మీరు నేర్పుతారా? మేం నేర్పాలా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అపరిష్కృతంగా 2 వేలకుపైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు
ఒక న్యాయమూర్తి ఎదుటే 800 పైచిలుకు
న్యాయస్థానాలపై అధికారులకు ఇంత అగౌరవమా?
జైలుకు పంపితే తప్ప మారరేమో: హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌: పరిస్థితి చూస్తుంటే కోర్టు ఉత్తర్వులను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని, అగౌరవపరుస్తున్నారనే భావన కలుగుతోంది. ఒకరిద్దర్ని జైలుకు పంపితే తప్ప పరిస్థితులు చక్కబడేలా లేవు. న్యాయస్థానాలను గౌరవించడాన్ని మీరు నేర్పించడం ప్రారంభిస్తారో? లేదంటే మేమే నేర్పించాలో చెప్పాలి. 

– హైకోర్టు

న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ప్రభుత్వ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం, ఉదాసీనతపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారా? లేదంటే మమ్మల్ని నేర్పమంటారా? అంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను ఉద్దేశించి ప్రశ్నించింది. ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై అప్పీలు దాఖలు చేయడంలో జరిగిన జాప్యానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు హెచ్చరించింది. సంబంధిత పిటిషన్‌లో జాప్యం జరిగిన ప్రతి రోజుకూ కారణాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

‘‘హైకోర్టులో రెండు వేలకు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఒక న్యాయమూర్తి ఎదుటే 800 దాకా ఉన్నాయి. ఈ తరహా పిటిషన్‌లు ఇన్ని దాఖలవుతుండటం ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ సరదాకి వాటిని దాఖలు చేయరు. ఇందు కోసం న్యాయవాదిని నియమించుకోవాలి. అతనికి రుసుము చెల్లించాలి. ఈ పరిస్థితి చూస్తుంటే కోర్టు ఉత్తర్వులను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని, అగౌరవపరుస్తున్నారనే భావన కలుగుతోంది. ఒకరిద్దర్ని జైలుకు పంపితే తప్ప పరిస్థితులు చక్కబడేలా లేవు. న్యాయస్థానాలను గౌరవించడాన్ని మీరు నేర్పించడం ప్రారంభిస్తారో? లేదంటే మేమే నేర్పించాలో చెప్పాలి’’ అని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ‘‘అవకాశం ఉన్నచోట ఉత్తర్వులను అమలు చేస్తున్నామని, లేనిచోట అప్పీలు, వెకేట్‌ పిటిషన్‌లు దాఖలు చేస్తున్నామని’ అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ, మున్సిపల్‌, రవాణా, హోంశాఖల నుంచి ఎక్కువగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలవుతున్నాయని ఏజీ దృష్టికి తీసుకువచ్చింది. అధికారులు మేల్కొనేలా అవగాహన కల్పించాలని, పిటిషన్‌లు దాఖలైనప్పుడే నిద్ర లేవడం సరికాదని వారికి హితవు పలకాలని సూచించింది. వీటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని, తరువాత కోర్టును నిందించి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది.

రాష్ట్ర లిటిగేషన్‌ విధానం ఏమైంది?
రాష్ట్ర లిటిగేషన్‌ విధానాన్ని(పాలసీ) రూపొందించాలని తాను బాధ్యతలు స్వీకరించినప్పుడే ప్రభుత్వానికి సూచించానని, ఏమైందని ఏజీని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఓ పరిశీలన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులు సర్వీసుకు సంబంధించిన వివాదాలపై కోర్టుకు వచ్చే ముందు ఆ కమిటీ ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. కమిటీలో సమస్య పరిష్కారం కాకపోతే, అప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates