ప్రయివేటైతే… జనంపై పిడుగే…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మారుమూల గ్రామాలకు బస్సులు గగనమే?
– చార్జీలు పెరిగే అవకాశం
– రాయితీ బస్‌పాస్‌లపై నీలినీడలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మధ్యప్రదేశ్‌, లేదా ఆ పక్కనున్న జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. మొత్తం రవాణా రంగమంతా ప్రయివేటు పరమే. అక్కడి పరిస్థితులు చూస్తే ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. మారుమూల గ్రామాలకు అస్సలు రవాణా సౌకర్యమే లేదు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే. చిన్న చిన్న ఆటోల్లో పది నుంచి ఇరవై మంది వరకు కిక్కిరిసి ప్రయాణిస్తారు. ప్రమాదాలు జరిగితే అంతే సంగతులు. తెలంగాణ ఆర్టీసీ రూట్లల్లో ప్రయివేటు బస్సులొస్తే మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ పరిస్థితి రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్న టీఎస్‌ఆర్టీసీ భవితవ్యం ప్రశ్నార్థకం కానుందని నిపుణులు అంటున్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీకి మొత్తం 8230 బస్సు రూట్లు ఉన్నాయి. ఇందులో లాభాలొచ్చే 28 శాతం రూట్లల్లో ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ తదితర బస్సులు, 36శాతం రూట్లల్లో పల్లెవెలుగు, మరో 36శాతం రూట్లల్లో సిటీ బస్సులు నడస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం 5100 బస్సు రూట్లను ప్రయివేటుకు అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది. అంటే రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న బస్సు రూట్లల్లో సగానికి పైగా రూట్లు ప్రయివేటు పరం కానున్నాయి. ఈ మార్గాల్లో పూర్తి స్థాయిలో ప్రయివేటు బస్సులు నడుస్తాయనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీలో నడుస్తున్న అద్దె బస్సులే ఇందుకు ఉదాహరణ. ఆర్టీసీ అజమాయిషీలో నడుస్తున్నప్పుడే అద్దె బస్సులన్నీ లాభాలోచ్చే ప్రధాన రహదారుల్లోనే తిరుగుతున్నాయి. రూట్లను ప్రయివేటు పరం చేస్తే కేవలం లాభాలు గడించే మార్గాల్లో మాత్రమే నడుపుతారని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. 51 రోజులుగా ఆర్టీసీ వల్ల బస్సులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులను అందుబాటులో ఉంచామని చెబుతుండగా, క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 50 రోజుల సమ్మె కాలంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఆర్టీసీలో ప్రయివేటు బస్సులొస్తే మొత్తం రవాణా రంగమంతా చిన్నాభిన్నం అవుతుందని భావిస్తున్నారు. సమయానుకూలంగా ప్రజలకు రవాణా సౌకర్యం అందకపోవడంతో పాటు రాయితీ బస్‌పాస్‌లు కనుమరుగు కావచ్చననే భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులు, వృద్ధులకు చెందిన దాదాపు మొత్తం లక్షా 60 వేల వివిధ రకాల రాయితీ బస్‌పాస్‌లు ఆర్టీసీలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో 60,000 విద్యార్థి బస్‌పాస్‌లు ఉండడం గమనార్హం. ప్రభుత్వం మాత్రం రాయితీ బస్‌పాస్‌లు యధావిధిగా నడుస్తాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కాదని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడే కొన్ని బస్సుల్లో రాయితీ పాసులను అనుమతించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ రూట్లల్లో ప్రయివేటు బస్సులొస్తే బస్‌పాసుల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది
చార్జీల బాదుడే!
ప్రస్తుతం ఆర్టీసీలో చార్జీలు ఆర్డీనరి బస్సుల్లో కిలోమీటరుకు 60పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో 80 పైసలు, లగ్జరీలో రూ.1.10గా ఉన్నాయి.. ఎప్పుడో పదేండ్లనుంచి ఇవే చార్జీలు కొనసాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి సారీ అధికారం చేపట్టిన తర్వాత బస్సు చార్జీలు పెంచుతామనే ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులు తెచ్చినప్పటికీ ప్రభుత్వం ఒప్పు కోలేదు. అయితేఆర్టీసీ రూట్లల్లో ప్రయివేటు బస్సులొచ్చిన వెంటనే చార్జీల మోత తప్పదని భావిస్తున్నారు. ప్రభుత్వ చేస్తున్న ప్రకటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. చార్జీలను రేషనలైజేషన్‌ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం జరిగింది. విద్యుత్‌, పెట్రోల్‌ తదితర సంస్థల్లో ఉండే రెగ్యులేటరీ విధానాన్ని ఆర్టీసీలో అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంధన చార్జీల పెరుగుదల, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రెగ్యులేటరీ కమిటీ ఎప్పుడంటే అప్పుడు చార్జీలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ప్రజలపై మరింత భారం పడుతుందని విష్లేషకులు అంటున్నారు.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates