6 నెలల్లో రూ.95వేల కోట్ల మోసాలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న ఫ్రాడ్‌లు
– పీఎస్బీల్లో దాదాపు 5,743 కేసులు వెలుగులోకి
– నిధుల కొరతతో ప్రభుత్వ బ్యాంకులు ఉక్కిరిబిక్కిరి..
– తాజాగా అప్పులు దొరక్క పలు కంపెనీలు దివాలా
– తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఎస్‌ఎంఈ సంస్థలు

వాణిజ్య విభాగం: బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటోందని.. ఫలితంగా నిరర్థక ఆస్తులు తగ్గి విత్త సంస్థలు వృద్ధి పథంలోకి చేరుతున్నాయంటూ మోడీ సర్కారు చేస్తున్న ప్రకటనలు గాలిమాటలేనని తేలిపోయింది. లెక్కలను విశ్లేషించి చూస్తే తీసుకుంటున్న చర్యలు వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదని తేలిపోతోంది. ఎందుకంటే గడిచిన ఆరు నెలల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీలలో) దాదాపు రూ.95,000 కోట్ల మోసాలు వెలుగులోకి వచ్చినట్టు స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 5,743 మోసం కేసులు జరిగినట్టుగా సర్కారు తెలిపింది. దాదాపు రూ.1000 కోట్లకు పైబడిన మోసాలు దాదాపు నాలుగేండ్ల తరువాత వెలుగులోకి వచ్చినట్టుగా సర్కారు వెల్లడించారు. గడిచిన ఆరు నెలల కాలంలో వెలుగులోకి వచ్చిన మోసాలలో రూ.2500 కోట్ల విలువైన మోసాలు ఇటీవలి కాలంలోనే జరిగినట్టుగా తాము గుర్తించామని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) లెక్కలను ఉటంకిస్తూ ఆర్థిక మంత్రి చట్ట సభలో వెల్లడించారు. దీంతో సర్కారు చేపడుతున్న చర్యల వల్ల బ్యాంక్‌ మోసాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదన్న సంగతి తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఆర్థికంగా మరింత బలహీనపడిపోతున్నాయి. అంతకంతకు పెరుగుతున్న మోసాలు, నిరర్థక ఆస్తుల కారణంగా విత్త సంస్థల వద్ద రుణ వితరణకు గాను నగదు అందుబాటులో లేకుండా పోతోంది. బ్యాంకులు తాజాగా రుణాలను అందిం చలేక పోతున్నాయి. రుణ జారీకి అవసరమైన నగదు లేకపోవడం, ఎన్‌పీఏల భయంతో బ్యాంకులు మంచి కంపెనీలకు కూడా రుణాలను ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలో అప్పు పుట్టడం కష్టంగా మారుతోంది. ఉన్న కాస్త సొమ్మును కూడా బ్యాంకులు రిస్క్‌ తక్కువగా ఉండే రిటైల్‌ రుణాల వైపుకు మళ్లిస్తున్నారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు రుణం లభించడం కష్టంగా మారింది. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నయాన్న వార్తలతో ప్రజలు డబ్బులను పొదుపు చేసుకొనేందుకు గాను బ్యాంకులకు రావడం తగ్గించేశారు. దీంతో డిపాజిట్లు తగ్గాయి. ప్రస్తుతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో దాదాపు 9.5 లక్షల కోట్ల విలువైన సొమ్ము నిరర్థక ఆస్తుల రూపంలో వ్యవస్థలో చిక్కుకొని ఉంది. ఎన్‌పీఏల బెంగతో కొన్ని బ్యాంకుల్లో సర్కారు చెల్లింపులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న పరిశ్రమలకు కూడా సరైన సమయంలో ఆర్థిక సాయం అందక ఆయా సంస్థలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎస్‌ఎంఈ సంస్థలు తీసుకున్న రుణాలు కూడా ఎన్‌పీఏగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని పారదోలేందుకు గాను పీఎస్‌యూ బ్యాంకుల్లో రుణ వితరణలో ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. .

కనిపించని ఐబీసీ ఫలితాలు..
బ్యాంకుల్లో ఆందోళనకర స్థాయికి పేరుకుపోతున్న రుణాల రికవరీ విధానాన్ని వేగవంతం చేసి వాటిని ఆర్థికంగా బలోపేతం చేసుందుకు గాను ప్రభుత్వం ఆర్థిక దివాలా స్మృతిని(ఐబీసీ) అమలులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలను పరిశీలించి చూస్తే మోడీ సర్కారు అమలులోకి తెచ్చిన ఐబీసీ అనుకున్నస్థాయిలో ఫలితాలివ్వడం లేదని తెలు స్తోంది. ఐబీసీ కింద దేశ వ్యాప్తంగా దాదాపు 2500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 3-4 ఏండ్ల కఠిన ప్రక్రియ కింద మొత్తం బ్యాంక్‌ మొండి బాకీల్లో 37 శాతం రికవరీలు నమోదయ్యాయి. దేశంలో బ్యాంకులను నిలబెట్టేందుకు గాను తాము చిత్తశుద్ధితో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటీకి.. ఆచరణలో ఇది కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలోని దిగ్గజ విత్త సంస్థలుగా నిలిచే రెండు పెద్ద బ్యాంకుల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవులు దాదాపు నెల రోజులుగా ఖాళీగా ఉన్నాయి. బాస్‌లు లేకపోవడంతో ఆయా సంస్థలు అభివృద్ధికి తాము ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నాయి. దీనికి తోడు టెలికాం, స్థిరాస్తి, పునరుత్పాదక ఇంధన, రహదారులకు సంబంధించిన రుణాలను జారీ చేసే విత్త సంస్థలు తీవ్రంగా మొండి బాకీల సమస్యను ఎదుర్కొం టున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ రంగంలో కొత్త ఎన్‌పీఏ భారం పెరగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సంక్షోభం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు మాటలు పక్కనబెట్టి బ్యాంకులను నిలబెట్టేలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే మేలని విశ్లేషకులు చెబుతున్నారు.

Courtesy NavaTelangana..

RELATED ARTICLES

Latest Updates