పారదర్శకతకు పాతర..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఎన్నికల బాండ్ల కొనుగోలులో చీకటికోణాలెన్నో !
– రాజకీయ పార్టీ ప్రకటించే వరకూ విరాళాల సంగతి బయటకురాదు..
– ఇచ్చిందెవరో…తీసుకున్నదెవరో ఎవరూ చెప్పరు…
– 2018-19 విరాళాల లెక్క చెప్పని బీజేపీ, కాంగ్రెస్‌
– అక్టోబరు 2020లో బయటకు రానున్న 2019 విరాళాల లెక్కలు

రూ.పదిలక్షలు, కోటి..విలువజేసే ఎన్నికబాండ్లను సాధారణ పౌరుడు కొంటాడా? కొనడు. బడా కార్పొరేట్‌ సంస్థలే కొన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. తద్వారా వారికిష్టమైన రాజకీయ పార్టీకి వేలకోట్లు విరాళంగా ముట్టజెప్పారన్నదీ తెలిసిందే. విచిత్రమేంటంటే, ఇక్కడ వేల కోట్లు ఇచ్చిన వారి పేరు, స్వీకరించిన రాజకీయ పార్టీ పేరు బయటకు రాదు. 2018-19 ఏడాది ఎన్ని విరాళాలు వచ్చాయన్నది బీజేపీ, కాంగ్రెస్‌లు ఇంకా బయటపెట్టనేలేదు. ఈ ఏడాది తీసుకున్నవి కూడా ఎప్పుడో అక్టోబరు 2020లో చెప్పబోతున్నాయి. ఇలాంటి దాగుడుమూతల వ్యవహారం ‘ఎన్నికల బాండ్ల’ పథకంలో అనేకమున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో బాండ్ల ద్వారా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు రూ.4444 కోట్లు విరాళాలు అందాయి. ఇందులో అత్యధికం బీజేపీ, కాంగ్రెస్‌లకే వెళ్లాయని తెలుస్తోంది. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలకు తమకు వచ్చిన విరాళాల ఇప్పటికే (ఈసీకి ఇచ్చిన ఆడిట్‌ రిపోర్టు) బయటపెట్టాయి కాబట్టి. వేలకోట్లు విరాళం ఇచ్చింది…బడా కార్పొరేట్‌ సంస్థలే అన్నదాంట్లోనూ ఎలాంటి అనుమానం లేదు. మరి ఆ సంస్థలు ఏమి ఆశించి అధికార పార్టీలకు ఇంతపెద్ద మొత్తంలో పార్టీ విరాళంగా (బాండ్ల కొనుగోలు ద్వారా) ఇచ్చాయి? అన్నది ఎన్నిటికి బయటకు రాదు. పెద్ద మొత్తంలో విరాళాలు స్వీకరించిన బీజేపీ, కాంగ్రెస్‌లు నోరు మెదపటం లేదు. ఎన్నికల బాండ్ల పథకమంతా లోపభూయిష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బయటకు రాని బీజేపీ, కాంగ్రెస్‌ లెక్కలు
కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు సమర్పించే వార్షిక ఆడిట్‌ నివేదికలో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన పార్టీ విరాళాల లెక్కలు తెలపాలి. 30 అక్టోబరులోగా ఆడిట్‌ సమర్పించాలి. బీజేపీ, కాంగ్రెస్‌ తప్ప….ఇతర జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి 2018-19 వార్షిక ఆడిట్‌ నివేదికల్ని సమర్పించాయి. 2017-18 ఈసీకి ఇచ్చిన ఆడిట్‌ రిపోర్టును బట్టి, ఎన్నికల బాండ్ల విరాళాల్లో 95శాతం బీజేపీకి వెళ్లాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలోని(అసెంబ్లీ ఎన్నికలకు ముందు) ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేడీ, వైఎస్‌ఆర్‌సీసీలకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.450కోట్లకుపైగా విరాళాలు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎన్నికల బాండ్ల విరాళాల్లో కేవలం 23శాతం (రూ.599కోట్లు) లెక్కలు మాత్రమే ఈసీకి చేరాయి. ఆడిట్‌ రిపోర్టులు ఇవ్వాల్సింది బీజేపీ, కాంగ్రెస్‌లే. దీనినిబట్టి మొత్తం విరాళాల్లో 77శాతం ఈ రెండు పార్టీలకు వెళ్లినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఖాతాలకు రూ.512.3కోట్లు
– జనవరి, 2018లో మోడీ సర్కార్‌ ‘ఎన్నికల బాండ్ల’ పథకాన్ని అమల్లోకితెచ్చింది. అప్పట్నుంచి ఇప్పటివరకు 12,313 బాండ్లు అమ్ముడుపోయాయి. రెండున్నర సంవత్సరాల్లో వచ్చిన మొత్తం విరాళాలు రూ.6,128.72కోట్లు.
– ఎక్కువ సంఖ్యలో బాండ్ల కొనుగోలు ముంబయి, కోల్‌కతా నగరాల్లో జరిగింది. హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయ పార్టీల ‘కరెంట్‌ ఖాతాల’కు చేరిన మొత్తం రూ.512.3కోట్లు.
– 2017-18లో బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు రూ.220కోట్లు. 2018-19లో విరాళాల మొత్తం రూ.2551కోట్లు. ఇందులో అత్యధికం బీజేపీ, కాంగ్రెస్‌లకే వెళ్లాయి. ఏ పార్టీకి ఎంత? అన్నది ఇంకా తేలలేదు.
– 2019-20లో ఇప్పటివరకూ రూ.3356కోట్లు పార్టీలకు విరాళాలు అందాయి. బాండ్ల కొనుగోలు జరిపినవాటిలో 99.97శాతం కార్పొరేట్‌ సంస్థలే ఉన్నాయి.
రూ.వెయ్యి, 10వేలు, లక్ష, పదిలక్షలు, కోటి విలువ చేసే బాండ్లను ఎస్‌బీఐ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ అమ్ముడుబోయిన బాండ్లలో 97.7శాతం కోటి, పది లక్షలు విలువజేసినవే ఉన్నాయి. కోటి విలువ జేసే 5,624 బాండ్లు , పది లక్షలు విలువజేసే 4,877 బాండ్లు అమ్ముడుబోయాయి. బడా కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేశాయన్నది ఇక్కడ సుస్పష్టం. సాధారణ పౌరులెవరూ ఇంతపెద్ద మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వరు కదా !

Courtesy NavaTelangana..

RELATED ARTICLES

Latest Updates