ఎంత చెట్టుకి అంత గాలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
చల్లపల్లి స్వరూపరాణి

‘మా మొగోళ్ళు ఊర్లో ఒంగి ఒంగి నడిచి వాడలో విరగదీసుకుని నడుస్తారు’ అని ‘మా బతుకులు’ అనే తన ఆత్మకధలో బేబీ కాంబ్లే రాసిన మాటని షేర్ చేస్తూ నేను ఈనెల 22 న పెట్టిన పోస్టు కొంతమందిని బాధ పెట్టింది.

నిజానికి అది ‘దళిత పితృస్వామ్యం’ పైన అప్పటికే జరుగుతున్న ఒక చర్చని దృష్టిలో పెట్టుకుని నేను పెట్టలేదు, ఎందుకంటే నేను ఆ డిబేట్ ని ఫాలో కాలేదు. దానికి తర్వాత (అదేరోజు) నేను పెట్టిన మరో పోస్టు ‘He kneels down at Doras and roars at helpless, and he is paised as ‘successor of Ambedkar’ అనే పోస్టు కొనసాగింపు.

సందర్భం తెలియక పెట్టినప్పటికీ బేబీ కాంబ్లే మాట ఉటంకించినందుకు నేను ఎవరికీ సంజాయిషీ ఇవ్వను. బేబీ అంబేడ్కర్ ఉద్యమ వారసురాలు. ఆమె అమ్మమ్మ, నాన్న, అమ్మ అంబేడ్కర్ ప్రారంభించిన రాడికల్ ఉద్యమంలో భాగం. బేబీ తన ఆత్మకధలో మహారాష్ట్రలో దళితుల పట్ల పెత్తనదారీ కులాలైన పాటిళ్ళు, బ్రాహ్మలు వంటి కులాల ఆగడాలతో పాటు దళిత కులాలలో ఉండే పురుషాధిక్యతను, దళిత కుటుంబాలలో స్త్రీలు ఎదుర్కునే హింసను సమానంగా ఎత్తి చూపింది. నా పోస్టు మీద కోపం వచ్చినవారికి బేబీ కాంబ్లే అభిప్రాయంతో అంగీకారం ఉండక్కర్లేదు. ఒకాయన ఆమె చదువెంత, ఆమె మాటకి విలువ ఇవ్వాలా అని అడిగాడు, మరొకాయన మేము వాడలో కూడా విరగదీసుకుని నడిస్తే దళిత స్త్రీలు మాకు దాసోహం అంటారా అని అడిగారు. మరొక వ్యక్తీ దళిత పురుషులు ఒంగి ఒంగి నడిస్తే కారంచేడు, చుండూరులు ఎందుకు జరిగేవి అన్నాడు. అసలు బేబీ కాంబ్లే మాట ఒక కవితాత్మక వ్యక్తీకరణ అని ఒప్పుకుంటారా వీళ్ళు? బేబీ కాంబ్లే రాసినా, నేను దానిని ఉటంకించినా దళిత సమాజాన్ని నిలువునా చీల్చి దళిత ఉద్యమానికి ద్రోహం చేసినట్టా? అసలు ప్రశ్న లోంచే కదా దళితవాదం పుట్టింది? ‘ఆత్మగౌరవం’ అంటే సదరు దళిత పురుషులకు మాత్రమె దక్కవలసిన మార్యాదా?

