డిజిటల్ నిఘా..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for డిజిటల్ నిఘా.." ఈమెయిల్స్‌తో వల
– ఆసక్తి కలిగించే లింక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని సందేశం
– మాల్‌వేర్‌తో బాధితుడి కంప్యూటర్‌పై పూర్తి నియంత్రణ
– మరోసారి భీమా కోరేగామ్‌ కేసులోని నిందితుల తరఫు న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యంగా..
– ఆమ్నెస్టీ సాంకేతిక బృందం పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియాలోని మానవ హక్కుల కార్యకర్తలు, సామాజికవేత్తలు, జర్నలిస్టుల డిజిటల్‌ సమాచారంపై నిఘాకు ఈమెయిల్స్‌ను ఎరగా వాడుతున్నట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సాంకేతిక బృందం పరిశోధనలో వెల్లడైంది. భీమాకోరేగామ్‌ కేసుతో సంబంధం ఉన్న వారికి వచ్చిన అనుమానిత ఈమెయిళ్లలో కంప్యూటర్‌పై నియంత్రణ సాధించే మాల్‌వేర్‌ను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ రకమైన ఈమెయిళ్లు ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వచ్చాయి. బెర్లిన్‌లో పని చేసే ఆమ్నెస్టీ డిజిటల్‌ బృందం ఈ మాల్‌వేర్‌ను గుర్తించింది.
ఓ లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా లక్ష్యిత వ్యక్తులకు ఈమెయిల్‌ సందేశాన్ని పంపిస్తారు. ఆ వ్యక్తుల అభీష్టాలకు అనుగుణంగా సందేశాలుంటాయి. దాంతో, ఆ వ్యక్తుల్ని మొదట ట్రాప్‌ చేస్తారు. లింక్‌ ద్వారా పంపే ఈ మాల్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తి కంప్యూటర్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. కంప్యూటర్‌లోని ఫైల్స్‌, కెమెరా, కీబోర్టు అన్నీ మాల్‌వేర్‌ ఆధీనంలోకి వెళ్తాయి. ఆ వ్యక్తి టైప్‌ చేసే ప్రతి అంశం దాని నియంత్రణలోకి వెళ్తుంది. ఇలాంటి ఈ మెయిళ్లు అందుకున్నవారిలో ఎక్కువమంది పేగాసస్‌ స్పైవేర్‌ బాధితులే. ఒకరు మాత్రం సాధారణ ప్రొఫెసర్‌.
అక్టోబర్‌ 26న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రేమ్‌కుమార్‌ విజయన్‌కు ఓ ఈమెయిల్‌ వచ్చింది. ఓ దాడి కేసుకు సంబంధించిన సమన్ల నోటీస్‌గా ఆ ఈమెయిల్‌ ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నుంచి వచ్చినట్టుగా ఉన్నది. ఆ ఈమెయిల్‌ అధికారికమైనదా..? కాదా..? అన్న అనుమానంతో పంపిన అడ్రస్‌ నుంచి సమాధానం కోరుతూ విచారించగా అది నకిలీదని తేలిందని ప్రొఫెసర్‌ తెలిపారు. తన జీవితంలో ఛత్తీస్‌గఢ్‌ ఎన్నడూ వెళ్లలేదని ఆయన తెలిపారు.
అలాంటి ఈ మెయిళ్ల బాధితుల్లో దళిత హక్కుల కార్యకర్త, పీయూసీఎల్‌ ఛత్తీస్‌గఢ్‌ అధ్యక్షుడు డిగ్రీప్రసాద్‌ చౌహాన్‌, జగదల్‌పూర్‌ లీగల్‌ ఎయిడ్‌ గ్రూప్‌ న్యాయవాది ఇషా ఖండేల్‌వాల్‌, నాగపూర్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది నిహాల్‌సింగ్‌ రాథోడ్‌, కోల్‌కతాకు చెందిన మాలిక్యులర్‌ బయోలజిస్ట్‌ పార్థోసరోథీరారు, ముంబయికి చెందిన విలేకరి ఉన్నారు. వీరిలో ఎక్కువభాగం గతంలోనూ డిజిటల్‌ దాడికి గురైనవారే. ఈ మెయిళ్లన్నీ ఒకే అకౌంట్‌ నుంచి వచ్చినట్టుగా సాంకేతిక బృందం గుర్తించింది. ఈమెయిళ్లపై యూనివర్సిటీ ఆఫ్‌ టొరొంటోకు చెందిన ది సిటిజెన్‌ ల్యాబ్‌ పరిశోధనా సంస్థ కూడా అధ్యయనం చేసింది. ఇంతకుముందు ఈ ల్యాబ్‌ వాట్సాప్‌తో కలిసి ఇజ్రాయెల్‌ స్పైవేర్‌ పేగాసస్‌పైనా పరిశోధన జరిపింది. ప్రపంచవ్యాప్తంగా పేగాసస్‌ బాధితులకు సహాయం అందించడం కోసం కృషి చేసింది.
ప్రాథమిక దర్యాప్తు మేరకు ఎన్‌ఎస్‌వోకుగానీ పేగాసస్‌కుగానీ ఈమెయిళ్ల వ్యవహారంతో సంబంధమున్నట్టుగా ఆధారాలు లేవు. ఎవరికైనా ఇలాంటి ఈమెయిళ్లు వస్తే షేర్‌ ఎట్‌ ఆమ్నెస్టీ డాట్‌ టెక్‌కు తెలియజేయాల్సిందిగా ఆమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. ఈమెయిళ్లు అందుకున్నవారిలో ప్రొఫెసర్‌ విజయన్‌ మినహాయిస్తే మిగతా వారంతా భీమా కోరేగామ్‌ కేసుతో సంబంధమున్నవారే కావడం గమనార్హం. ముంబై జర్నలిస్ట్‌ మాత్రం తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు. భీమా కోరేగామ్‌కు సంబంధించిన వార్తల్ని ఆయన ఎక్కువగా మీడియాకు అందించారు. ప్రొఫెసర్‌ విజయన్‌ మాత్రం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన తన మాజీ సహ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా విడుదల కోసం జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. 90 శాతం అంగవైకల్యంతో బాధ పడుతున్న సాయిబాబాను పలు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనకు యావజ్జీవ శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన నాగపూర్‌ కేంద్ర కారాగారంలో ఉన్నారు.
భీమా కోరేగామ్‌ కేసులోని నిందితుల తరఫున వాదించే న్యాయవాదులపై డిజిటల్‌ నిఘా ఇదే మొదటిది కాదు. వాట్సాప్‌ ద్వారా పంపిన పేగాసస్‌ స్పైవేర్‌ వల్ల వారి ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్టు ఇప్పటికే వెల్లడైంది. ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌వో రూపొందించిన పేగాసస్‌ స్పైవేర్‌ వల్ల 121 మంది భారతీయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని భారత ప్రభుత్వానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమాచారమిచ్చినట్టు వాట్సాప్‌ నిర్వాహకులు తెలిపారు. భారత్‌లో ఫోన్లు హ్యాకింగ్‌కు గురైన 40మందికి మే నెలలోనే సమాచారమిచ్చామని వాట్సాప్‌ తెలిపింది. దాంతో, తమకు వాట్సాప్‌ నుంచి సందేశాలొచ్చింది వాస్తవమేనని బాధితులు ఒకరొకరుగా వెల్లడించారు.
మరోవైపు పేగాసస్‌ స్పైవేర్‌ను రూపొందించిన ఎన్‌ఎస్‌వో తాము ఈ సాంకేతికతను ప్రభుత్వ నిఘా సంస్థలకు మాత్రమే అమ్ముతామని, ప్రయివేట్‌ వ్యక్తులకు ఇవ్వమని స్పష్టం చేయడంతో మోడీ సర్కార్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జగదల్‌పూర్‌ లీగల్‌ ఎయిడ్‌ గ్రూప్‌నకు చెందిన షాలినీగెరా (భీమాకోరేగామ్‌ కేసులో నిందితుడు సుధాభరద్వాజ్‌ తరఫు న్యాయవాది), ఇదే కేసులో సురేంద్ర గాడ్లింగ్‌ తరఫు న్యాయవాది నిహాల్‌సింగ్‌ రాథోడ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల హక్కుల కార్యకర్త ఆనంద్‌తేల్‌తుంబ్డేలు హ్యాకింగ్‌ బాధితుల్లో ఉన్నట్టు తెలిపారు.
(Courtesy Nava Telanagana)

RELATED ARTICLES

Latest Updates