పోరు ఎక్కువ.. పోల్‌ తక్కువ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కదిలి వచ్చిన ఢిల్లీ నేతలు.. ముందుకు రాని గల్లీ ఓటర్లు
  • గ్రేటర్‌ ఎన్నికల్లో భావోద్వేగం తీవ్రం.. పోలింగ్‌ కేంద్రాలకు తీసికట్టుగా ఓటర్లు
  • ఇప్పటికే ఊళ్లకు వెళ్లిపోయిన కొందరు ఉద్యోగులు
  • మూడు రోజుల వరుస సెలవులతో మరికొందరు
  • ఓట్ల గందరగోళం, గల్లంతుతోనూ హక్కు హుళక్కి
  • సెల్‌ఫోన్‌ ఉంటే ఆపేసిన పోలీసులు.. ఓటర్లు వెనక్కి
  • ఓటు వేసేందుకు వరద బాధితుల నిరసన!!
  • ఈసారి పాతబస్తీలోనూ పోలింగ్‌కు దూరంగా ఓటర్లు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో పాత కథే పునరావృతమైంది! ఈసారి ప్రచారం హోరెత్తింది! భావోద్వేగాలు పొంగిపొర్లాయి! అన్ని పార్టీలూ కోట్ల రూపాయల్లో ఖర్చు చేశాయి! ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు తరలి వచ్చారు! కానీ, ఎప్పట్లాగే, ఓటరు మాత్రం పోలింగ్‌ కేంద్రానికి రాలేదు! ప్రజాస్వామ్యంలో తమకు హక్కుగా వచ్చిన ఓటును వేయలేదు! ఐదేళ్లపాటు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి ఆసక్తి చూపలేదు! వరద సాయం క్యూలు కనిపించినంతగా.. మద్యం షాపుల ముందు బారులు తీరినట్లుగా కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలు కనిపించలేదు! కొన్ని పోలింగ్‌ కేంద్రాలు అయితే ఖాళీగా దర్శనమిచ్చాయి!

ఓటు వేసే విషయంలో కొంతమందిది నిర్లిప్తత అయితే.. కొందరిది నిర్లక్ష్యం! మరికొందరు నిరసనగా ఓటు వేయడానికి వెళ్లలేదు! ఇక, తక్కువ ఓటింగ్‌కు ఎన్నికల కమిషన్‌ తప్పులు కూడా కారణమయ్యాయి! వెరసి, గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పెరిగినా.. ఈసారి కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పడిపోయింది.

2002 ఎన్నికల్లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఇప్పుడు 45.71 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించారు. నిజానికి, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ 36.73 పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. కానీ, తుది ప్రకటనకు వచ్చేసరికి ఏకంగా 9 శాతం పోలింగ్‌ పెరగడం గమనార్హం. ఇక, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా గ్రేటర్‌ పరిధిలో 50 శాతానికి మించి పోలింగ్‌ నమోదైంది. దానితో పోల్చినా.. ప్రస్తుతం పోలింగ్‌ తక్కువేనని అంటున్నారు.

మరీ ముఖ్యంగా, రూ.2 కోట్ల వరకూ ఖర్చు చేసినా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలి రాలేదని కొంతమంది అభ్యర్థులు తలలు బాదుకుంటుంటే.. ‘డబ్బులు తీసేసుకోండి.. కానీ, మీరు పోలింగ్‌ కేంద్రాలకు రావక్కర్లేద’ని కొన్నిచోట్ల అభ్యర్థులు ఓటర్లకు స్పష్టం చేశారనే ప్రచారం జరుగుతోంది. అంతేనా, ఈసారి పోలింగ్‌ సమయంలో ఉద్రిక్తతలు పెరగడానికి, ఘర్షణలు జరగడానికి అవకాశం ఉందనే ప్రచారం కూడా ఓటర్లు కేంద్రాలకు దూరంగా ఉండడానికి కారణమని అంటున్నారు. సాక్షాత్తూ డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులే విలేకరుల సమావేశంలో ప్రకటించడమూ ప్రజల భయాందోళనకు కారణమనే అభిప్రాయం ఉంది. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ సందర్భంగా సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం కూడా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడాన్ని ఉదాహరిస్తున్నారు.

ఓట్ల గందరగోళం
గాంధీ నగర్‌కు చెందిన ఓ జంట అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసింది. కానీ, గ్రేటర్‌ ఎన్నికలకు వచ్చేసరికి ఆమె ఓటు గల్లంతైంది. ఆయన ఓటును భోలక్‌పూర్‌ డివిజన్‌కు మార్చారు. ఇద్దరూ ఓటు వేయలేకపోయారు. మరో ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి. గతంలో ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. కానీ, ఇప్పుడు ముగ్గురి ఓట్లనూ మూడు పోలింగ్‌ కేంద్రాల్లోకి మార్చారు. దాంతో, ఓటు వేయడానికి ముగ్గురూ ఆసక్తి చూపలేదు. మంగళవారం పోలింగ్‌ సందర్భంగా ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఎప్పట్లాగే, ఈసారి కూడా ఓట్ల గల్లంతు ఫిర్యాదులు పెద్దఎత్తున వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఓటరు జాబితానే గ్రేటర్‌ ఎన్నికలకూ తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అయితే, నోటిఫికేషన్‌ వచ్చే ముందు రోజు వరకు కూడా కొత్తగా ఓటర్లు నమోదయ్యేందుకు అవకాశం ఉంటుంది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం ఉంటుంది. కానీ, వీటి పరిష్కారం సరిగా ఉండడం లేదు. ఓట్ల గల్లంతు, తొలగింపు వంటి ఫిర్యాదులు ఎన్నికల అధికారుల దృష్టికి వస్తున్నా వాటిని సంపూర్ణంగా పరిష్కరించడం లేదన్న ఆరోపణలున్నాయి. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోని కారణంగానూ ఓటు హక్కును చాలా మంది కోల్పోతున్నారు.

దీంతో… అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నా.. గ్రేటర్‌ ఎన్నికల్లో జాబితాలో ఓటు లేని పరిస్థితులు కనిపించాయి. పోలింగ్‌ శాతం తగ్గడానికి ఇది మరో కారణం. ఓటు వేసేందుకు ఎపిక్‌ లేదా గుర్తింపు కార్డుతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చినా ఓటు లేదని చెప్పడంతో చాలామంది వెనుదిరిగారు. ఇక, పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెంచడంతో అవి ఎక్కడ ఉన్నాయో కొందరికి తెలియని పరిస్థితి. మరికొందరి ఓట్లు ఏకంగా డివిజన్‌ల పరిధి మారాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓటు కూడా గల్లంతు జాబితాలోనే చేరింది. ఓటు వేయకుండానే ఆయన వెనుదిరిగారు.

అనాసక్తి, అయిష్టత
రాజకీయాలు, పార్టీలు, ఎన్నికలపై అనాసక్తి, అయిష్టత కారణంగానే చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేదని చెబుతున్నారు. అందుకే, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఓటర్లు ఆశించిన స్థాయిలో పోలింగ్‌ కేంద్రానికి రాలేదు. ఓటరు పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లేలా చాలా మంది అభ్యర్థులు చొరవ చూపలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిలోనూ పలువురు పోలింగ్‌కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. కార్పొరేటర్లు, పార్టీ పనితీరు కారణంగా ఈసారి టీఆర్‌ఎ్‌సకు ఓటు వేసేందుకు సుముఖత చూపలేదని, అదే సమయంలో, ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందనే భావనతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారని, వెరసి, పోలింగ్‌ కేంద్రాలకే రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక, పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే వెసులుబాటును కూడా వినియోగించుకోవడం లేదు. నోటాకు ఓటు వేసినా ఫలితాలపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం ఇందుకు కారణం. దాంతో, చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. పోలింగ్‌ శాతం కనీసంగా నమోదు కావాలన్న నిబంధన ఉండి ఉంటే పోలింగ్‌ పెరిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఖర్చు.. ప్రచారం.. భారీగానే
గ్రేటర్‌ ఎన్నికల్లో 48 వేల మంది పోలింగ్‌ సిబ్బంది, సుమారు 55 వేల మంది పోలీసు సిబ్బంది పాల్పంచుకున్నారు. ప్రభుత్వపరంగా ఎన్నికకు రూ.100 కోట్ల వరకూ ఖర్చయిందని అంచనా. ఇక, అభ్యర్థుల ఖర్చు రూ.1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు పార్టీపరంగా కోట్లలోనే అందడంతో వారు భారీగానే ఖర్చు చేశారన్న ప్రచారం జరిగింది. మరోవైపు, రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌, కేంద్రంలోని అధికార బీజేపీ గ్రేటర్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు పరిమితమైనా.. భారీగా వ్యూహాలు రచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైౖర్మన్లు, పార్టీ సీనియర్‌ నేతలు.. ఇలా ప్రతి డివిజన్‌కు బాధ్యులను నియమించి, పక్కా వ్యూహంతో కదిలారు.

బీజేపీ కూడా అగ్ర నేతలతో రంగంలోకి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి సహా ఆ పార్టీ అతిరథులు తరలి వచ్చారు. అయినా, ఓటర్లకు కేంద్రాలకు తీసుకు రావడంలో పార్టీలు విఫలమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ నడుస్తోంది.. భావోద్వేగ పరమైన అంశాలు పని చేస్తే ఓటింగ్‌ శాతం పెరిగి.. మెజార్టీ ఓటర్లు ఆయా పార్టీల వైపునకు మొగ్గు చూపి ఉండేవారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా ఓటింగ్‌ శాతం పెరిగి ప్రత్యర్థి పార్టీకి ఓట్లు పెరుగుతాయంటున్నారు. కానీ, ఎన్నికల్లో ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరించారు.

మెజారిటీ ఓటర్లను ప్రభావితం చేసి పోలింగ్‌ బూత్‌ వరకూ రప్పించే అంశం ఏ పార్టీ అజెండాలోనూ లేదన్నది స్పష్టమవుతోందంటున్నారు. దీన్ని ఓటర్ల నిర్లక్ష్యం, బద్ధకంగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. వరుస సెలవులు వర్తించే ఉద్యోగ వర్గం శాతం నగరంలో నామమాత్రంగానే ఉంటుందని, వారిని కదిలించే అంశాలు పార్టీల అజెండాలో కనిపిస్తే వారూ వచ్చి ఓటు చేసేవారనీ అంటున్నారు. శాసనసభ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రత్యర్థి పార్టీల వారిని గెలిపించినా అధికార పార్టీలోకి ఫిరాయిస్తూ ఉండడమూ ఓటింగ్‌ పట్ల ప్రజల్లో నిర్లిప్తత నెలకొనడానికి కారణంగా చెబుతున్నారు. 60 శాతానికిపైగా ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉండడం పార్టీల విధానాలకు, ప్రజలకు మధ్య ఏర్పడిన అంతరాన్ని సూచిస్తోందంటున్నారు.

పోలింగ్‌పై కరోనా, చలి ఎఫెక్ట్‌
పోలింగ్‌ శాతం పడిపోవడానికి కరోనా, చలి కూడా కారణమనే వాదన ఉంది. కరోనా భయంతో వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేదు. ఇటువంటి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించినా.. పెద్దగా ఎవరూ వినియోగించుకోలేదు. ఇక, విద్యా సంస్థల మూసివేత ప్రభావం కూడా పోలింగ్‌పై పడిందని అంటున్నారు.

సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌
ఓటు వేసే కంపార్ట్‌మెంట్‌లోనికి మాత్రమే మొబైల్‌ ఫోన్‌లకు అనుమతి లేదు. ఇది మూడు నాలుగేళ్లుగా అమల్లో ఉన్న నిబంధన. కానీ, ఇప్పుడు చాలామంది ఫోను లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కనక, ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. పోలింగ్‌ కేంద్రం బయటే పోలీసులు వారిని ఆపేశారు. దాంతో, ఇద్దరిద్దరు వచ్చిన వారు ఒకరి తర్వాత మరొకరు వెళ్లి ఓటు వేశారు.  కొంతమంది ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు. నిజానికి, మొబైల్స్‌ వంటి వాటిని పోలింగ్‌ ఏజెంట్లు లేదా సిబ్బంది వద్ద పెట్టి ఓటు వేశాక… తిరిగి పొందే సౌకర్యం కల్పించాల్సి ఉంది. అలా లేకపోవడంతో చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

వరద బాధితుల నిరసన
వరద సాయం అందుకున్న వారు.. వరద సాయం ఆశించేవారు వెరసి.. ఈసారి పెద్దఎత్తున ఓట్లు పడతాయని అనుకున్నారు. కానీ, పోలింగ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. ఎన్నికల సంఘం నిలిపివేసే సమయానికి 6.64 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.664 కోట్లను వరద సాయంగా పంపిణీ చేసింది. లక్షలాది కుటుంబాలు ఇంకా తమకు సహాయం అందలేదని ఆందోళనలు చేశాయి. సాయం అందిన వారి లెక్కలనే తీసుకున్నా.. ఒక్కో కుటుంబంలో సగటున 4 ఓట్లు ఉంటాయని భావిస్తే… కూడా కనీసంగా 25 లక్షల ఓట్లు పోలవ్వాలి.

కానీ, వరద సహాయం అందిన కుటుంబాలు, వరద సహాయంతో సంబంధం లేని కుటుంబాలు, వరద సహాయం అందలేదని ఆందోళన చేసిన కుటుంబాలు ఇలా… చాలా మంది పోలింగ్‌ కేంద్రానికి రాలేదు.వరదలవల్ల తాము నష్టపోయామని, ఇటు ప్రభుత్వం కానీ అటు పార్టీలు కానీ స్పందించలేదనే నిరసన ఈ రూపంలో బయటపడిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.  పాతబస్తీలో ఈసారి తక్కువ పోలింగే నమోదైంది. గతానికి భిన్నంగా, ఈసారి పోలింగ్‌ కేంద్రాలు ఖాళీగా కనిపించాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates