అయ్యో.. ఐరోపా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • 25వేలు దాటిన మరణాలు..
  • అమెరికాలో 2లక్షల వరకూ చనిపోవచ్చు: ట్రంప్‌

 న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ విలయతాండవం ప్రపంచాన్ని, ముఖ్యంగా యూర్‌పను మంచాన పడేసింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 36వేల పైచిలుకు మరణాల్లో మూడింట రెండొంతులు ఈ ఒక్క ఖండాన చోటు చేసుకున్నవే! ఒక్క ఐరోపా దేశాల్లోనే దాదాపు 4లక్షల పైచిలుకు మందికి వైరస్‌ సోకగా 25వేల మంది మరణించారు. ఇటలీ (సుమారు 11వేలు), స్పెయిన్‌ (7340) ల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. స్పెయిన్‌లో గంటకు 35 మంది చనిపోతున్నారు. ఒక్కరోజులో అక్కడ 812 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఘోరం ఏంటంటే- వైరస్‌ సోకిన వారిలో దాదాపు 15శాతం మంది అంటే సుమారు 13వేల మంది వైద్య సిబ్బందే. కొంతభాగం యూర్‌పలో ఉన్న రష్యాకు ఈ సెగ తగలడంతో మాస్కో నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. 1836  మందికి ఇది సోకినట్లు, ఇంతవరకూ 9 మంది మరణించినట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాకిన 183 దేశాల్లో కేసుల సంఖ్య 7.52 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 36, 205 కాగా- ఇప్పటివరకూ డిశ్ఛార్జి అయినవారు 1,58, 688 మంది.

అమెరికాలో పరిస్థితి పూర్తి గందరగోళంగా, భయానకంగా ఉంది. గడచిన 24 గంటల్లోనే 518 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 2500కు చేరువవుతోంది. కేసుల సంఖ్య 1,43,000కు పెరిగింది. మరణాల సంఖ్య లక్ష దాకా పెరగవచ్చని సుప్రసిద్ధ ఎండమాలజిస్ట్‌ ఆంథోనీ ఫాసీ అంచనా వేయగా, అమెరికా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మరణాలు 2లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటోంది. ఇటలీలో కరోనా ఉధృతి కాస్త తెరిపినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 5.6 శాతం మేర తగ్గింది. వైరస్‌ వచ్చాక 6 శాతం కంటే తక్కువ నమోదు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం మరణాలు 11వేలు దాటగా, కేసుల సంఖ్య లక్ష దాటేశాయి. వైరస్‌ మొదలైన చైనాలో తాజాగా నలుగురు మరణించారు.

ఇవన్నీ వుహాన్‌లోనే. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్వీయ-నిర్బంధంలోకి వెళ్లారు. కొవిడ్‌-19 బారిన పడ్డ బ్రిటన్‌ యువరాజు ఛార్లెస్‌ స్వీయ-ఏకాంతం నుంచి బయటపడ్డారు. ఆయన కోలుకున్నట్లు రాజప్రతినిధి ఒకరు చెప్పారు. ఇరాన్‌లో పరిస్థితి మరీ గడ్డుగా తయారైంది. ఒక్క రోజులో 117 మంది మరణించారు. కేసుల సంఖ్య 21,600 దాటింది. ఆస్ట్రేలియాలో ఇప్పటిదాకా 18 మంది మరణించారు. న్యూజిలాండ్‌లో తొలి మరణం నమోదైంది. ప్రముఖ జపనీస్‌ కమెడియన్‌ కెన్‌ షిముర (70),  గ్రామీ పురస్కార గ్రహీత, అమెరికన్‌ సింగర్‌ జో డిప్ఫే (61) కరోనాతో మృతిచెందారు. మరో దిగ్గజ గాయకుడు జాన్‌ ప్రైన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

కోలుకున్న ప్రిన్స్‌ చార్లెస్‌
ఇంగ్లండ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న ఆయన గత వారం భార్య కమిలాతో కలిసి స్కాట్‌లాండ్‌ వెళ్లారు. అక్కడ ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. బల్మోరల్‌ ఎస్టేట్‌లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చింది. కాగా.. కరోనా సోకకున్నా ఆయన భార్య కూడా ఐసోలేషన్‌లో గడిపారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates