చాణక్యం కాదు.. ప్రజాస్వామ్యం ఖూనీ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ ఓటర్ల తీర్పును గంగలో కలిపింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓటర్ల(ప్రజల) నిర్ణయంతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించింది. చివరి వరకు ఎన్సీపీపై ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌పై కుంభకోణం, అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన అభియోగాలు, ఆరోపణలు చేసి.. శనివారం అతనికే ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. బీజేపీ రాత్రికి రాత్రే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. శనివారం ఉదయం వచ్చిన ప్రతి దినపత్రికలోనూ అధికారంలోకి రాబోతున్న బీజేపీయేతర కూటమికి శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనే నాయకత్వం వహిస్తారనీ, ఆయనే ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారన్న ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రకటనలు వచ్చాయి.

కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనల మధ్య చర్చలు శుక్రవారం సాయంత్రానికే దాదాపు తుదిదశకు వచ్చాక ఎన్సీపీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌తో బీజేపీ డీల్‌ కుదుర్చుకున్నట్టు సమాచారం. శనివారం ఉదయం ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారాలు టీవీ తెరలపై ప్రసారమయ్యాయి. ఎన్సీపీ బహిరంగంగా ప్రకటించినప్పటికీ.. గవర్నర్‌ ఆ పార్టీ నేతలు బీజేపీకి మద్దతునిస్తున్నారని విశ్వసించి ప్రమాణ స్వీకారం జరిపించడం గమనార్హం. ఇలా రాజ్యాంగ నిబంధనలతో బీజేపీ చెలగాటమాడటం ఇది మొదటిసారేమీ కాదు. కానీ, నేడు అది పరాకాష్టకు చేరిందని చర్చ. మహారాష్ట్రను బీజేపీయేతర కూటమి పాలించడం మింగుడు పడని.. బీజేపీ ముందునుంచే వ్యూహాలు రచిస్తూ వస్తున్నది.

దేవేంద్ర ఫడ్నవీస్‌ తిరిగి అధికారంలోకి రావడానికి మోడీ, అమిత్‌ షా ఎ(జి)త్తులు ఒకసారి పరిశీలిస్తే..
1. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందే కేంద్రంలోని మోడీ సర్కారు దర్యాప్తు ఏజెన్సీల వేగాన్ని పెంచి.. ఎన్సీపీ నేతలు అజిత్‌ పవార్‌, శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌పై అవినీతి అభియోగాలు మోపి, విచారణ త్వరితం చేసింది.
2. ఎన్నికల ఫలితాల్లో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రాకపోవడం, సీఎం పదవి కోసం శివసేన బెట్టు చేయడంతో.. పోలింగ్‌కు ముందు నెలలో నియమించిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను నాన్చుతూ వచ్చారు.
3. గవర్నర్‌ కొశ్యారి.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించి 48 గంటల సమయమివ్వడం.. ఫడ్నవీస్‌ తిరస్కరించడంతో శివసేనను ఆహ్వానించి 24 గంటల కాల పరిమితినిచ్చారు. శివసేన మరింత సమయాన్ని కోరినా నిరాకరించి ఎన్సీపీకి అవకాశమిచ్చారు. కాగా, ఎన్సీపీకి ఇచ్చిన 24 గంటల గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఈ సిఫారసులు ‘బొమ్మయి’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉల్లంఘనే.
4. వెంటనే రాష్ట్రపతి పాలన అమలైంది. ఇతర పార్టీల్లో చీలికలు తీసుకొచ్చేందుకు బీజేపీ ఈ కాలాన్ని వాడుకుంది.
5. తమ భావజాలాలను పక్కనబెట్టి శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు ఒక్కతాటిమీదకు రాగానే.. ఇరిగేషన్‌ స్కామ్‌లో నిందితుడైన అజిత్‌ పవార్‌తో బీజేపీ డీల్‌ కుదుర్చుకుంది. ఫడ్నవీస్‌కు మద్దతు పలికిని అజిత్‌ పవార్‌కు ఉపముఖ్యమంత్రి సీటు ఇచ్చారు. దీంతో అజిత్‌పై మొదలైన అవినీతి కేసు దర్యాప్తులకు బ్రేకులు వేసినట్టేనా? అన్న చర్చ మొదలైంది.
6. ఎవరికి మద్దతు ఇస్తున్నారో పేర్కొనకుండా.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు సమ్మతించిన లేఖ అజిత్‌ పవార్‌ దగ్గర ఉండగా.. దాన్ని ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తున్నట్టు అజిత్‌ దుర్వినియోగం చేశారని ఎన్సీపీ ఆరోపించింది. అయితే, ఆ లేఖ విశ్వసనీయతను గవర్నర్‌ పరిశీలించనేలేదని తెలుస్తున్నది.
7. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్న దస్త్రంపై ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం పెట్టారు. సాధారణంగా కేంద్ర క్యాబినెట్‌ సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగనేలేదని సమాచారం.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates