ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని కేసీఆర్ పాలన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– జూలకంటి రంగారెడ్డి

ఈ ఐదున్నరేండ్ల కేసీఆర్‌ ప్రభుత్వ పాలన ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన ప్రదాన హామీలేవీ అమలు చేయలేదు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు, కుటుంబపాలన, అధిక అప్పులూ రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. పోలీసు బలగాలతో ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది.

రాష్ట్రాభివృద్దికి ఉపయోగపడే ప్రధాన అంశాలు పరిష్కరించకుండా కాలయాపన సాగిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద వర్గాలు, రైతులెదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం, విద్య, వైద్యం, అధికధరలు, అవినీతి అక్రమాలు, శాంతిభద్రతల వంటి సమస్యల పరిష్కారంలో విఫలమవుతోంది. దీనికి తోడు నోట్ల రద్దు, జీఎస్టీలతో పాటు, అనేక నిర్ణయాల్ని రాష్ట్ర సర్కార్‌ గుడ్డిగా సమర్థించింది.

ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి హామీ కలగానే మిగిలింది. రాష్ట్రంలోని మూడు లక్షల దళిత కుటుంబాలకు భూమిలేదని ప్రభుత్వమే సర్వే చేసి చెప్పింది. వీరికి 9లక్షల ఎకరాలు పంపిణీ చేయాల్సి ఉండగా నేటి వరకూ కేవలం 11వేల ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేసింది. కనీస సౌకర్యాల్లేక దళిత వాడల్లో ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారు. కనీసం శ్మశానవాటికలు కూడా లేవు. అందరికీ పింఛన్లు అందడం లేదు. ఇండ్లూ, స్థలాల్లేక పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించి వారి సంక్షేమానికి నామమాత్రంగా ఖర్చు పెట్టి మిగతా వాటిని భారీ ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారు. వీరి బతుకులు ఎంత కాలమైనా ఇంతేనా..?
హక్కుదారు పత్రాలివ్వని సర్కార్‌..

గిరిజనులు ఏడు లక్షల ఎకరాల్లో ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు సర్కార్‌ హక్కుదారు పత్రాలివ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఆ భూములపై వారిని తొలగించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా తండాలు పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. కానీ వాటికి నిధుల్లేవు. పంచాయతీ భవనాల్లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలాయి. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు బడ్జెట్లో కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి నామమాత్రంగా ఖర్చు పెట్టి నిధులు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. తండాల్లో వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లేక అల్లాడుతున్నారు. సరైన వైద్యం అందక ఏటా అనేక మంది చనిపోతున్నారు. గిరిజనులకు ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నా.. నేటి వరకూ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అంతేకాకుండా ఆదివాసీ, లంబాడీ గిరిజనుల మధ్య తగాదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందచూస్తున్నారు.
దుర్భరం వ్యవసాయ కూలీల బతుకులు..

రాష్ట్రంలో సుమారు కోటీ 6లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో 20లక్షల కుటుంబాలకు సొంత ఇండ్లు లేవని సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ 10వేల ఇండ్లు మాత్రమే అక్కడక్కడ మంజూరు చేశారు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. అనేక మందికి రేషన్‌కార్డులు లేవు. కూలీలకు పెన్షన్‌, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

రైతులకు అన్నీ కష్టాలే..
లక్షలోపు రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి నేడు ఊసెత్తడం లేదు. ఇంకా 9లక్షల మందికి రైతుబంధు పథకం ఇవ్వలేదు. రబీ మొదలైనా.. ఇంకా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కౌలు, పోడు భూముల రైతులకు ఈ పథకం వర్తించక అవస్థలు పడుతున్నారు. భూప్రక్షాళన పేరుతో రెవెన్యూ రికార్డులు తప్పులతడకగా సాగాయి. 11లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలివ్వలేదు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సకాలంలో బ్యాంకు రుణాలు, కల్తీలేని ఎరువులు, విత్తనాలు అందించలేకపోతున్నారు. వీటి కారణంగా ఈ ఐదున్నరేండ్లలో తెచ్చిన అప్పులు తీర్చలేక, వ్యవసాయ పెట్టుబడులు వెళ్లక సుమారు 4800మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే అన్నదాతలను ఈ విధంగా నష్టపోతున్నారు.

ప్రజాధనం దుర్వినియోగం..
లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని భారీ ప్రాజెక్టులు చేపట్టి ఇప్పటి వరకూ 80 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి నేటికీ 10లక్షల ఎకరాలకు కూడా నీరందించలేదు. ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేసిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో కూడా రైతులకు అన్యాయం చేస్తూ బలవంతంగా భూములు లాక్కున్నారు. ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రీ-డిజైన్‌, రీ-ఎస్టిమేట్‌ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అదే విధంగా మిషన్‌ భగీరథ పేరుతో రూ.వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేపడుతున్నారు. ఇంటికో నల్లా ఇస్తామనీ, ఇవ్వకుండా ఊరికో నల్లా కూడా ఇవ్వని గ్రామాలు కోకొల్లలు. నల్లాల పైపులైన్ల కోసం వేసిన రోడ్లు పగలగొట్టి తిరిగి మరమ్మతులు కూడా చేయకుండా అలాగే వదిలేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పథకంలో కూడా కోట్లాది ప్రజాధనం దుర్వినియోగమైంది. పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి.

పెరిగిన నిరుద్యోగం..
ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. నిరుద్యోగభృతి కింద రూ.3 వేలు ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదు. చదువుకున్న నిరుద్యోగులు సుమారు 15లక్షలమంది ఎంప్లారుమెంట్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. 25 వేల మందికి పోలీసు ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు భర్తీ మాటే లేదు. రాష్ట్రం విడిపోయేటప్పుడు వివిధ శాఖల్లో లక్షా 7వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాల కోసం ఉద్యమిస్తే గృహ నిర్బంధాలు చేసి అనేక మంది నిరుద్యోగులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు.

పేదలకు అందని విద్య
పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోంది. కేజీ టు పీజీ ఉచిత విద్యనందిస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం అటు కేజీ గానీ, ఇటు పీజీ గానీ ఏమాత్రం కన్పించడం లేదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో సుమారు నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు సిద్ధమౌతోంది. నెలల తరబడి మెస్‌ చార్జీలు విడుదల చేయడం లేదు. హాస్టళ్లలో కనీస వసతుల్లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. తరచూ విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. విద్యపై ప్రభుత్వానికి సరైన విధానం లేదు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వాటికి అవసరమైన వసతులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్షగా మారింది.

ఆడబిడ్డలకు రక్షణ కరువు
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. లైంగికదాడులూ, హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామని ఇవ్వలేదు. జిల్లాకో మహిళా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటూ తద్వారా ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చి చేయలేదు. సమాన పనికి సమాన వేతనం కల్పించ లేదు. మహిళాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించలేదు.

మైనార్టీలకూ అన్యాయమే..
మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని తీర్మానించి, చేతులెత్తేసింది. సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని విస్మరించింది. బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు కాపాడలేకపోతున్నారు. వీరికి రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించడానికి తగిన విధంగా సహకారమందించడం లేదు. రంజాన్‌ సందర్భంగా భోజనాలు, దుస్తులు, సరుకులివ్వడం తప్ప మౌలిక సమస్యల పరిష్కారంలో విఫలమౌతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్యతో పాటు, ట్రిపుల్‌ తలాక్‌పై తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్‌ఎస్‌ పూర్తిగా సమర్థించింది.

చేతివృత్తిదారులు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తులు రోజురోజుకూ నిర్వీర్యమవుతుండటంతో జీవనం కష్టంగా ఉంది. అన్ని విధాలా వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామమాత్రంగా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు.
కార్మిక సంఘాల గొంతు నొక్కుతున్న సర్కార్ వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో లక్షలాదిమంది కార్మికులూ ఉద్యోగులూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్నా.. వారిని పర్మినెంట్‌ చేయకుండా చాలీచాలని వేతనాలతో పని చేయించుకుంటూ వారికి అన్యాయం చేస్తున్నారు. ‘మాకు న్యాయం చేయండి’ అని పోరాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. సంఘాలపై దాడిచేస్తున్నారు. ఆర్టీసీ, అంగన్‌వాడీ వర్కర్స్‌, ఆయాలు చేసిన సమ్మెలపై ఉక్కుపాదం మోపారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తోంది. ఏ ఎన్నికలొచ్చినా.. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ గెలవడమే ప్రధానంగా ఎంచుకొని రాజకీయాలను, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రజా ఉద్యమాలపై, ప్రతిపక్షాలపై, కార్మిక సంఘాలపై దాడికి సిద్ధమౌతున్నది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తిప్పికొట్టాల్సిన అవసరమెంతైనా ఉంది.

అడ్డగోలుగా పెరుగుతున్న ధరలు
నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. వాటిపై నియంత్రణ ఏమాత్రం లేదు. కూరగాయల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితి నెలకొంది. మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ వెలసి ఆదాయమే ప్రధానంగా ప్రభుత్వం భావించి ప్రజలను మద్యం మత్తులో ముంచెత్తుతున్నది.

బీసీలకు అన్యాయమే
ప్రతీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ బీసీలకు సబ్‌ప్లాన్‌ తీసుకు వస్తోంది. కానీ ప్రస్తావనే లేదు. బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్నిక చేసినారు కానీ పూర్తి కమిటీ లేదు. దీనికి 12 ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు. వాటికి నిధులు కేటాయించాలి. ఎంబీసీలకు వెయ్యి కోట్లు కేటాయించారు. దాన్ని నుంచి 250 కోట్లు వేరే వాటికి మళ్లించారు. ఎప్పటికప్పుడు బీసీల విషయంలో హామీలిచ్చి వాటిని పట్టించుకోవడం లేదు. బీసీ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు.

పెరుగుతున్న అవినీతి అక్రమాలు
అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ ఎక్కడ చూసినా.. అవినీతిమయమైంది. దీన్ని అదుపు చేసే వారే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని రంగాల్లో అవినీతి విలయ తాండవం చేస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నడిపిస్తూ తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

RELATED ARTICLES

Latest Updates