ఊళ్లలో ఉపద్రవం  

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..
కొన్ని గ్రామాల్లో గల్లీకో దుకాణం
యువకులు, ఇంటి పెద్దల్ని  కబళిస్తున్న వ్యసనం
జనగామ, వరంగల్‌ గ్రామీణ, నగర జిల్లాల నుంచి ప్రత్యేక ప్రతినిధి

ఇల్లు గుల్లయినా ఇనకపాయె. పానం మీదికొచ్చినా మానలేదాయె. తాగిండు… తాగిండు… తాగుతూనే పోయిండు…
సరదాగా మొదలైన మద్యం వ్యసనమైంది. కనిపించని కాలనాగై కాటేసింది. ఉప‘ద్రవమై’ ఉసురు తీసింది. నాన్నేడని అడిగే బిడ్డలకేంజెప్పేది? పెనిమిటి కోసం దిగులు పడే కోడలినెలా ఓదార్చేది? కొడుకు పోయిన ముదుసలి బతుకెట్టా సాగేది?
భర్త లేని భార్య… కొడుకు దూరమైన తల్లి… తండ్రిని కోల్పోయిన బిడ్డలు… ఇంకేం కుటుంబం? అంతా ఛిద్రం. ఒక్క మగాడు… ఎందరికో ఆధారమవుతాడు. అతడు కుటుంబ మాలికలో దారం లాంటి వాడు. ఆ దారం తెగిపోతోంది. ఆధారం జారిపోతోంది. అతడే పోతే… బంధాలు మాయం. బతుకులు భారం…

ఈ ఫొటోలో కనిపించే మహిళల నేపథ్యం అలాంటిదే. మద్యం వల్ల వీరి జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కొందరు కొడుకులను కోల్పోయారు. మరికొందరు భర్తలను పోగొట్టుకున్నారు. జనగామ మండలం జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ఒక్క ముదిరాజ్‌ కాలనీలోనే ‘మద్యం బాధిత కుటుంబాల’ మహిళలు 30 మందికి పైగా ఉన్నారు. ఈ ఊరిలో రెండు మద్యం దుకాణాలకు అనుమతి ఉండగా, అనధికారికంగా 30 వరకూ బెల్టుషాపులు నడుస్తున్నాయి. బాధితుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.

ముసలితనంలో చేరదీయాల్సిన కొడుకు..
బతుకంతా తోడుగా నిలుస్తానని ఒట్టుపెట్టిన ఇంటాయన..
భవిష్యత్తును భుజాలపై ఎక్కించుకొని చూపించాల్సిన నాయిన..

ఇలా విభిన్న బంధాలను మద్యం విచ్ఛిన్నం చేస్తోంది. గుడుంబా బంద్‌ అయిందని.. తమ వాళ్లు బాగుపడతారని ఊపిరిపీల్చుకున్న మహిళలను బెల్టుషాపుల మహమ్మారి భయపెడుతోంది. తెలంగాణ పల్లెల్లో విచ్చలవిడిగా వెలసిన ‘ఇంటి దుకాణాలు’.. యువతను మత్తులో ముంచేస్తున్నాయి. ఒక్కో ఊర్లో కనీసం 20కి తక్కువ కాకుండా ఇలాంటి దుకాణాలు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. తాగుడుకు బానిసలై మృతిచెందుతున్న మొత్తం బాధితుల్లో దాదాపు 30 శాతం మంది 30-40 ఏళ్ల వయసువారే కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. మద్యం కారణంగా చితికిపోతున్న కుటుంబాల దయనీయ జీవితాలను జనగామ, వరంగల్‌ గ్రామీణ, నగర జిల్లాల్లో ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గుడుంబాను నిషేధించిన ప్రభుత్వానికి జేజేలు కొడుతున్న మహిళా లోకమే.. ఇప్పుడు బెల్టుషాపులపైనా ఉక్కుపాదాన్ని మోపాలని వేడుకుంటోంది.

దుకాణాల కుమ్మక్కు
అధికారికంగా మద్యం దుకాణాలను నెలకొల్పినవారు ఆయా మండలాల్లో కుమ్మక్కై గ్రామాలను పంచుకొని అమ్మకాలు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్‌ గ్రామీణ జిల్లా దమ్మన్నపేటలో బెల్టుషాపులు నిర్వహించేవారు వర్ధన్నపేట మండలంలోని 3 వైన్స్‌ల నుంచే తెచ్చుకోవాలి. అలాకాకుండా సమీపంలోని జఫర్‌గడ్‌ నుంచి తెచ్చుకున్నట్లు తెలిస్తే.. ‘తనిఖీలు’ జరుగుతాయి. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ అధికారులు కూడా గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఖరీదు ఎక్కువైనా..
సాధారణంగా మద్యం దుకాణాలకు సమయం ఉంటుంది. అయితే బెల్టుషాపుల ప్రవేశంతో గ్రామాల్లో 24 గంటలూ మద్యం ఏరులై పారుతోంది. ఇళ్లలోనే ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు సులువవుతోంది. పైగా కిరాణా షాపులో నిత్యావసరాలు ఉద్దెరిచ్చినట్లుగా.. మద్యానికీ ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఈ తరహా దుకాణాల్లో ధర కూడా అధికమే. ఈ నేపథ్యంలో తమ వారి ఒళ్లు.. తమ ఇళ్లు.. గుల్ల అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.
*  తాళ్లపల్లి సోమమ్మ.. భర్త సహా ముగ్గురు కొడుకులను మద్యం మహమ్మారి కబళించింది. ఇంట్లో మగ దిక్కు లేకుండా పోయింది. ఇద్దరు కోడళ్లు బతుకుదెరువు వెతుక్కుంటూ పొరుగూళ్లకు తరలిపోగా.. మరో కోడలు, పిల్లలతో సోమమ్మ బతుకుపోరాటం చేస్తోంది. ‘మాకు పింఛను ఇస్తున్నడు కేసీఆర్‌ సారు.. ఈ బెల్టుషాపులు కూడా బంద్‌ చేయించాలే’ అని కోరుతోంది.
*  లింగాల సత్తెమ్మ..  భర్త ఎల్లయ్య మద్యానికి బానిసై అనారోగ్యంతో చనిపోగా.. ఇంటిని చక్కదిద్దాల్సిన కొడుకులు అశోక్‌(20), శ్రీకాంత్‌(18) కూడా ఈ దుర్వ్యసనానికి అలవాటు పడ్డారు. చివరకు మత్తులోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్తెమ్మ వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని నెట్టుకొస్తోంది.
*  బాషబోయిన లక్ష్మి.. కూలీనాలీ చేసుకుంటేనే పొట్ట నిండేది. భర్త అంజయ్య మద్యానికి అలవాటుపడి మృతిచెందగా.. ఒక బిడ్డ అనారోగ్యంతో చనిపోయింది.
*  నీలం రాజు(15).. తండ్రి మద్యం తాగీతాగీ మూడేళ్ల కిందట మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. రాజు ఇప్పుడు అనాథగా మారాడు.
*  గొడుగు రజిత(26).. ఆమె భర్త నగేశ్‌ తాగుడుకు బానిసై కాలేయ వ్యాధితో నాలుగేళ్ల కిందట మృతిచెందాడు. వీరికి ఒక్కత్తే పాప(5). మిషన్‌ కుట్టుకుంటూ, కూలీనాలీ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న రజిత.. కష్టనష్టాలకోర్చి బిడ్డను ప్రైవేటు బడిలో చదివిస్తోంది.
*  వరంగల్‌ గ్రామీణ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడులో మద్యం కారణంగా వితంతువులుగా మారిన మహిళలు సుమారు 30 మంది వరకూ ఉన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. ఈ గ్రామ జనాభా 1500 మాత్రమే అయినా ఇక్కడ మాత్రం 5 బెల్టుషాపులుండడం గమనార్హం.

అక్రమ అమ్మకాలను అడ్డుకుంటాం
-బ్రహ్మానందరెడ్డి, ఎక్సైజ్‌ సీఐ, పాలకుర్తి

గుడుంబాతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఇప్పటికే దాన్ని అరికట్టాం. ఇప్పుడు గ్రామాల్లో గుడుంబా అనేది లేకుండా చేశాం. అక్రమంగా ఇళ్లలో మద్యం అమ్మడం చట్టవిరుద్ధం. ఇలాంటివి ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. తప్పకుండా మద్యం అక్రమ అమ్మకాలను అడ్డుకుంటాం.

బెల్టుషాపులను అరికట్టాలి
మద్యం కారణంగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. యువకులు తాగుడుకు బానిసలై మృతిచెందుతున్నారు. గ్రామాల్లో ఇళ్లలోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. వీటిని అధికారులు అరికట్టాలి. బెల్టుషాపులకు వ్యతిరేకంగా ఇటీవలే మా గ్రామంలో తీర్మానం కూడా చేశాం. మద్యం కారణంగా జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తాం.

– బల్లెపు వెంకట నర్సింగరావు, జఫర్‌గఢ్‌ సర్పంచి

వరంగల్‌ నగర జిల్లా నందనం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అనిల్‌(25) అతిగా మద్యం సేవించడంతో కాలేయం దెబ్బతిని కన్నుమూశాడు. భర్త మరణించే నాటికి భార్య శ్రుతి(22) ఆర్నెల్ల గర్భిణి. అప్పటికే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు చిన్నారులతో ఒంటరిగా బతుకు పోరాటం చేస్తోంది. నందనంలో గల్లీకో బెల్టుషాపు ఉందని గ్రామస్థులు తెలిపారు.వరంగల్‌ గ్రామీణ జిల్లా దమ్మన్నపేటకు చెందిన మేడి నాగరాజు పెట్రోల్‌ పంపులో పనిచేసేవాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాగరాజు చనిపోయేనాటికి 18 నెలల వయసున్న బిడ్డ ఉండగా.. భార్య లత ఆర్నెళ్ల గర్భిణి. ఆర్థికంగా కష్టమైనా పెద్ద కూతురిని ప్రైవేటు బడికి పంపిస్తోంది. ఇంకా రెండేళ్లు నిండని చిన్న బిడ్డను ఒళ్లో పెట్టుకొని కుట్టు పని నేర్చుకుంటోంది.

జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం ఒగులపురానికి చెందిన చీపురు రాధిక(21)ది మరో దీనగాథ. విపరీతంగా మద్యం అలవాటున్న ఆమె భర్త సంపత్‌ అదే మత్తులో డాబాపై నుంచి కిందపడి చనిపోయాడు. భర్తను కోల్పోయిన ఆమె బతుకుదెరువు కోసం తల్లిగారిల్లు వర్ధన్నపేటకు చేరింది. బట్టల దుకాణంలో పనిచేస్తూ బతుకుబండిని లాగుతోంది.

Courtesy Eenadu …

RELATED ARTICLES

Latest Updates