ప్రైవేటు లేదు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • సమ్మె కాలానికీ వేతనం
  • ఆర్టీసీ సిబ్బందికి సీఎం వరాలు
  • ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60కి పెంపు
  • ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తాం
  • రెండేళ్ల పాటు యూనియన్లుండవు.. ప్రతీ ఉద్యోగికీ భద్రత కల్పిస్తాం
  • మహిళా ఉద్యోగులకు రాత్రి 8 వరకే డ్యూటీ.. 3 నెలలు చైల్డ్‌కేర్‌ లీవ్‌
  • ఆర్టీసీ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ వెల్లడి.

మీ సంస్థకు నేనే ప్రచార రాయబారిని ఆర్టీసీకి నేనే ప్రచార రాయబారి(బ్రాండ్‌ అంబాసిడర్‌)గా వ్యవహరిస్తాను. నేను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, సంస్థను లాభాల బాట పట్టించాను. నాకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉంది. నష్టాల్లో ఉన్న డిపోలనూ లాభాలు వచ్చేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. నష్టాలు వస్తున్న రూట్లను రీ సర్వే చేయాలి. – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఏ ఒక్కరినీ ఉద్యోగంలోంచి తీసేయబోమని పేర్కొన్నారు. వారికి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరు నెల జీతాన్ని సోమవారమే అందిస్తామని చెప్పారు. 55 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని త్వరలో ఏకమొత్తంలో అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగునెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ఏటా వెయ్యి కోట్ల  రూపాయల లాభం సంస్థకు రావాలని, ప్రతి ఉద్యోగీ ఏడాదికి రూ.లక్ష బోనస్‌ అందుకోవాలని ఆకాంక్షించారు. మహిళా కండక్టర్లకు విధులను రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తామన్నారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామని, ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో 30కి పైగా కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు సహా అయిదుగురు చొప్పున దాదాపు 97 డిపోల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌ శర్మ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలు, కంట్రోలర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్‌ తర్వాత 2 గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, వినతులపై అప్పటికప్పుడు స్పందించి, నిర్ణయాలు ప్రకటించారు. వాటి అమలుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ నిర్ణయాలు :
*  ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత
*  సంస్థ ప్రైవేటీకరణ ఉండదు
*  సమ్మె కాలానికి వేతనం
*  కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులనే పిలవాలి. ఆర్టీసీలో యాజమాన్యం, ఉద్యోగులు ఒకటే. కుటుంబంలా ఉండాలి
*  యథావిధిగా ఇంక్రిమెంటు
*  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు
*   విరమణ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంపు
*   సంపూర్ణ టికెట్‌ బాధ్యత ప్రయాణికుడిదే. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోబోం
*  దృష్టిలోపం ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకుంటాం. ఉద్యోగం నుంచి తొలగించం
*  మహిళా ఉద్యోగులకు రాత్రిపూట విధులు వద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు
*  ప్రతి డిపోలో 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు, దుస్తులు మార్చుకునే గదులు, లంచ్‌ గదుల ఏర్పాటు
*  మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూణ్నెల్ల పాటు శిశుసంరక్షణ సెలవులు (చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌)మంజూరు
*  మహిళా ఉద్యోగులకు ఖాకీ యూనిఫాం నిబంధన తొలగింపు. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్‌ వేసుకునే వెసులుబాటు
*  పురుష ఉద్యోగులు కూడా ఖాకీ యూనిఫాం వద్దంటే వారికీ వేరే రంగుది వేసుకునే అవకాశం
*  మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, సూచనల కోసం కమిటీ
*  రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు నిర్వహించేది లేదు
*  ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ మండలి
*  ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో వైద్యసేవలు. హైదరాబాద్‌లోనే కాకుండా అవసరమైతే ఇతర ప్రాంత ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందుకునేలా చర్యలు ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందుల పంపిణీ
*  ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు
*  ఉద్యోగుల పిల్లలకు బోధన రుసుముల కోసం వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు
*  ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్‌) బకాయిలు, సీసీఎస్‌ డబ్బులు చెల్లింపు
*  డిపోల్లో కావాల్సిన స్పేర్‌ పార్ట్స్‌ నిల్వ
*  కొన్నేళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ
*  కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన
*  పార్సిల్‌ సర్వీసులు ప్రారంభం 

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates