ప్రయివేటీకరణ కోసమే…!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఫీజుల పెంపుతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం
– వర్సిటీలను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం

న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిందే తడువుగా ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటు వారికి కట్టబెట్టే పనిని వేగవంతం చేస్తున్నది మోడీ సర్కార్‌. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు.. విద్యారంగం నుంచి కూడా వైదొలిగేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. దేశ రాజధానిలోని జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఫీజుల పెంపు ఇందులో భాగమేనని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫీజులను పెద్ద ఎత్తున పెంచడంతో నిరుపేద విద్యార్థులను చదువు నుంచి దూరం చేసేందుకే ఈ కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంతటా అదే తీరు..

దేశంలోని వర్సిటీలలో ఫీజుల పెంపు జేఎన్‌యూ ఉదంతంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినా అంతకుముందు నుంచే వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఐఐటీ), సెంట్రల్‌ యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజులను మోడీ సర్కారు ఇష్టారీతిన పెంచుతున్నదనే ఆరోపణలున్నాయి. గడిచిన రెండేండ్లలో ఐఐటీల్లో రెండుసార్లు ఫీజులను పెంచారు. ఐఐటీల్లోని ఎంటెక్‌ కోర్సులకు 900శాతం ఫీజులు పెరిగాయి. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)లో కోర్సుల వారీగా రూ. 20 వేలు, రూ. 50 వేలున్న ట్యూషన్‌ ఫీజులు.. ఒక్కసారిగా రూ.2 లక్షల వరకూ పెంచారు. ఈ ఏడాది ఫీజులు పెంచుతామని వెల్లడించిన పాండిచ్చేరి వర్సిటీ.. విద్యార్థుల ఆందోళనతో కొంత వెనక్కుతగ్గింది. షిమ్లాలోని ప్రయివేటు స్కూళ్లలో యాజమాన్యాలు ప్రతిఏడాది ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నారు. జేఎన్‌యూలో సైతం ఫీజులు ఒక్కసారిగా పెద్దఎత్తున పెంచడంతో ఢిల్లీలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జేఎన్‌యూలో చేరిన ఒక విద్యార్థి ఏడాదికి అన్ని ఫీజులను కలిపి (పెంచిన ఫీజుల ప్రకారం) దాదాపుగా రూ. 60,700 (హాస్టల్‌లో ఇద్దరుంటే), రూ. 62,500 (హాస్టల్‌లో ఒక్కరుంటే) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది దిగువ మధ్యతరగతి, నిరుపేద విద్యార్థులకు చాలా కష్టంతో కూడుకున్నది. 2017 జేఎన్‌యూ వార్షిక నివేదిక ప్రకారం.. వర్సిటీలో 40 శాతం మందికి పైగా విద్యార్థుల కుటుంబ ఆదాయం నెలకు రూ. 12 వేల కంటే తక్కువే. పెంచిన ఫీజులను చెల్లించడం వీరికి శక్తికి మించిన భారం అవుతున్నది.

ప్రయివేటీకరణతో నష్టం..
దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత విద్య వ్యాపార వస్తువయ్యింది. ప్రజలకు ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నది. ఇందులో భాగంగా గత ఇరవై ఏండ్లలో ప్రయివేటు విద్యా సంస్థలు లక్షల సంఖ్యలో వెలిశాయి. విద్య మార్కెట్‌ సరుకుగా మారిపోయింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు పాఠశాల విద్యనే పూర్తి చేయలేకపోతున్నారు. చిన్నారుల్లో డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. మరోవైపు ప్రయివేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. తమ ఇష్టారీతిన ఫీజులను పెంచుతున్నాయి. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీఎఎంఎస్‌) కోర్సును బోధిస్తున్న 13 ప్రయివేటు కళాశాలలు కోర్సు ఫీజును రూ. 80 వేల నుంచి రూ. 2.15 లక్షలకు పెంచాయి. దీన్ని సవాల్‌ చేస్తూ విద్యార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం కాలేజీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల వద్ద వసూలు చేసిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినా ప్రయివేటు యాజమాన్యాలు కోర్టు తీర్పును సైతం పట్టించుకోలేదు. పోగా విద్యార్థులపై భౌతికదాడులకు పాల్పడి వారినుంచి ఫీజులు వసూలుచేశాయని గతంలో వార్తలు వచ్చాయి.

ఫీజుల పెంపుతో పాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రయివేటు వర్సిటీలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రయివేటీకరణతో దేశంలో 68 శాతం మంది ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులు.. 37 శాతం మంది పాఠశాలకు వెళ్లే చిన్నారులు తీవ్రంగా విద్యకు దూరం కానున్నారు. వర్సిటీలలో ఇప్పటికే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు (ఎస్‌ఎఫ్‌సీ)లను ప్రవేశపెట్టి విద్యార్థుల జేబులు ఖాళీ చేస్తున్న వర్సిటీలు తాజాగా ట్యూషన్‌ ఫీజులను పెంచి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates