గవర్నర్‌ కేంద్రంగా రాజకీయ క్రీడలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కేంద్రంలోని అధికార పార్టీకి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీ వచ్చినపుడు.. అధికారాన్ని ఇతరులకు దక్కకుండా చేయడానికి గవర్నర్‌ను, కేంద్ర దర్యాప్తు సంస్థలను పావుగా వాడుతున్న దృష్టాంతాలు కోకొల్లలు. కేంద్రం చర్యలతో గవర్నర్ల పదవి, అధికారాలపై దేశ ప్రజలకు గౌరవం నానాటికీ సన్నగిల్లుతోంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952లో టంగుటూరి ప్రకాశం పంతులును ముఖ్యమంత్రి పీఠంపైకి ఎక్కనీయకుండా చేసేందుకు రాజాజీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంతో మొదలైన వివాదాస్పద నిర్ణయాలు తాజాగా మహారాష్ట్ర సంక్షోభం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ సందర్భాల్లో పలు రాష్ట్రాల గవర్నర్ల ఏకపక్ష నిర్ణయాలు ఇలా ఉన్నాయి…

1984(ఆంధ్రప్రదేశ్‌): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు… ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పటి గవర్నర్‌ రామ్‌లాల్‌ను పావుగా వాడి నాదెండ్ల చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది. ఈ చర్యతో రాష్ట్రం అట్టుడికిపోయింది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించారు. నెలరోజుల్లోనే రాష్ట్రంలో నాదెండ్ల ప్రభుత్వం కూలిపోయింది.

* 1988(కర్ణాటక): జనతాదళ్‌ ముఖ్యమంత్రి ఎస్‌.ఆర్‌.బొమ్మైకి శాసనసభలో సంపూర్ణ  మెజారిటీ ఉన్నా… నిరూపించుకునే అవకాశాన్ని అప్పటి గవర్నర్‌ పి.వెంకటసుబ్బయ్య ఇవ్వలేదు. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. దీనికి కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.   గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం వ్యాజ్యం నడిచింది. గవర్నర్ల పాత్రపై చర్చకు తెరతీసిన కేసు ఇది.

1994(గోవా): గోవా ముఖ్యమంత్రి విల్‌ఫ్రెడ్‌ డిసౌజా మంత్రివర్గంలోని ఐదుగురు మంత్రులు రాజీనామా చేసినపుడు గవర్నర్‌ భానుప్రతాప్‌ సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేశారు. రవి  నాయక్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పట్లో కేంద్రంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వం అధికారంలో ఉంది.

1996(గుజరాత్‌): భాజపా సీఎం సురేష్‌  మెహతా ప్రభుత్వంపై సొంతపార్టీ నాయకుడు శంకర్‌సిన్హ్‌ వాఘేలా 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుబాటు చేశారు. గవర్నర్‌  క్రిష్ణపాల్‌సింగ్‌ ఆదేశంతోనే సీఎం సురేష్‌   మెహతా మెజారిటీని నిరూపించుకున్నా… దానికి గవర్నర్‌ విలువివ్వలేదు. రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న దేవెగౌడ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది.

1998(ఉత్తర్‌ప్రదేశ్‌): కల్యాణ్‌సింగ్‌(భాజపా) ప్రభుత్వానికి లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్‌, జనతాదళ్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వాన్ని గవర్నర్‌ రమేష్‌భండారి రద్దుచేశారు. లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్‌కు చెందిన జగదాంబికా పాల్‌కు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చారు. కోర్టు ఆదేశంతో మూడురోజుల వ్యవధిలోనే కల్యాణ్‌సింగ్‌ మళ్లీ పీఠమెక్కారు.

2005(ఝార్ఖండ్‌): 80 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌ శాసనసభలో 41 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ ముందుకొచ్చింది. గవర్నర్‌ సయ్యద్‌ సిబ్తె రజీ ఎన్డీయేకు అవకాశం ఇవ్వకుండా.. జేఎంఎంకు చెందిన శిబూ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశంతో నిర్వహించిన బలపరీక్షలో సోరెన్‌ విఫలమయ్యారు.

2016(ఉత్తరాఖండ్‌): హరీశ్‌   రావత్‌(కాంగ్రెస్‌)పై సొంతపార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు(ఆ తర్వాత వారిపై అనర్హత వేటుపడింది). రావత్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ కె.కె.పౌల్‌ రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఆయన నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో రావత్‌ బలనిరూపణ చేసుకున్నారు.

2016(అరుణాచల్‌ ప్రదేశ్‌): అరుణాచల్‌ స్పీకర్‌ను అభిశంసించాలంటూ కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ జె.పి.రాజ్‌కోవాను సంప్రదించింది. దీన్ని ఆయన పట్టించుకోలేదు. గవర్నర్‌ సిఫార్సుతో కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించింది. సుప్రీంకోర్టు జోక్యంతో వెనక్కితగ్గింది.

2017(గోవా):  40 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలుచుకుని పెద్దపార్టీగా అవతరించింది. కానీ…గవర్నర్‌ మృదులాసిన్హా ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌ను కాకుండా భాజపాను ఆహ్వానించారు.

2017(మణిపుర్‌): 60 స్థానాలున్న మణిపూర్‌ శాసనసభలో కాంగ్రెస్‌ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా.. గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా భాజపాను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.

2017(బిహార్‌): కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీ(యూ) కూటమి నుంచి ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ (జేడీ-యూ) బయటికి వచ్చారు. తర్వాత భాజపా మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అతిపెద్ద పార్టీ ఆర్జేడీ విన్నపాన్ని గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి పట్టించుకోలేదు.

2019(కర్ణాటక): రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఏడాది దాటిన తర్వాత 17 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, వారిపై స్పీకర్‌ వేటువేయడం తదితర పరిణామాల తర్వాత 2019, జులై 23న జరిగిన బలపరీక్షలో సీఎం కుమారస్వామి ఓడిపోయారు. ఇక్కడ కూడా గవర్నర్‌ వజూభాయ్‌ వాలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుని, విమర్శలు ఎదుర్కొన్నారు.

గవర్నర్‌ పదవిని రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నిర్వర్తించాలి. లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉన్నత లక్షణాల ప్రాతిపదికగా ఈ విధులుండాలి. ఆ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం సైతం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం  వాటిల్లకుండా వ్యవహరించాలి.
సుప్రీంకోర్టు (1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసులో)

Courtesy Eenadu..

RELATED ARTICLES

Latest Updates