అమ్మలేక..కొనలేక..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అటవీ ఉత్పత్తుల సేకరణపై కరోనా ప్రభావం
లాక్‌డౌన్‌తో ఆదివాసీల అరణ్య రోదన
సంతలు మూసివేయటంతో ఎక్కడి వారక్కడే
నిత్యావసర వస్తువులూ దొరకని దైన్యం
వలస ఆదివాసీల పరిస్థితి మరింత దుర్భరం
గిరిజన కార్పొరేషన్‌ జాడేది?
తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మందిపై ప్రభావం

ప్రకృతి వడిలో ప్రశాంత జీవితం గడిపే ఆదివాసీల్లో కరోనా పెద్ద అలజడినే సృష్టిస్తున్నది. రేపటి గురించి ఆలోచించని అడవి బిడ్డలు ఈ రోజు ఎలా గడుస్తుందోనని కలత చెందే పరిస్థితి ఏర్పడింది. అడవంతా కలియ తిరిగి సేకరించుకున్న అటవీ ఉత్పత్తులను లాక్‌డౌన్‌ పేరుతో కొనేవారే లేకపోవటంతో దిక్కు తోచక ఎదురు చూస్తున్నారు. వారాంతపు సంతలను మూసి వేయటంతో నిత్యావసరాలు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఎండాకాలం ఆదాయ వనరుగా ఉండే తునికాకు సేకరణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకుతున్న వలస ఆదివాసీలపరిస్థితి మరింత దుర్భరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని 30 లక్షల మంది ఆదివాసీల దైన్యంపై  ప్రత్యేక కథనం.

తాము జీవించటానికి అవసరమైన అన్ని వనరులూ ప్రకృతే ఇస్తుందని నమ్మే ఆదివాసీలకు దాచుకోవటం తెలియదు. అడవి తల్లి ఇచ్చిన కాయో పండో తెచ్చుకుని సంతలో అమ్ముకోవటం, ఆ డబ్బుతో వారానికి సరిపడ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవటం వారి జీవన విధానంలో భాగం. తరతరాలుగా ఇదే జరుగుతోంది. కానీ కరోనాలాక్‌డౌన్‌తో ఆదివాసీలకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. అటవీ ఉత్పత్తులు చేతికి వచ్చే కాలంలో వాటిని ఎక్కడఅమ్ముకోవాలో తెలియక అలమటిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితి గతంలో తాము చూడలేదని అంటున్నారు.తెగ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీల జీవనం సంతలతోనే ముడిపడి ఉంటుంది. గత మూడు వారాలుగా సంతలు జరగక పోవటంతో ఆదివాసీలకు ఊపరి అడటం లేదు. తెలంగాణలోని ఉట్నూరు, ఏటూరునాగారం,భద్రాచలం, అమ్రాబాద్‌, ఏపీలోని పాడేరు, రంపచోడవరం. సీతంపేట, చింతూరు ఐటీడీఏల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆదివాసీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. వ్యవసాయ పనులు కూడా దొరకని రోజుల్లో వారికి అటవీ ఉత్పత్తులు చేతికి అందుతాయి. అడవిలో దొరికే విప్పపువ్వు, చింతపండు, విప్పబద్ద, తేనె, కరక్కాయలు, జిగురు, తునికి, పుసుకుపండ్లు, ముష్టి గింజలు వంటి అనేక రకాల అటవీ ఉత్పత్తులను సేకరించుకనివాటిని సంతల్లో అమ్ముకుని వచ్చే ఆదాయంతో కాలం గడుపుతారు. అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసే గిరిజన కార్పొరేషన్‌ ఇటీవల కొనగోళ్లు నిలిపివేయటంతో తక్కువ ధరలకు దళారులకు వాటిని ఆదివాసీలు అమ్ముకుంటున్నారు. లాక్‌డౌన్‌ పభావంతో గత మూడు వారాలుగా ఏజెన్సీ ప్రాంతంలో సంతలు మూతపడ్డాయి. దీనికి తోడు రవాణా వ్యవస్థ ఆగిపోవటంతో కనీసం పక్క గ్రామానికి కానీ మండల కేంద్రానికి కూడా ఆదివాసీలు వెళ్లలేక పోతున్నారు. దీనితో వారికి రోజు గడవని పరిస్థితి ఏర్పడింది.

మారుమూల గ్రామాల ఆదివాసీలు మేకలను సంతలో అమ్ముకుని వారానికి సరిపడ నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటారు. ఇప్పుడు వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకూ ఏజెన్సీ ప్రాంతంలో వెదురు పుష్కలంగా లభిస్తుంది. వీటితో ఆదివాసీలు తడకలు, బుట్టలు, తట్టలు, గుమ్ములు, చాటలు వంటి వస్తువులను తయారు చేసి సంతలో అమ్ముకునే వారు. వెదురు నరక వద్దని అటవీ శాఖ ఆంక్షలు విధించటంతో వేలాది మంది ఆదివాసీలు ఉపాధి కోల్పోయారు. ఆదిలాబాద్‌, కొమ్రం భీం జిల్లాల్లోని కొల్లాం తెగ ఆదివాసీలు వెదురుపైనే ఆధార పడి జీవిస్తారు. కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ప్రాంతంలో ఆదివాసీలను అడవిలోని వెళ్లకుండా నిషేధిచంటంతో వారు దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా వెదురుపై ఆంక్షలు సడలించలేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యంతో పాటూ పప్పు, ఉప్పు, నూనె వంటి ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని ఆదివాసీలు కోరుతున్నప్పటికీ సర్కార్‌ నోరు మెదపటం లేదు. ప్రతినెలా ఇచ్చే రేషన్‌ బియ్యం కూడా ఈ నెలలో ఇంకా అందలేదు. వలస ఆదివాసీల పరిస్థితి దుర్భరం… ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం నుంచి వలస వచ్చి తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోనూ, తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలోనూ ఉంటున్న 260 గ్రామాల వలస ఆదివాసీలకు లాక్‌డౌన్‌ మరింత నష్టం తెచ్చి పెట్టింది. వారిలో పలువురికి రేషన్‌ కార్డులు లేక పోవటంతో బియ్యం అందటం లేదు. కూలి పనులు చేసుకుందామన్నా ఎక్కడికీ కదలలేనిపరిస్థితి ఏర్పడింది.

తునికాకు సేకరణ ప్రశ్నార్థకం..
తెలుగు రాష్ల్రాల్లోని ఆదివాసీలకు ఎండాకాలంలో తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. 10లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకూఆదివాసీ కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకూ తునికాకు తెంపుతారు. దీని ద్వారా ప్రతి కుటుంబం రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకూ సంపాదిస్తారు. లాక్‌డౌన్‌ పేరుతో ఈ సంవత్సరం తెలంగాణ, ఏపీల్లో పాటలు నిర్వహించక పోవటంతో ఆదివాసీలు అందోళన చెందుతున్నారు. తునికాకు దట్టంగా పెరగటానికి ఏప్రిల్‌ నెలలోనే కొమ్మలు కొట్టే ప్రక్రియ (ప్రూనింగ్‌) చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల్లో ఇది చేపట్టలేదు. దీనితో ఈ సంవత్సరం తునికాకు సేకరణ ఉంటుందో లేదో తెలియక ఆదివాసీలు ఆయోమయంలో ఉన్నారు.

ఆదేశాలకే పరిమితం….
కరోనా లాక్‌డౌన్‌ నేపధ్యంలో దేశంలోని 10 కోట్ల మంది ఆదివాసీల జీవన స్థితిగతుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అధ్యయనం చేయలేదు. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ ముండా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, బెంగాల్‌, అసోం,రాజస్థాన్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలకు ఈ లేఖలు పంపినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందచేస్తారో ఆ లేఖలో పేర్కొనలేదు. ఎటువంటి మార్గదర్శక సూత్రాలను జారీ చేయలేదు. పన్నుల రాబడి లేకఖజానా ఖాళీ అయిపోవటంతో అటవీ ఉత్పత్తుల సేకరణకు వివిధ రాష్ట్రాలు ముందుకు రావటంలేదు. కేంద్రం అందించే సబ్‌ప్లాన్‌ నిధులు కూడా విడుదల చేయలేదు.

నిత్యావసర సరకులు సరఫరా చేయాలి….
కరోనా లాక్‌డౌన్‌తో ఆదివాసీలు ఉపాధి కోల్పోయారు. ప్రతి కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసర సరకులు సరఫరా చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో సమగ్ర సర్వే నిర్వహించి కరోనా ప్రభావం ఉందో లేదో అంచనా వేయాలి. ఇతర ప్రాంతాల వారు ఆదివాసీ గ్రామాలకు రాకుండా కట్టడి చేయాలి. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో సంతలను ప్రారంభించాలి. అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి వెంటనే ఏర్పాట్లు చేయాలి.ఏజెన్సీ ప్రాంతంలో పౌష్ఠికాహార లోపంతో మహిళలు పిల్లల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉందని, దీనిని అధిగమించటానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో బియ్యం, పప్పు తదితర వస్తువులన్నీ అందుబాటులో ఉంచాలి. బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇంటి వద్దే అందించాలి.
డాక్టర్‌ మిడియం బాబూరావు జాతీయ చైర్మెన్‌, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌.
కొండూరి రమేష్‌బాబు

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates