కశ్మీర్‌లో మౌన ప్రళయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అధికరణ 370 రద్దుతో విశాల భారతావనికి కశ్మీర్ మరింతగా సన్నిహితమవ్వ లేదు. సన్నిహితమవ్వక పోగా రెండిటి మధ్య ఒక ప్రగాఢ, బహుశా పూడ్చలేని, భావోద్వేగ అగాధం ఏర్పడింది. కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయం పూర్తిగా భారత్‌కు ప్రతికూలంగా మారిపోయి పాకిస్థాన్ వైపు మొగ్గుతోంది; మితవాద రాజకీయాల నుంచి వేర్పాటు వాదానికి మద్దతుగా మారుతోంది; కశ్మీరీ అస్తిత్వం నుంచి ఇస్లామిక్ అస్తిత్వానికి ఆరాటంగా రూపొందుతోంది. జాతీయ సమగ్రత, సమైక్యత పటిష్ఠం కాకపోగా న్యూఢిల్లీ అనుసరిస్తోన్న కొత్త కశ్మీర్ విధానం భారతదేశపు జాతీయ ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా పరిణమిస్తోంది.

కశ్మీర్‌లో పరిస్థితులు ఎలా వున్నాయి? అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ప్రతినిధుల బృందంతో కలిసి నేను మూడు రోజులు (నవంబర్ 13-–15 తేదీల్లో) కశ్మీర్ లోయలో పర్యటించాను. ఆపిల్ పండ్ల సాగుదారుల వెతలు విని, వారి పంటకు సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకే నేను ప్రధానంగా కశ్మీర్‌లో పర్యటించాను. అయితే ఆపిల్ ఫలాల గురించి చర్చించడానికి మాత్రమే కశ్మీరీలు పరిమితమవ్వలేదు. ఈ ఏడాది ఆగస్టు 5 అనంతరం వారి మాటా మంతీ పూర్తిగా మారిపోయింది. కశ్మీరీలు ఎప్పుడూ రాజకీయాల గురించి సమగ్ర, నిశిత అవగాహనతో మాట్లాడే చైతన్యపరులు. సొంత అభిప్రాయాలను సొగసుగా, సూటిగా చెప్పగల ప్రజ్ఞ వారి సొంతం. ఈసారి, 370 రద్దు అనంతర మొదటి వంద రోజులలో తమ అనుభవాలను వివరించడానికి వారు చాలా ఉత్సుకత చూపారు.- తాము విశ్వసించిన వారికే సుమా. చెవులు నిక్కబొడుచుకుని వారు చెప్పినవన్నీ సావధానంగా విన్నాను.

సామాన్య కశ్మీరీలు అధికరణ 370 రద్దు గురించి బాధపడడం గానీ, రద్దు అనంతర ‘ఏకీకరణ’ను ఆమోదిస్తున్నారని గానీ భావిస్తే మీరు పొరపడినట్టే. కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ మాట్లాడినవారు నాకు ఒక్కరూ తటస్థించలేదు. కశ్మీర్ లోయలో నివశిస్తున్న కశ్మీరీలలో, కేంద్ర ప్రభుత్వ కొత్త కశ్మీర్

విధానాన్ని సమర్థిస్తున్న ఏ ఒక్క వ్యక్తి గురించైనా మీకు తెలుసా అని నా స్నేహితులను అడిగాను. అడిగీ అడగక ముందే వారి నుంచి సమాధానం వచ్చింది: ‘కోయి గధా భీ సపోర్ట్ నహీ కరేగా’ (ఒక్క గాడిద కూడా ఆ విధానానికి మద్దతునివ్వడం లేదు). అది వారి నిశ్చితాభిప్రాయం. ఎలాంటి మినహాయింపులు లేకుండా వ్యక్తం చేశారని నేను భావించాను.

కశ్మీర్ లోయలో ఇప్పటికీ నివసిస్తున్న కొద్ది మంది పండిట్ లతో మాట్లాడాలని నేను ఆరాటపడ్డాను. అయితే, వారి అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోలేక పోయాను. మా స్థానిక ఆతిథేయి ఒక కశ్మీరీ పండిటే. అయితే ఆయన సంపూర్ణ లౌకికవాది, ఉదార వాది. సొంత సామాజిక వర్గం మనోభావాలను ఆయన అభిప్రాయాలు ప్రతిబింబించేవి కావు.

అధికరణ 370 రద్దుతో జమ్మూ-కశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి సానుకూల పరిస్థితులు నెలకొన్నాయన్న అధికార వర్గాల వాదనతో ఏకీభవిస్తున్న వారు ఒక్కరూ నాకు కన్పించనే లేదు. కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కూడా సంభాషించాను సౌమ్యుడైన యువ వ్యాపారవేత్త ఫాహీమ్ మా సంభాషణలను ఇలా సంగ్రహించాడు: ‘ఎవరి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారో మాకు తెలియడం లేదు. సమాచార వ్యవస్థలను మూసివేశారు. ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పోయింది. వ్యాపారాలు జరగడం లేదు. అయినా మేము మా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నాము. బ్యాంకులకు వడ్డీలు చెల్లి స్తున్నాము.

రుణాల వసూళ్ళు కొనసాగుతున్నాయి. కేంద్రం చెబుతున్న పెట్టుబడులు ఎక్కడ? ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి చర్చల్లోనూ మేము భాగస్వాములుగా లేము. ఇప్పుడే కాదు, రాబోయే ఇరవై ఏళ్ళ దాకా మా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు ఏవీ కన్పించడం లేదు’. అధికరణ 370 రద్దు అనంతరం మొదటి వంద రోజుల్లో కశ్మీర్ లోయలో ప్రకటిత లక్ష్యాలకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు మాత్రమే సిద్ధించాయి. అధికరణ 370 రద్దుతో విశాల భారతావనికి కశ్మీర్ మరింతగా సన్నిహితమవ్వ లేదు. సన్నిహితమవ్వక పోగా రెండిటి మధ్య ఒక ప్రగాఢ, బహుశా పూడ్చలేని, భావోద్వేగ అగాధం ఏర్పడింది.

కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయం పూర్తిగా భారత్‌కు ప్రతికూలంగా మారిపోయి పాకిస్థాన్ వైపు మొగ్గుతోంది; మితవాద రాజకీయాల నుంచి వేర్పాటు వాదానికి మద్దతుగా మారుతోంది; కశ్మీరీ అస్తిత్వం నుంచి ఇస్లామిక్ అస్తిత్వానికి ఆరాటంగా రూపొందుతోంది. జాతీయ సమగ్రత, సమైక్యత పటిష్ఠం కాకపోగా న్యూఢిల్లీ అనుసరిస్తోన్న కొత్త కశ్మీర్ విధానం భారతదేశపు జాతీయ ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా పరిణమిస్తోంది.

అధికరణ 370 రద్దుకు పూర్వం కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయం మధ్యే మార్గస్థులు లేదా వేర్పాటువాదులకు అనుకూలంగా వుండేది ప్రధాన స్రవంతి రాజకీయాలలో అబ్దుల్లా కుటుంబం భారత్‌కు అనుకూలంగా ఉండేది. మెహబూబా ముఫ్తీ అప్పుడప్పుడూ భారత్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ వేర్పాటువాదానికి మద్దతు నిచ్చే వారు కాదు. కరడుగట్టిన మిత వాద రాజకీయాలకు ప్రతినిధి అయిన హురియత్ ఆజాదీని డిమాండ్ చేసేది. లేదంటే పాకిస్థాన్ అనుకూల వైఖరి వహించేది. కశ్మీర్ లోయలో స్పష్టంగా కన్పిస్తున్న ఆగస్టు 5 ప్రభావం ఏమిటంటే అబ్దుల్లాలు, ముఫ్తీల పట్ల సానుకూల వైఖరులు పూర్తిగా తడిచి పెట్టుకుపోవడమే. ఫరూక్ అబ్దుల్లా జాతీయ టీవీలో కన్పించి అధికరణ 370 రద్దు పట్ల కన్నీటి పర్యంత మయ్యారు. అయితే ఎవరూ ఆయన పట్ల ఏ మాత్రం సానుభూతి చూపలేదు. ‘శని వదిలిపోయింది’ అన్నదే, ప్రధాన స్రవంతి రాజకీయవేత్తల పట్ల కశ్మీర్ లోయలో ప్రజల మనోభావంగా ఉన్నది.

న్యూఢిల్లీతో సంబంధాలను నెలకొల్పుకున్న వ్యక్తులను, ఉదాహరణకు, బ్లాక్ డెవలె‍‍ప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన వారు,- ‘తొత్తులు’గా కశ్మీరీలు ఈసడిస్తున్నారు. ఒక చిన్న పట్టణంలోని ఉపాధ్యాయుడు ఒకరు నాతో ఇలా అన్నారు: ‘ప్రొఫెసర్ సాహిబ్, నేను మీ వ్యాసాలను చదువుతుంటాను. భారత్ భావన గురించి మా విద్యార్థులకు చెప్పుతుంటాను. ఇప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?’. ఆయన ప్రశ్నకు నేను సమాధానమివ్వలేక పోయాను. నా పాత స్నేహితుడు ప్రొఫెసర్ ధర్ ఇలా అన్నారు: ‘ఖాన్‌లు, పఠాన్‌ల కంటే హిందుస్థానీలు చాలా మెరుగైన వారు, మంచివారని కశ్మీరీలు అనుకునేవారు. అయితే ఇప్పుడు…’ అంటూ ఆగిపోయి, సుదూర కొండలపై చూపులు సారించి మెల్లిగా గొణిగారు.. ‘ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళాను. ఆగస్టు 5 అనంతరం వెళ్ళినప్పుడు ఏదో ఒక విదేశానికి వెళ్ళానన్న భావన కలిగింది’.

ధికరణ 370 రద్దు తమ ఉమ్మడి అస్తిత్వంపై దాడిగా కశ్మీరీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ పండ్ల సాగుదార్లకు సంభవించిన నష్టాల గురించి చర్చిస్తున్నప్పుడు జమీల్ అనే యువరైతు ఇలా ప్రశ్నించాడు: ‘ప్రతి సారీ మమ్ములను మోసం చేయడం మినహా భారత్ మాకు ఏమి ఇచ్చింది?’. ఇర్ఫాన్ అనే మరో యువ రైతు తన ముకుళిత హస్తాలతో ఇలా అన్నాడు: ‘ఆప్ హమే చోడ్ క్యోం నహీ దేతే’ (మమ్ములను మీరు ఎందుకు వదిలివేయరు?)

..ఎందుకు అలా అడుగుతున్నావని ప్రశ్నించగా ఇలా ప్రతిస్పందించాడు:

‘మై అప్నా సీనా చీర్ కర్ కైసే దిఖావూ కీ కిత్నా దర్ద్ హై (నా గుండెను చీల్చి నా బాధను మీకు ఎలా చూపగలను?) కశ్మీరీలలో గూడుకట్టుకు పోయిన ఈ బాధే, ప్రప్రథమంగా వారిని విశాల భారతావనిలోని మిగతా ముస్లిములకు సన్నిహితులను చేసింది. అంతకుముందు కశ్మీరీ, భారతీయ ముస్లిముల మధ్య సంబంధాలు పరస్పర అజ్ఞానం, ఉదాసీనత, తిరస్కార భావంతో కూడుకుని వుండేవి. అయితే కశ్మీరీ ముస్లిములు ఇప్పుడు తాము కశ్మీరీలవ్వడం వల్లే గాక, ముస్లిములయినందు వల్ల కూడా అణచివేతకు గురవుతున్నామని విశ్వసిస్తున్నారు.

కశ్మీరీలు ఇప్పుడు నరేంద్ర మోదీ గురించి అంతగా మాట్లాడటం లేదు. అమిత్ షా, భారత రాజ్య వ్యవస్థ కొత్త ముఖంగా పరిగణన పొందుతున్నారు. అమిత్ షా వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ గురించి యువ కశ్మీరీలు మాట్లాడుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రే ఎక్కువగా వారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగపు వీడియోను యువ కశ్మీరీలు పదే పదే చూస్తున్నారు. ఆ ప్రసంగంలో హిందూత్వ, కశ్మీర్ గురించి ఇమ్రాన్ పలు ప్రస్తావనలు చేశారు. ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ పెన్-డ్రైవ్‌లు, బ్లూ టూత్‌ల ద్వారా ఆ వీడియో విస్తృత ప్రచారంలో వున్నది.

అధికరణ 370 రద్దుతో కశ్మీరీలు మిలిటెంట్ల వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారా? ఈ ప్రశ్నకు నేను సమాధానమివ్వలేను. స్పష్టమైన సమాధానమివ్వడానికి అవసరమైన సమాచారం నాకు అందుబాటులో లేదు. గత మూడు దశాబ్దాలుగా కశ్మీరీలు భయానకమైన హింసాకాండను చూశారు. హింసను గురించిన కాల్పనిక భావావేశాలు వారికేమీ లేవు. ఇటీవల కశ్మీర్ లోయలో ఇతర భారతీయ రాష్ట్రాలకు చెందిన కూలీలు, ట్రక్ డ్రైవర్లను మిలిటెంట్లు హతమార్చడాన్ని, నేను మాట్లాడిన ప్రతి కశ్మీరీ తీవ్రంగా ఖండించాడు. అనివార్యంగా సంభవించనున్న దాన్ని అంగీకరించడమే శ్రేయస్కరమని చాలా మంది భావిస్తున్నారు. మా డ్రైవర్ అఖ్తర్ ఇలా అన్నాడు: ‘మా కశ్మీరీలం ఏమి చేయగలం? కశ్మీర్ లోయలో ఉన్న వారందరి కంటే మిగతా భారతదేశంలోని ఒక జిల్లాలో ఉన్న జనాభాయే ఎక్కువ’.

డబ్బుకు ప్రలోభపడుతున్నవారే మిలిటెంట్ కార్యకలాపాలు, రాళ్ళు రువ్వడం మొదలైన చర్యలకు పాల్పడుతున్నారన్న మాటకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘ఇది అర్థరహితమైన వాదన. గుప్పెడు డబ్బుల కోసం బుల్లెట్లను ఎదుర్కోవడానికి ఎవరు సిద్ధమవుతారు?’ అని ఎదురు ప్రశ్నించారు. వారి మాటల్లో మిలిటెంట్ల పట్ల కించిత్ సానుభూతి ధ్వనించిందనే భావన నాకు కలగక పోలేదు. అయితే ఆ సానుభూతి ఎంతవరకు నిజమో నేను చెప్పలేను.

కరీం అనే స్నేహితుడు ఇలా అన్నాడు: ‘ఆగస్టు 5తో భారతదేశపు ఉదారవాద ప్రజాస్వామ్యం గురించిన మా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి మేము కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని మీలాంటి వారు అనుకోవచ్చు గానీ నిజానికి మేము భారత దేశాన్నే వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు అధికరణలు 370, 35ఎ గురించి ఎవ్వరూ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మా చరిత్ర గమనం ఇప్పుడు ఆజాదీ లక్ష్యం నుంచి పాకిస్థాన్ దిశగా సాగుతోంది’. కరీం ఇంకా ఇలా అన్నాడు: ‘మీ లాంటి ఉదారవాదులను నేను ఎలా విశ్వసించాలి? అమెరికాలో ఉదారవాదులు వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకించినప్పుడు నిర్బంధ సైనిక శిక్షణను కూడా తిరస్కరించి అందుకు తగు మూల్యం చెల్లించుకున్నారు.

మీరు ఉగ్రవాదులుగా దుయ్య బడుతున్న పాకిస్థానీ జిహాదీలు ఇక్కడకు వచ్చి మా కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. మరి మీ భారతీయ ఉదారవాదులలో ఎంత మంది మా కోసం కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు?’ కరీం ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు.

ఇప్పుడు కశ్మీర్ లోయను తుఫాను ముందరి ప్రశాంతత ఆవరించివున్నది. ప్రతి వీధిలోనూ భద్రతా దళాలను మోహరించారు. బహిరంగ నిరసనలకు ఎలాంటి ఆస్కారం లేదు. సామాన్య ప్రజలకు నాయకులు ఎవ్వరూ అందుబాటులో లేరు. కశ్మీరీల మనస్సులు కోపంతో రగిలి పోతున్నాయి. పర్యవసానాలేమిటి? నా కశ్మీరీ స్నేహితుడు ఒకరు ఇలా సమాధానమిచ్చారు: ‘కుటుంబంలో ఒకరు చనిపోయినప్పుడు ఆప్తులు బాధతో ఏడ్వలేకపోతున్నారు. ఆగస్టు 5 అనంతరం కశ్మీర్‌లో పరిస్థితి ఇది. సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నదో ఈ పరిస్థితి స్పష్టం చేయడం లేదా? బిగ్గరగా రోదించినా, నిరసన తెలిపినా ఏదో ఒక విధంగా సాధారణ పరిస్థితులు తిరిగిరావచ్చు. అయితే ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండిపోతున్నారు. ఈ మౌనం రానున్న ప్రళయానికి సూచన. సందేహం లేదు. ఈ శీతాకాలం ముగిసేవరకు వేచి చూడండి’.

యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

RELATED ARTICLES

Latest Updates