ఇక ‘దళిత పితృస్వామ్యం’ అనేది ఒక సున్నితమైన చర్చ. ఇరవై ఏళ్లకు ముందే సాహిత్యంలో దానిమీద చర్చ మొదలైంది. నేను 1995 లో రాసిన ‘మంకెనపువ్వు’ లో ‘ఇంట్లో పురుషాహంకారం ఒక చెంప చెళ్ళుమనిపిస్తే వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగొడుతుంది’ అని రాశాను. ‘మాయమ్మ’ అనే కవితలో కూడా అటు కులపెత్తనంతో పాటు ఇంట్లో మగపెత్తనాన్ని కూడా ప్రస్తావించాను. నా పోస్టుపై స్పందించిన జిలకర శ్రీనివాస్
‘అక్కడి బాబ్డ్ హైర్ ఉద్యమాల్లో
పట్టుచీరల పోరాటాల్లో
స్లీవ్ లెస్ స్పీచ్ ల్లో
నీ అద్దెపిల్లి అరవయ్యో నెంబర్ కోక
బిక్కమొహం వేలాడేస్తుంది
అక్కడ మహలక్షమమ్మ, అంకాళమ్మ
సీతారావమ్మ గార్లంతా
ఈ దేశంలో స్త్రీలపై అణచివేత నశించాలనీ
మహిళలకు లైంగిక స్వేచ్ఛ కావాలనీ
బ్యాక్ బ్యాలెన్స్ లను
ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోడానికి
ఆర్థిక స్వాతంత్ర్యం కావాలనీ
నోరు నొప్పి పుట్టలా ఉపన్యసించి
చివర్లో పాపం
దళిత స్త్రీని కూడా
పైకి తీసుకెళ్లాలని ముగిస్తారు‘‘అనే
తనకి అనుకూలంగా ఉండే లైన్స్ మాత్రమె తీసుకుని, అవి వినోదిని పుస్తకంలోంచి తీసుకున్నానని చెప్పడం చూసి విస్తుపోయాను. అదే కవితలో నేను
‘ఊళ్లోవాల్లందరికీ మా నాన్న లోకువైతే,
మా నాన్నకి మాయమ్మ లోకువ’ అని కూడా రాశాను. అప్పట్లో మా దళిత కుటుంబాలలో పితృస్వామ్యం లేదు, ఉంటే అది ప్రజాస్వామికంగా ఉంటది తప్ప ఆధిపత్య కులాల మాదిరి కాదు అని, మా ఆడోళ్ళు పొలం పనికెల్లోచ్చి కోడి గుడ్డు పెట్టినంత సులువుగా పిల్లల్ని ప్రసవిస్తారు, మాకు ‘లేబర్ రూమ్’ సమస్య కాదు అని దళిత పురుషుల నుంచి వినిపించింది. ఒకప్పుడు ఈనాటి దళిత కులాలతో పాటు ఆదివాసీ తెగలలో ‘మాతృస్వామిక’ కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ సమూహాలు ఎప్పుడో ‘సంస్కృతీకరణ’ కు గురయ్యాయని వారికి తెలియదనుకోవాలా? దళిత రచయిత్రుల్లో కూడా కొందరు మాకు పితృస్వామ్యం లేదని చెప్పడం మరీ విడ్డూరం. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణ వాదం ఒక ఆధిపత్యవాద మానసిక స్థితి, అది బ్రాహ్మణులలో ఉన్నట్టే ఇతరులలో కూడా ఉంటుంది అంటారు. అది పితృస్వామ్యానికి కూడా వర్తిస్తుంది, అది పురుషులతో పాటు స్త్రీలలో, దళిత స్త్రీలలో కూడా ఉంటుంది.

సాధారణంగా సాహిత్య చర్చల్లో కూడా ‘స్త్రీలు’ అనగానే పెత్తనదారీ కులాల స్త్రీలని, ‘దళితులు’ అనగానే దళిత పురుషులనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం ఎక్కువగా జరుగుతుంది. ‘దళిత స్త్రీ’ అనే వ్యక్తిని అంతా కల్సి చాలాకాలం పాటు ఎక్కడా కనిపించకుండా చేశారు. గత రెండు దశాబ్దాలుగా దళిత స్త్రీ స్వరం సాహిత్యంలో కనిపిస్తుంది. అయినా దళిత కులాలలో పితృస్వామ్యం అనే విషయంలో పాత అభిప్రాయమే వ్యక్తమవడం విషాదం. నిజమే, కుల సమాజంలో వ్యక్తులు ‘స్త్రీలు’, ‘పురుషులు’ అనే వేరువేరు సమూహాలుగా ఉండరు, వారు కులాలుగానే విడిపోయి ఉంటారు. సమాజంలో ఎన్ని కులాలు ఉంటాయో స్త్రీలు కూడా అన్ని రకాల కుల గుర్తింపుతోనే ఉంటారు తప్ప ‘జెండర్’ అనేది ఒక ప్రత్యేక ‘entity’ కాదు.

దళిత స్త్రీల అందరి అస్తిత్వం కూడా ఒకటి కాదు, అందులో కూడా అనేక పొరలున్నాయి. వివిధ దళిత ఉపకులాల స్త్రీల అస్తిత్వం వేరుగా ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉండే దళిత శ్రామిక వర్గపు స్త్రీ బైట ఫ్యూడల్ వ్యవస్థలో అనేక రకాల వివక్షలు, బాధలు నిత్యం ఎదుర్కుంటుంది. బైట పనిచేసే చోట ఆమెపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతాయి, అటువంటి పరిస్థితిలో ఆమెకి ఇంట్లో మగ పెత్తనం అనేది ఒకటి ఉన్నట్టు కూడా అనిపించదు. అలాగే చదువుకునే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళలో దళిత బాలికలపై జరిగే దారుణాలు చెప్పనక్కర్లేదు. జోగినీ, బసివి, మాతంగి వ్యవస్థలలో బుగ్గి అయ్యే స్త్రీలు వారు కేవలం స్త్రీలు అయినందుకు కాదు, దళితులూ, అందునా ‘దళిత స్త్రీలు’ అయినందుకే. she is the victim among victims, dalit among dalits. ఆర్ధికంగా కొంత వెసులుబాటు ఉండే దళిత స్త్రీకి కుల వివక్ష ఉన్నా అది పరోక్షంగా ఉంటుంది తప్ప ఇలాంటివి అనుభవంలోకి రావు.

భార్య తెచ్చిన కూలి డబ్బులతో తాగి అదేమని అడిగితే చితకబాదే శ్రామిక వర్గ దళిత పురుషులు చేసే దౌర్జన్యం పేరేంటి? చదువుకుని ఆడపిల్లలను ప్రేమపేరుతో, పెళ్లి పేరుతో మోసం చేసే వాళ్ళలో ఆర్ధిక వెసులుబాటు ఉండే దళిత పురుషులు లేరా? వారు దళిత అమ్మాయిల్ని వేధించడం లేదా? ఇవి పితృస్వామ్యపు పరిధిలోకి రావా? ఇటీవలి సర్వేలలో దళిత స్త్రీల మీద గృహ హింస పెరిగిపోతుంది అని రుజువైంది. అది ఏ ఇతర కులాలవారికంటే తక్కువ కాదు. ఎంత చెట్టుకు అంత గాలి.

1999 డిసెంబర్ నెలలో హైదరాబాదులో జరిగిన దళిత సాహిత్య సదస్సులో సుమారు ఐదారు వందల మంది పాల్గొన్నారు. అందులో స్త్రీలు పదిమంది లోపలే. కవి సమ్మేళనం లో కవితలు చదవడానికి ఒక్కరే ఉంది. నేను ‘ఇక్కడకి వచ్చిన దళిత స్త్రీల సంఖ్యని బట్టి అర్ధం చేసుకోవాలి దళిత స్త్రీలకి ఏమాత్రం వెసులుబాటు, స్వేచ్చ ఉన్నాయో’ అని అంటే కొందరికి చాలా కోపం వచ్చింది. ఇప్పటి దళిత పురుషుల ఉలికిపాటుకి చాలా చరిత్ర ఉంది అని గుర్తు చెయ్యడానికే ఇది.

స్త్రీవాదం అంతా ఒకటి కాదు. సోషలిస్ట్ స్త్రీవాదం వర్గపోరుతో ఆర్ధికపరమైన సమానత్వం వస్తే స్త్రీలకు ఇంటిపని, వంటపని నుంచి విముక్తి లభిస్తుంది అంటుంది. రాడికల్ ఫెమినిజం body politics, sexuality ల మీద కూడా చర్చిస్తుంది. ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానంతో చైతన్యవంతమైన దళిత స్త్రీలు కుల వివక్ష, శ్రమ దోపిడీ, లోపలా, బయటా పురుషాధిపత్యం అంతరిస్తే తాము విముక్తి పొందుతామని నమ్ముతారు. దళిత స్త్రీలు కుల వివక్ష గురించి రాస్తే, మాట్లాడితే ఉండే సౌకర్యం తమ సొంత కులంలో ఉండే పురుషాధిక్యతను ప్రశ్నిస్తే ఉండదు. ప్రశ్నించిన వారి మీద మాటల దాడి చేసి వంటరిని చేస్తారు. పైగా వారు లోపలి విషయాలు మాట్లాడితే దళిత ఉద్యమానికి నష్టం అని కుంటి సాకులు చెప్పుకొస్తారు. దళిత స్త్రీలు ‘ఫెమినిజం’ అనేదాని జోలికి పోకూడదని, లోపల జెండర్ పరమైన అంశాలపై చర్చ చెయ్యొద్దని కోరుకోడం దళిత పురుషుల పిత్రుస్వామ్యపు(దాని పేరు ఏదన్నా కానీ) పరిమితులే తప్ప మరీమీ కాదు.

చల్లపల్లి స్వరూపరాణి

RELATED ARTICLES

Latest Updates