నిఘా ఉండదు.. గస్తీ కనిపించదు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బాహ్యవలయ రహదారిలో 
లారీల ఇష్టారాజ్యం
అసాంఘిక కార్యకలాపాల బెడద

హైదరాబాద్‌ : అక్కడ వారిదే ‘రాజ్యం’! ఖాకీలు కన్నెత్తి చూడరు. గస్తీ వాహనాలు మచ్చుకైనా కనిపించవు. ఇదే అదనుగా కొందరు లారీల సిబ్బంది అక్రమాలకు తెరతీస్తున్నారు. పలు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారి (ఔటర్‌ రింగ్‌రోడ్డు) నేరాలకు కేంద్రంగా మారుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికార, పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యం అక్రమార్కులకు మరింత కలిసివచ్చేలా చేస్తోంది. చోరీలు, వాహన ప్రమాదాలు జరిగినప్పుడు కొద్దిరోజులు హడావుడి చేసే పోలీసులు ఆ తర్వాత అక్కడ ఏం జరిగినా స్పందించరనే ఆరోపణలున్నాయి. గ్రేటర్‌ చుట్టూ సుమారు 158 కిలోమీటర్ల పరిధిలో బాహ్యవలయ రహదారి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాలకు సంబంధించి రోజూ అనేక వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యావసర వస్తువులు, ఇనుము, సిమెంట్, సిగరెట్లు వంటి వ్యాపార ఉత్పత్తుల రవాణాకు ఇదే మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. సరకుల దిగుమతి, ఎగుమతులకు నాలుగైదు రాష్ట్రాలకు చెందిన లారీలు రోజూ ప్రయాణిస్తుంటాయి. నగరంలోని ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా లారీలు, ప్రైవేటు బస్సులు, కార్లు ఓఆర్‌ఆర్‌కు ప్రాధాన్యమిస్తుంటాయి.

బాబోయ్‌ ఔటర్‌.. 
బాహ్యవలయ రహదారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఈ మార్గంలోని పలు ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాలు వీటికి అనుకూలంగా మారాయి. రాత్రిసమయాల్లో  కొందరు లారీడ్రైవర్లు మద్యం మత్తులో తరచూ గొడవలు సృష్టిస్తున్నారు. కారులో ప్రయాణించే వారితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలూ వెలుగు చూస్తున్నాయి. షాద్‌నగర్‌ సమీపంలోని టోల్‌ప్లాజాకు దగ్గరలో పశువైద్యురాలి సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు గురవడం విదితమే. నిత్యం జనసమ్మర్దం ఉండే ప్రాంతంలో ఘోరం చోటుచేసుకోవటం అక్కడి భద్రతావైఫల్యానికి నిదర్శనం.ఔటర్‌ మార్గంలోని పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, కోకాపేట్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఏదుల నాగులపల్లి, పటాన్‌చెరు, షామీర్‌పేట్, ఘట్‌కేసర్, కీసర, తెలంగాణ స్టేట్‌ పోలీసు అకాడమీ, తారామతిపేట, సుల్తానాపూర్, బొంగులూరు, సారాగూడెం నానక్‌రామ్‌గూడ,  పెద్ద గోల్కొండ, రావిర్యాల్, తుక్కుగూడ ప్రదేశాల్లో టోల్‌ప్లాజాలున్నాయి.

హత్యలు, దోపిడీలు
నిర్మానుష్యమైన ప్రాంతం. కనుచూపుమేరలో కనిపించని జనం. దీంతో అక్రమార్కులు తమ నేరాలకు బాహ్యవలయ మార్గాన్ని కేంద్రంగా ఎంచుకుంటున్నారు. మూడేళ్ల క్రితం.. భార్యను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని శంషాబాద్‌ టోల్‌ప్లాజా పక్కనే ఉన్న నిర్జన ప్రాంతానికి వెళ్లాడు. ఐదేళ్ల కూతురిని కారులో కూర్చోబెట్టి, భార్య మృతదేహాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.  అక్కడున్నవారు గమనించటంతో ఘోరం వెలుగు చూసింది. ఒడిశాతో పాటు విశాఖపట్టణం, వరంగల్, తదితర ప్రాంతాల నుంచి నగర శివారులకు గంజాయి రవాణా మార్గంగా స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.  ఖరీదైన సిగరెట్లను సరఫరా చేసే లారీలను ఇక్కడినుంచి చోరీ చేసిన ఘటనలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భారీవాహనాలు, లారీలకు రాత్రివేళల్లో నగరంలోకి అనుమతి లేకపోవటంతో అక్కడే నిలుపుతున్నారు. పెద్దఅంబర్‌పేట్, బొంగులూరు, తుక్కుగూడ, ఘట్‌కేసర్‌ వంటి టోల్‌ప్లాజాల వద్ద రాత్రివేళల్లో అధికశాతం లారీలను నిలుపుతుంటారు. సమీపంలోనే మద్యం దొరకటంతో మత్తు బాగా ఎక్కేంతవరకూ తాగుతున్నారు. స్నేహితులతో సరదాగా మందుపార్టీల కోసం ఇటీవల కొందరు యువతీ యువకులు ఔటర్‌ వైపు వెళ్తున్నారు. పోలీసు గస్తీకి ఏనాడో మంగళం పాడటంతో అక్కడ జరిగే కార్యకలాపాలు వెంటనే వెలుగు చూడట్లేదు.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates