బడ్జెట్ 2020 – అవాస్తవ సంఖ్యలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ప్రొ|| జయతీఘోష్‌Image result for ప్రొ|| జయతీఘోష్‌

కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా అర్థరహిత మైనదిగా, ప్రక్కదారి పట్టించే విధంగా ఉంది. బడ్జెట్‌ పత్రాల్లో పొందుపరిచిన అంచనా ఆదాయం, అంచనా వ్యయాన్ని పరిశీలించిన వారెవరైనా పిచ్చోళ్ళై పోవాల్సిందే. కాబట్టి ఈ సంఖ్యలను పరిశీలించి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఒక మార్గదర్శకాన్ని ఇస్తాయని అనుకొని మన సమయాన్ని వధా చేయొద్దు.

ఈ సంవత్సరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భారత దేశ చరిత్రలో ఇంత వరకు ఎవరూ చేయని సుదీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగం చేసారు. వాస్తవానికి సుదీర్ఘమైన ప్రసంగం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చే ఏ విధమైన దార్శనికతను సమకూర్చలేదు. ఏదో కొన్ని రకాల రాయితీలు, పన్నుల విధానంలో మార్పులను చేసినా గానీ, పెద్ద పెట్టుబడి దారులకు, విదేశీ, స్వదేశీ పెట్టుబడి దారులకు లాభం కలిగే విధంగా బడ్జెట్‌ ఉంది. అత్యవసరంగా ప్రజల డిమాండ్‌కు స్పందించి వ్యవసాయరంగం, గ్రామీణ అభివద్ధి, ఆహార ఉత్పత్తి విషయంలో తగినంత బడ్జెట్‌ కేటాయింపులు చేయకుండా విస్మరించారు.

ముందు చూపు లేకుండా బడ్జెట్‌ ఉన్నది అలా ఉంచితే, అన్నింటి కన్నా విచారకరమైన విషయం ఏమిటంటే బడ్జెట్‌లో పొందుపరిచిన అంకెలన్నీ నమ్మశక్యంగా లేవు. ఆ అంకెలు వాస్తవ అంకెలకు దగ్గరగా లేవు. బడ్జెట్‌ అంచనాలకు, సరి చేసిన అంచనాలకు, వాస్తవ సంఖ్యలకు తేడాలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. కానీ ఆ అంకెల తేడా సాపేక్షంగా చూస్తే చాలా తక్కువ. ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా ఏడాది కాలంగా ఆ తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత..? ఖర్చు చేసేదెంత అనేది ఈ బడ్జెట్‌ అంచనాలు మనకు తెలపడం లేదు. ఏదేమైనా పార్లమెంటులో ప్రవేశ పెట్టిన పత్రాల వలన ఏ ప్రయోజనం లేకుండా పోయింది.

కారణం ఏమిటంటే, బడ్జెట్‌ ఒక నెల రోజులు ముందు అంటే ఫిబ్రవరి చివరి రోజున కాకుండా మొదటి రోజునే ప్రవేశ పెట్టారు. దీని కారణంగా, రాబడి, వ్యయానికి సంబంధించిన అధికారిక గణాంకాలు డిసెంబర్‌ మాసాంతం వరకే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి మూడు నెలల రాబడి, వ్యయాల గణాంకాలను ఊహించవలసి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వం చివరి మూడు నెలల గణాంకాలను అతిగా అంచనా వేసింది. అందువల్ల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని సరి చేయబడిన అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సరిపోవచ్చు, సరిపోక పోవచ్చు. దానివలన రాబడి, వ్యయాల అంచనాలకన్నా తగ్గే అవకాశం ఉంది.

ఉదాహరణకు గత ఏడాది బడ్జెట్‌లో రాబోయే వ్యయానికి మించి పెద్ద మొత్తంలో అంటే 1,67,195 కోట్ల పన్నుల రాబడి ఉంటుందని అంచనా వేశారు. కానీ సరి చేయబడిన అంచనాలు ప్రజలను పిచ్చివారిని చేసింది. వాస్తవానికి ఆర్థిక శాఖకు ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి జనవరి నుంచి ప్రజా ప్రయోజనాల కోసం చేసే వ్యయంలో కోత విధించింది. ముఖ్యంగా ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థలో, వ్యవసాయ రంగానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు చేయవలసిన ద్రవ్య బదిలీలపై ఇంకోమాటలో చెప్పాలంటే, పెద్ద మొత్తంలో ఖర్చు చేయవల్సిన రంగాలకు భారీగా కోతలు విధించింది.

ఈ సంవత్సరం కూడా ఇదే జరుగుతుందనిపిస్తుంది. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం తెలివిగా ప్రజలను మాయచేసి తప్పించుకుంది. వాస్తవానికి పార్లమెంటుకు అబద్ధం ఎందుకు చెప్పావని ఆర్థిక మంత్రిని బయటకు పిలవవలసివుంది. మనం డిసెంబర్‌ 2019 చివరి నాటికి వసూలు చేసిన మొత్తాన్ని పోల్చితే, ఈ ఏడాది మరొకసారి, చివరి త్రైమాసికంలో అత్యాశతో రాబడి అంచనాలు వేశారని స్పష్టంగా కనిపిస్తోంది. డిసెంబర్‌ చివరినాటికి కేంద్ర ప్రభుత్వం చేత వసూలు చేసింది 11.78లక్షల కోట్లు. కానీ రానున్న మూడు నెలల కాలంలో 15.21లక్షల కోట్లు ప్రభుత్వానికి రాబడి వస్తుందని బడ్జెట్‌లో ప్రకటించారు. అంటే ఇప్పుడు వసూలు చేసిన దానికన్నా ఎక్కువ. అదేవిధంగా పన్నుల రాబడి దాదాపు 66శాతం పైగా పెరుగుతాయని, కార్పొరేషన్‌ పన్నుల ద్వారా రెట్టింపు రెవెన్యూ వస్తుందని, ఆదాయపు పన్ను దాదాపు 80శాతం ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఇదంతా జరగని అంశమనీ ఆర్థిక శాఖకు కూడా తెలుసు. కాబట్టి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అవసరమైన వ్యయాలపై కోత విధించే పని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదలెట్టింది.

ఇప్పటికే ఇది స్పష్టమైంది. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలలో వ్యవసాయరంగంపై ఖర్చు చేసింది 60శాతం మాత్రమే. అలాంటి వాటిపై ఖర్చు చేసేది రానున్న కాలంలో ఇంకా తగ్గుతుంది. అదేవిధంగా, ఆరోగ్యం, విద్య ఇతర రంగాల గురించి ప్రభుత్వం ఎక్కువ మాట్లాడుతున్నది, కానీ చాలా తక్కువ నిధులను మాత్రమే యిస్తుంది.

ఆహార సబ్సిడీ నిమిత్తం బడ్జెట్‌ అంచనా 1.84లక్షల కోట్ల నుంచి 1.08లక్షల కోట్లకు కోత పడింది. అంటే దీనర్థం, ఆహార పంపిణీ నిమిత్తం అవసరమైన నిధులు రాష్ట్రాలు పొందక పోవడమే కాకుండా, ఎఫ్‌సీఐ కూడా నష్టాలను భరిస్తూ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎఫ్‌సీఐకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను పొందకపోవడమే యిందుకు కారణం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి అవసరమైన నిధులు కూడా కోతకు గురవుతున్నాయి. ప్రస్తుత నిర్వహణ ప్రకారం బడ్జెట్లో ఒక లక్ష కోట్లు అవసరమవుతాయి. కానీ ఈ బడ్జెట్‌ ప్రస్తుతం సరిపడా లేని 71 వేల కోట్ల నుంచి రానున్న సంవత్సరానికిగాను 9,500కోట్ల కోత విధిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలకు యివ్వాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇది సరైనది కాదు. ఎందుకంటే, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిధులను ఖర్చు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఆయా రాష్ట్రాలకు చెల్లించవలసిన జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించక పోవడమే కాకుండా, భవిష్యత్తులో ఆ విధమైన చెల్లింపులు ఒప్పందం ప్రకారం కాకుండా సెస్‌ల ద్వారా పెరిగే ఆదాయాల ఆధారంగా జరుగుతాయని ప్రకటించింది. కేంద్రప్రభుత్వం జీఎస్‌టీ చెల్లింపుల నిమిత్తం ఇవ్వవలసిన నిధులను రాష్ట్రాలకు బదిలీ చేయకుండా అనేక రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభాన్ని సష్టిస్తోంది. ఇక ప్రజల బాగోగుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఎక్కడీ

ముఖ్యంగా గణాంకాలు స్పష్టంగా లేనప్పటికీ, ఈ బడ్జెట్‌ మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన ఆర్థిక పరిపుష్టిని సమకూర్చదు అనేది స్పష్టం. ఈ బడ్జెట్‌ వలన ఆశ్రిత పెట్టుబడిదారులకు, పన్నుల మినహాయింపు పొందిన విదేశీ పెట్టుబడుదారు లకు లాభం కల్గుతుంది. భారతదేశ ప్రజలు భయంకరమైన, దారుణమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. జాతీయవాదం, ఆధిపత్య విజయ గర్వపు అరుపులతో ప్రజల దష్టి మళ్లిస్తోంది.

అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates