దిశ కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్: శంషాబాద్ పరిసరాల్లో దారుణ హత్యాచారానికి గురైన దిశ కేసులో ఒక్కో నిజం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మనిషి రూపంలో ఉన్న నలుగురు రాక్షసులు దిశపై ముందు అత్యాచారం చేసి ఆ తరువాత చంపేసి దిశకు నిప్పంటించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. దిశ బతికుండగానే ఆమెకు నిప్పంటించారని తెలుస్తోంది. దిశను సజీవ దహనం చేసినట్లు తాజాగా వెల్లడైంది. చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకడైన ఆరీఫ్ ఈ మేరకు పోలీసు అధికారులకు చెప్పాడు. నలుగురు నిందితులపై జైల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. వారిపై సామ భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి నుంచి మరింత సమాచారం రాబట్టుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జైల్లో కాపలా కాస్తున్న జవాన్లను కూడా రంగంలోకి దింపారు. నిందితులను మెల్లగా మాటల్లోకి దించి వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. ఇలా జైలు సిబ్బందితో మాటలు కలిపిన ప్రధాన నిందితుడు ఆరిఫ్.. కీలక విషయాలను వెల్లడించాడు. దిశను బ్రతికుండగానే నిప్పు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. చేసిన దాష్టికాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా ఆరిఫ్ వెల్లడించాడు. జైలు సిబ్బంది కూడా చాకచక్యంగా మరిన్ని మాటలు కలిపి మొత్తం వివరాలను రాబట్టారు. జైలు సిబ్బంది మాయలో పడ్డ ఆరీఫ్.. మొత్తం ఘటనను పూసగుచ్చినట్లు వివరించాడు.

రోడ్డుపై ఉన్న దిశను కాళ్లు, చేతులు బందించి లాక్కెళ్లినట్లు ఆరిఫ్ చెప్పుకొచ్చాడు. భయంతో దిశ గట్టిగా అరవడంతో తన వద్దనున్న మద్యం సీసాను దిశ నోట్లో పెట్టి బలవంతంగా మద్యం తాగించినట్లు ఆరిఫ్ చెప్పాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయిందని వెల్లడించాడు. అలా నలుగురు నిందితులు దిశపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఆమెను మళ్లీ లారీ పైకి ఎక్కించి అక్కడ కూడా అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు. మద్యం మత్తు, గ్యాంగ్ రేప్‌తో మానసికంగా అతలాకుతలం అయిపోయిన దిశ.. తమ బెదిరింపులతో మరింత భయాందోళనకు గురై చివరకు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమెను చటాన్‌పల్లి వంతెన వద్దకు తీసుకెళ్లి బతికుండగానే నిప్పంటించి పరారయ్యామని జైలు సిబ్బందికి ఆరిఫ్ వివరించాడు. అత్యాచారం చేసిన తరువాత ఎవరూ గుర్తుపట్టలేనంతగా శరీరాన్ని కాల్చేస్తే సాక్ష్యాలు దొరక్క తప్పించుకోవచ్చునని భావించినట్లు ఆరిఫ్ వెల్లడించాడు. అయితే వ్యవహారం ఇంతదూరం వస్తుందని భావించలేదని చెప్పుకొచ్చాడు.

కాగా, ఇంత జరిగినా ఇప్పటికీ ఆరిఫ్‌లో పశ్చాత్తాపం కానీ, పాపభీతి కానీ లేకపోవడాన్ని చూసి జైలు సిబ్బందే ఆశ్చర్యపోయారు. మరోవైపు మొత్తం ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి చార్జిషీట్ రూపంలో కోర్టులో దాఖలు చేసి నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా పోలీసులు ఫోకస్ పెట్టారు. దిశ హత్యాచారం కేసులో సేకరించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపారు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన రిపోర్ట్ రానుంది. దిశ మృతదేహం వద్ద లభించిన సగం కాలిన దుప్పటి ముక్కలు, ప్యాంట్ జిప్, లోదుస్తులు, ఐడీ కార్డు, చెప్పులను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత నిందితుల డీఎన్‌ఏ పోల్చి విశ్లేషిస్తారు. డీఎన్ఏ శాంపిల్స్ సరిపోలితే నిందితులు తప్పించుకునే అవకాశం పూర్తిగా మూసుకుపోయినట్లే అని అధికారులు చెబుతున్నారు.

Courtesy Andhrayothi…

RELATED ARTICLES

Latest Updates