ఏకపక్షంగా ఎలక్టోరల్‌ బాండ్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యాయమంత్రిత్వశాఖ, సిఇసి అభ్యంతరాలు
అనుమతివ్వని ఆర్‌బిఐ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకంలో పాల్గొనేందుకు రాజకీయ పార్టీలు కనీసం 1 శాతం ఓటు షేరు సాధించి వుండాలన్న షరతుపై కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద ఒక కార్యకర్త అంజలీ భార్గవ్‌ సంపాదించిన పత్రాల ద్వారా తెలుస్తోంది. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థాయిల్లో రాజకీయ పార్టీలు కనీసం 6 శాతం ఓటు షేరు సాధించటాన్ని ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకం అర్హతా నిబంధనగా నిర్ణయించాలని, లేదా ఈ అర్హతా నిబంధనను పూర్తిగా తొలగించాలని న్యాయమంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు ఈ పత్రాల ద్వారా తెలుస్తోంది.

అదే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా ఈ ఓటు షేరు అర్హతా నిబంధన వివక్షాపూరితంగా వుందంటూ అభ్యంతరం వ్యక్తంచేసిందని ఈ పత్రాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తమను మాటమాత్రం కూడా సంప్రదించలేదని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే ఈ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోని ఆర్థిక మంత్రిత్వశాఖ మాత్రం కనీసం ఒక శాతం ఓటు షేరు సాధించిన రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు ఈ పథకంలో పాల్గొనే హక్కు వుందని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ వద్ద వున్న తాజా వివరాల ప్రకారం దేశంలో ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల స్థాయిలో 52 ప్రాంతీయ పార్టీలు, 2,487 గుర్తింపు పొందని పార్టీలు వున్నట్లు తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందేందుకు కనీసం 6 శాతం ఓట్లు సాధించాలన్న షరతు అమలులో వున్న విషయం తెలిసిందే. అయితే ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకం నిర్దేశించిన 1 శాతం ఓటింగ్‌ షేర్‌ను ఎన్ని గుర్తింపులేని పార్టీలు సాధించాయన్న అంశంపై స్పష్టత లేదు. 2017 ఫిబ్రవరిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ఈ పథకంపై జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ స్పందనను తెలియచేయాలని 2017 మేలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఆయా పార్టీలకు లేఖలు రాసింది.

దీనికి కేవలం నాలుగుపార్టీలు మాత్రమే స్పందించాయి. ఈ పథకం ముసాయిదా పత్రాలను తమకు అందచేయాలని కాంగ్రెస్‌ పార్టీ, బహుజన్‌ సమాజ్‌పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సిపిఐ), శిరోమణి అకాలీదళ్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాయి. కేవలం ‘రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలు’ మాత్రమే ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హులని కొన్ని ముసాయిదా పత్రాలలో పేర్కొనగా, పార్టీ జాతీయ లేదా ప్రాంతీయ పార్టీ అయివుండాలని మరి కొన్ని పత్రాలలో పేర్కొన్నట్లు ఆ ఏడాది జూన్‌లో భరద్వాజ్‌కు లభించిన స.హ స్పందన ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 5న 1 శాతం నిబంధనను తొలిసారిగా ఈ పథకం ముసాయిదాలో చేర్చారు. ఆగస్టు 21న జరిగిన భేటీలో ప్రధాని నరేంద్రమోడీ పరిశీలనకు ఈ ప్రతిపాదనను అందచేశారు. ఆ తరువాత అన్ని రాజకీయ, ప్రాంతీయ పార్టీలకు, ప్రజలకు వారి స్పందన కోసం పంపాల్సిన ఈ ప్రతిపాదనను తుంగలో తొక్కారు. అయితే సెప్టెంబర్‌ 22న కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎకె జోటి మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం కింద స్వతంత్ర అభ్యర్థులు కానీ, కొత్త రాజకీయ పార్టీలు కానీ విరాళాలు అందుకునే వెసులుబాటు లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కొంతమేర వివక్షాపూరితంగా వుందని, దీనిని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం వుందని హెచ్చ రించారు. డిసెంబర్‌లో ఈ ముసాయిదాను మరోసారి పరిశీలించిన న్యాయమంత్రిత్వశాఖ ఆరుశాతం ఓటు షేరు నిబంధనను సవరించాలని, దీనిని ప్రజాప్రాతినిధ్య చట్టంతో అనుసంధానించాలని సూచించింది. కనీసం ఒక శాతం ఓటు షేరు సాధించిన పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు అందుకునే అర్హత కల్పించటం పాలనాపరంగా తీవ్ర సమస్యలను సృష్టించటంతో పాటు ఎలక్టోరల్‌ బాండ్ల జారీ పర్యవేక్షణ కూడా కష్టసాధ్యమవుతుందని న్యాయమంత్రిత్వశాఖ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆర్దిక వ్యవహారాల కార్యదర్శి 1 శాతం ఓటు షేరు నిబంధనను కొనసాగించి తీరాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎంత మొత్తం విరాళాలనయినా స్వీకరించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ 1 శాతం ఓటు షేరు నిబంధన చట్ట నిబంధనను కాలరాస్తుందని న్యాయమంత్రిత్వశాఖ కేంద్రానికి రాసిన లేఖలో వివరణ ఇచ్చింది. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ నిబంధనపై తమ మంత్రిత్వశాఖ పట్టును మరోసారి గుర్తు చేయటంతో న్యాయమంత్రిత్వశాఖ ఈ ముసాయిదాను క్లియర్‌ చేసి ఆర్థిక మంత్రిత్వశాఖ ‘విధాన నిర్ణయం’ మేరకు తాము ఆమోదిస్తున్నట్లు తెలియచేసింది.

ఆర్‌బిఐ అనుమతి లేదు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అట్టహాసంగా ప్రకటించిన ఈ ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంకు అనుమతి లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బిఐకి మధ్య జరిగిన లేఖాయణం ద్వారా తెలుస్తోంది. ఆర్‌బిఐ అనుమతించనప్పటికీ, ‘పరోక్ష అనుమతి’ లభించిందంటూ ప్రభుత్వం దీనిని అమలులోకి తెచ్చింది. ఈ బాండ్లజారీకి రిజర్వ్‌ బ్యాంకు కాక ఇతర వ్యవస్థలను అనుమతించాలన్న ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పటి ఆర్‌బిఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ 2017 సెప్టెంబర్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. సాధారణ కరెన్సీ తరహాలో వుండే ఈ బాండ్లను బేరర్‌ బాండ్ల రూపంలో జారీ చేస్తే రిస్క్‌ వుంటుందని ఆయన హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ఈ పథకంపై ప్రతికూల ప్రభావాన్ని చూపటంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బిఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాండ్లను కేవలం డిజిటల్‌ రూపంలో మాత్రమే జారీ చేయాలని ఆయన పలుమార్లు సూచించారు. అయితే ఈ సూచనను తిరస్కరించిన ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్‌ రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతల పేర్లను గోప్యంగా వుంచాలన్న ఈ పథకం ప్రధానోద్దేశాన్ని ఇది దెబ్బతీస్తుందని తన జవాబులో పేర్కొన్నారు. దీనిపై ఆర్‌బిఐ గవర్నర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్యాంకు సూచనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా అది బ్యాంకు సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన తన జవాబులో స్పష్టం చేశారు. అయితే ఆర్‌బిఐ అభ్యంతరాలను తాము గమనించామని, ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నదని గార్గ్‌ తన జవాబులో పటేల్‌కు వివరించారు. రిజర్వ్‌ బ్యాంకు సమ్మతి లేకుండానే ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ పథకం అమలుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం వత్తిడి తెచ్చినట్లు స.హ పత్రాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం ఎలక్టోరల్‌ బాండ్లను స్క్రిప్‌ల రూపంలో స్టేట్‌ బ్యాంకు ద్వారా జారీ చేయాలని భావిస్తే ఆర్‌బిఐ అందుకు అనుమతించి తీరాల్సిందేనని ఆ ఏడాది అక్టోబర్‌ 11న జరిగిన ఆర్‌బిఐ కేంద్ర బోర్డు కమిటీ మినిట్స్‌లో పొందుపర్చిన అంశాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి గార్గ్‌ తన జవాబులో ప్రస్తావించారు. దీనిని ఆర్‌బిఐ పరోక్ష సమ్మతిగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత న్యాయమంత్రిత్వశాఖకు చెందిన శాసన వ్యవహారాల విభాగం (డిఎల్‌ఎ) ఆర్‌బిఐ అనుమతి కోరే ప్రక్రియను విరమించుకుని స్టేట్‌ బ్యాంకు సహకారాన్ని కోరింది. ఈ బాండ్ల జారీకి తమకు అయ్యే వ్యయాన్ని తిరిగి చెల్లించాలంటూ స్టేట్‌ బ్యాంకు చేసిన విజ్ఞప్తిని డిఎల్‌ఎ పక్కన పెట్టింది. అయితే స్టేట్‌ బ్యాంక్‌ దీనిపై పట్టుపడుతుండటం వల్ల దీనిని తాము పరిశీలిస్తామని ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన బడ్జెట్‌ విభాగం వెల్లడించింది.

RELATED ARTICLES

Latest Updates