మానసా…ప్రియాంకా …. ఇంకా ఎంతమంది బలవ్వాలి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
By : కె సజయ

‌ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కి వెళితే ఇది మా పరిధిలోకి రాదని నిర్దాక్షిణ్యంగా పంపించగలిగిన ‘ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ’ మన తెలంగాణాకు వుంది. పైగా, ఆ తల్లిదండ్రులు ‘మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్‌ ‌స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది, మాకేదో భయంగా వుంది’ అని చెబితే, ‘బాయ్‌ ‌ఫ్రెండ్స్ ‌వున్నారా, ఎవరితోనైనా వెళ్ళిపోయి వుంటుంది, వస్తుందిలే’ అని ఎగతాళిగా చెప్పేంత ‘స్నేహం’గా కూడా వుంటారు! ‘వాళ్ళూ మనుషులే గదా వారికీ సామాజిక పరమైన భావజాలం వుంటుంది, వాళ్ళు అలా అనటం తప్పే, కానీ ఇప్పుడు దానిని ప్రశ్నించడం అంత అవసరమా’ అని వాపోయే రిటైర్డ్ ‌పోలీసు అధికారులూ టీవీ చర్చల్లో కనబడతారు.

జండర్‌ ‌సమానత్వం పై సమాజంలో మార్పు తీసుకురావటం కోసం పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌ ‌రూపకల్పన జరగాలి. స్త్రీల మీద జరుగుతున్న హింసలో మద్యపానం కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనేది ఎవరూ కాదనలేని సత్యం. దాని మీద తెలంగాణాలో నియంత్రణ జరగకపోగా చాల విచ్చలవిడిగా దుకాణాలు వెలుస్తున్నాయనేది వాస్తవం. తమ బస్తీల్లో మద్యం దుకాణాలు వద్దని ఆందోళన చేస్తున్న స్త్రీల మీదే కేసులు పెట్టి అరెస్ట్ ‌చేస్తున్నారు మన మిత్ర పోలీసులు.

ఒక్కరోజు కూడా గడవకముందే మరిన్ని ఘటనలు. అన్నీ అత్యంత క్రూరమైన పద్ధతుల్లో జరిగినఅత్యాచారాలు, హత్యలు.. ఒక మానస, ఒక ప్రియాంక ….తెలంగాణా లో లైంగిక హింసకు బలై పోయిన తాజా ఉదాహరణలు. ఎప్పటిలానే, ఈ చావుల మీద కూడా అనేక వాదోపవాదాలు జరుగుతూనే వున్నాయి. హఠాత్తుగా అందరికీ 100 నెంబర్‌ ‌మీద బోలెడంత అవగాహన వచ్చేసింది. రకరకాల యాప్స్ ‌నంబర్లు కూడా వెంటవెంటనే అందరికీ చేరిపోతున్నాయి. ప్రియాంక విషయంలో అందరూ ఎంతో గట్టిగా విశ్వసిస్తున్నదేమిటంటే ఆ అమ్మాయి తన చెల్లికి కాకుండా 100 కి ఫోన్‌ ‌చేసి వుంటే బతికి వుండేది అని! సాక్షాత్తూ మన తెలంగాణా హోం మినిస్టర్‌ ‌గారే ఆ మాట చెప్పారు కూడా! చనిపోయిన ఆ అమ్మాయిదే పొరపాటు అని ! సరే, కాసేపు మీ వాదన నిజమనే ఒప్పుకుందాం. నిజంగా 100 కి ఫోన్‌ ‌చేసి వుంటే ఎంత సేపటిలో మీ నుంచీ సహాయం వెళ్ళగలిగి వుండేది? మీరు చెబుతున్న ఈ నంబర్‌ ‌కి ఫోన్‌ ‌చేసి సమాచారాన్ని మొదట ఫోన్‌ ఎత్తిన వారికి అందజేస్తే సరిపోతుందా? అక్కడ నుంచీ కనీసం వాళ్ళు ఇచ్చిన ఇంకో మూడు నాలుగు నంబర్లకు ఇదే సమాచారాన్ని అందజేయాల్సి వుంటుంది కదా! అందరికీ సమాచారాన్ని చెబుతూ వెళ్ళాలి. ఈ ప్రక్రియ అంతా జరగటానికి పట్టే కనీస సమయం 20 నుంచీ 22 నిముషాలు. అది కూడా సావధానంగా వాళ్ళు అందజేసే నంబర్లన్నీ రాసుకునే వీలుండి, అంతే సావకాశంగా మళ్ళీ ఫోన్లు చేయగలిగిన అవకాశం వున్నప్పుడు! మరి ప్రమాదకర పరిస్థితులు వున్నప్పుడు చేసే ఒక్క కాల్‌ ‌కే పోలీసు వ్యవస్థ స్పందించే అవకాశం వుండాలి కదా! ఇదంతా ఏమీ ఆషామాషీగా చెప్పటం లేదు. ఈ విషయాల మీద క్రమపద్ధతిలో పనిచేస్తున్న యాక్టివిస్టులు చెబుతున్న అంశమే. ఇదీ వాస్తవం. దీనిమీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం అది పక్కకు పెట్టేసి, చనిపోయిన అమ్మాయినే నిందించడం ఎంతవరకూ సబబు? అలానే ఇంకో మంత్రిగారు ప్రతి ఇంటికీ కాపలాగా పోలీసులను పెట్టడం ఎలా సాధ్యం అన్నట్లుగా టివి లో చూశాం? పోలీసు వ్యవస్థ మానవీయంగా స్పందించాలి అని ప్రజలు అడిగితే ఆయనకు విషయం ప్రతి ఇంటికీ ఒక పోలీసుని పెట్టాలి అని ఎలా అర్థమైందో ఆయనే వివరించాలి! ఇంకో మంత్రి ట్విట్టర్‌ ‌లో మానిటర్‌ ‌చేస్తాం, ఆధునిక యాప్‌ ‌లు పెట్టుకోండి అంటారు! ముఖమే లేని సామాజిక మాధ్యమాల కన్నా మానవీయంగా వుండే వ్యవస్థను కదా మనం నిర్మించుకోవలసింది! ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కి వెళితే ఇది మా పరిధిలోకి రాదని నిర్దాక్షిణ్యంగా పంపించగలిగిన ‘ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ’ మన తెలంగాణాకు వుంది. పైగా, ఆ తల్లిదండ్రులు ‘మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్‌ ‌స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది, మాకేదో భయంగా వుంది’ అని చెబితే, ‘బాయ్‌ ‌ఫ్రెండ్స్ ‌వున్నారా, ఎవరితోనైనా వెళ్ళిపోయి వుంటుంది, వస్తుందిలే’ అని ఎగతాళిగా చెప్పేంత ‘స్నేహం’గా కూడా వుంటారు! ‘వాళ్ళూ మనుషులే గదా వారికీ సామాజిక పరమైన భావజాలం వుంటుంది, వాళ్ళు అలా అనటం తప్పే, కానీ ఇప్పుడు దానిని ప్రశ్నించడం అంత అవసరమా’ అని వాపోయే రిటైర్డ్ ‌పోలీసు అధికారులూ టీవీ చర్చల్లో కనబడతారు. పోనీ, అమ్మాయిలు తమ జీవితాల మీద ఒక నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినా గానీ, ఆ విషయం మీద కామెంట్‌ ‌చేసే అధికారం గానీ, హక్కు గానీ పోలీసులకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు . వాళ్ళ పని పరిధి ఫిర్యాదు తీసుకుని పనిచేయడం వరకే కానీ వాటి మీద తమ వ్యక్తిగత బూజు భావజాలాల్ని ప్రదర్శించడానికి లేదు. దాదాపు అర్థరాత్రి బిడ్డ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుందో అని భయపడుతూ వచ్చిన తల్లిదండ్రులకు మన ‘పోలీసు మిత్రులు’ ఇచ్చిన ‘భరోసా’ ఇది. ఇప్పుడంతా ఆధునిక పరిజ్ఞానం. మన ఫ్రెండ్లీ పోలీసులు నిర్వహించే వెబ్‌ ‌సైట్లో స్త్రీలకు సంబంధించి ఏ సమాచారం ఎలా ఇస్తారో కూడా మనం తెలుసుకోవాలి. స్త్రీలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, పెప్పర్‌ ‌స్ప్రే లు ఎలా దగ్గర పెట్టుకోవాలి, వంటరిగా బయటకు వెళ్లొద్దు లాంటివి కాకుండా, సమస్య వచ్చినప్పుడు ఒక వ్యవస్థ గా ఎంత తొందరగా స్పందిస్తాము అనే అంశాలతో అవసరమైన సమాచారాన్ని అందించడం వంటివి చేస్తే ఇంకా ఉపయోగం వుంటుంది. ముందు వ్యవస్థా పరంగా తీసుకోవలసిన విధాన నిర్ణయాలపై సమయం కేటాయించగలిగితే చాలా సంతోషం.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికలు-2018 సందర్భంగా సమగ్రమైన మహిళా హక్కులు, సాధికారత, జండర్‌ ‌పరమైన విధాన అంశాలను డిమాండ్‌ ‌చేస్తూ మహిళా, ట్రాన్స్ ‌జండర్‌ ‌సంఘాల ఐక్య కార్యాచరణ తరఫున ఒక ఎన్నికల మానిఫెస్టో విడుదల అయింది. ఇది అన్ని రాజకీయ పార్టీలకు అందించాం, మీ పార్టీతో సహా! అధికారంలోకి వచ్చిన మీ పార్టీ దీనిని ఎంతవరకు ప్రాధాన్యత లోకి తీసుకుందో అనుమానమే! నిజంగా ఆ మానిఫెస్టో ఇచ్చిన సూచనలను పరిగణన లోకి తీసుకుని వుంటే ఎన్నో అంశాలు వాస్తవ రూపంలోకి రావటానికి ఒక ప్రయత్నమైనా జరిగి వుండేది. ప్రియాంక, మానస లాంటి ఆడపిల్లలు బలయ్యేవారు కాదు. స్త్రీల మీద, ఆడపిల్ల మీద పెరుగుతున్న లైంగిక హింస, అత్యాచారాలను నివారించడానికి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయటానికి వివిధ స్థాయిల్లో చేపట్టవలసిన చర్యల గురించి మేము అందించిన సూచనలను మళ్ళీ ఒకసారి యధాతధంగా ఇక్కడ ప్రస్థావిస్తాను. ‘‘ గ్రామాలు, పట్టణాలు, నగరాలతో సహా స్త్రీలకూ 24 గంటలూ అందుబాటులో వుండే విధంగా ప్రజారవాణా వ్యవస్థను ఏర్పరచాలి. (మేము ప్రజారవాణా వ్యవస్థను విస్తృతం చేయమంటే మీ ప్రభుత్వం అసలు ఉనికినే ప్రశ్నార్ధకం ఎలా చేయబోయిందో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!) ప్రమాదంలో వున్న స్త్రీలు, ఆడపిల్లలను రక్షించే విధంగా 108 లాంటి సర్వీసులను ప్రత్యేకంగా పెట్టాలి. లైంగిక హింసలకు గురయిన వారి పట్ల పోలీసులు, వైద్య సిబ్బది వ్యవహరించే విధానం మానవీయంగా వుండాలే గానీ మరింత అవమానపరిచేది గా వుండకూడదు. అట్లా వ్యవహరించేవారిని తక్షణమే శిక్షించే విధంగా రూల్స్ ఉం‌డాలి. అత్యాచార సంఘటనలను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలను, సంఘాలను పోలీసులు టార్గెట్‌ ‌చేసి వేధించటాన్ని మాని వారిని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పరిగణించాలి. స్త్రీలపై పెరుగుతున్న దాడులను అరికట్టటానికి తగిన రక్షణ చర్యలు, సత్వర పరిష్కార మార్గాలు చేపట్టాలి గానీ , స్త్రీలు పరిమిత సమయాల్లోనే బయటకు రావాలనే సంకుచిత ధోరణిని విడనాడాలి. అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు వారు ఎంతటి ఉన్నత, అధికార స్థాయిలో వున్నా గానీ తక్షణమే వారిని అరెస్ట్ ‌చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిర్దేశించిన నిర్ణీత సమయానికే చార్జిషీట్‌/ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేయాలి. నిందితుల వైపు నుంచీ స్త్రీలకు వచ్చే బెదిరింపులు, వేధింపుల మీద పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భాలలో నిందితులకు బెయిల్‌ ‌లాంటివి మంజూరు చేయకూడదు. కోర్టు లలో విచారణ సత్వరమే జరగాలి. సంవత్సరాల తరబడి జరగకూడదు. సందర్భాన్ని బట్టి ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలి. వీటితో పాటుగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సామాజిక వ్యవస్థలో హింసకు కారణమవుతున్న మూలాలను నిర్మూలించడం మీదా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం వుంది. జండర్‌ ‌సమానత్వం పై సమాజంలో మార్పు తీసుకురావటం కోసం పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌ ‌రూపకల్పన జరగాలి. స్త్రీల మీద జరుగుతున్నా హింసలో మద్యపానం కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనేది ఎవరూ కాదనలేని సత్యం. దాని మీద తెలంగాణాలో నియంత్రణ జరగకపోగా చాల విచ్చలవిడిగా దుకాణాలు వెలుస్తున్నాయనేది వాస్తవం. తమ బస్తీల్లో మద్యం దుకాణాలు వద్దని ఆందోళన చేస్తున్న స్త్రీల మీదే కేసులు పెట్టి అరెస్ట్ ‌చేస్తున్నారు మన మిత్ర పోలీసులు. ప్రభుత్వాలు, పోలీసులను ప్రశ్నిస్తూనే, సమాజంగా మనమేం చేయగలుగుతామని కూడా ప్రశ్నించుకోవాలి. లైంగిక హింసను ప్రేరేపించే వ్యవస్థలన్నీ విచ్చలవిడిగా అడ్డూ అదుపు లేకుండా మన చుట్టూనే వుంటాయి. అవి ప్రకటనలు కావొచ్చు, సీరియల్స్ ‌కావొచ్చు, హింసాత్మక హీరోయిజాన్ని మాత్రమే చూపించే సినిమాలు, బాధితులైన స్త్రీలమీదే నిందలు వేసే సినీరంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కుల, మత సమూహాలు ఏవైనా కావొచ్చు. వీటిని ప్రశ్నించే పౌర వ్యవస్థ లేదు. వీటన్నిటి పట్ల ప్రభుత్వాలనుంచీ పాలనా పరమైన చర్యలు చేపట్టాలంటే ఒక ప్రత్యేకమైన పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ పరిధిలోకి అన్ని అంశాలను అనుసంధానం చేయటం ద్వారా పాలనా పరమైన జాప్యాలను లేకుండా సత్వర న్యాయాన్ని అందించేందుకు అవకాశం వుంటుంది. వాటికోసం డిమాండ్‌ ‌చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, నేర స్వభావపు మూలాలను ప్రశ్నించకుండా, వాటిని రూపుమాపే చర్యలు తీసుకోకుండా, జండర్‌ ‌సమానత్వం గురించి ఆలోచించకుండా వున్నంతకాలం మళ్ళీ మళ్ళీ ప్రియాంకలు, మానసలు బలవుతూనే వుంటారు. ఈ సమస్య ఈరోజు ఆ కుటుంబాల్లో ఎదురైంది, రేపు మనమెవరమైనా లేదా ఇంకెవరైనా కావొచ్చు. నేరస్తులను భౌతికంగా నిర్మూలించడం సమస్యకు పరిష్కారం ఎప్పటికీ కాదు, నేర మూలాలను నిర్మూలించే ఆలోచన, ఆచరణ కావాలి.

RELATED ARTICLES

Latest Updates