ఉసురు తీసిన అప్పులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ముగ్గురు రైతులు ఆత్మహత్య

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అప్పుల బాధతో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన సామినేని శివానందం (65)కు రెండెకరాల సొంత భూమి ఉంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని మూడేళ్లుగా శనగ, మిర్చి సాగు చేశాడు. ఏటా నష్టాలే మిగిలాయి. పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. మొత్తం పది లక్షల రూపాయలు అప్పులు తేలాయి.

వీటిని తీర్చాలంటూ వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేశారు. అప్పులు తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపంతో తన ఇంటి ముందు ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రమైన సంతమాగులూరుకు చెందిన యువ రైతు ఉరాది ప్రశాంతరెడ్డి (32)కి రెండెకరాల పొలం ఉంది. ఐదు సంవత్సరాలుగా మరో ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మిరప, పత్తి సాగు చేశాడు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో దాదాపు రూ.30 లక్షలపైగా అప్పు అయింది. అప్పుల వారు ఉన్న రెండెకరాలనూ స్వాధీనం చేసుకున్నారు. ‘నీకు నీ పొలంతో సంబంధం లేదు’ అంటూ హెచ్చరించారు. దీంతో, మనస్తాపం చెందిన ప్రశాంతరెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ రెండు సంఘటనలూ సోమవారం చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి… పాతపట్నం మండల కేంద్రంలోని కోటగుడ్డి కాలనీకి చెందిన గుర్రం రాంబాబు (39) రిక్షా పుల్లర్‌గా పనిచేస్తున్నాడు. వస్తున్న ఆదాయం కుటుంబ

పోషణకు చాలకపోవడంతో గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఐదేళ్లుగా సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం సుమారు రూ.రెండు లక్షల వరకు అప్పులు చేశాడు. గతేడాది పంట బాగానే పండినా చేతికొచ్చే సమయానికి తిత్లీ తుపాను తుడిచిపెట్టింది. ఈ ఏడాది మళ్లీ అప్పులు చేసి విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు కొన్నాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని రిమ్స్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

(CORTECY PRAJASHAKTHI)

RELATED ARTICLES

Latest Updates