ఉస్మానయా ఆస్పత్రి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • 24 అంతస్తులతో ట్విన్‌ టవర్స్‌…
  • ఆస్పత్రి ఉన్నచోటే నిర్మాణం
  • నిజాం కాలంనాటి భవనం
  • కూల్చివేయాలని సర్కారు నిర్ణయం
  • పాత భవనం సీజ్‌ చేయాలని ఆదేశాలు
  • నాలుగు రోజులుగా రోగుల తరలింపు
  • నేడు పాత భవనానికి తాళాలు
  • ఏడాదిలోపే జంట టవర్ల నిర్మాణం పూర్తి
  • ఆ తర్వాత మిగతా భవనాల కూల్చివేత

దేశంలోనే అతిపురాతనమైన సర్కారు ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియా దవాఖానా భవనం ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. శిథిలావస్థకు చేరిన నిజాం కాలంలో నిర్మించిన ఈ ఆస్పత్రి భవనాన్ని వీలైనంత త్వరగా కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అదే స్థలంలో 24 అంతస్తుల చొప్పున జంట టవర్ల (ట్విన్‌ టవర్స్‌)ను నిర్మించాలని సంకల్పించింది. అనుకున్నట్లుగా నిర్మాణం పూర్తయితే గనక దేశంలోనే అతిపెద్ద సర్కారు దవాఖానా కానుంది. 

హైదరాబాద్‌ : ఉస్మానియా ఆస్పత్రి భవనం పురాతన వారసత్వ కట్టడం అయినప్పటికీ అన్ని మరమతులు చేసి పునరుద్ధరించడం అసాధ్యం అన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం చివరికి దాని కూల్చివేతకే మొగ్గుచూపింది. ఈ మేరకు  వైద్యఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో  ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి, సీజ్‌ చేయాలని తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌  రమేశ్‌ రెడ్డి  బుధవారం అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు. ఆస్పత్రికి సీల్‌ వేసిన సమాచారాన్ని వెంటనే డీఎంఈ కార్యాలయానికి తెలిపాలని  ఉత్తర్వుల్లో కోరారు. పాత భవనంలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర వార్డుల్లోకి తరలించాలని, అక్కడ ఇక ఎటువంటి  వైద్య సేవలు నిర్వహించవద్దని సూచించారు. ఈ విషయంలో తమ ఆదేశాలను పాటించకపోతే తదుపరి చర్యలుంటాయని అందులో హెచ్చరించారు.

ఉస్మానియా పాత భవనాన్ని యుద్ధప్రాతిపదికన కూల్చివేసి ట్విన్‌ టవర్స్‌ను ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని సర్కారు గట్టిపట్టుదలతో ఉంది. దేశంలోనే అద్భుతం అనిపించేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సర్కారు దవాఖానాను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత  అక్కడ మిగిలిన భవనాలను కూల్చివేయనున్నారు. వాస్తవానికి ఐదేళ్ల క్రితమే ఉస్మానియా ఆస్పత్రి ఉన్నచోట ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ అనుమతులు ఇచ్చారు. 2015 జూలైలో ఉస్మానియా ఆస్పత్రిని కేసీఆర్‌ సందర్శించారు. ఆస్పత్రి పరిస్థితిని చూసిన అనంతరం వెంటనే దాన్ని కూల్చివేసి, ట్విటన్‌ టవర్స్‌ నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులందరినీ పేట్లబురుజు, కింగ్‌కోఠీ తదితర ఆస్పత్రులకు తరలించారు.  అయితే ఆస్పత్రిని కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాలు చేశారు. విపక్షాలు కూడా ఆందోళన చేయడంతో సర్కారు  వెనక్కి తగ్గింది.   ఇటీవల చిన్నపాటి వర్షానికే ఆస్పత్రి వార్డుల్లోకి నీరు చేరిన ఘటనతో ఆస్పత్రి మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠకు విఘాతం కలిగించిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రిలో రోగులు ఉన్న వార్డుల్లోకి నీరు చేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయ్యాయి. ఇది ఏకంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.  గత ఏడాది కూడా ఆస్పత్రి రెండో ఫ్లోర్‌లో పెచ్చులు ఊడిరోగుల మీద పడ్డాయి. దాంతో అప్పట్లో వైద్యులు హెల్మెట్లు పెట్టుకొని వైద్య సేవలందించారు. ఇది కూడా పెద్ద చర్చకు దారి తీసింది. మున్ముందు వర్షాలు పడితే.. ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఈ పురాతన భవనాన్ని కూల్చి, ఆ స్థానం లో దేశంలోనే అతిపెద్ద దవాఖానా నిర్మించాలని నిర్ణయించింది.

ఉస్మానియా రికార్డులయా.. 

  1. దేశంలోనే మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందిక్కడే.
  2. తొలి పాంక్రియాస్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన ఘనత ఉస్మానియా వైద్యులదే.
  3. ఆస్పత్రిలో ఏటా 140 మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లు, 200 మోకాళ్ల శస్త్రచికిత్సలు, 11 లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్లు

 550 పేజీల నివేదికలో ఏముందంటే..
ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని భవనాల సుముదాయ పరిస్థితిపై కన్జర్వేటివ్‌ ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణ మూర్తి ‘‘కాంప్రహెన్సీవ్‌ క్యాంపస్‌ రిప్లే్‌సమెంట్‌ అండ్‌ రిన్నోవేషన్‌ ప్లాన్‌’’ను రూపొందించారు. పూర్తిస్థాయి సర్వేతో తయారుచేసిన 550 పేజీల  నివేదికను ఆయన 2012లో అప్పటి ప్రభుత్వానికి అందజేశారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో స్వాతంత్ర్యానంతరం కట్టిన భవనాల కంటే.. నిజాంకాలంలో కట్టిన భవనాలే పటిష్టంగా ఉన్నాయని ఆయన అన్నారు.  చారిత్రక భవనం మినహా, మిగతా భవనాలను కూల్చి కట్టవచ్చని ఆ నివేదికలో ఆర్కిటెక్ట్‌ మూర్తి తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో 1950ల తర్వాత నిర్మించిన 11 ప్రధాన భవనాలలో ఎనిమిది బ్లాకులు మరీ, పాతబడి నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రస్తావించారు. అందులోనూ నర్సింగ్‌ కాలేజీ, వసతిగృహం భవనాలు మరీ శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. చారిత్రక కట్టడం పరిరక్షణకు విరుద్ధంగా, అస్తవ్యస్థంగా నిర్మించిన బ్లాకులను కూల్చివేయచ్చని మూర్తి తన నివేదికలో నొక్కిచెప్పారు. ఆ ప్రదేశంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తుల భవనాన్ని రెండు బ్లాకులుగా డివైడ్‌ చేస్తూ కట్టొచ్చని ఆయన సూచించారు. అదీ, హెరిటేజ్‌ బిల్డింగ్‌ పరిరక్షణకు అనుగుణంగా, కొన్ని పరిమితులతో నిర్మించవచ్చని మూర్తి చెబుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates