సుప్రీంకోర్టు తాజా తీర్పులు-ఒక పరిశీలన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రకాశ్‌ కరత్‌

ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ రంజన్‌ గొగోయి ఈ నెల 17న పదవీ విరమణ చేయగా ఆయన వారసుడిగా జస్టిస్‌ ఎస్‌.ఎ బాబ్డే పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలించేందుకు ఇదే అనువైన సమయం. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగానికి లోబడి వున్నాయా లేదా అన్న అంశాన్ని నిర్ధారించటంతో పాటు, పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుది.
అయితే దురదృష్టవశాత్తు గత కొంత కాలంగా సుప్రీంకోర్టు తన బాధ్యతల నిర్వహణ లోను, రాజ్యాంగ పరిరక్షణ లోనూ విఫలమవు తోంది. రాజ్యాంగం నిర్దేశించిన దేశ లౌకిక ప్రజాస్వామ్య ఛత్రాన్ని కాలరాసేందుకు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న హిందూత్వ మెజారిటీ వ్యవస్థ ప్రయత్నిస్తున్న సమయంలో ఇది కొంత ఆందోళన కలిగించే అంశమేనని చెప్పక తప్పదు. ప్రధాన న్యాయమూర్తిగా రంజన్‌ గొగోయి పదవీ బాధ్యతలు నిర్వహించిన కాలమంతా శాసన వ్యవస్థను సమర్ధిస్తూ, పౌరుల హక్కులను సమర్ధించే విషయంలో నిర్లిప్తత వహిస్తూ, విశ్వాసాల పేరుతో మెజార్టీ వాదంతో రాజీ పడటమే సరిపోయింది. గత ఏడాది కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ, సమగ్రతలకు విఘాతం కలిగించే ఈ ధోరణి మన కళ్లకు కడుతుంది. తమ ప్రాథమిక హక్కులను కాపాడే రక్షకుడిగా ప్రజలు సుప్రీంకోర్టును భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే అందులో జోక్యం చేసుకుని వాటిని రక్షించటంలో కోర్టు విఫలమైంది. జమ్మూ కాశ్మీర్‌లో ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఆంక్షలు విధించి, అనేక మంది రాజకీయ నేతలను నిర్బంధంలో వుంచటాన్ని సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు వివరించటానికి సాధ్యం కానిది. మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి నిర్బంధాన్ని సవాలు చేస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కానీ, మీడియా స్వేచ్ఛ, పౌరుల స్వేచ్ఛా సంచారం, మైనర్ల నిర్బంధం వంటి అంశాలకు సంబంధిం చిన పిటిషన్ల విషయంలో సుప్రీం కోర్టు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను సమర్ధించటానికి నిరాకరించింది. ఈ పిటిషన్ల న్నింటినీ విచారించేందుకు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన న్యాయపాలిక, ఆర్టికల్‌ 370, 35 (ఎ) అధికరణాల రద్దుపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
ముగ్గురు సభ్యుల ధర్మాసనం రెండు నెలలు గడిచినా, తనకు నిర్దేశించిన ఏ ఒక్క పిటిషన్‌పై కూడా ఇప్పటి వరకూ తీర్పు వెలువరించలేదు. యువకుల నిర్బంధానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణను కూడా ధర్మాసనం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ జాప్యం చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్‌ 3కు వాయిదా వేశారు. క్రమానుగతంగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అవసర మైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఈ ముగ్గురు సభ్యుల ధర్మాసనం గత సెప్టెంబర్‌ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ద్వారా కొన్ని ఎంపిక చేసిన ఆంక్షలను తొలగించే అధికారాన్ని న్యాయ వ్యవస్థ అధికార యంత్రాంగానికి కట్టబెట్టింది. ఇందులో కూడా జాతీయ ప్రయోజనాలతో రాజీ పడ వద్దంటూ షరతు విధించింది.
న్యాయపరమైన తీర్పు వెలువడటంలో జరిగే జాప్యం ఒక విధమైన ‘న్యాయ దురాక్రమణే’ అవుతుంది. దీనితో ప్రభుత్వం, శాసన వ్యవస్థ ఒక తప్పుడు చర్యను, విధానాన్ని అమలు చేసేందుకు వీలవుతుంది. ఇటువంటి ‘న్యాయ దురాక్రమణ’కు చక్కని ఉదాహరణ ఎలక్టోరల్‌ బాండ్ల కేసు. ఇక్కడ కూడా ప్రధాన న్యాయమూర్తి గొగోయి నేతృత్వం లోని ధర్మాసనం లోక్‌సభ ఎన్నికల ముందు ఈ కేసు విచారణ చేపట్టింది. అధికార పార్టీ రహస్యంగా నిధులను సేకరించుకునేం దుకు ఈ ఎలక్టోరల్‌ బాండ్లను ఉపయోగించుకుని అనుచిత ప్రయోజనాలు పొందిందన్న విషయాన్ని అత్యవసర ప్రాతిపదికపై తేల్చాల్సి వుంది. కానీ విచారణ, వాద ప్రతివాదనల తరువాత రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలను మే చివరి లోగా తమకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలంటూ ధర్మాసనం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఆ తరువాత ఈ కేసు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటి వరకూ రు.6 వేల కోట్లకు పైగా విలువైన ఎలక్టోరల్‌ బాండ్లు జారీ అయ్యాయి.
రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థ దీనిపై తుది తీర్పును వెలువరించేంత వరకూ అధికార యంత్రాంగం నోరు మెదపదు. అయోధ్య విషయంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించిన తీర్పు రాజ్యాంగంలో నిర్దేశించిన లౌకిక సిద్ధాంతాన్ని గట్టిగా సమర్ధించటంలో న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని మన కళ్లకు కడుతోంది.
రాజ్యాంగ విలువలను సమర్ధిస్తూ లౌకిక ప్రాతిపదికన ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని ఉద్ఘాటించిన సుప్రీంకోర్టు తన తుది తీర్పులో మాత్రం ఒక వర్గం వారి నమ్మకాలు, విశ్వాసాలకు కొమ్ము కాసింది. మెజార్టీ వర్గంతో ఈ విధంగా రాజీ పడటం తీవ్ర పరిణామాలకు దారి తీయటమే కాక ప్రభుత్వ లౌకిక విధానాన్ని సవాలు చేసేందుకు హిందూత్వ శక్తులకు మరింత ఊతమిస్తుంది.
శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశ విషయంలో గత ఏడాది వెలువరించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే వైఖరిని అనుసరిస్తూ తుది నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఈ రివ్యూ పిటిషన్ల విచారణ తరువాత వెలువరించిన మెజార్టీ తీర్పులో గతంలో వివిధ ధర్మాసనాలు వెలు వరించిన తీర్పులను ప్రస్తావిస్తూ వీటిని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించటం ద్వారా అన్ని పిటిషన్లను పెండింగ్‌ లో పెట్టింది. ఈ విషయంలో ఇప్పుడు ఏదైనా తాజా ఆధారాలు లేదా తప్పులు తెరపైకి వచ్చినపుడు మాత్రమే ధర్మాసనం వాటిని పరి శీలిస్తుంది. ఇక్కడ కూడా మహిళల హక్కులపై విశ్వాసాలు, నమ్మకాలదే పైచేయి అయింది.
సుప్రీంకోర్టు ఈ వైఫల్యాలన్నీ కేవలం ఒక ప్రధాన న్యాయమూర్తి, లేదా న్యాయమూర్తుల ఏకపక్ష ప్రవర్తన కారణంగా మాత్రమే కావన్నది సుస్పష్టం. దీని వెనుక ప్రభుత్వ హస్తం కూడా వుందన్నది నిర్వివాదాంశం. ఆరేళ్ల క్రితం అధికారం చేపట్టిన నాటి నుండి న్యాయమూర్తుల నియామకం, వారి పదోన్నతుల విషయంలో మోడీ సర్కారు విచ్చలవిడిగా జోక్యం చేసు కుంటూనే వుంది. విస్తృత స్థాయిలో పరిశీలించి నపుడు హిందూత్వ సైద్ధాంతికత ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థల్లో చొరబడిన విషయం మనకు స్పష్టంగా కన్పిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇందుకు మినహాయింపు కాకపోవటం విచారకరమైన అంశం.

 

 

RELATED ARTICLES

Latest Updates