సాహిత్యమే ఆలోచనకు మూలం…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మరుగున పడ్డ చరిత్రలుంటాయి. కావాలని మరుగున పడేస్తున్న వర్తమానాలుంటాయి. ఎంతో కృషి చేసినా.. ఇంత కూడా గుర్తింపు లభించని జీవితాలుంటాయి. అసలు ఆ గుర్తింపుకే ఆరాటపడని వ్యక్తిత్వాలుంటాయి. అలాంటి అరుదైన మనిషి… బోయి విజయభారతి. బోయి భీమన్న కూతురిగానో, బొజ్జా తారకం భార్యగానో కాక.. తనదైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో పీహెచ్‌డీ పట్టా పొందిన మొట్టమొదటి దళిత మహిళ. తెలుగుసాహితీ విమర్శలో ధిక్కారస్వరం. అగ్రహార కోటలను బద్దలు కొట్టి.. తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా ఎదిగారు. పురాణాలను మరో చూపుతో చూసి.. అందులోని కుట్రలను తేటతెల్లం చేశారు. ‘రాముని, కృష్ణుని రహస్యాల’ను తెలుగీకరించారు. ‘దశావతారాల’ గుట్టు విప్పారు. పురుషాధిక్యత, కుల వివక్షను రూపుమాపాలంటే.. అందుకు మూలమైన వేదాలు, పురాణాలను పునర్విశ్లేషణ చేయడమొక్కటే మార్గమని చెబుతున్న ఆమె అంతరంగం…

నాన్న బోయి భీమన్న, అమ్మ బోయి నాగరత్నమ్మ. తాత (అమ్మవాళ్ల నాన్న)గొల్ల చంద్రయ్య వాళ్లది రాజోలు. ఆ రోజుల్లోనే ఆయన చదువుకుని, టీచర్‌ ట్రైనింగ్‌ చేశాడు. దళిత విద్యార్థులకోసం హాస్టల్స్‌ నిర్వహించారు. తాతగారి ప్రోత్సాహంతోనే నాన్న బీఏ, బీఈడీ చేశారు. తరువాత అమ్మనిచ్చి పెండ్లి చేశారు. తాతయ్య టీచర్‌ కావడం, నాన్న పత్రికల్లో పనిచేయడం వల్ల ఇంట్లో పుస్తకాలుండేవి. నాన్న ఉద్యోగం మద్రాసులో కావడంతో నేను రాజోలులోని తాతయ్యవాళ్లింట్లో ఉండి చదువుకున్నా. రివ్యూకోసం వచ్చిన రకరకాల పుస్తకాలు ఇంటికి తెచ్చేవారు నాన్న. వాటిని మేం, మా పిన్నులు, హాస్టల్‌ పిల్లలు చదివేవాళ్లం. నాన్న మా దగ్గర ఉన్నది తక్కువే. ఉన్నప్పుడే భారత, రామాయణాలు, కథలు చెప్పేవారు. సాహిత్యం మీద ఆసక్తి పెరిగింది. రాయడం కూడా అలవాటయ్యింది. ఎస్సెల్సీ వరకు రాజోలులో, ఇంటర్మీడియట్‌ పిఠాపురం మహారాజా కాలేజీలో చదువుకున్నా. తరువాత హైదరాబాద్‌ వచ్చి కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో బీఏస్పెషల్‌ తెలుగు చేశాను. సాహిత్యమంటే మరింత ఇష్టం ఏర్పడింది.

తొలిదళిత మహిళ…
‘నువ్వేదైనా రాస్తే నీకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకో’మనేవారు నాన్న. తెలుగులో పీహెచ్‌డీ చేస్తున్నా రచనకంటే… ఎంతసేపు మన కాళ్ల మీద మనం నిలబడాలి అన్న ఆలోచన ఉండేది. బీఏ, ఎమ్మే చదివేప్పుడు సెలవుల్లో అనువాదకురాలిగా, టీచర్‌గా పనిచేసిన. తరువాత లెక్చరర్‌ పోస్టుకు అప్లై చేసిన. నిజామాబాద్‌లో మొదటి పోస్టింగ్‌. అక్కడ పదకొండేళ్లు చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన. తెలుగులో పీహెచ్‌డీ డాక్టరేట్‌ తీసుకున్న మొదటి దళితమహిళను. తెలుగులో తొలి మహిళను కూడా నేనే ఉండాలి.. దళిత మహిళకు తొలి అవకాశం ఇవ్వడమెందుకని ఆలస్యం చేశారని తరువాత తెలిసింది. మా నాన్న అప్పటికే కవి అయినా వివక్ష ఉండేది. అయినా ఆ రోజుల్లోనే చదువుకునే అవకాశం వచ్చింది. అంతవరకు నేను అదృష్టవంతురాలినే.

నాకోసం నిజామాబాద్‌కు…
తారకంగారికి నాన్నగారంటే ఆరాధన. బ్రహ్మసమాజం పద్ధతిలో మా పెండ్లయ్యింది. ఆయన కాకినాడలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. నేనే అక్కడికెళ్లి ఉద్యోగం చూసుకుందామనుకున్నా. కానీ ఆయనే వచ్చి నిజామాబాద్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అప్పటికే అంబేద్కర్‌ భావజాలం, పేదలకు న్యాయం అందించాలనే తపన, భూస్వాముల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారనే ఆవేదన ఉన్నాయి ఆయనకు. నాకు ఆ కాన్సెప్ట్‌ లేదు. చేతిలో ఉద్యోగం ఉండాలనుకునేది. తారకం రాగానే అందరూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. చుట్టుపక్కల ఊర్లలో ఎస్సీ కమ్యూనిటీకి ఆయన దిక్కయ్యారు. అక్కడ అంబేద్కర్‌ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. మనకు ఒక లాయరున్నారనే భరోసా ఇచ్చారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఆయన ముందుండేవారు. ఆయన ఎక్కడెక్కడో తిరిగి వస్తుండేవారు. నేనేమో ఉద్యోగం, పిల్లలు చూసుకున్నాను. ఆయనకు ఇక్క నిజామాబాద్‌తోనే కాకుండా రాష్ట్రమంతటా తన సర్వీసెస్‌ అందాలనే ఆలోచనతో ఉండేవారు. పొలిటికల్‌ సంబంధాలు కూడా ఉండేవి. నాకు ఆ ఆలోచన లేదు. అనుకోకుండా అకాడమీ నుంచి ఆఫర్‌రావడం, ఆయనకు హైదరాబాద్‌ వచ్చి ప్రాక్టీస్‌ చేయమన్న సూచన రావడంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక హక్కుల గొంతుకయ్యారు.

నేను గెలిచాను…
తెలుగు అకాడమీ పెట్టిన కొత్తలో… బ్రాహ్మణ పండితులే తెలుగును ఉద్దరిస్తారు, వ్యవహారిక తెలుగు కూడా వాళ్లే చేయగలరన్న అభిప్రాయం ఉండేది. ఇదో అగ్రహారంలా తయారయ్యిందని… అన్ని కులలవారికి అవకాశం కల్పించాలని భావించారు వెంకటస్వామిగారు. అట్లా.. 1978లో తెలుగు అకాడమీకి రీసర్చ్‌ ఆఫీసర్‌ (టెర్మినాలజీ)గా వచ్చాను. ఆ పదజాలం ఆమెకేం తెలుస్తుంది? ఆమేం చేస్తుంది? అని కామెంట్‌ చేశారు. మాల, మాదిగోళ్లకు తెలుగేం వస్తుందనేవారు. అట్లాంటి సమయంలో ‘సాహత్యకోశం’ ప్రాజెక్టు, నాకు శివనారయ్యగారికి అప్పగించారు. అదెప్పుడో అప్రూవ్‌డ్‌ ప్రాజెక్టు. ఎవ్వరూ దానిమీద శ్రద్ధ పెట్టలేదు. వీళ్లిద్దరూ ఆ ప్రాజెక్టు చేయడమా, వీళ్లకెమొస్తుంది అని… ఏం వివరాలు చెప్పలేదు. సహాయన నిరాకరణ చేశారు. తమకివ్వలేదన్న అసూయతో రిఫరెన్స్‌ పుస్తకాలున్నా ఇవ్వకపోయేవారు. ఎన్ని చేసినా.. అనేక గ్రంథాలు చదవడం, కవులు, రచనలు ముందే పరిచయం అవ్వడం వల్ల విజయవంతంగా పూర్తి చేశాం. ‘సాహిత్యకోశం 1851-1950’, ‘సాహిత్యకోశం 1951-1991’ రెండు వాల్యూమ్స్‌ తీసుకొచ్చాం. ‘అదంతా తప్పుల తడక, ఆమెకు అనుభవం లేదు. ఎడిటర్‌గా పనికి రాదు’ అని పత్రికల్లో రాయించారు. విచారణకోసం కమిటీలు వేశారు. అయినా నేనే గెలిచాను.

