చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తెరాసకు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేంద్రం ప్రభుత్వ ఉత్తర్వులను 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 16కి వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే..వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేశ్‌ భారతీయ పౌరసత్వం పొందినట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ పది ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ అఫిడవిట్‌లో రమేశ్ పేర్కొనడంపైనా హోంశాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రమేశ్‌ పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేశారు. అదేసమయంలో ఆది శ్రీనివాస్‌ హైకోర్టును కూడా ఆశ్రయించగా.. కేంద్ర హోంశాఖ పరిధిలో ఈ విషయం ఉందని రమేశ్‌ కోర్టుకు విన్నవించారు. విచారించిన కోర్టు కేంద్ర హోంశాఖ ఓ కమిటీని నియమించి విషయాన్ని తేల్చాలని చెప్పింది. 2010లో ఎస్‌.కె.టాండన్‌ నేతృత్వంలో హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని…తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పౌరసత్వం పొందానని కమిటీ ముందు రమేశ్‌ తన వాదనలు వినిపించారు. వాదనలు విని, అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఆయన పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో 2017లో హోంశాఖ చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వాన్ని రద్దుచేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ రమేశ్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ కోర్టు ఈ ఏడాది జులైలో ఆదేశాలిచ్చింది.

హైకోర్టు ఆదేశాలతో 2019 అక్టోబర్‌31న ఇరు పక్షాలు తమ వాదనలను హోంశాఖ మందు వినిపించాయి. వాదనలు పరిగణనలోకి తీసుకొని హోంశాఖ చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దు చేస్తూ ఈనెల 20న 13 పేజీల ఉత్తర్వులిచ్చింది. పౌరసత్వం రద్దుపై  రమేశ్‌ తాజాగా మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ, చట్ట విరుద్ధమంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 10(3)లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలంటూ జూన్‌ 10న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోలేదన్నారు. కేంద్రం కంటి తుడుపు చర్యగా పరిశీలించి ఆలోచనారహితంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెన్నమనేని రమేశ్‌కు ఊరటనిస్తూ కేంద్రహోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

Courtesy Eenadu..

 

RELATED ARTICLES

Latest Updates