టీచర్‌కు అరదండాలు.. విద్యార్థినులను లైంగికంగా వేధించి కటకటాల పాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిందితుడిని శిక్షించాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌
షాద్‌నగర్‌లో ప్రైవేటు పాఠశాల టీచర్‌..అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన
సైన్స్‌ పాఠాల బోధన పేరుతో అశ్లీల వీడియోల ప్రదర్శన
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్న షీటీమ్స్‌
శుక్రవారం.. మళ్లీ అలాంటి సంఘటనే ..
నేరెడ్‌మెట్‌ ప్రభుత్వ పాఠశాలలో..
మాష్టారు వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పుకొన్న పిల్లలు
టీచర్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులు

నేరేడ్‌మెట్‌, హైదరాబాద్, డిసెంబర్‌ : పిల్లలకు విలువలు నేర్పి ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదం చేయాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో.. కొందరి తీరు… విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మాత్రమే కాదు మొత్తం సంఘాన్నే భయపెట్టే విధంగా ఉంటోంది. ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ విజ్ఞాన బోధన పేరుతో ఆడపిల్లలకు అశ్లీల వీడియోలు చూపిస్తూ దొరికిపోయిన విషయాన్ని పోలీసులు గురువారం వెల్లడించారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి వ్యవహారం శుక్రవారం వెలుగుచూసింది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు అతడిని నిలదీశారు.

విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాలకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేరేడ్‌మెట్‌ పోలీసులు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం..

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(38) 2009లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. ఏడాదిన్నర క్రితం నేరేడ్‌మెట్‌లో ఓ పాఠశాలకు బదిలీపై వచ్చాడు. పాఠాలు చెప్పాల్సిన అతడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. మూడు నెలల నుంచి ముగ్గురు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. బాలికల మానసిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఏమైందని వారిని ప్రశ్నించారు. సోషల్‌ టీచర్‌ లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని నిలదీశారు. విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. పాఠశాలకు వచ్చిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బాలికలు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.

బాలికలను వేధిస్తే కఠిన చర్యలు : సీఐ
మల్కాజిగిరి న్యాయమూర్తితో కలిసి పాఠశాలలో ఇటీవల నిర్వహించిన విజ్ఞాన సదస్సులో బాలికల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించామని, దీంతో బాలికలు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారని సీఐ చెప్పారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రర్తించిన, లైంగికంగా వేధించినా, సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు చేసినా, సెల్‌ఫోన్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టిన వారిపై నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సీపీసీఆర్‌) గైడ్‌లైన్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉపాధ్యాయుడిని శిక్షించాలి
బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల నాయకులు, బాలికల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ… బాలికలను ఉపాధ్యాయుడు వేధిస్తున్నా.. ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో గమనించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. టీచర్‌ను ప్రధానోపాధ్యాయుడు సమర్థించడానికి ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌, ఎన్‌ఎ్‌సయూ, టీఎన్‌ఎ్‌సఎఫ్‌, ఏబీవీపీ, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ఓంకార్‌, బి. సాయి, అరవింద్‌, సాయి, మనోజ్‌, అక్రమ్‌, జైకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాజీకి యత్నించిన నాయకుడిపై ఆగ్రహం
ఉపాధ్యాయుడు, బాలికల తల్లిదండ్రుల మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించిన ఓ సీనియర్‌ నాయకుడి ప్రయత్నం బెడిసి కొట్టింది. ఉపాధ్యాయుడి తరపున మాట్లాడటానికి స్టేషన్‌కు వెళ్లాడు. కేసు పెడితే పోలీస్‌స్టేషన్‌, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని బెదిరింపు ధోరణితో అన్నాడు. ఆగ్రహం చెందిన బాలికలు ‘మాకు జరిగిన అన్యాయం నీ కుమార్తెలకు జరిగితే ఏంచేస్తారంటూ’ ప్రశ్నించడంతో సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. స్పందించిన విద్యార్థి సంఘాల నాయకులు… రాజీ ప్రయత్నం మానుకొని స్టేషన్‌ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేయడంతో చేసేదేమి లేక వెనుదిరిగారు. బాధితులకు అండగా ఉండాల్సిన నాయకుడు ఇలా వ్యవహరించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.

ఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
విద్యార్థినుల తల్లిదండ్రులు విషయం చెప్పగానే ఆరా తీశాం. ఘటనపై విచారణ జరిపి పై అధికారులకు నివేదిక అందజేస్తాం. ఉపాధ్యాయుడు తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు

RELATED ARTICLES

Latest Updates