ఢిల్లీలో మలేసియన్ల పట్టివేత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రత్యేక విమానం ఎక్కబోతుండగా 8 మంది మలేసియన్ల పట్టివేత
మర్కజ్‌కు వెళ్లినవారి కోసం దేశవ్యాప్త అన్వేషణ
ఎఫ్‌ఎ్‌సఎల్‌ శాస్త్రవేత్తల దర్యాప్తు
సెల్‌ డేటా, జీపీఎస్‌ సాయంతో 13,700 మంది గుర్తింపు
తబ్లీగీని తప్పుపట్టాడని యూపీలో యువకుడి కాల్చివేత

న్యూఢిల్లీ: మర్కజ్‌ ప్రార్థనలకు హాజరై.. ఇన్నాళ్లూ ఢిల్లీలోనే వేర్వేరు ప్రాంతాల్లో దాక్కుని.. ప్రత్యేక విమానంలో తమదేశానికి పారిపోయే ప్రయత్నం చేసిన ఎనిమిది మంది మలేసియన్లను మన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం పట్టుకున్నారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మనదేశం చాలారోజుల క్రితమే నిషేధం విధించినా.. భారత్‌లో ఉన్న తమవారి కోసం వివిధ దేశాలు పంపిస్తున్న ప్రత్యేక విమానాలను మాత్రం అనుమతిస్తోంది. అలాంటి విమానంలో వెళ్లేందుకు ప్రయత్నించిన మలేసియన్లను మన అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని ఢిల్లీ పోలీసులకు, వైద్యాధికారులకు అప్పగించారు.

ఇక, పెద్దఎత్తున సమావేశాలపై విధించిన నిషేధాన్ని తబ్లీగీ జమాత్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో.. దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ శాస్త్రవేత్తలు, ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం మర్కజ్‌ నిజాముద్దీన్‌కు వెళ్లారు. కాగా.. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన తబ్లీగీ సభ్యుల అన్వేషణను తీవ్రతరం చేశాయి. వారితో సన్నిహితంగా ఉన్నవారినీ గుర్తించి ఐసోలేషన్‌, క్వారంటైన్‌కు పంపుతున్నాయి. మర్కజ్‌ సమావేశాలకు వెళ్లొచ్చిన 1499 మందిని గుర్తించామని.. వారిలో 1205 మందిని క్వారంటైన్‌కు పంపామని యూపీ సర్కారు ప్రకటించింది. వారిలో 305 మంది విదేశీయులుగా గుర్తించినట్టు తెలిపింది. యూపీలోని కాన్పూర్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన ఆరుగురు తబ్లీగీ సభ్యులు (వారిలో ఇద్దరు విదేశీయులు) తిరిగిన ప్రాంతాలను స్థానిక అధికారులు రెడ్‌జోన్లుగా ప్రకటించారు.

ఆ ఆరుగురూ తిరిగిన మసీదులకు చుట్టుపక్కల కిలోమీటరు ప్రాంతాన్ని హాట్‌స్పాట్లుగా గుర్తించి.. బారికేడ్లు నిర్మించి, డ్రోన్లతో నిఘా పెట్టారు. ఇక మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన తబ్లీగీ సభ్యులెవరైనా రాష్ట్రంలో ఉంటే, వారంతా ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, లేదా చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ హెచ్చరించారు. శనివారం ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా తేలిన ఏడుగురిలో ముగ్గురు తబ్లీగీ సభ్యులే కావడంతో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఇప్పటివరకూ హిమాచల్‌ప్రదేశ్‌లో 14 కేసులు పాజిటివ్‌ రాగా.. ఇద్దరికి నయమైంది. ఇద్దరు చనిపోయారు. చికిత్స పొందుతున్న 10 మందిలో ఆరుగురు తబ్లీగీ సభ్యులే కావడం గమనార్హం. కాగా.. మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న తబ్లీగీ సభ్యులు వైద్యపరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో వారిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు సెల్‌ఫోన్‌ డేటాను, జీపీఎస్‌ లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేస్తున్నారు. సమావేశాలు జరిగిన సమయంలో ఎవరి జీపీఎస్‌ లొకేషన్‌ మర్కజ్‌ ప్రాంతంలో ఉందో వారందరి సెల్‌ఫోన్‌ డేటానూ ట్రాక్‌ చేస్తున్నారు.

ఈ పద్ధతిలో ఇప్పటివరకూ 13,700 మందిని గుర్తించి.. వారంతా దేశంలో ఏయే ప్రాంతాల్లో ఉన్నారో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత వైమానిక దళానికి చెందిన ఒక సర్జెంటును సైతం ఈ పద్ధతిలోనే గుర్తించినట్టు సమాచారం. ఈ మ్యాపింగ్‌లో ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్‌కు వివిధ రాష్ట్రాల పోలీసులు సహకరిస్తున్నారు. ఇక ‘వ్యాపారం కోసం ఈ గ్రామంలోకి వచ్చే ముస్లింలకు ప్రవేశం నిషిద్ధం’ అంటూ మధ్యప్రదేశ్‌లోని బోరుద్‌ గ్రామం వద్ద పెట్టిన బ్యానర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని మార్చి 17న పెట్టగా పోలీసుల ఆదేశాలతో వెంటనే తొలగించారు.

తబ్లీగీని తప్పుపట్టాడని యువకుడిని కాల్చి చంపారు
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి తబ్లీగీ జమాతే కారణమని అన్నందుకు.. యూపీలోని ప్రయాగలో ఓ యువకుణ్ని కాల్చిచంపారు. ఆ యువకుడు తన ఇంటిబయట మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో యువకుడు అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్లి కొద్దిసేపటి తర్వాత మరికొంతమందిని తనతో వెంటబెట్టుకొచ్చాడు. రావడం రావడమే తుపాకీ తీసి.. తబ్లీగీని తప్పు పట్టిన యువకుణ్ని కాల్చేశాడు. మిగతావారు అతడి తలపై కొట్టి చంపేశారు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన ప్రధాన నిందితుడితోపాటు, మరొకడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేయాలని యూపీ సీఎం ఆదేశించారు.

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates