రైతు బంధుకు పరిమితి!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • పది ఎకరాల నిబంధన విధింపు
  • సీఎంవోకు ఫైలు పంపిన సాగు శాఖ
  • లక్ష మంది పెద్ద రైతులకు సాయం బంద్‌
  • ఏడాదికి 5000 కోట్ల వరకూ మిగులు
  • ఖరీఫ్‌ ముగిసినా 1500 కోట్ల బకాయి
  • రబీ మొదలైనా ఊసే లేని చెల్లింపులు
  • 2 సీజన్లకూ 8,460 కోట్లు అవసరం

హైదరాబాద్‌: రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం పునః సమీక్షించనుందా!? పథకం కింద అందే సాయంలో కోత పెట్టనుందా!? పది ఎకరాలలోపు రైతులకే దీనిని పరిమితం చేయనుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి వ్యవసాయ శాఖ వర్గాలు. ఎంత భూమి ఉన్నా ఇప్పటి వరకూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ రబీ సీజన్‌ నుంచి 10 ఎకరాల వరకు కటాఫ్‌ ప్రకటించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వ్యవసాయ శాఖ నుంచి సీఎంవోకు ఫైల్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడమే తరువాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంలో క్రియాశీల పాత్ర పోషించిన ‘రైతు బంధు’ పథకం.. ఇప్పుడు ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.

గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. ముందస్తు ఎన్నికలకు ముందు రెండు కిస్తీలను పక్కాగా చెల్లించిన సర్కారు.. ఆ తర్వాత ఆ స్థాయిలో శ్రద్ధ పెట్టడం లేదు. సీజన్‌ ముగిసినా రైతు బంధు సాయం అందలేదు. ఖరీఫ్‌ పాత బకాయి, రబీ సీజన్‌కు చెల్లించాల్సిన డబ్బులు కూడా సర్దుబాటు కావడం లేదు. దాంతో, పథకాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మంది రైతులు ఉంటే.. వారి చేతిలో 1.40 కోట్ల ఎకరాలు ఉన్నాయి. వీరిలో లక్ష మంది పదెకరాలకుపైబడిన రైతులే. వారి చేతిలోనే ఏకంగా 50 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఏడాదికి ఎకరాకు రూ.8000 పంపిణీ చేసినప్పుడే వీరికి ఏకంగా రూ.4000 కోట్లకుపైగా చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం రైతు బంధు సాయాన్ని పెంచడంతో ఈ మొత్తం రూ.5000 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే, పెద్ద రైతులకు రైతు బంధు సాయాన్ని నిలిపి వేసే దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌లో ప్రారంభమైంది. సెప్టెంబరులో ముగిసింది. ఈ ఏడాది నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున, రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఖరీఫ్‌ సీజన్‌లో 53 లక్షల మంది పట్టాదారులకు రూ.6,960 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, గడచిన ఐదు నెలల్లో విడతలవారీగా 45 లక్షల మంది రైతులకు రూ.5,460 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 8 లక్షల మంది పట్టాదారులకు రూ.1,500 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. సాగు ప్రారంభించడానికి ముందే పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. సీజన్‌ ముగిసినా చెల్లింపులు చేయకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రబీ అవసరం రూ.6,960 కోట్లు
రాష్ట్రంలో రబీ సీజన్‌ ప్రారంభమై ఏడు వారాలు అవుతోంది. ఈ సీజన్లో 53 లక్షల మందికి రూ.6,960 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఇంతవరకూ పంపిణీ ప్రారంభించలేదు. రైతు బంధు సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌ బకాయిలు రూ.1,500 కోట్లు, రబీ సాయం రూ.6,960 కోట్లు.. వెరసి, రూ.8,460 కోట్లు విడుదల చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.

Courtesy AndhraJyothy…

RELATED ARTICLES

Latest Updates