మళ్లీ సూచనలు అడగటమంటే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-బృందాకరత్‌

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద పశువైద్యురాలిని లైంగికదాడి చేసి, కాల్చి మరీ చంపిన దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనలు పెల్లుబికాయి. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని టోన్క్‌ జిల్లాలో పాఠశాలలో జరిగిన ఆటల పోటీల నుంచి ఇంటికి బయలుదేరిన ఆరేళ్ళ పాప దారిలోనే మాయమైంది. లైంగికదాడికి గురై ఒళ్ళంతా రక్తపు మరకలతో పడి ఉన్న పాప శరీరం తర్వాత దొరికింది. కోయంబత్తూరులో తన జన్మదిన వేడుకలు జరుపుకున్న 11వ తరగతి అమ్మాయి అపహరణకు తర్వాత లైంగికదాడికి గురైంది. రాంచీలో న్యాయ శాస్త్ర విద్యార్థిని ఆదివాసీ. ఆమెను సాయుధులు అపహరించి మూకుమ్మడి లైంగికదాడితో బలి తీసుకున్నారు.

ఈ పదిరోజుల్లో మహిళలపై సాగిన లైంగికదాడులూ హత్య ఘటనలు పరిశీలిస్తే దేశంలో మహిళల విషయంలో అత్యవసర పరిస్థితి తలెత్తిందా అన్న ఆందోళన కలుగుతోంది. బరితెగించిన పురుషాధిక్యత, స్త్రీ శరీరం మగవాడి లైంగికవాంఛకు దాసోహం అనాలన్న తిరోగామి ధోరణి, చట్టం నుంచి తప్పించుకోవచ్చన్న ధీమా ఇలాంటి ఘాతుకాలకు దార్లు వేస్తున్నాయి. అయినా ఏలికలకు ఇవేవీ కనపడటం లేదు. 2016 నుంచి జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదికలు వెలుగు చూడలేదు. 2017కి సంబంధించిన నివేదిక 2019లో మాత్రమే బయటకు వచ్చింది. మూక హత్యల వివరాలను, ఘోరమైన నేరాలను లెక్కలోకి తీసుకోకుండా నివేదిక విడుదల చేసారు. అన్ని వివరాలు వాస్తవాలను తొక్కి పెట్టిన తర్వాత కూడా మహిళలపై జరిగిన దారుణాలు దేశంలో ఉన్న భయానక స్థితికి అద్ధం పడుతున్నాయి. మహిళలపై దాడుల విషయంలో సగటున రోజుకి వెయ్యి చొప్పున ఏడాదికి మూడున్నర లక్షల సంఘటనలు నమోదయ్యాయి. రోజుకి 93మంది మహిళలు కామాంధుల చేతిలో బలవుతున్నారు. అందులో మూడో వంతు మైనర్‌ బాలికలు. లైంగిక దాడికి, దాడులకు గురయ్యామని 87924 మంది మహిళలు కేసులు నమోదు చేశారు. అంటే రోజుకి మూడోవంతు 241 మంది లైంగిక దాడులకు గురయ్యారు. సగటున రోజుకి 28మంది వరకట్న వేధింపులకు గురై మంటల్లో మాడిపోతున్నారు.

నమోదు కాని దాడులెన్నో…
ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన ఈ వివరాలకే కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. మహిళలపై జరుగుతున్న దాడుల్లో పోలీసు రికార్డుల్లో ఎక్కుతున్న కేసులు సంఖ్య నామమాత్రమే. పెద్ద సంఖ్యలో కేసులు అనేక కారణాల వలన మరుగున పడుతున్నాయి. నాల్గో దఫా జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. పెండ్లయిన వారిలో కనీసం మూడోవంతుమంది మహిళలపై భౌతిక లేదా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందులో ఒకటిన్నరశాతం మంది మాత్రమే పోలీసు సహాయం కోరుతున్నారు. పోలీసులు నివారణా చర్యలు తీసుకోవటానికి సరైన సమాచారం కీలకం. కానీ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీసే కీలకమైన వివరాలను ఈ ప్రభుత్వం తొక్కి పెడుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన దారుణం ఏలికల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. బాధిత కుటుంబాన్ని పరామర్శించటానికి ముఖ్యమంత్రి దగ్గర సమయం లేదు. ఈ విషయం పార్లమెంట్‌లో చర్చకు వచ్చినపుడు హౌమ్‌ మంత్రి అమిత్‌షా సభలోనే కనపడలేదు. ఢిల్లీ నేరుగా కేంద్ర హౌమ్‌ శాఖ అజమాయిషీలోనే ఉంది. మహిళల భద్రత దారుణంగా కరువైన నగరం ఢిల్లీ. ఉన్నత స్థాయి అధికారులతో హౌం మంత్రి కనీసం ఒక్కసారన్నా సమీక్ష చేసి సమస్య తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారా? ఈ దేశ మహిళలు పిల్లల భద్రత ఆయనకు ప్రాధాన్యతగా లేదు. హైదరాబాద్‌ దుర్ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన పార్లమెంట్‌ సభ్యులనుద్దేశించి మాట్లాడిన రాజనాధ్‌ సింగ్‌ హౌం మంత్రి తరఫున సమాధానం ఇస్తూ సభ్యుల మనోభావాలు గమనంలోకి తీసుకుని అవసరమైతే కొత్త చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు. మహిళలపై సాగుతున్న ఘోరమైన నేరాలను అదుపు చేయటానికి ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటామని కఠిన చర్యలకు వెరవబోమని ఢంకా బజాయించారు. అలా చెప్పటం అంటేనే సమస్యను పక్కన పెట్టి శిక్ష దాని మోతాదు గురించిన చర్చను ముందుకి తేవటమే. అటువంటి దుర్ఘటనలు జరక్కుండా ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించిన చర్చను పక్కదారి పట్టించటమే తప్ప మరోటి కాదు.

ప్రభుత్వం దోషిగా నిలబడ్డ
ప్రతిసారీ కఠిన చర్యలు శిక్షల గురించి మాట్లాడుతుంది.. ఈ హౌరులో అసలు సమస్య మరుగున పడుతుంది. దోషులను బహిరంగంగా కొట్టి చంపాలన్న జయాబచ్చన్‌ వ్యాఖ్యలు ప్రమాదకరం. తక్షణమే ఉపసంహరించాలి. లైంగికదాడి, హత్యలకు ఉరిశిక్ష వేయాలని మన చట్టం చెపుతున్న విషయమే. అయితే కఠిన శిక్షలతో ఇలాంటి సమస్య అదుపులోకి వచ్చినట్టు ప్రపంచంలో ఏ దేశ అనుభవం చెప్పటం లేదు. కేవలం కఠిన శిక్షలు గురించి మాత్రమే కాక పౌర సమాజం ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిని చట్టబద్ధంగా విచారించి శిక్ష విధించాలని, అయితే ఈ ప్రక్రియ వేగంగా జరగాలని కోరుతున్నాయి. ఈ దిశగా చెప్పుకో దగ్గ పురోగతి ఏమీ లేదు.

పేరుకుపోతున్న కేసులు జాతీయ నేర రికార్డుల బ్యూరోవివరాల ప్రకారం ఆడపిల్లలపై జరిగిన లైంగిక దాడులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. మహిళలపై దాడి కేసుల్లో89.6శాతం వివిధ స్థాయిల్లో పడకనబడి ఉన్నాయి. 2017 నాటికి దాదాపు 1.17లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఒక్క ఏడాదే 28750 కేసులు విచారణకు వచ్చాయి. ఇందులో ఎంతమంది నిందితులకు శిక్ష పడింది? కేవలం 5822. ఘోర నేరాలకు పాల్పడిన వారిని చట్టబద్ధంగా శిక్షించేలా న్యాయ వవస్థలో తగిన సంస్కరణలు తేవడంలో పాలకుల వైఫల్యం ఈ అంకెల్లో కనిపిస్తోంది. మహిళలు ఆడపిల్లలకు రక్షణ కల్పించే విషయంలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఓ నివేదిక ”మహిళల భద్రతకు విధానాలు, వ్యూహాలు కావాలి. ఈ విధానాలు, వ్యూహాలు దుర్ఘటన జరగటానికి ముందు అమలు చేయాల్సిన విషయాల మీద దృష్టి పెట్టాలి. నివారణ చర్యలు దీర్ఘకాలిక, సమగ్ర చర్యలు అవసరం. దురాగతాల నివారణ, పీడితుల పరిరక్షణ, చుట్టూ ఉన్న సమాజం ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా ఉండేందుకు అనుగుణంగా ఈ వ్యూహం ప్రణాళిక ఉండాలి” అని పేర్కొంది. భారత దేశంలో నిర్భయ దుర్ఘటన తర్వాత జస్టిస్‌ జె ఎస్‌ వర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇటువంటి దుర్ఘటనల నివారణకు అనేక చర్యలు సిఫారసు చేసింది. మహిళలపై జరిగే దారుణాలు దాడులను నియంత్రించటానికి కావల్సిన సామాజిక వ్యవస్థాగత సంస్కరణలు, వనరులు ఏర్పాటు బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని వర్మ కమిషన్‌ స్పష్టం చేసింది. అప్పటికే ఉన్న అనేక ప్రతిపాదనలు విస్తృత పర్చటమో, వాటికి జోడింపులు చేయటమో చేసింది. అందులో పాఠశాల కాలేజీ స్థాయిలో స్త్రీ పురుష సమానత్వం, సామాజిక విలువలు, మహిళలను గౌరవించటం, వారి స్వయం ప్రతిపత్తిని గౌరవించటం, వీధి లైట్లు ఏర్పాటు, ప్రజా రవాణాలో భద్రత ఏర్పాటు, నిఘా కెమెరాలు ఏర్పాటు, భద్రత కరువైన ప్రాంతాలను గుర్తించి వాటిలో అదనవు పోలీసు పహారా పెంచటం వంటి అనేక చర్యలు వర్మ కమిటీ నివేదిక లో ఉన్నాయి. ఈ సిఫార్సులు అమలు చేసి ఉంటే హైదరాబాద్‌ దుర్ఘటన జరిగేది కాదు. దిశ క్షేమంగా ఉండి ఉండేది.

కనీస భద్రత చర్యలు
వర్మ నివేదిక ”కనీస భద్రత చర్యలు అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పౌర సమాజం, న్యాయ వ్యవస్థ, ఆందోళనకారులతో జరిగిన సంప్రదింపులు, సిఫార్సులు, చర్చల తర్వాత కూడా రాజ్యాంగ యంత్రం దేశంలో మహిళలకు రక్షణ కల్పించటంలో దారుణంగా విఫలమైంది” అని ఎత్తి చూపింది. వర్మ కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి చేరి ఆరేళ్ళవుతోంది. అయినా మరలా ప్రభుత్వం పార్లమెంట్‌లో జరిగిన చర్చకు స్పందిస్తూ సలహాలు సూచనలు అడగటం అంటే ప్రభుత్వం మహిళా భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవు తోంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళల హక్కుల పట్ల తిరోగామి అవగాహనే చట్టబద్ధమైనదిగా మారింది. కతువ, షాజహాన్‌పూర్‌లల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు లైంగికదాడికి పాల్పడ్డ కామాంధుల పక్షాన నిలవటం దీనికి ఉదాహరణ. బాధితులనే బజారుకీడ్చారు. బహిరంగంగా అవమానాలు పాల్జేసారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు రక్షణ కోరుకునే హక్కును పాలక పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రత్యేకంగా దళిత, ఆదివాసీ మహిళలు పని చేసే ప్రాంతాల్లో అభద్రతా వాతావరణం పెద్ద ఎత్తున నెలకొంది. అంతేకాక ఈ ప్రదేశాల్లో కుల వివక్ష బాహాటంగా అమలవుతోంది. దాంతో శ్రామిక మహిళల భద్రత గాల్లో దీపంగా మారింది. ఈ పరిస్థితుల్లో లైంగిక హింసకి వ్యతిరేకంగా సాగే పోరాటం మహిళల్ని నిరాయుధులను చేసే రాజకీయ సాంస్కతిక విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో అంతర్భాగమే..
సామాజిక మార్పు కోసం, జవాబుదారీతనంతో కూడిన పాలన కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వహహరించేలా భారతదేశం మహిళలకు, ఆడపిల్లలకు భద్రత కల్పించేలా ఒత్తిడి తేవటానికి కావాల్సిన ప్రజా పోరాటాలు పెంపొందించటమే మన ముందున్న మార్గం.

అనువాదం: కొండూరి వీరయ్య,
సెల్‌: 9871794037

RELATED ARTICLES

Latest Updates