100 నేరాలు 4 శిక్షలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for 100 నేరాలు 4 శిక్షలు!"అత్యాచార సంఘటనల్లో ఇదీ స్థితి
సత్వర న్యాయంలో ‘ఫాస్ట్‌ట్రాక్‌’ పాత్ర ఎంత?
నేర విచారణ పద్ధతే లోపభూయిష్ఠం
జాప్యం వల్ల వీగిపోయేవే అధికం

వరుస నేరాలు నిత్యకృత్యమయ్యాయి. అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు, సంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని అందరూ ముక్తకంఠంతో నినదిస్తారు. కఠినమైన శిక్షలు… అవీ సత్వరం అమలైతేనే నేరస్థులకు భయం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ మన దేశంలో ఇలాంటి కేసుల విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దశాబ్దాలు గడిచినా… కోర్టుల్లో కేసులు తేలవన్న ధీమా వల్ల నేరస్థులకు భయం ఉండట్లేదు. సుదీర్ఘ విచారణ కారణంగా… పలు మార్గాల్లో నిందితులు శిక్షలను తప్పించుకుని బయటపడిన సందర్భాలెన్నో. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచార కేసుల్లో శిక్షలు పడే కేసులు ఎన్నో తెలుసా? కేవలం నాలుగు శాతం లోపే. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌.సి.ఆర్‌.బి.) నివేదిక (2017) చెబుతున్న గణాంకాలివి. అంటే నూటికి 96 కేసుల్లో నిందితులు బయటపడుతున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోనూ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఇక్కడ మహిళలపై జరిగే అన్ని నేరాల్లో 6.2 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఏ కేసు అయినా సరే కొన్ని దశాబ్దాల పాటు తేలకుండా అలా పెండింగ్‌లో ఉండి సంఘటన అంతా మర్చిపోయాక తీర్పులు వస్తుంటాయి. అత్యాచార కేసులను పరిశీలిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఏళ్లకు ఏళ్లు కేసులు తేలకపోవడంతో సాక్షులు మాట మార్చుతున్నారు. లేదంటే సాక్షులను నిందితులు ప్రలోభపెడుతున్నారు. బాధితులతో రాజీ కుదుర్చుకుంటున్నారు. ఈ కారణాలతోనే నిందితులకు శిక్షలు పడే కేసులు నామమాత్రమైపోయాయి.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఇలా…
రాష్ట్రంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సత్వర న్యాయం అందించడానికి ‘ఫాస్ట్‌ట్రాక్‌’ పేరుతో తీసుకువచ్చిన కోర్టుల్లోనూ అంతే జాప్యం జరుగుతోంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సంచలన కేసుల విషయంలోనూ ప్రభుత్వాలు ఫాస్ట్‌కోర్టులకు అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తుంటాయి. శంషాబాద్‌లో పశువైద్యురాలు ‘దిశ’ హత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కేవలం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగిస్తే సరిపోదని, దర్యాప్తు, న్యాయవిచారణ వేగవంతం చేస్తేనే ప్రయోజనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసును విచారించింది ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు కాదు. పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు. ఆ కేసు 61 రోజుల్లోనే కొలిక్కి వచ్చేసింది. దర్యాప్తు చేసే పోలీసులు, ఇటు న్యాయాధికారుల మధ్య సమన్వయం దీనికి కారణం. అన్ని కేసుల్లోనూ ఇలాగే వ్యవహరించాలన్నా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. బ్రిటిష్‌ కాలం నాటి విచారణ పద్ధతులనే ఇప్పటికీ అనుసరిస్తుండడం, చట్టంలోని కొన్ని వెసులుబాట్ల కారణంగా జాప్యం అనివార్యమవుతోంది. ఇప్పటివరకు అత్యాచారం కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోయినప్పటికీ కేసుల తీవ్రత దృష్ట్యా సాధారణ కోర్టుల్లోనే సత్వర విచారణ పూర్తి చేస్తున్నాయి.

ఒకటి రెండు కేసుల్లోనే చురుకుదనం  
తెలంగాణలో అయిదేళ్ల క్రితం అభయ అత్యాచారం కేసు విచారణ దాదాపు తొమ్మిది నెలల్లో పూర్తి చేసి, ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఈ ఏడాది జరిగిన తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం సంఘటనలో 61 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయి, నిందితుడికి శిక్ష ఖరారైంది. ఈ కేసులో నిందితుడు పోలేపాక ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌కు కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు హైకోర్టుకు రాగా ఉరిని యావజ్జీవంగా మార్చుతూ నిందితుడిని చివరిశ్వాస విడిచేవరకూ జైలులోనే ఉంచాలని నవంబరు 12న ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇలా ఆరు నెలల్లోనే హైకోర్టు దాకా విచారణ పూర్తికావడం విశేషం. ఇది మినహా సత్వర న్యాయం జరిగిన కేసులు తక్కువే. గాజులరామారం పోలీసు స్టేషన్‌ పరిధిలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ముగ్గురు చిన్నారులను కిడ్నాప్‌ చేసి ఆపై అత్యాచారం, హత్య చేసిన విషయం ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఈ కేసులో కూడా విచారణ పూర్తయి త్వరలో తీర్పు వెలువడనుంది.

2000లోనే మొదట ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు
పాత (బ్యాక్‌లాగ్‌) కేసుల పరిష్కారానికి 2000 సంవత్సరంలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికింద తెలంగాణలో 36 కోర్టులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో జిల్లా జడ్జి కోర్టులు 22 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులుగా పనిచేస్తుండగా వీటిలో తొమ్మిదింటిని పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులుగా మార్చుతూ ప్రభుత్వం సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో మరో 16 సబార్డినేట్‌ కోర్టులు పనిచేయడంలేదు. అత్యాచారం, పోక్సో కేసులు సుమారు 5598 ఉండగా, 36 కోర్టులను కేటాయించారు. ఇందులో 10 కోర్టులు కేవలం పోక్సో కేసులకు, 26 కోర్టులను అత్యాచారం, పోక్సో కేసుల విచారణకు నిర్దేశించారు.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates