ఉన్నావ్‌లో మరో ఉన్మాదం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ మరో దారుణ ఘటనకు కేంద్రంగా నిలిచింది. గతంలో కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ అనే బీజేపీ ఎమ్మెల్యే ఓ అత్యాచారం కేసులో నిందితుడు కావడంతో విస్తృత ప్రచారంలోకి వచ్చిన ఈ జిల్లాలో, గురువారం ఉదయం కొందరు వ్యక్తులు తాము గతంలో అత్యాచారం చేసిన యువతిపై కిరోసిన్‌ కుమ్మరించి ఆమెను నిలువునా తగులబెట్టారు.

గత ఏడాది డిసెంబరులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ వీరంతా బెయిల్‌మీద బయటకు వచ్చి బాధితురాలిని అంతం చేసేందుకు సిద్ధపడ్డారు. సహాయాన్ని కోరుతూ మండుతున్న ఆ దేహంతోనే కిలోమీటరు మేర పరుగు తీసి చివరకు ఆమె కుప్పకూలింది. ఆమెను అమితవేగంగా దేశరాజధానిలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించినప్పటికీ, దేహం 90శాతానికి పైగా కాలిపోయినందున తిరిగి ఈ లోకాన్ని చూసే అవకాశాలు తక్కువే.

అత్యాచారానికి గురైన యువతి గుడ్లనీరు కుక్కుకుంటూ ఇంట్లో పడివుండాల్సింది పోయి, తమపైనే కేసుపెట్టినందుకు ఈ యువకుల అగ్రకుల అహంకారం దెబ్బతిన్నది. ఆమెను హతమార్చడం ద్వారా ఆమె తమపై సాగిస్తున్న న్యాయపోరాటాన్ని అంతం చేయాలనుకున్నారు.. కేసు పనిమీద స్వగ్రామం నుంచి వేకువజామునే రాయ్‌బరేలీకి కుటుంబీకులతో సహా బయలుదేరిన ఆమెను ఇంటికి కొద్దిదూరంలోనే వీరంతా అటకాయించి దాడి చేశారు. వీరిలో ఇద్దరు గత ఏడాది డిసెంబరులో ఆమెను అపహరించి, అత్యాచారం చేసినప్పటికీ ఈ ఏడాది మార్చిలో కానీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. నిన్నగాక మొన్న కేంద్రహోంమంత్రి యూపీలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ విపక్షాలు యోగి పాలనపై విరుచుకుపడ్డాయి. రాజ్యసభలోనూ ఆగ్రహావేశాలు మిన్నంటాయి.

బాధితురాలికి ఎందుకు రక్షణ కల్పించలేదంటూ మహిళా కమిషన్‌ ఆగ్రహించింది. ఈ ఆగ్రహాలు, నివేదికలు, అరెస్టులు అటుంచితే, తమ జిల్లా మాజీ ఎమ్మెల్యే అడుగుజాడల్లోనే ఈ నిందితులూ నడిచారు. ఆరోపణలు వచ్చినప్పటికీ సెంగార్‌ను పోలీసులు ఎంతోకాలం అరెస్టుచేయలేదు. కేసు పెట్టినందుకు ప్రతీకారంగా బాధితురాలి తండ్రిని అక్రమ కేసులో ఇరికించి, లాకప్‌లో పెట్టి పోలీసులు సెంగార్‌ మనుషులతో కలిసి కొట్టిచంపేశారు. ఆ తరువాత ఎమ్మెల్యే అరెస్టయి జైల్లో ఉండగానే, బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీతో ఢీ కొట్టించి హత్యచేయించే ప్రయత్నం ఒకటి జరిగింది. సమీపబంధువు, న్యాయవాది మరణిస్తే ఆమె నెలలతరబడి ఆసుపత్రిలో ఉండి చివరకు కోలుకుంది.

ఈఘటనకు రెండువారాల ముందే తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని ఆమె సుప్రీంకోర్టుకు ఓ లేఖ రాయడం, ఈ ఘటన తరువాత కానీ దానిని చూడని మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ కేసు సీబీఐకి అప్పగించడం తెలిసిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నడుస్తున్నప్పటికీ కేసు దర్యాప్తు, విచారణ నత్తనడకనే సాగాయి. 45 రోజుల్లో తీర్పుచెప్పాలని ట్రయల్‌ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా 80రోజులు దాటినా తీర్పు వెలువడలేదు.

ఈ దేశంలో అత్యాచారాలపై దర్యాప్తులు, విచారణలు ఎలా సాగుతున్నాయనడానికి దేశాన్ని కుదిపేసిన సెంగార్‌ కేసు చక్కని ఉదాహరణ. ఈయనపై పెట్టిన సెక్షన్లన్నీ ఇప్పటికే పలుచబడిపోయినాయన్న విమర్శలను అటుంచితే, ఇప్పటి ఘటనలో, అందునా ఒకవేళ బాధితురాలు మృతి చెందినపక్షంలో కేసు ఇకపై ఎలా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. హైదరాబాద్‌ దారుణం ‘దిశ’ విషయంలో పార్లమెంటులో మన నాయకులు ప్రదర్శించిన ఆగ్రహావేశాలను, ఏకరువుపెట్టిన కఠినాతికఠినమైన శిక్షల జాబితాను చూశాం. వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి అనుగుణమైన భాషని వాడుతూ, కఠినచట్టాలు కాంక్షిస్తూ అద్భుత ప్రసంగాలు చేశారు తప్ప, క్షేత్రస్థాయి లోపాలు, వ్యవస్థల దిద్దుబాటు గురించి మాట్లాడింది లేదు. అత్యాచార కేసుల నమోదునుంచి తీర్పుల వరకూ మన తీరు సమూలంగా మారాల్సి ఉన్నదని చెప్పిందీ లేదు.

దిశ కేసులో తక్షణం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పడినందుకు సంతోషించవలసిందే. కానీ, ఈ ఘాతుకానికి ముందు జరిగిన అనేక ఘోరమైన ఘటనల్లో ఇదే తీరున ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేదన్నది ప్రశ్న. బాధితుల కుల, మత, ఆర్థిక, నివాస నేపథ్యాలు, ఆయా ఘటనలపై సమాజం వెలిబుచ్చిన ఆగ్రహాన్ని బట్టి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు నిర్ణయం జరుగుతోందన్న విమర్శలకు అతీతంగా ఇకనైనా వ్యవహరించాలి. బాధితులు ఎవరైనా న్యాయం చేకూరవలసిందే, నిందితులు ఎంతటివారైనా శిక్షలు పడాల్సిందే. కేసు నమోదునుంచి, తీర్పు వెలువడేవరకూ నెలకొన్న తీవ్ర జాప్యమే అత్యాచార బాధితులపై మరిన్ని వేధింపులకు, దాడులకు, హత్యలకు కారణమవుతున్నదని ఉన్నావ్‌ ఘటనలు రెండూ తెలియచెబుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే, అత్యాచార ఘటనలన్నింటినీ సత్వరమే తేల్చే ఫాస్ట్‌ట్రాక్‌ వ్యవస్థ ఏర్పాటు జరగాలి.

Andhrajyothi…

RELATED ARTICLES

Latest Updates