మత్తులో మునిగి తేలుతున్నారు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నేరాలకు.. మద్యపానమే కారణం!
పర్మిట్‌ రూంల పేరుతో నిబంధనలు బేఖాతరు
రోడ్ల పక్కనే నడుపుతున్నా పట్టని వైనం
దిశ ఉదంతానికి మద్యం మత్తూ కారణమే..

హైదరాబాద్‌: పేరుకే అది మద్యం దుకాణం… పక్కనే 100 మందికి పైగా ఉండేలా పెద్ద పర్మిట్‌ రూం.. అందులో కుర్చీలు, టేబుళ్లు.. పక్కనే ఆహారం సరఫరా.. బార్‌ను తలపించేలా ఏర్పాట్లు.. గ్రేటర్‌ వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద పరిస్థితి ఇది. ఉదయం 10 గంటలకు లగాయతు అర్ధరాత్రి దాటే వరకు మద్యం ఏరులై పారుతోంది. నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలకు మద్యం దుకాణాలు మూసేయాలి. బార్‌లైతే రాత్రి 11 గంటల వరుకు పనిచేయాలి. కానీ అనేక ప్రాంతాల్లో ఈ నిబంధనలు పాటించడం లేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో మద్యం లభ్యమవుతోంది. పర్మిట్‌ రూంల పేరుతో బార్‌లను నడపుతున్నారు. హైదర్‌గూడ, అత్తార్‌పూర్‌, ఉప్పర్‌పల్లి, లంగ్‌హూస్‌, ఆరాంఘర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో పలు వైన్‌షాపులు బార్‌లను తలపిస్తున్నాయి. అత్తాపూర్‌ ప్రాంతంలో ఓ వైన్‌షాపు యాజమాన్యం ఏకంగా రోడ్డు పక్కనే పర్మిట్‌ రూం వేశారు. ఉదయం 10 గంటల నుంచే అక్కడ సందడి ప్రారంభమవుతోంది. మందు బాబులు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఇక్కడే కాదు మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌ వరకు చాలా మద్యం దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీటిపై కనీస నిఘా కరవవుతోంది. ఇటు పోలీసులు అటు ఎక్సైజ్‌ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రోడ్లపైనే నీటి పొట్లాలు ఇతర చెత్తాచెదారం పారబోస్తున్నా జీహెచ్‌ఎంసీ నుంచి కూడా కనీస చర్యలు ఉండటం లేదు. నెలానెలా ఆయా శాఖల అధికారులకు మామూళ్లు అందుతుండటమే ఇందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా పశువైద్యాధికారి అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి నిందితులు పూటుగా తాగి ఈ ఘోరానికి పాల్పడ్డారు. అక్కడ హైవేకు సమీపంలో మద్యం తెచ్చుకొని సాయంత్రం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉన్నారు. మత్తు పూర్తిగా తలకెక్కడంతో విచక్షణ కోల్పోయి ఈ అఘాయత్వానికి ఒడిగట్టారు.

కాపురాల్లో చిచ్చు
మద్యపానం అన్యోన్యమైన కాపురాల్లో చిచ్చు పెడుతోంది. తెచ్చిన జీతం మొత్తం మద్యం షాపులో పోసి చాలామంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. మద్యానికి బానిసవుతున్న వారిలో ఎక్కువ శాతం కూలీనాలీ చేసుకునే కార్మికులు, అల్పాదాయ వర్గాలు ఉంటున్నాయి. మద్యపానం వల్ల ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతోంది. కాలేయ, జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. ఉస్మానియాకు కాలేయ సమస్యలతో నిత్యం 50-100 మంది వరకు అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు. ఇప్పటికే కాలేయ మార్పిడి కోసం 100 మంది వరకు ఎదురు చూస్తున్నారు. ఇందులో 80 శాతం మంది మద్యపాన బాధితులే. అంతేకాక మెదుడుపై మద్యం తీవ్ర ప్రభావం చూపుతోంది.

ప్రమాదాలకు కారణమే…
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యపానమే ప్రధాన కారణం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడుతున్నా.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. మద్యం మత్తులో కాళ్లు, చేతులు మెదుడు ఆధీనంలో ఉండవు. దీంతో క్లచ్‌, బ్రేక్‌ వేసే సందర్భాల్లో తెలియకుండానే పట్టు కోల్పోతుంటారు. వేగంగా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. దీంతో ప్రమాదాలు కోరి తెచ్చుకుంటుంటారు. మద్యం మత్తులో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. రోడ్డు, జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలపై నిఘా అవసరమని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా పర్మిట్‌ రూంలను నియంత్రించి సకాలంలో మూసివేసేలా చూడాలని కోరుతున్నారు.

పెరుగుతున్న నేరాలు
నేరాల్లో అధిక శాతం మద్యం మత్తులో జరుగుతున్నవే. ఆ మత్తులో మనిషి విచక్షణ కోల్పోయి ఎంతకైనా తెగిస్తున్నాడు. కొన్నిసార్లు కన్నవారిని కూడా కడతేర్చడానికి వెనుకాడటం లేదు. మద్యపానానికి బానిసైనవారి మెదడులో నిత్యం ఏదో ఒక అనుమానం మెదులుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దానిని ఇంట్లో భార్య లేదంటే ఇతరులపై చూపించి అకారణంగా గొడవలకు దిగుతుంటారు. అది చివికి ఎదుటి వారిని హతమార్చడమో… లేదంటే తనను తాను అంతమొందించుకోవడమో.. చేస్తున్న సంఘటనలు ఇటీవలి నగరంలో వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన వారం పది రోజుల్లో నగరంలో అయిదు వరకు హత్యలు జరిగాయి. ఇందులో నిందితులు, హంతకులు మద్యం మత్తులో ఉండటం గమనార్హం.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates