బతుకులు ఆగం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– నిర్బంధంతో 200మంది వలస కూలీలు బలి
– కోట్లాది మందిని వేధిస్తున్న జీవనోపాధి, ఆకలి సమస్యలు
– ఒత్తిడి తట్టుకోలేక పలువురి ఆత్మహత్యలు!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిస్థితులు… ఇందులో ఏది డేంజర్‌ అని ? ప్రశ్నిస్తే, సగటు పౌరుడు సమాధానం చెప్పలేకపోతున్నాడు. రెండూ కూడా మానవ మనుగడకు అత్యంత ప్రమాదకరమని భావిస్తు న్నాడు. భారతదేశంలో కరోనా బారినపడి ఎంతమంది మరణించారు? లాక్‌డౌన్‌ కారణంగా చనిపోయింది ఎంతమంది?అని ఒక పరిశోధన బృందం అధ్యయనం జరపగా, ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. అవేంటంటే.. ఏప్రిల్‌ 13నాటికి దేశంలో కరోనా మర ణాలు 331 నమోదవ్వగా, లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా (ఆకలి చావులు, వైద్యం అందకపోవ టం, ఆత్మహత్యలు) దాదాపు 200మంది చనిపో యారని పరిశోధనలో తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం, సామాజిక మాధ్యమంలోని డాటా ఆధారంగా తేజస్‌ జిఎన్‌, కనికాశర్మ, అమన్‌…అనే ముగ్గురు పరిశోధకులు ‘లాక్‌డౌన్‌’ మరణాల సంఖ్య 200కు చేరుకుందని లెక్కతేల్చారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన ఘర్షణల్లో ఏడుగురు చనిపోయరని పరిశోధకులు తెలిపారు.

లాక్‌డౌన్‌ వల్ల కోట్లాదిమందికి ఉపాధిలేకుండా పోయింది. దాంతో ఆకలి సమస్యలు పెరిగాయి. ప్రభుత్వ గోడౌన్లలో కోట్లాది టన్నుల ధాన్యం వృధాగా పడి ఉన్నా, ప్రజలు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదులుతున్నారు. ఆకలిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి.
కారణాలేంటి?

మద్యపానానికి అలవాటైన వారు లాక్‌డౌన్‌ పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మద్యం లభ్యం కావటంలేదని 40మంది ఆత్మహత్య చేసుకున్నారు.

తమకు కరోనా వైరస్‌ సోకందన్న భయంతో 39మంది ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘకాలం ఒంటరిగా గడపటం, స్వీయ నిర్బంధం…వారిని మానసికంగా కుంగదీసింది.

లాక్‌డౌన్‌ పరిస్థితుల్ని జీర్ణించుకోలేక, జీవితంపై విరక్తి ఏర్పడి 21మంది చనిపోయారు. పోలీసులు నమోదు చేసిన మరణాలు ఇవి. వారి రికార్డుల్లో నమోదుకాని మరణాలెన్నో ఉన్నాయని పరిశోధకులు అంచనావేస్తున్నారు.

ఫిబ్రవరిలోనే టెస్టింగ్‌ జరపాల్సింది..
మార్చి నెలాఖరు వచ్చే వరకూ ఆగి…హటాత్తుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడం కోట్లాది మందిని తీవ్రంగా ఇక్కట్లకు గురిచేస్తున్నది. ఫిబ్రవరి నుంచే మోడీ సర్కార్‌ సరైన చర్యలు చేపడితే, పరిస్థితి చాలావరకు నియంత్రణలో ఉండేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బస్సులు, రైళ్లు, విమానాలు…రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. ప్రజలు అత్యవసరమై వేరే ప్రాంతాలకు వెళ్లాలన్నా..వెళ్లలేని పరిస్థితి. ప్రభుత్వ విధానాలు ఈ విధంగా ఉండటం సరైంది కాదని, ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించే తీరు ఇది కాదని నిపుణులు చెబుతున్నారు.

కాపుడుతుందా? చంపుతుందా?
కరోనా మహమ్మారి ప్రమాదకారి. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. ఎంతోమంది ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అలా జరగకుండా, ప్రజల ప్రాణాలు కాపడటానికే లాక్‌డౌన్‌ విధించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. పంట కోతలకు కూలీలు దొరకటం లేదని, పంట నాశనమైపోతుందన్న ఆందోళనలో యూపీలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేఘాలయకు చెందిన ఒక యువకుడ్ని రెస్టారెంట్‌ యజమాని పని నుంచి తీసేయటంతో, తీవ్రమైన భావోద్వేగానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అంబులెన్స్‌ ముందుకెళ్లడానికి మంగుళూరులో పోలీసులు నిరాకరించడంతో, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహారాష్ట్రలో పోలీసులు అంబులెన్స్‌ డ్రైవర్‌ను చితకబాదడంతో, తీవ్రంగా గాయపడి మరణించాడు. వార్తల్లోకి ఎక్కని ఇలాంటి ఘటనలెన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే, లాక్‌డౌన్‌ ప్రజల్ని కాపడటానికా? పోలీసుల చేతుల్లో చావడానికా? అనే సందేహం వస్తోంది!

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates