మగపిల్లలకు మంచి బుద్ధులు చెబుదాం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కె. శ్రీనివాస్

ఒక సంఘటన జరిగినప్పుడు ఆవేశపడడం కాదు, దీర్ఘకాలిక సాంస్కృతిక ఉద్యమంగా ఇది సాగాలి. మన చదువులను కడిగిపారేయాలి. బహిరంగంలో ఉన్న ప్రతి పాఠ్యాన్ని పరీక్షకు గురిచేయాలి. ప్రతి సాంస్కృతిక అంశాన్నీ బోనులో నిలబెట్టి పరీక్షించాలి.

భయమేస్తోంది పాపా– అని బెదురుగా బేలగా చెల్లెలితో చెప్పుకున్న ఆ గొంతు జాతిని వెంటాడుతున్నది. తెల్లవారేసరికి, ఆ భయం నిజమై, వెలిగిపోవలసిన జీవితం కాలిపోయి, మన నాగరికత అభివృద్ధి చట్టుబండలయి, మౌలిక ప్రశ్న ఒకటి సమాజాన్ని బోనులో నిలబెట్టింది. దిశనే కాదు, వరంగల్‌ మానస, ఆసిఫాబాద్‌ టేకులక్ష్మీల మీద, ఈ అక్షరాలు రాస్తున్నప్పటి, రేపు చదువుతున్నప్పటి మధ్య కాలంలో జరగబోయే అఘాయిత్యాలన్నిటిలోనూ ఒక దీనస్వరం ఒక ఆర్తనాదం ఎడతెగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ స్వరం గుండెను పిండేయకపోతే, ఉనికిని కంపింపజేయకపోతే, జీవితపు తాత్వికతను కుదిపివేయకపోతే, మనం మనుషులమే కాము.

బాధకి నిష్కృతిలేక, నిస్సహాయులై జనం, మళ్లీ మళ్లీ ఈ నేరం జరగదులెమ్మన్న భరోసా లేక, ఏవేవో ఏవేవో నినాదాలు చేస్తున్నారు.. ఏవేవో పరిష్కారాలు వెదుకుతున్నారు. ఆ నలుగురిని ఉరితీయాలని, నడివీధిలో నరికేయాలని, లేదా, జనానికి అప్పజెప్పాలని, బాధితురాలిని చంపినట్టే చంపాలని అడుగుతున్నారు. మామూలు మనుషులు, కడుపుమండి, ఆక్రోశంతో, ఈ వ్యవస్థ మీద,

ఇందులో లభించే న్యాయం మీద అవిశ్వాసంతో అట్లా అడుగుతున్నారు. ఇక టీవీ కెమెరాల ముందు, ఫేస్‌బుక్‌ పోస్టుల్లోనూ ఉద్రేకంతో ఊగిపోతున్న స్పందనలను చూస్తున్నాము. ఎక్కడ చూసినా అర్నబ్‌ గోస్వామి పూనినట్టు సమూహాలు ఆవేశపడుతున్నాయి.. ఆడపిల్లల తల్లులూ తండ్రులూ అయితే, గుండెల్లో బండరాయి వంటి భయంతో వణికిపోతున్నారు, కాసింత నమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ స్పందనలన్నిటికీ పరాకాష్ఠగా, ఎవరో ఒకావిడ, దిశ ఉదంతంలో నిందితులకు ఉరిశిక్ష విధించాలని నిరాహారదీక్ష మొదలుపెట్టారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పక్కనబెట్టి, తామనుకున్న పద్ధతిలో ప్రక్రియలు సాగాలని ఆందోళనలు చేయడం సబబేనా? ఫలానా తీర్పే ఇవ్వాలని కోరుతూ ప్రజలు దీక్షలు చేయవచ్చునా? దర్యాప్తు, నేరవిచారణ యంత్రాంగాల సీరియస్‌నెస్‌పై ఉన్న అనుమానాల కారణంగానే ఇటువంటి డిమాండ్లు వచ్చే మాట నిజమే కానీ, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా అటువంటి కోర్కెలను ఆమోదించకూడదు. గతంలో, ఒక మరణశిక్ష కేసులో న్యాయమూర్తి ప్రజల మనోభావాలను సంతృప్తిపరచడం తీర్పు ఉద్దేశ్యంగా ఉన్నదని చెప్పి సంచలనం సృష్టించారు.

శిక్షలదేముంది, పడాలి. కఠినశిక్షలు పడాలి. ఆ నలుగురూ ఇప్పడు వాళ్ల ఇంటికీ ఊరికీ కూడా కానివాళ్లు. కండెమ్డ్‌. వారి ప్రాణాల గురించి ఎవడడుగుతాడు ఇప్పుడు? వారికి సమాజంలో ఏ అండా దొరకదు. ఇవాళే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటయింది. విచారణ వేగంగానే జరుగుతుంది. బహుశా, ఎంత కష్టమైనా ప్రాసిక్యూషన్‌, సాక్ష్యాధారాలు సమర్పించగలుగుతుంది. న్యాయమూర్తి వారికి మరణశిక్ష విధిస్తారు. ప్రక్రియలో అనవసరమైన జాప్యం, అనాసక్తత మాత్రం క్షమార్హం కానివి. వాటిని సరిదిద్దుకోవాలని ఒత్తిడి తేవాలి. అయితే, ప్రతి విచారణ న్యాయప్రక్రియ ఆసాంతం గడచి గట్టెక్కవలసిందే.

మనకు ఖాయంగా తెలుసును ఏమిటంటే, ఇవాళ్టి దుర్మార్గం నుంచి కలిగిన కలవరం నుంచి, తక్షణ శిక్షనో, బహిరంగ శిక్షనో అడుగుతున్నాము తప్ప, అది పరిష్కారం కాదు. దిశ సంఘటన అనంతరం కూడా పల్లెల్లో పట్టణాలలో అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిటికే స్పందనలు ఎక్కువ లభిస్తాయి. అందుకు అనేక కారణాలు. అందులో ఒకటి, మధ్యతరగతి బాధకు స్పందన ఎక్కువ.

పట్టణాలలో జరిగే నేరానికి మమేకత ఎక్కువ, మధ్య తరగతికి నోరు కూడా ఎక్కువ. నాక్కూడా ఇట్లా జరిగితే, నా పిల్లలకూ ఇదే జరిగితే? ఎగువ తరగతి లంపెన్‌ నుంచి జరిగితే ఒక అభద్రత, కింది తరగతి లంపెన్‌ నుంచి జరిగితే మరో రకం అభద్రత. ఆడవాళ్లు కదా, ఒక్కోసారి వారు కేవలం ఆడవాళ్లు, అందరి కంటె అట్టడుగు వాళ్లు. అందుబాటు సమస్య తప్ప, స్త్రీలు అందరూ భోగ్య, భోజ్య వస్తువులే.

అధికార బలంతోనో డబ్బుబలంతోనో సంఘనియమాలకు ఎగువన వ్యవహరించేవాళ్లు కొందరుంటారు. వాళ్లూ జులాయిలే. వాళ్లూ ఘోరమైన నేరాలు చేస్తారు. వాళ్లకు రాజకీయ వ్యవస్థ, అధికారయంత్రాంగం అండదండలు కూడా లభిస్తాయి. వాళ్ల నేరాల విషయంలో మన స్పందనలు అంత తీవ్రంగా ఉండవు ఎందుకో తెలియదు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులే అత్యాచారనిందితులుగా ఉన్న ఉదంతాలు మనకు తెలుసు. వాళ్ల మీద చర్యల కోసం ప్రభుత్వాన్ని కదిలించడానికి ఎంతో ప్రయాస అవసరమైంది.

కేవల అధోజగత్‌ సంచారంతో, నేర ప్రపంచ సాన్నిహిత్యంతో నియమాలను ధిక్కరించి వ్యవహరించేవాళ్లు మరికొందరు. వీళ్లు దరిద్రులు. అల్పులు. కనిష్ఠ స్థాయి సంస్కారంతో బొటాబొటి ఆదాయంతో బతుకు ఈడుస్తారు. గాఢమైన మానవసంబంధాలూ వీళ్లకు ఉండవు. ఢిల్లీలోనూ హైదరాబాద్‌లోనూ పెద్ద సంచలనాలు కలిగించిన నేరస్థులు ఈ కోవ వాళ్లే. ఒక వేటజంతువు తన ఆహారం మీద పడ్డట్టు వీళ్లు బాధితుల మీద పడ్డారు తప్ప, తాము చేసిన నేరం ఎంత పెద్దదో వాళ్లకు స్పృహ ఉండి ఉండదు.

ఈ రకం మనుషులను ఈ వ్యవస్థే ఉత్పత్తి చేస్తుంది. వీళ్లు వరుస నేరగాళ్లు కానక్కరలేదు. ప్రస్తుత నిందితులు నలుగురూ గతంలో ఏ కేసూ లేనివాళ్లు. ప్రస్తుతం క్లీన్‌గా ఉన్నవాళ్లెందరో, చట్టం నిద్రపోతూ, సీసీ కెమెరాలు మసకేస్తూ, సంఘభీతి అవసరం లేదు అనుకున్న చోట– నేరస్థులవుతారు. స్త్రీల మీద అతి హింసాత్మకంగా దాడిచేయగలిగిన స్లీపర్‌సెల్స్‌ సమాజంలో ఎన్నో ఉన్నాయి. అదును దొరకడమే ఆలస్యం.

నిందితులకు సత్వరశిక్ష కోసం ఉద్యమిస్తున్నవాళ్లలో అత్యధికుల దృష్టిలో– నేరస్థులు అనేది ప్రత్యేక తెగ లేదా జాతి. వారిని నిర్మూలించాలి. నేరస్థులు మనలోనుంచే పుడుతున్నారన్నది వాళ్ల ఆలోచనలో లేదు. జాగ్రత్తలు, రక్షణలు చెబుతున్నవారంతా, ఆడవాళ్లు తమ ప్రయాణాలను, క్రియాశీలతను ఎట్లా కట్టడి చేసుకోవాలో, ఎట్లా కీడెంచి మేలెంచాలో, ఎట్లా తప్పించుకుంటూ బతకాలో చెబుతున్నారు. జనాభాలో సగం మంది మరో సగం గురించి ఎప్పుడూ భయపడుతూ గెరిల్లాయుద్ధం లాంటి జీవితం గడపాలన్న మాట. నిర్భయ, దిశ, టేకు లక్ష్మి వంటి వాటి విషయంలో హింసా తీవ్రత ఎక్కువ. అన్ని అత్యాచారాలలోనూ అంత తీవ్రత ఉండకపోవచ్చు. కానీ, ప్రతి అత్యాచారమూ, స్త్రీ శరీరం మీద దండయాత్రే.

ఇష్టపడిన భాగస్వాముల విషయంలో పరస్పరతకీ, అనుబంధానికీ కారణమయ్యే లైంగిక భావనలు, సమ్మతి లేనిచోట నేరపూరితంగానూ, వికృతత్వంతోను కలుషితమై, ఒక ఆక్రమణగా, హింసాయుతచర్యగా, పరిణమించడం– స్త్రీ లైంగికత, పునరుత్పత్తి శక్తి అన్నీ పురుషస్వామ్యానికి లోబడవలసి రావడం– మన సామాజిక వ్యవస్థను నిర్వచిస్తాయి. సాంప్రదాయపు కోవల నుంచి బయటకు వచ్చి కొత్త దారులలో నడుస్తూ సాధికారత కోసం ప్రయత్నిస్తున్న కొత్త తరం స్త్రీల మీద, పురుషాధిక్యం జరిపే ప్రతీకార దాడులు కూడా తక్కువవి కావు. నిర్భయ కానీ, అభయ కానీ, దిశ కానీ చదువుకుని, ఒక పట్టణ వృత్తి మధ్యతరగతి ఉద్యోగినులుగా ఎదుగుతున్న స్త్రీలు. ఎవరికైనా సరే, దాడి చేసి, గాయపరచవలసినవారిగా వారు ఎట్లా కనిపించారు?

అత్యాచారాలలో అపరిచితుల మధ్య జరిగేవి తక్కువ అట. మగతనం వారిని వేటాడుతున్నప్పుడు, అది వేరు వేరు రూపాల్లో వేరు వేరు చర్యల ద్వారా వేటాడుతుంది. తండ్రులు, అన్నలు, కొడుకులు.. యజమానులు, అధికారులు, సహోద్యోగులు, సహచరులు, బంధువులు, ఎవరైనా కావచ్చు ఒక్కొక్కరు ఒక్కోరకపు పరిధులు విధిస్తారు, ఆధిక్యం చెలాయిస్తారు. ఆడవాళ్లలో కూడా మగతనం ఉంటుంది. వాళ్లను వాళ్లే హీనపరుచుకునేట్టు చేస్తుంది. ఇంట్లో పరిగణన, రోడ్డు మీద పరిగణన వేరుగా కనిపించవచ్చును కానీ, రెండూ ఒకదానికొకటి పొడిగింపులే.

ఈ మనుషులే ఇంట్లోనూ ఉంటారు, బయటా ఉంటారు. సర్వత్రా వ్యాపించిన విలువల సంపుటి ఒకటే. వేర్వేరు స్థానాల నుంచి చూస్తారు తప్ప, అందరిదీ తక్కువ దృష్టే. సమాజంలో సరిసమానంగా ఉన్నప్పుడు, తమ వారయినా పరాయివారయినా ఒకే పరిగణన ఇస్తారు.స్త్రీని తక్కువగా చూడడాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్నప్పుడు, నేరానికి మూలం ఎక్కుడుందో తెలుస్తూనే ఉంది.

విలువల వాతావరణాన్ని సంస్కరించడం వల్ల స్త్రీలకు భద్రత సమకూరుతుంది. రక్షణ చర్యలు ఏవో తీసుకోవచ్చు. ఒక దశలో స్త్రీల చొరవ దెబ్బతినకుండా ఉండడానికి ఈ రక్షణలు అవసరం కూడా. కానీ, నమ్మగలిగిన భద్రత, సంస్కారవంతమయిన సమాజం నుంచి రావాలి. అది, స్త్రీని గౌరవంగా చూడాలి, ఎక్కడైనా సమస్య ఎదురయితే తోడుగా నిలబడాలి, స్త్రీపురుషుల మధ్య, వివిధ సంబంధాలలో ఉన్న అసమానతలన్నిటిని ప్రశ్నించి, ప్రజాస్వామికతను అందులోకి తీసుకురాగలగాలి. తోటి మనిషినిచూసి భయపడే పరిస్థితి ఉండకూడదు.

అందుకు కావలసింది, ఒక నిరంతర ఉద్యమం, దీర్ఘకాలిక కార్యక్రమం. మనల్ని మనం సంస్కరించుకునే కార్యక్రమం. మగపిల్లలకు మంచి బుద్ధులు చెప్పే కార్యక్రమం. స్త్రీలను గౌరవించడానికి ఆదరించడానికి పురోగతికి చేయూతను ఇచ్చే సంస్కారాన్ని సమాజంలో పెంచాలి. ఒక సంఘటన జరిగినప్పుడు ఆవేశపడడం కాదు, దీర్ఘకాలిక సాంస్కృతిక ఉద్యమంగా ఇది సాగాలి. మన చదువులను కడిగిపారేయాలి. బహిరంగంలో ఉన్న ప్రతి పాఠ్యాన్ని పరీక్షకు గురిచేయాలి.

ప్రతి సాంస్కృతిక అంశాన్నీ బోనులో నిలబెట్టి పరీక్షించాలి. సినిమాలను, పాటలను, ప్రతి వెకిలి వెగటు కుసంస్కారాన్నీ ప్రక్షాళన చేయాలి. అమానవీయతను అలవరిచే ప్రతి ధోరణినీ ఆమడదూరానికి తరిమేయాలి. అసాంఘికంగా, నేరపూరిత సరళిలోకి మళ్లే అవకాశమున్న వ్యక్తులను, వృత్తి బృందాలను గుర్తించడానికి సాంఘిక కార్యకర్తలు కృషిచేయాలి. వారి పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, ప్రజాజీవితంలో భాగం కావడానికి సహకరించాలి.

ఎవరో ఎవరినో శిక్షిస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. సమస్య మనమే. పరిష్కారంలో భాగం కావడం ద్వారా మాత్రమే నేరభారం నుంచి తప్పించుకోగలము.

RELATED ARTICLES

Latest Updates