లాక్‌డౌన్‌ తర్వాత కార్మిక సంక్షోభం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రోజు పని చేస్తేనే కానీ కడుపు నిండని కూలీలు, కార్మికులకు నెల రోజులుగా పని లేదు. లాక్‌ డౌన్‌ ఎప్పటి వరకూ ఉంటుందో తెలియదు! అందుకే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. వారంతా తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. కొందరు గమ్యం చేరారు! కొందరు మధ్యలో చిక్కుకున్నారు! లాక్‌డౌన్‌ ఎత్తేసిన వెంటనే స్వగ్రామాలకు చేరాలనే సంకల్పంతో ఉన్నారు! అప్పుడు పరిశ్రమలు తెరిస్తే.. నిర్మాణ కార్యక్రమాలు మొదలైతే.. కూలీలు, కార్మికులు ఎలా!? ఇదీ.. ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న! దాదాపు నెల రోజుల బతుకు భయం వారిని వెంటనే రానివ్వదు! ఇక్కడ ఉన్నవాళ్లూ స్వగ్రామాలకు వెళ్లేందుకే ప్రాధాన్యమిస్తారు! అందుకే, లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూలీల సంక్షోభం తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి!

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో వలస కార్మికులు పడుతున్న కష్టాలను రోజూ కథలు కథలుగా వింటున్నాం, చూస్తున్నాం. తెలంగాణలో ఏళ్ల తరబడి పని చేస్తున్న వివిధ రాష్ట్రాల కార్మికులు ఇక్కడ బతుకు భరోసా లేదన్న అభిప్రాయానికి వచ్చి, సొంత ఊరికి వెళ్లిపోవాలన్న పట్టుదలతో మండుటెండలో కాలినడకన వెళ్లిపోతున్నారు. ఇన్నాళ్లు వాళ్లతో పని చేయించుకున్న యజమానులు కూడా వారికి కావాల్సిన నిత్యావసరాలు సమకూర్చి మానవ వనరులను కాపాడుకుందామనే ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతానికి బయటి నుంచి చూసే వారికి ఇది వలస కూలీల వ్యక్తిగత కష్టంగానే కనబడవచ్చు. కానీ, లాక్‌డౌన్‌ ఎత్తేశాక తెలంగాణ రాష్ట్ర నిర్మాణ, పారిశ్రామిక రంగానికి అతిపెద్ద సమస్యగా మారనుంది. ఇన్ని గండాలు దాటుకొని సొంత గ్రామాలకు చేసిన వలసకార్మికులు లాక్‌డౌన్‌ ఎత్తేయగానే పరుగున వస్తారనుకోవడం అత్యాశే. వారికి తిరిగి నమ్మకం కలగడానికి నెలలు, ఏళ్లు పట్టొచ్చు. అప్పటి దాకా తెలంగాణ నిర్మాణ, పారిశ్రామిక రంగాలకు కార్మికుల కొరత తప్పదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్రెడాయ్‌, ట్రెడాయ్‌, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్లు సంప్రదింపులు మొదలు పెట్టాయి.

యాభై శాతం మంది ఇంటికి
కరోనాకు ముందు దేశమంతా ఆర్థిక మందగమనం ముసురుకోగా హైదరాబాద్‌లో మాత్రం నిర్మాణరంగం కళకళలాడుతూ ఉంది. లాక్‌డౌన్‌ దెబ్బకు మొత్తం నిర్మాణ రంగమే కుదేలై పోయింది. మునుపటి పరిస్థితి వెంటనే వచ్చే అవకాశం లేదని, మరో 6-12 నెలల సమయం పడుతుందని బిల్డర్లే అంటున్నారు. తెలంగాణలో నిర్మాణ రంగంతో పాటు, ఫ్యాక్టరీలు, హోటళ్లు ఎక్కువగా వలస కార్మికులపైనే ఆధారపడ్డాయి. వీరిలో 50 శాతం మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. హైకోర్టు జోక్యం చేసుకున్నా వలస కార్మికులకు భరోసా కల్పించే స్థాయిలో ఏర్పాట్లు జరగలేదు. ప్రభుత్వం, పరిశ్రమల వర్గాలు ఈ సంక్షోభాన్ని ముందే గుర్తించి, కార్మికులకు బస, భోజన సౌకర్యం కల్పిస్తే కొంత భిన్నమైన పరిస్థితి ఉండేదని భావిస్తున్నారు. వెళ్లిన వాళ్లు తిరిగి రావాలంటే కనీసం ఆరు మాసాలు పడుతుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో నిర్మాణరంగంలో, పరిశ్రమల్లో కలిపి 30 లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వారిలో ఇరవై లక్షల మంది హెచ్‌ఎండీఏ పరిధిలోనే పని చేస్తున్నారు. ఏడు లక్షల మంది ఇతర రాష్ట్రాల వారు. సంఘటిత రంగంలో 15 లక్షల మంది, అసంఘటిత రంగంలో 15 లక్షల మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించగానే అసంఘటిత కార్మికులే పెద్ద ఎత్తున సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. భారీ నిర్మాణ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న వారికి, సైట్లోనే వసతి, భోజనం కల్పించడం ద్వారా కాపాడుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ పాక్షికంగా సడలించినా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణ పనులు కొనసాగించడానికి సమాయత్తమవుతున్నాయి. ఇలాంటి సంస్థలకు కూడా లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తేశాక అసలు సంక్షోభం మొదలవుతుందని భావిస్తున్నారు.

వలస కార్మికుల లెక్క ఇదీ!
తెలంగాణలో ఏడు లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. బిహార్‌, ఒడిసా, తమిళనాడు, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌‌, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. నాలుగు లక్షల మంది నిర్మాణ రంగంలో, రెండున్నర లక్షల మంది పరిశ్రమల్లో, లక్ష మంది వరకు ఇతర రంగాల్లో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో తొలుత రోడ్డున పడింది అసంఘటిత కార్మికులే. సగం వెళ్లిపోగా.. మరో సగం మంది ఇక్కడే ఉన్నారు. వారంతా ప్రభుత్వం, నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా, హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ లేబర్‌ స్థాయి నుంచి డిగ్రీ చేసిన వారి వరకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 2000 మంది శిక్షణ పూర్తి చేసుకొన్నారు. వీరిలో 90 శాతం కార్మికులను చేర్చుకోవడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి.

హోటల్‌ రంగంలోనూ
హోటల్‌ రంగంలో కూడా వలస కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌ హోటల్‌ కార్మికుల్లో సగం మంది ఇతర రాష్ట్రాల వారే. వారు తిరిగి వచ్చే వరకూ హోటల్‌ రంగానికీ సంక్షోభమే.

నగదు సాయం అందించాలి: లక్ష్మయ్య
కార్మికులకు మళ్లీ ఉపాధి లభిస్తున్నదన్న భరోసా కల్పించకపోతే తిరిగి రారని భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం చైర్మన్‌ లక్ష్మయ్య అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఒక్కో కార్మికుడికి రూ.10 వేల చొప్పున సాయం అందించాలన్నారు. లాక్‌డౌన్‌ సడలించినా ఆ తర్వాత మూడు నెలల వరకు ఈ రంగం కోలుకోదని తెలిపారు. కాగా, మే 8 తర్వాత నిర్మాణ పనులు మొదలవుతాయని ట్రెడా అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు అన్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటే కార్మికులను క్వారంటైన్‌లో పెట్టాలంటే వారు రారని తెలిపారు.

నేనైతే రాను: హీరా మోహన్‌, కార్మికుడు
నా పేరు హీరా మోహన్‌. మాది మధ్యప్రదేశ్‌లోని బాలాఘడ్‌ జిల్లా. ఘట్‌కేసర్‌లోని ఒక భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాను. గత నెల చేసిన పనికి కూడా కూలీ ఇవ్వలేదు. తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌ని నిలదీశాం. చేతిలో చిల్లిగవ్వలేదు. నేనైతే, ఊరెళ్లాక తిరిగి రావాలనుకోవడం లేదు.

భరోసా కలిగితేనే వస్తారు
పొరుగు రాష్ట్రాల కార్మికులు ఉపాధి లభిస్తున్నదన్న నమ్మకం కుదిరితేనే తిరిగి వస్తారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. గృహ రుణాలపై వడ్డీని మరింత తగ్గించాలి. సులువుగా రుణాలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీల్లోనూ రాయితీలివ్వాలి. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి వలస కార్మికులకు అద్దెకు ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి కూడా కొంత నగదు సాయం అందించాలి. నిర్మాణానికి అనుబంధంగా మరో 250 రంగాలున్నాయి.

ఎప్పుడనేది చెప్పలేం!
నిర్మాణరంగం పూర్తిగా స్తంభించింది. కోలుకుంటుందనే భావిస్తున్నాం. ఎప్పుడన్నది మాత్రం చెప్పలేం. లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో ఎత్తివేసిన తర్వాతే పుంజుకొనే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండబోతున్నాయి కాబట్టి వలస కార్మికుల్లో 80-90 శాతం తిరిగి వస్తారు. నిర్మాణ రంగంలో భౌతికదూరం పాటించడం కష్టమే. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ణానాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికీ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం.
ఎస్‌.రాంరెడ్డి, క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates