కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

డా.దేవికారాణి అక్రమాలపై అనిశా దర్యాప్తులో గుర్తింపు
అక్రమార్జనలో ఆమె భర్తకూ భాగస్వామ్యం: అరెస్టు

కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!

హైదరాబాద్‌: బీమా వైద్యసేవల(ఐఎంఎస్‌) విభాగం కుంభకోణం సూత్రధారి డా.దేవికారాణి అక్రమాస్తుల గుట్టు రట్టయింది. అవినీతి నిరోధక శాఖ.. మూలాల్లోకి వెళ్లి కూపీ లాగడంతో రూ.కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. మూడు విడతలుగా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించడంతోపాటు ఇతర నిందితులు, ఆమె బినామీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా భారీ మొత్తంలో అక్రమాస్తుల్ని కూడగట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు బుధవారం మరోసారి హైదరాబాద్‌తోపాటు తిరుపతి, కడప ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని మదించిన అనంతరం సుమారు రూ.15 కోట్ల(రిజిస్ట్రేషన్‌ విలువ) స్థిరాస్తుల్ని గుర్తించారు. వీటి విలువ బహిరంగ విపణిలో దాదాపు రూ.100 కోట్లుంటుందని అంచనా వేశారు. దీనికితోడు హైదరాబాద్‌లోని ఒక్క పీఎంజే జ్యుయెలరీలోనే రూ.7.3 కోట్ల విలువైన వజ్రాభరణాల్ని కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. మరిన్ని చరాస్తుల్నీ గుర్తించారు.

పాపపు సొమ్ముతో గురుమూర్తి లావాదేవీలు
దేవికారాణి అక్రమార్జనలో ఆమె భర్త పి.గురుమూర్తికి భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐఎంఎస్‌లోనే సివిల్‌ సర్జన్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన ఆయన.. భార్య తరఫున వసూలు చేసిన లంచాల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు లావాదేవీలు నడిపినట్లు నిర్ధారణకు వచ్చారు. గురువారం ఆయన్ని అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్‌కే చెందిన గురుమూర్తి ఎంబీబీఎస్‌ చదివేటప్పుడు దేవికారాణి సహాధ్యాయి. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో తర్వాతి కాలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుమూర్తి వైద్యాధికారిగా పలు చోట్ల విధులు నిర్వహించిన అనంతరం డా.దేవికారాణి ఈఎస్‌ఐలో పనిచేస్తుండటంతో స్పౌస్‌ విభాగంలో ఆయన సైతం 2004లో ఈఎస్‌ఐలో చేరాడు.


డా.దేవికారాణి, ఆమె కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల్లో ముఖ్యమైనవి.. ( రిజిస్ట్రేషన్‌ విలువ)

* నిర్మాణ రంగ సంస్థలో సెక్యూరిటీ డిపాజిట్లు: రూ.6.63 కోట్లు
* హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 16 వాణిజ్య దుకాణాలు: రూ.3.85 కోట్లు
* జూబ్లీహిల్స్‌ షేక్‌పేటలో విల్లా: రూ.3.8 కోట్లు
* షేక్‌పేటలోని ఆదిత్య ఎంప్రెస్‌ టవర్స్‌లో మూడు ఫ్లాట్లు: రూ.2.65 కోట్లు
* సోమాజిగూడలోని ఆర్‌ఎస్‌ఎస్‌ టవర్స్‌లో ఫ్లాట్‌: రూ.1.27 కోట్లు
* 23 బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు: రూ.1.13 కోట్లు
* తిరుపతిలో బహుళఅంతస్తులభవనం: రూ.కోటి
* తెలంగాణలో ఏడు చోట్ల 32.95 ఎకరాల వ్యవసాయ భూములు: రూ.88.47 లక్షలు
* రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 ఓపెన్‌ ప్లాట్లు: రూ.42.54 లక్షలు
* గృహ అలంకరణ వస్తువులు: రూ.38 లక్షలు
* నారాయణగూడ ఇండియన్‌ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: రూ.34 లక్షలు
* ఇళ్లల్లో లభించిన బంగారు, వెండి ఆభరణాలు: రూ.25.72 లక్షలు
* ఇన్నోవా క్రిస్టా కారు: రూ.20 లక్షలు
* వైజాగ్‌ మధురవాడలో గృహం : రూ.12 లక్షలు
* ఇంట్లో లభించిన నగదు: రూ.8.4 లక్షలు.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates