మనకిప్పుడు కావాల్సింది సామాజిక ప్రజాస్వామ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాజ్యాంగ నిర్ణయ సభలో డా. అంబేడ్కర్ ముగింపు ఉపన్యాసం

రాజ్యాంగ నిర్ణయ సభలో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డా. బి ఆర్ అంబేడ్కర్ 1949 నవంబర్ 25న ముగింపు ఉపన్యాసం చేశారు. గతంలో ఈ ఉపన్యాసం నుంచి కొన్ని భాగాలు అనువాదం చేశాను, ఉపన్యాసాల్లో ఉటంకించాను గాని, ఇప్పుడు ఆ ఉపన్యాసం పూర్తి పాఠం అనువాదం చేసి రాజ్యాంగం ఆమోదించి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా వీక్షణం డిసెంబర్ 2019 సంచికలో ప్రచురిస్తున్నాను చూడండి.

రాజ్యాంగం గురించి డా. బి ఆర్ అంబేడ్కర్. రాజ్యాంగ నిర్ణయ సభ చివరి సమావేశంలో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డా. బి ఆర్ అంబేడ్కర్ 1949 నవంబర్ 25న చేసిన ముగింపు ఉపన్యాసం (లాంచనప్రాయమైన కృతజ్ఞతలు, స్థూల అంశాలు, ఉపోద్ఘాతం ముగిసిన తర్వాత)

జనవరి 26, 1950న భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా మారుతుంది. ఆ స్వాతంత్ర్యానికి ఏమవుతుంది? భారతదేశం తన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోగలుగుతుందా, లేదా మరొకసారి కోల్పోతుందా? నా మదిలో మెదులుతున్న మొదటి ఆలోచన ఇది. భారతదేశం గతంలో స్వాతంత్ర్యం అనుభవించిన దేశమే. కాని అది తన స్వాతంత్ర్యాన్ని ఒకసారి కోల్పోయింది. అది తన స్వాతంత్ర్యాన్ని రెండోసారి కోల్పోతుందా? ఈ ఆలోచనే భవిష్యత్తు పట్ల నన్ను ఆందోళనలో ముంచెత్తుతున్నది.

భారతదేశం తన స్వాతంత్ర్యాన్ని ఒకసారి కోల్పోయిందనే విషయం మాత్రమే కాదు, ఆ ఓటమి తన సొంత ప్రజల అవిధేయత వల్లా, విద్రోహం వల్లా జరిగిందనే విషయం నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది.

సింధ్ ను మహమ్మద్ బిన్ కాసిం దురాక్రమిస్తున్నప్పుడు రాజు దహర్ దగ్గర పనిచేస్తుండిన సైనికాధికారులు మహమ్మద్ బిన్ కాసిం తైనాతీల నుంచి లంచాలు తిన్నారు. తమ సొంత రాజుకోసం యుద్ధం చేయడం మానుకున్నారు. మహమ్మద్ ఘోరీ భారతదేశం మీద దండెత్తుతున్నప్పుడు ఆహ్వానించినవాడూ, పృథ్వీరాజు మీద యుద్ధం చేయమనీ, తానూ, సోలంకి రాజులూ సహకరిస్తామనీ చెప్పినవాడూ జైచంద్. శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు ఇతర మరాఠా ప్రభువులూ రాజపుత్ర రాజులూ మొఘల్ చక్రవర్తుల పక్షం వహించారు. సిక్కు పాలకులను మట్టికరిపించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్నప్పుడు సిక్కుల ప్రధాన సైనికాధికారి గులాబ్ సింగ్ మౌనంగా కూచుని, సిక్కు రాజ్యాన్ని కాపాడకుండా ఉండిపోయాడు. 1857లో భారతదేశంలో అత్యధికభాగం బ్రిటిష్ వారి మీద స్వాతంత్ర్య యుద్ధం ప్రకటించినప్పుడు, సిక్కులు ఆ పరిణామాలకు మౌనసాక్షులుగా నిలిచిపోయారు.

ఆ చరిత్ర పునరావృతమవుతుందా? ఆ ఆలోచనే నాలో ఆందోళన నింపుతున్నది. కులాలు, మతాల రూపంలోని మన పాత శత్రువులతో పాటు, ఇక ముందు మనకు విభిన్నమైన, పరస్పర వ్యతిరేకమైన రాజకీయ అభిమతాల రాజకీయ పార్టీలెన్నో ఉండబోతున్నాయనే వాస్తవం గుర్తిస్తే నా ఆందోళన మరింత పెరుగుతున్నది. భారతీయులు తమ దేశాన్ని తమ మతం కన్న ముందు పెడతారా, లేక మతాన్నే దేశం కన్న ముందు పెడతారా? నాకు తెలియదు. కాని నిశ్చితంగా చెప్పగలదేమంటే రాజకీయ పార్టీలు గనుక దేశం కన్న మతాన్నే పైన పెట్టేట్టయితే, మన స్వాతంత్ర్యం రెండోసారి కూడ ప్రమాదంలో పడుతుంది. బహుశా ఎప్పటికీ కోల్పోయే స్థితి వస్తుంది. ఈ దుష్పరిణామం రాకుండా మనందరమూ నిర్ణయాత్మకంగా పనిచేయవలసి ఉంది. మన చివరి రక్తపు బొట్టు వెచ్చించి అయినా సరే మన స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి మనం దృఢదీక్ష తీసుకోవలసి ఉంది.

1950 జనవరి 26న భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా మారనున్నది. అంటే ఆరోజు నుంచి భారతదేశం ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఉండే ప్రభుత్వాన్ని చూడబోతున్నది. ఇక్కడ కూడ నాలో అదే ఆలోచన తలెత్తుతున్నది. భారత ప్రజాస్వామిక రాజ్యాంగానికి ఏమవుతుంది? భారతదేశం ఆ రాజ్యాంగాన్ని నిర్వహించుకోగలుగుతుందా లేక దాన్ని కూడ కోల్పోతుందా? నా మదిలో మెదులుతున్న రెండో ఆలోచన ఇది. మొదటి ఆలోచనలాగనే ఇది కూడ నన్ను ఆందోళన పరుస్తున్నది.

భారతదేశానికి ప్రజాస్వామ్యం అంటే తెలియదని కాదు. ఒకానొక కాలంలో భారతదేశం నిండా గణతంత్ర రాజ్యాలుండేవి. రాచరికాలు ఉన్నప్పుడు కూడ అవి ఎన్నికల ద్వారానో, పరిమిత అధికారాలతోనో ఉండేవి. ఎప్పుడూ సంపూర్ణ నిరంకుశాధికారాలు లేవు. భారతదేశానికి ప్రజా ప్రాతినిధ్య సభలూ పార్లమెంటరీ పద్ధతులూ కూడ తెలియనివేమీ కావు.

బౌద్ధుల భిక్కు సంఘాలను అధ్యయనం చేస్తే, ఆ సంఘాలు పార్లమెంట్లుగా వ్యవహరించాయని మాత్రమే కాదు, ఆధునిక కాలానికి తెలిసిన పార్లమెంటరీ పద్ధతుల సూత్రాలన్నీ ఆ సంఘాలకు కూడ తెలుసుననీ, అవి వాటిని పాటించాయనీ కూడ అర్థమవుతుంది. ఎవరు ఎక్కడ కూచోవాలో సూత్రాలున్నాయి. ప్రతిపాదనలు ఎలా పెట్టాలో, తీర్మానాలు ఎలా ప్రవేశపెట్టాలో, కనీసం ఎంతమంది ఉంటే నిర్ణయాలు తీసుకోవాలో చెప్పే సూత్రాలు, ఒక వైఖరి తప్పనిసరిగా తీసుకోవాలని నియంత్రించే సూత్రాలు (విప్), వోట్ల లెక్కింపు, రహస్య వోటింగ్, అభిశంసించే తీర్మానాలు, క్రమబద్ధీకరణ, నిర్ణయం జరిగిపోయిన అంశం మీద చర్చను నియంత్రించే సూత్రాలు వగైరా ఎన్నో ఉన్నాయి. స్వయంగా బుద్ధుడే సంఘ సమావేశాలలో ఈ పార్లమెంటరీ పద్ధతుల సూత్రాలను వర్తింపజేసినప్పటికీ, ఆయన తన కాలంలో దేశంలో ఉనికిలో ఉండిన రాజకీయ ప్రాతినిధ్య సభల సూత్రాలనే గ్రహించి ఉంటాడు.

ఆ ప్రజాస్వామిక వ్యవస్థను భారతదేశం కోల్పోయింది. మరి రెండోసారి కూడ దాన్ని కోల్పోతుందా? నాకు తెలియదు. కాని సుదీర్ఘకాలంగా వినియోగంలో లేని, ఏదో కొత్తగా వచ్చినదిగా గుర్తించబడుతున్న ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న భారతదేశంలో ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వం తలెత్తే ప్రమాదం ఎంతగానో ఉంది. ఇప్పుడు కొత్తగా జన్మిస్తున్న ప్రజాస్వామ్యం కేవలం రూపంలో మాత్రమే మిగిలిపోయి, వాస్తవంలో నియంతృత్వం తలెత్తడానికి చాల అవకాశం ఉంది. ఏదో ఉత్పాతం జరిగితే, ఈ రెండో ప్రమాదం వాస్తవంగా మారే అవకాశం మరింతగా ఉంటుంది.

మనం ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలో మాత్రమే కాక, వాస్తవంగా నిలుపుకోవాలంటే ఏం చేయవలసి ఉంది?

నా అంచనాలో మనం చేయవలసిన మొట్టమొదటి పని మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగబద్ధ పద్ధతులకు కట్టుబడి ఉండాలి. దాని అర్థమేమంటే మనం విప్లవపు రక్తపాత పద్ధతులను వదిలివేయాలి. దాని అర్థమేమంటే మనం పౌర శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పద్ధతులను వదిలివేయాలి. ఆర్థిక, సామాజిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగబద్ధ పద్ధతులకు అవకాశం లేనప్పుడు, రాజ్యాంగేతర పద్ధతులు ఉపయోగించడానికి చాల సమర్థనీయమే. కాని రాజ్యాంగబద్ధమైన పద్ధతులకు అవకాశం ఉన్నప్పుడు, రాజ్యాంగేతర పద్ధతులు ఉపయోగించడానికి సమర్థన లేదు. ఆ పద్ధతులు కేవలం అరాచక పద్ధతులు మాత్రమే అవుతాయి. వాటిని మనం ఎంత తొందరగా వదులుకుంటే అంత మంచిది.

రెండో విషయం, ప్రజాస్వామ్య నిర్వహణ మీద ఆసక్తి ఉన్నవాళ్లందరికీ జాన్ స్టువార్ట్ మిల్ చేసిన హెచ్చరికను పాటించడమే మనం చేయవలసిన పని. అదేమంటే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఎంత గొప్పవారి పాదాల దగ్గరైనా పెట్టకపోవడం, ఎంత గొప్పవారినైనా నమ్మి ప్రజాస్వామిక వ్యవస్థలను తిరగదోయగల అధికారాన్ని వారి చేతుల్లో పెట్టకపోవడం. దేశానికి తమ యావజ్జీవిత సేవలు అందించిన మహానుభావుల పట్ల కృతజ్ఞత చూపడం తప్పేమీ కాదు. కాని కృతజ్జతకు కూడ పరిమితులున్నాయి. ఐరిష్ దేశభక్తుడు డానియెల్ ఓకానెల్ సరిగ్గా చెప్పినట్టుగా, ఏ పురుషుడూ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత, ఏ మహిళా తన శీలాన్ని పోగొట్టుకునేంత, ఏ దేశమూ తన స్వేచ్ఛను త్యాగం చేసేంత కృతజ్ఞత ఉండగూడదు. భారతదేశం విషయంలో ఏ దేశం కన్నా మరింత ఎక్కువగా ఈ హెచ్చరిక అవసరం. ఎందుకంటే, భారతదేశపు రాజకీయాల్లో భక్తి, లేదా ఆరాధనా మార్గం, లేదా వీరపూజ ప్రపంచంలోని మరే దేశ రాజకీయాల్లో కన్న ఎక్కువ పాత్ర వహిస్తాయి. మతంలోనైతే భక్తి అనేది ఆత్మ విమోచనకు మార్గం కావచ్చు. కాని రాజకీయాల్లో భక్తి లేదా వీరపూజ పతనానికి కచ్చితమైన మార్గం. అంతిమంగా అది నియంతృత్వానికే దారితీస్తుంది.

మనం చేయవలసిన మూడో విషయం, కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతృప్తి చెందకుండా ఉండడం. మనం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తయారుచేయవలసి ఉంది. పునాదిలో సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు.
సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అంటే స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని జీవనసూత్రాలుగా గుర్తించే జీవనవిధానం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ సూత్రాలను వేరువేరుగా ఉండే త్రిమూర్తులుగా భావించగూడదు. అది మూడు మూర్తులూ కలిసిన ఒకే ఐక్యసూత్రం. వాటిలో ఒకదాని నుంచి మరొకదాన్ని వేరు చేస్తే అసలు ప్రజాస్వామ్య ప్రయోజనమే దెబ్బతింటుంది.

స్వేచ్ఛను సమానత్వం నుంచి వేరు చేయడానికి వీలులేదు. సమానత్వాన్ని స్వేచ్ఛ నుంచి వేరు చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ సౌభ్రాతృత్వంతో వేరు చేయలేము. సమానత్వం లేకుండా స్వేచ్ఛ మాత్రమే ఉంటే అది అనేకుల మీద కొందరి ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. స్వేచ్ఛ లేకుండా సమానత్వం మాత్రమే ఉంటే అది వ్యక్తిగత చొరవను చంపివేస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్చా సమానత్వాలు సహజంగా వికసించలేవు. వాటిని అమలు చేయడానికి సౌభ్రాతృత్వం రక్షక భటుడుగా ఉండాలి.

భారత సమాజంలో ఈ మూడిటిలో రెండు ఎంతమాత్రం లేవనే గుర్తింపుతో మనం ప్రారంభిద్దాం. ఆ రెంటిలో ఒకటి సమానత్వం. సామాజిక తలంలో భారత సమాజం తారతమ్య అసమానత సూత్రం పునాదిగా ఉంది. ఈ సమాజంలో కొందరికి అపార సంపద, అసంఖ్యాకులు దుర్భర దారిద్ర్యంలో జీవించే స్థితి ఉంది.

జనవరి 26, 1950న మనం ఒక వైరుధ్యమయమైన జీవితంలో ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలోనేమో మనకు సమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం మనకు అసమానత్వం ఉంటుంది. రాజకీయాలలో మనం ఒక మనిషికి ఒక వోటు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. కాని మన సామాజిక, ఆర్థిక జీవనంలో మన సామాజిక ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరించడం కొనసాగిస్తాం. ఈ వైరుధ్యమయమైన జీవితాన్ని ఎంతకాలం కొనసాగించగలం? మన సామాజిక, ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిరాకరిస్తూ ఎంతకాలం కొనసాగగలం? ఆ నిరాకరణను మనం ఎంత ఎక్కువకాలం కొనసాగనిస్తే, అంత ఎక్కువ కాలం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో ఉంచుతూనే ఉంటాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాన్ని రద్దు చేయవలసి ఉంది. అలా జరగకపోతే, అసమానత వల్ల బాధలు అనుభవిస్తున్నవారు ఈ రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘకాలం కష్టపడి నిర్మించిన మన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని పేల్చివేస్తారు.

మనలో కొరతగా ఉన్న రెండో అంశం సౌభ్రాతృత్వ భావనను గుర్తించకపోవడం. సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? సౌభ్రాతృత్వం అంటే భారతీయులందరి మధ్య ఒక ఉమ్మడి సోదర భావన. భారతీయులందరమూ ఒకటే అనే భావన. మన సామాజిక జీవనానికి ఐక్యతను. సంఘీభావాన్ని ఇచ్చే సూత్రం అది. కష్టసాధ్యమైన సూత్రం అది. ఈ సౌభ్రాతృత్వాన్ని సాధించడం ఎంత కష్టమో అమెరికా సంయుక్త రాష్ట్రాల విషయంలో అమెరికన్ కామన్వెల్త్ గురించి జేమ్స్ బ్రైస్ రాసిన సంపుటంలో తెలుస్తుంది.

ఆ కథను బ్రైస్ రాసిన మాటల్లోనే వివరిస్తాను:

”కొన్ని సంవత్సరాల కింద అమెరికన్ ప్రొటెస్టెంట్ ఎపిస్కోపల్ చర్చ్ తన త్రిశతజయంతి సమావేశంలో తన ప్రార్థనా గ్రంథానికి సవరణలు చేయాలని తలపెట్టింది. దాని చిన్న వాక్యాల ప్రార్థనలలో యావత్ ప్రజా సమూహానికీ వర్తించే మాటలు చేర్చాలని అనుకున్నారు. ఒక ప్రముఖ మతాచార్యుడు ‘భగవంతుడా, మా దేశాన్ని దీవించు’ అనాలని ప్రతిపాదించాడు. ఆ మధ్యాహ్నం తక్షణమే ఆ మాటను అందరూ ఆమోదించారు. మర్నాడు ఆ వాక్యం పునఃపరిశీలనకు వచ్చింది. ఎందరెందరో ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘దేశాన్ని’ అనే మాట వాడితే జాతీయ ఐక్యత గురించి ఒక నిశ్చిత గుర్తింపు ధ్వనిస్తున్నదని, అది కుదరదని అభ్యంతరాలు వచ్చాయి. ఆ మాటను వదిలేశారు. చివరికి అందరికీ ఆమోదయోగ్యమైన ‘భగవంతుడా, సంయుక్త రాష్ట్రాలను దీవించు’ అనే వాక్యాన్ని అంగీకరించారు.

ఈ ఘటన జరిగినప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సంఘీభావం అంత తక్కువగా ఉండింది. అమెరికా ప్రజలు తమను తాము ఒక దేశంగా కూడ గుర్తించుకోలేదు. అమెరికా ప్రజలే అలా తమది ఒక దేశం అని గుర్తించలేకపోయినప్పుడు, భారతీయులు తమను తాము ఒక దేశం అని గుర్తించడం ఎంత కష్టం?

రాజకీయ అభిప్రాయాలున్న భారతీయులు ‘భారతదేశ ప్రజలు’ అనే మాటను అంగీకరించని రోజులు ఉండేవని నాకింకా గుర్తుంది. ఆ మాట బదులు వాళ్లు ‘భారత జాతి’ అనాలని భావించేవారు. కాని మనం ఒక జాతి అని అనుకోవడంలో మనం ఒక పెద్ద భ్రమలో బతుకుతున్నామని నాకనిపిస్తుంది. వేలాది కులాలుగా విభజింపబడిన ప్రజలు ఒక జాతిగా ఎలా ఉండగలరు? జాతి అంటే ఉండే సామాజిక, మనస్తత్వ పరమైన అర్థంలో మనం ఇంకా ఒక జాతి కామని మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. అలా గుర్తించినప్పుడు మాత్రమే మనం ఒక జాతిగా రూపొందవలసిన అవసరాన్ని గ్రహించగలం. ఆ గమ్యాన్ని చేరడానికి ఉన్న మార్గాలూ సాధనాలూ ఏమిటో తీవ్రంగా ఆలోచించగలం. ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడం నిజంగా చాల కష్టతరమైనది. అది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కన్న ఎక్కువ కష్టతరమైనది. అమెరికాలో కుల సమస్య లేదు. భారతదేశంలో కులాలు ఉన్నాయి. కులాలు దేశద్రోహకరమైనవి. అవి ఎందుకు దేశద్రోహకరమైనవంటే, మొట్టమొదట అవి సామాజిక జీవనంలో వేర్పాటును తీసుకువస్తున్నాయి. అలాగే అవి ఎందుకు దేశద్రోహకరమైనవంటే అవి కులానికీ కులానికీ మధ్య ఈర్ష్యాసూయలనూ, వైమనస్యాన్నీ సృష్టిస్తాయి. కాని వాస్తవంగా మనం ఒక దేశంగా, జాతిగా మారాలని కోరుకుంటే ఈ అవరోధాలన్నిటినీ అధిగమించవలసి ఉంది. ఎందుకంటే ఒక్క దేశం, ఒక్క జాతి ఉన్నప్పుడు మాత్రమే సౌభ్రాతృత్వం అనేది సాధ్యమవుతుంది. సౌభ్రాతృత్వం లేకుండా సమానత్వమూ స్వేచ్ఛా అనేవి పైన వేసిన రంగుల కన్న ఎక్కువ లోతుకు పోజాలవు.

మన ముందు ఉన్న కర్తవ్యాల గురించి ఇవీ నా ఆలోచనలు. ఇవి కొందరికి అంత సంతోషకరంగా ఉండకపోవచ్చు. కాని ఒక మాట చెప్పకతప్పదు. ఈ దేశంలో రాజకీయాధికారం అనేది సుదీర్ఘకాలంగా అతి కొద్ది మంది గుత్తాధిపత్యంగా ఉండిపోయింది. అశేష ప్రజానీకం కేవలం గొడ్డుచాకిరీకి మాత్రమే కాదు, వేటాడబడే జంతువులుగా కూడ ఉండిపోయారు. కొందరికి ఉన్న గుత్తాధిపత్యం వల్ల అశేష ప్రజానీకానికి తన జీవన పరిస్థితులు మెరుగు పరచుకునే అవకాశాలు నిరాకరించబడడం మాత్రమే కాదు, వారి జీవన ప్రాధాన్యత అనేదే వారి నుంచి కొల్లగొట్టబడింది. ఈ అణగారిన వర్గాలు ఇంకెంతమాత్రమూ పాలించబడడానికి సిద్ధంగా లేవు. తమను తాము పాలించుకోవాలనే అసహనం వారిలో ముప్పిరిగొంటున్నది. ఈ అణగారినవర్గాలలో స్వీయ ఆకాంక్షల సాకారం కోసం తపన వర్గపోరాటంగానో, వర్గ యుద్ధంగానో మారడానికి మనం అనుమతించగూడదు. అదే జరిగితే మన గృహం, ఈ రాజ్యాంగ నిర్ణయసభ ముక్కలైపోతుంది. అది నిజంగా విధ్వంస దినంగా మిగిలిపోతుంది. ఎందుకంటే, అబ్రహాం లింకన్ సరిగ్గా చెప్పినట్టు, తనలో తాను ముక్కలైన గృహం ఎక్కువకాలం నిలబడి ఉండజాలదు. అందువల్ల, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎంత తొందరగా అవకాశాలు కల్పిస్తే, కొద్ది మందిగా ఉన్నవారికి అంత మేలు. దేశానికి అంత మేలు. దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి అంత మేలు. దేశ ప్రజాస్వామిక నిర్మాణాలను నిర్వహించడానికి అంత మేలు. అది సాధించాలంటే సమస్త జీవన రంగాలలో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని స్థాపించడం ఒక్కటే మార్గం. అందువల్లనే నేను ఆ అంశాల మీద అంతగా నొక్కి చెపుతున్నాను.

ఈ సభా సమయాన్ని నేనింకా ఎక్కువగా తీసుకోదలచలేదు. నిస్సందేహంగా స్వాతంత్ర్యం అనేది సంతోష సందర్భమే. కాని ఈ స్వాతంత్ర్యం మన ముందుకు అనేక బాధ్యతలు తెస్తున్నదని మనం మరచిపోగూడదు. ఇంతకాలంగా ప్రతి తప్పుకూ బ్రిటిష్ వాళ్లను కారణంగా చూపే అవకాశాన్ని ఈ స్వాతంత్ర్యం ద్వారా మనం కోల్పోతాం. ఇకనుంచి ఏదైనా తప్పు జరిగితే మనం నిందించడానికి ఎవరూ లేరు. మనను మనం నిందించుకోవలసిందే. పైగా తప్పులు జరగడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంది కూడ. కాలం వేగంగా మారుతున్నది. మన ప్రజలతో సహా ప్రజలందరూ కొత్త భావజాలాలతో ప్రేరణ పొందుతున్నారు. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అనేదానితో వారు విసిగిపోతున్నారు. ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వాలు కావాలని వారు అనుకుంటున్నారు. అవి ప్రజల చేత, ప్రజల వల్ల ఏర్పడిన ప్రభుత్వాలు కాకపోయినా సరే అనుకుంటున్నారు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ప్రభుత్వం అనే సూత్రం ఆధారంగా మనం రూపొందించిన ఈ రాజ్యాంగాన్ని మనం సంరక్షించుకోవాలంటే, మన మార్గంలో అడ్డుగా ఉన్న చెడులను గుర్తించడంలో ఏమరపాటు లేకుండా ఉందామని ప్రతిజ్ఞ చేసుకుందాం. ఆ చెడులు మన ప్రజలను ప్రజల చేత ప్రభుత్వం నుంచి మళ్లించి ప్రజల కొరకు ప్రభుత్వం వైపుగా ఆకర్షిస్తాయని గుర్తిద్దాం. ఆ చెడులను తొలగించడంలో మన కర్తవ్యదీక్షలో బలహీనంగా ఉండబోమని ప్రతిజ్ఞ చేద్దాం. దేశానికి సేవ చేయడానికి అది ఒక్కటే మార్గం. అంతకంటె మెరుగైన మార్గం నాకు తెలియదు.

అనువాదం ఎన్. వేణుగోపాల్ – సీనియర్ జర్నలిస్టు

RELATED ARTICLES

Latest Updates