అకాడమీని నిలబెట్టగలిగాను…
డైరెక్టర్స్‌ మారుతూ ఉండేవారు. నా గురించి తెలిసినవాళ్లయితే మాట్లాడేవారు కాదు. తెలియనివాళ్లొస్తే.. డైరెక్టర్‌ ముందు నన్ను తక్కువ చేయాలని చూసేవారు. కానీ నా పనితీరు చూసిన తరువాత డైరెక్టర్‌ మంచి ప్రాజెక్టులు ఇచ్చేవారు. అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఎప్పుడో అవకాశం రావాల్సింది. కానీ… ఆలస్యంగా ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్‌ అయ్యాక… పబ్లికేషన్స్‌ బాధ్యత అంతా నాదే. మంచి పుస్తకాలు వేసినా ఎంకరేజ్‌ చేసేవారు కాదు. అమ్మకాలు చేయలేమని చెప్పేవారు. అప్పటిదాకా అకాడమీ తెలుగు మీడియం మాత్రం వేసేది. దానిలోంచి ఎమ్‌సెట్‌కు ప్రశ్నలు వచ్చేవి. దాంతో ఇంగ్లీష్‌ మీడియం కూడా వేద్దామని చెప్పాను. పాఠ్యాంశాలు రాయించడం దగ్గరనుంచి ప్రింటింగ్‌ వరకు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. పేపర్‌ బాగుండటం లేదని ఇంటర్మీడియట్‌ బోర్డ్‌తో చెప్పించారు. టెండర్ల తరువాత కూడా పేపర్‌ సకాలంలో అందకుండా చేయాలని చూశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. సహౌద్యోగి ప్రమీలా రెడ్డి నాతో ఉంది. రాత్రిపగలు తేడా లేకుండా ఇద్దరం పనిచేసి, పేపర్‌ లోడ్‌ను దగ్గరుండి ప్రెస్‌కు పంపించాం. నేను రిటైర్‌ అవ్వడానికి ఏడాది ముందే ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలు విజయవంతంగా తీసుకొచ్చాను. అన్ని తట్టుకుని నేను నిలబడ్డాను. డైరెక్టర్‌గా అకాడమీని నిలబెట్టగలిగాను.

కోపం, బాధ కలిగినప్పుడే రాశాను…
పదవీవిరమణ తరువాతే రచనలు మొదలుపెట్టాను. నాకు కోపమో, బాధో కలిగినప్పుడే రాశాను. దళితులకు ఇంగ్లీష్‌ అవసరమా? అని చర్చమొదలైంది. తెలుగు జ్ఞానమంతా వేదాలు, పురాణాల రూపంలో బ్రాహ్మణుల పూజగదుల్లో మగ్గుతుంటే… దళితులకు విద్యనందించింది ఆంగ్లేయులే. అలాంటి ఇంగ్లిష్‌ కచ్చితంగా అవసరమని వ్యాసం రాసి ఆంధ్రజ్యోతికే పంపాను. అంబేద్కర్‌ జీవిత చరిత్ర రాయమని తారకంగారిని ఎవరో అడిగారు. ఆయన ఈవిడ బాగా రాస్తుందని నన్ను సూచించారు. అంబేద్కర్‌ జీవిత చరిత్ర మొదట వచ్చింది. గౌతు లచ్చన్న పత్రికకకోసం ‘ జ్యోతిరావుపూలే జీవిత చరిత్ర’ సీరియల్‌గా రాశాను. సగం అయ్యేసరికి పత్రిక మూసేశారు. నాకున్న ఆసక్తితో మొత్తం పూర్తి చేసి పుస్తకం తెచ్చాను. అట్లా జీవిత చరిత్రల రచనల్లోకి వెళ్లాను. అకాడమీలో అంబేద్కర్‌ను చదవడం వల్ల సోషల్‌ అవుట్‌లుక్‌ మారిపోయింది. నేను అప్పటికే చదివిన హరిశ్చంద్రోపాఖ్యానమే అంబేద్కర్‌ను చదివాక మరో రకంగా అర్థమయ్యింది. క్లాసికల్‌ లిటరేచర్‌లో మన దేశకాల పరిస్థితులు ఎలా ఉండేవి? వాళ్ల ఆలోచనలు, ఆ కథల్లో వాళ్లు ప్రవర్తించిన తీరు మీద రాస్తే బాగుండదనిపించిది. హరిశ్చంద్రుడు అనగానే సత్యం, ప్రతివ్రతా లక్షణాలు, కులం.. అన్నీ తప్పుడు కథలు చెప్పారు. హరిశ్చంద్రుడు కష్టాలు పడింది అబద్ధాలు చెప్పలేక కాదు. కులం పోగొట్టుకోలేక. నిజానికి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. అందుకే ఆ విషయాలన్నీ చెబుతూ ‘సత్యహరిశ్చంద్రుడు’ అనే విమర్శనాత్మక పుస్తకం రాశాను. కులం గురించి, స్త్రీల గురించి ఉన్న పుస్తకాలు చదివి ‘షట్చక్రవర్తులు’, ‘దశావతారాలు’ వరుసగా రాసుకుంటూ వచ్చాను. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం వైపు మారుతున్న సమాజంలో తాటకను ఎలా చంపారో అంబేద్కర్‌ రాశారు. ఆ స్ఫూర్తితో రామాయణం మీద ‘వ్యవస్థను మార్చిన రాముడు’ రాశాను. అలాగే ‘రాముని కృష్ణుని రహస్యాలు’ అనువాదం చేశాను. మహాభారతంలో స్త్రీలను అణచిపెట్టే ధర్మసూక్ష్మాలను ‘నరమేధాలూ నియోగాలు-మహాభారతం పరిశీలన’గా తీసుకొచ్చాను. ‘పురాణాలు-మరోచూపు’ అలాంటిదే.

పునర్విశ్లేషించాలి…
అధికారం తమ చేతుల్లోంచి జారిపోతుందని భావించినప్పుడే బ్రాహ్మణులు రామాయణ, మహాభారతాలను, ఇతర పురాణాలను ముందుకు తెచ్చారు. ఇప్పుడు మనకోసం ఓ భారతం, రామాయణం రావాల్సి ఉంది. అందుకే దళిత యువత ప్రాచీన సాహిత్యాన్ని రీఇంటర్‌ప్రెట్‌ చేయాలి. మూలవాసులను రాక్షసులు, నాగులు అని చెడ్డపేర్లు పెట్టి క్రూరంగా చిత్రించి, మన జాతి చరిత్రను తెలుసుకోకుండా చేశారు. పురాణాలు మనకెందుకు అనుకోవద్దు. వాటి పునాది మీదనే పురుషాధిపత్యం, కుల వ్యవస్థ బతుకుతున్నది. దాన్ని బద్ధలు కొట్టాలంటే మనం పురాణాలు బాగాచదవాలి. వాటిని తిరగరాయాలి. అంబేద్కర్‌ బోధనలు ఇప్పుడు నిత్య పారాయణం చేయాలి. .

ఆర్థిక సమానత్వం రావాలి..
కులాంతర వివాహాలతోనే కాదు.. కులమనే ప్రసక్తి లేకుండా జీవించగలిగినప్పుడు, భావజాలాల్లో కూడా మార్పు వచ్చినప్పుడు కుల నిర్మూలన సాధ్యమవుతుంది. ఆర్థికాంతరాలు పోయి, కుల మూలాలు తెలియనంత ఆర్థికస్థాయి సమానమైప్పుడు కులం పోతుందేమో!? అంబేద్కర్‌ చెప్పినట్టు సంఘటిత పోరాటాలు చేయాలి. అందరికీ ఒకే రకమైన లక్ష్యాలుండాలని ఏం లేదు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అందరూ న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి. ప్రశ్నించినవాళ్లను జైళ్లలో పెడుతున్నారు. పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. మనం ఉత్సాహం తెచ్చుకోవాలి. మనకు సాధ్యమైనంతగా పోరాటాలు చేస్తూనే పోవాలి.

అమ్మ వివక్షకు గురైంది…
మరాఠీ సాహిత్యంలో దళిత మహిళల ఆత్మకథలు వచ్చాయి. తెలుగులో ఎవ్వరూ రాయడం లేదు. పితృస్వామ్యం, దళిత పురుషులకున్న వ్యామోహాల వల్ల అమ్మ దళిత స్త్రీగా తన జీవితంలో ఎంత పోరాడింది. అమ్మ మాటలు కొన్ని, అమ్మ గురించిన మా వ్యాసాలతో ‘మా అమ్మ బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు’ పుస్తకం తీసుకొచ్చా. అదే మరో కులం స్త్రీ అయితే ఆమెకు దక్కే గౌరవం మరోలా ఉండేది. కానీ.. కేవలం దళిత స్త్రీ కావడం వల్ల ఎంతో వివక్షకు గురైంది. రచయిత్రులు వాళ్ల తల్లుల పేరు మీద అవార్డులు ఇద్దామన్న చర్చ జరిగిందోసారి. మా అమ్మ పేరు వచ్చేసరికి అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఎంత కలుపుకొని పోయినట్టు కనిపించినా… దళిత స్త్రీలంటే వివక్ష ఎంతో ఉంది. వేదికలను ఎక్కించే దగ్గరనుంచి మాట్లాడించేవరకు అది ప్రస్ఫుటమవుతుంది.

దళిత స్త్రీలు బాధ్యత వహిస్తారు..
దళిత కుటుంబాల్లో ఆడవాళ్లకంటే తాము గొప్పవాళ్లని నిరూపించుకోవాలని చూస్తారు పురుషులు. ఆడవాళ్లు చెబితే నీకేం తెలుసులే అని కొట్టిపారేస్తారు. పితృస్వామ్యం సంపన్న కుటుంబాల్లో, అగ్రకులాల్లో అంతగా లేదు. అది దళితులకు వ్యాపించి, బలంగా కొనసాగుతున్నది. దళిత స్త్రీలు బాధ్యత వహించడాన్ని.. వాళ్లిచ్చిన స్వేచ్ఛగానో, మరోటిగానో చెబుతున్నారు తప్ప… దళిత ఆడవాళ్లకు స్వాతంత్య్రం ఎక్కువ అన్నది అబద్ధం. దేశకాల పరిస్థితులను బట్టి అగ్రకులాలు నియమాలు మార్చుకుంటూ వచ్చాయి. కానీ దళిత పురుషులు దళిత స్త్రీ సమాజంపై ఎక్కువ దృష్టిపెట్టలేదు. చదివించారు కానీ స్వతంత్రత ఇవ్వలేదు. ఆ స్వతంత్రత లేనప్పుడు మనిషి పరిణామం చెందలేడు. మా కుటుంబ బాధ్యతంతా తీసుకున్నది అమ్మ. మా అమ్మ, వాళ్ల అక్క చెల్లెళ్లు, నా స్నేహితులు.. నా జీవితం మీద ప్రభావం చూపారు. కానీ… అన్నింటికీ మించి సాహిత్యం ఆధారంగానే నా ఆలోచన సాగింది. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అస్సలు పోగొట్టుకోకూడదు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆత్మధైర్యం వస్తుంది. దాంతోనే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం.

Courteys Nava telangana

RELATED ARTICLES

Latest Updates