గిరిజన విద్య-తీరుతెన్నులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆ ఆశ్రమ పాఠశాలలు అడవి బిడ్డలకు అక్షర జ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసినవి. ప్రభుత్వాల నిర్లక్ష్యం పుణ్యమా అని కనీస సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు లేక, సరిపడా తరగతి గదులు లేక గిరిపుత్రులది అరణ్య రోదనే అవుతున్నది. పంతుళ్లు లేక బళ్లు మూత పెడుతున్న ఘటనలు… మరుగుదొడ్ల సౌకర్యం కొరవడి కాలకృత్యాల కోసం ఆరుబయట ఆడపిల్లలు పడుతున్న అగచాట్లు… ఏలికలకు ఏ మాత్రం పట్టడం లేదు.
విజయనగరం జిల్లా సాలూరు మండలం కురికూటి బాలికల ఆశ్రమ బాలికోన్నత పాఠశాలకు ఇటీవల సిపియం పార్టీ నాయకత్వ బృందం వెళ్ళి పరిశీలించింది. 3, 4, 5 తరగతుల్లో 197 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆ మూడు తరగతులకు ఆరుగురు ఎస్‌.జి.టి ఉపాధ్యాయులు చదువు చెప్పాల్సి ఉంది. కానీ అక్కడ ఒకే ఒక్కరు ఉన్నారు. మేము వెళ్లేటప్పటికి ఆయన ఒక క్లాసులో వున్నారు. మిగతా రెండు క్లాసుల్లో విద్యార్థినులు ఆడుకుంటున్నారు. అన్ని క్లాసులకూ ఒక్క ఉపాధ్యాయుడే ఎలా చదువు చెప్పగలరు? చదువు ఎలాగూ చెప్పలేరు. కనీసం కాపలాకు కూడా సరిపడా సిబ్బంది లేరు. 6, 7, 8, 10 తరగతులకు చదువు చెప్పాల్సిన ఎన్‌.ఎస్‌ (నేచురల్‌ సైన్స్‌), ఇంగ్లీషు, డ్రిల్లు మాస్టారు కూడా లేరు. వార్డెన్‌గా కాంట్రాక్టు టీచర్‌ (సిఆర్‌టి) పని చేస్తున్నారు. ఆమే లెక్కలు కూడా చెబుతారు. గుమస్తా లేరు. మొత్తం 320 మంది విద్యార్థులకి ఒకే ఒక్క వంట మనిషి. ఇంత మంది ఉన్న ఆశ్రమ బాలికోన్నత పాఠశాలకు వాచ్‌మెన్‌ కూడా లేరు. ఆడ పిల్లల భద్రత పట్ల ప్రభుత్వ బాధ్యతకు ఇదో నిదర్శనం. పిల్లలకు బాత్‌రూములు లేవు. వాటి నిర్మాణం లోపభూయిష్టంగా వుండడంతో వాడుకకు పనికి వచ్చే పరిస్థితులు లేవు. ఆడ పిల్లలు ఆరు బయట కాలకృత్యాలకు అగచాట్లు పడుతున్నారు. రాత్రిపూట కాపలా పని కూడా వంట మనిషిదే. అదే సాలూరు మండలం తోణాం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లోని 3, 4, 5 తరగతుల్లో 105 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు చదువు చెబుతున్నారు. వీరు గాక ఆ గ్రామంలో పాఠశాల లేనందున 1, 2 తరగతుల విద్యార్థులు కూడా 65 మంది ఇదే స్కూలులో చదువుతున్నారు. ఈ రెండు తరగతులకు కూడా టీచర్లను నియమించలేదు. మావుడు పల్లి ఆశ్రమ బాలికోన్నత పాఠశాలోనూ సరిపడా టీచర్లు లేరు. తరగతి గదులు, మరుగుదొడ్లు, స్నానపు గదులు సమస్యగానే ఉంది. 1 నుండి 5వ తరగతి వరకు రెండే గదులు ఉన్నాయి. రాత్రిపూట ఎక్కడా వాచ్‌మాన్‌ లేరు. వంట మనిషే రాత్రి, పగలు పని చేస్తున్నారు. ఒక్కరితో పని జరగక వారు గానీ, వార్డెన్లు గానీ ఎంతో కొంత ఇచ్చి అదనంగా మనుషులను పెట్టుకుని నెట్టుకు వస్తున్నారు.

ఉపాధ్యాయులు లేక తెరవని బడులు
సాలూరు మండలం లోనే 15 గ్రామాల్లో ఈ విద్యా సంవత్సరంలో బడులు పునఃప్రారంభం కాలేదు. గిరిజన సంఘం, విద్యార్థి సంఘాలు, సిపియం ఆందోళన చేయగా 10 స్కూళ్లల్లో డిప్యుటేషన్‌ మీద టీచర్లను వేశారు. ఇప్పటికీ 4 ఎం.పి.పి స్కూళ్ళల్లో టీచర్లు లేక తెరవవలేదు (పట్టు చెన్నారి, బింగుడు వలస, ఇటిక వలస, బందసాయి, సంపంగిపాడు). ఉపాధ్యాయులు లేరు గనుక తెరవలేకపోయామని అధికార్లు చెబుతున్నారు. పాచిపెంట మండలంలో విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఉపాధ్యాయులు లేక 13 జిపిఎస్‌ స్కూళ్లను తెరవలేదు. చాపరాయి వలస, పెద కంచూరు, రాయివలస, కాగుల మావుడి, మెలియా కంచూరు, జూలిభద్ర, నేరేడు వలస, కమ్మరి వలస నేటికీ మూతపడి ఉన్నాయి. వేటగాని వలస ఆశ్రమ బాలుర పాఠశాలలో ఇంగ్లీషు, లెక్కలు, ఫిజికల్‌ సైన్స్‌, హిందీ చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. సరాయి వలస ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో జూన్‌ నుండి 3 రోజుల క్రిందటి వరకు లెక్కలు, తెలుగు ఉపాధ్యాయులు లేరు. ఈ రెండు సబ్జెక్టులకు డిప్యుటేషన్‌పై 3 రోజుల క్రితమే వచ్చారు. హిందీకి నేటికీ ఉపాధ్యాయుడు లేరు. ఇవి కొన్ని మాత్రమే. బడులు తెరవకపోయినా, చదువు చెప్పకపోయినా ఈ బడుల్లో విద్యార్థులు మాత్రం తరువాత తరగతికి వెళ్లిపోతారు. విద్యార్థికి అక్షరం తెలియకుండానే 3వ తరగతి ఆశ్రమ పాఠశాలలో ప్రవేశిస్తాడు. అక్కడ టీచర్లు లేకపోవడంతో చదువు లేకుండానే ముందుకు తోసేస్తున్నారు. ఎంత దారుణం? గిరిజనుల పట్ల పాలకులు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో దీన్ని బట్టి అర్థం కావడం లేదా?
ఉన్న టీచర్లలో అత్యధికులు కాంట్రాక్టు టీచర్లే. వారు 20 ఏళ్ల నుండి ఉపాధ్యాయులుగా చేసినా కాంట్రాక్టు టీచర్లే. వారిని మార్చిలో తీసివేస్తే పోరాటాలు చేయగా చేయగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో మరలా నియమిస్తారు. వందల మంది గిరిజన యువతీ యువకులు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉన్నారు. ఈ ఖాళీల్లో వారికి కాంట్రాక్టు టీచర్లుగా కూడా నియమించకపోవడం మహా దారుణం. గిరిజన ప్రాంతంలో పరిశ్రమలు లేవు. ఈ ఖాళీలు నింపినా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది.
గిరిజనుల మాతృ భాష తెలుగు కాదు. వారి తెగల భాషలో చెబితేగాని వారికి అర్థం కాదు కాబట్టి, భాషా వాలంటీర్లను నియమించాలి. అయితే ఒక్క ‘సవర’ భాషకు తప్ప ‘జాతాపు’ వంటి ఇతర తెగల భాషలకు భాషా వాలంటీర్లను నియమించలేదు. ఆ ‘సవర’ భాషా వాలంటీర్లకు కూడా జూన్‌ నుండి ఇంతవరకు జీతం ఇవ్వలేదు. ఇప్పుడు జీతం ఇస్తాం గానీ స్కూలు చైర్మన్‌, స్కూలు టీచర్‌ ఖాతాలో వేస్తాం. వారి నుండి తీసుకోమంటున్నారు. ఇచ్చింది తక్కువ. నెలల తరబడి ఇవ్వరు. ఇప్పుడు ఇదో పేచీ. కొన్ని జిపిఎస్‌ స్కూళ్లల్లో రెగ్యులర్‌ టీచర్‌ లేకపోయినా భాషా వాలంటీర్లు చదువు చెబుతున్నారు.
నవంబర్‌ మధ్యలోకొచ్చినా టీచర్లు లేకపోతే చదువు ఎలా వస్తుందో ఏలిన వారికే ఎరుక. గిరిజనులు గనుక ఆందోళన కూడా చేయలేరనే దీమాతో ఇంత దారుణానికి ఒడిగడు తున్నారు. ప్రభుత్వ నేతలు, ప్రజా ప్రతినిధుల పిల్లలను ఇలాంటి స్కూళ్ళల్లో చదివిస్తారా? ఒక్క ఇంగ్లీషుకే జూన్‌ నుండి ఇంతవరకు టీచర్‌ను నియమించలేకపోయారు. మొత్తం తెలుగు మీడియంను రద్దు చేసి అందరికీ ఇంగ్లీషు చదువు చెప్పేస్తానని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు నేర్పలేని వారికి ఇంగ్లీషు బహు చక్కగా చెప్పేస్తానని మొండిగా మాట్లాడుతున్నది ప్రభుత్వం. ఇంగ్లీషులో టీచర్‌ లేకపోవడమే గాక ఇంగ్లీషులో అన్ని సబ్జెక్టులు చెప్పగల స్థితిలో ఉపాధ్యాయులు లేరు. ఇంటి దగ్గర ఇంగ్లీషు కాదు కదా తల్లిదండ్రులకు తెలుగు కూడా రాదు. ప్రైవేటు చెప్పించుకునే ఆర్థిక స్థోమత లేదు. తెలుగు రద్దు చేసి ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తే గిరిజన పిల్లలు రెంటికీ చెడ్డ రేవడి కావాల్సిందే. ఈ వాస్తవం పరిశీలించి ఏలిన వారు నిర్ణయం తీసుకోవాలి.

అవగాహనా లేకనా? దురుద్దేశమా?
విద్యార్థులు 1, 2, 3 వరకు జిపిఎస్‌లో చదువుకునేవారు. వారిలో 3, 4వ తరగతి పిల్లలకు ఆశ్రమ పాఠశాలల్లో బలవంతంగా చేర్పించేశారు. అందువలన 10 మంది పిల్లలు లేరనే నెపంతో జిపిఎస్‌ స్కూళ్లను మూసివేశారు. టీచర్లు లేరని సాలూరు మండలం లోనే ఇప్పటికీ 5 జిపిఎస్‌ స్కూళ్ళు మూసేసే ఉన్నాయి. 3, 4, 5 తరగతుల పిల్లలకు చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులను నియమించలేదు. ప్రభుత్వం చేస్తున్న విధానం గిరిజనులకు చదువు చెప్పాలనా? చదువు లేకుండా చేయాలనో విజ్ఞులకే అర్థం కావాలి. నవంబర్‌ 20 నాటికి కూడా సైన్సుకు, ఇంగ్లీషుకు, లెక్కలకు టీచర్లను నియమించకపోతే 10వ తరగతి పిల్లలు చదువు ఎలా చదవగలరు? మార్చిలో పరీక్షలు ఎలా రాయగలరు? ప్రభుత్వం, అధికార్లు నిర్దేశించిన 100 శాతం ఫలితాలు ఎలా సాధించగలరు? ఇవి ఒక సంవత్సరం ఒక స్కూలు పరిస్థితా? అంటే కాదనే సమాధానం చెప్పాలి. ఐటిడిఎ పరిధిలో ఇదే వైఖరి సంవత్సరాల తరబడి సాగుతున్నది. ప్రభుత్వాధి నేత లకు తెలియక ఇలా జరుగుతోందా? అంటే ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు, అధికార్లు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. విద్యా సమీక్షల్లో చెబుతున్నారు. ఒకటో తరగతి నుండి ఇంత అధ్వాన్నమైన చదువుతో వారు ఎలా ఎదగగలరు?

ప్రైవేటు స్కూళ్లకు తరలించే దారి
స్కూళ్లల్లో టీచర్లు లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆడపిల్లలకు సైతం భద్రత లేకపోవడం వంటి దారుణ పరిస్థితులు చూసిన తరువాత ఏ తల్లి తండ్రి మాత్రం ఈ స్కూళ్లలో పిల్లలను చదివించుకుంటారు. ఈ రోజు కురికూటి, తోణాం, మావుడి పల్లి ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థిక స్థోమత లేదు గనుక పిల్లలను ఆ పాఠశాలల్లోనే ఉంచుతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రైవేటు స్కూలుకు తరలించేసేవారు. స్కూలును, చదువును చెడగొట్టడం ప్రభుత్వమే చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివితే చదువు రాదని ప్రచారం చేస్తోంది. పైగా టీచర్ల పిల్లలను ప్రైవేటు స్కూళ్లల్లో చదివించుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎం.పి, ఎం.ఎల్‌.ఏ.లు తమ పిల్లలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్లల్లో చదివించరు? ప్రభుత్వ బడుల్లో చదివితే తమ పిల్లలకు చదువు రాదనే కదా? గిరిజన బిడ్డలకు చదువు లేకపోయినా వీళ్లకు చీమ కుట్టినట్లు కూడా లేదు. దీన్ని కుట్ర అనాలా లేక అజ్ఞానం అనాలా?

పోరాడి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి
గిరిజన పిల్లలకు చదువు అక్కర్లేదనే దురుద్దేశం కాకపోతే విద్యా సంవత్సరంలో సగం పైన కాలం గడిచిపోయినా టీచర్లను నియమించకపోవడం ఏంటి? పోనీ తెలియదా అంటే…స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారికే ప్రజలు చెబుతున్నారు, ఉపాధ్యాయులు విన్నవించుకుంటున్నారు. ఐటిడిఎ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు మనవి చేసుకుంటు న్నారు. ఎంత మంది అధికారులకూ, ప్రజాప్రతినిధులకు చెప్పినా సిఎం చెవికి చేరడం లేదా? లేదా పత్రికల్లో ప్రచురితమైనా కంటికి కనిపించడం లేదా? ఈ నిర్లక్ష్యాన్ని సహించకూడదు. గిరిజనులంతా ఐక్యమై పోరాడి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. ప్రజాతంత్రవాదులు, సంఘాలు, సంస్థల నుండి సహకారం తీసుకోవాలి. టీచర్లను నియమించి, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వాచ్‌మెన్‌లను, వంట మనుషులను నియమించేంత వరకు పోరాటం కొనసాగించాలి.

– ఎం కృష్ణమూర్తి ( వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )

Courtesy prajasakthi

 

RELATED ARTICLES

Latest Updates