విమర్శిస్తున్నందుకేనా ఈ వేధింపు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి వ్యతిరేక వార్త మీద కేసులు పెట్టమని శాఖాధిపతులను కూడా ప్రభుత్వం పురమాయిస్తోంది. ఏమి కేసులు పెడతారో మరి, పరువునష్టాలో, క్రిమినల్‌ కేసులో, తెలియదు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా నక్సలైట్‌ కేసులే పెట్టి నోళ్లు నొక్కేయాలని చూస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు దారి చూపిస్తున్నది. ఆలోచనలను బతకనివ్వండి, వాటిని వ్యాపించనివ్వండి. తెలంగాణ కూడా ఒకనాడు ఆలోచనే. అది వ్యాప్తి చెందిన తరువాతనే ఒక ఉద్యమమైంది. ఆ చరిత్ర మరచిపోయి, ఆలోచనా రంగంలో పనిచేస్తున్నవారికి సంకెళ్లు బిగించాలనుకోవడం తప్పు. చాలా పెద్ద తప్పు. వెంటనే సరిదిద్దుకోండి.

టెర్రరిజం తుపాకులతో రాదు, ఆలోచనలతో వస్తుంది. కాబట్టి, సిఆర్‌పిఎఫ్‌ అటవీ, గ్రామీణ ప్రాంతాలలోని వామపక్ష తీవ్రవాదులనే కాక, అర్బన్‌ నక్సలైట్ల పని కూడా పట్టాలి– అంటూ కేంద్ర హోంమంత్రి ఆ మధ్య ఈ కేంద్రసాయుధ బలగాల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒక సందేశం ఇచ్చారు. హింసను హింసతో చర్యను చర్యతో ఎదుర్కొంటారనుకుందాం, మరి ఆలోచనలను కూడా బలప్రయోగంతోనే ఎదుర్కొనాలా? ఆలోచనలను ఆలోచనలతోనే ఎదుర్కొనాలి, రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనాలి– అని గతంలో పెద్దలు చెబుతుండేవారు.

కేంద్ర హోంమంత్రి కానీ, సాక్షాత్తూ ఈ దేశ ప్రధానమంత్రి కానీ, గోల్వాల్కర్‌గారి ‘‘ఆలోచనల గుచ్ఛం’’ నుంచి ప్రేరణ పొందినవారు. తాము కోరుకున్న భారతదేశాన్ని నిర్మించడం కోసం ఆలోచనలను బలంగా వ్యాపింపజేసి, వాటిని ఆచరణలోకి తెచ్చి, వాటి విజయాలను ప్రత్యక్షంగా చూస్తున్నవారు. మరి వారి ఆలోచనలను ఎవరైనా బలప్రయోగంతో అణచిపెట్టి ఉంటే, వారి పరిస్థితి ఎట్లా ఉండేది?

దేశాన్ని తాము అనుకున్న పద్ధతికి మార్చాలని ఆలోచన ఉన్నవారందరికీ ఉంటుంది. యథాతథ స్థితి నచ్చకపోవడం, దాన్ని మరమ్మత్తు చేయడమో, సమూలంగా మార్చడమో చేయాలనుకోవడం సహజం. అయితే, ప్రస్తుత స్థితిలోని ఏది ఎందువల్ల నచ్చలేదు, దేన్ని ఎట్లా మార్చాలి– అన్న అంశాల మీద భిన్నమయిన అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని ఆయా మార్గాల సాధకులు ప్రచారం చేయడం, ప్రజలను ఏదో ఆచరణకు ప్రేరేపించడం– ఒక ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో భిన్న భావాలు, ప్రక్రియలు కూడా పక్కపక్కన సహజీవనం చేస్తాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకుంటారు. ప్రయోజనాల ఘర్షణ వచ్చినప్పుడు ప్రజాస్వామిక పద్ధతులలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు.

అధికారంలో ఉండే పక్షమైనా అంతే, తన ప్రతిపక్షాలను అది మనుగడ సాగించనివ్వాలి, అనేక రకాల అభిప్రాయాలను ప్రచారం చేసే స్వేచ్ఛ ఇవ్వాలి. భావాలకు భావాలతో సమాధానం ఇవ్వాలి. మరి, కొన్ని రకాల భావాలు అశాంతి కలిగిస్తేనో, చట్టాన్ని ఉల్లంఘిస్తేనో? ఎక్కడైతే చట్టం ఉల్లంఘనకు ఆస్కారం ఉంటుందో అప్పుడు చట్టం చెప్పినట్టు వ్యవహరించవలసిందే. చట్టం చెప్పినట్టే కాఠిన్యాన్ని, చట్టం చెప్పినట్టే ఔదార్యాన్ని, చట్టం చెప్పినట్టే నియమపాలనను ప్రభుత్వం కూడా చేయవలసి ఉంటుంది. ఎన్నికల ద్వారా ప్రధానరాజకీయ క్షేత్రంలో ఉంటున్న కమ్యూనిస్టులైనా, మావోయిస్టులని పిలుస్తున్న విప్లవకమ్యూనిస్టులైనా, ఇతర సాయుధ, మిలిటెంట్‌ సంస్థలైనా, వారు చట్టం లోపల వ్యవహరిస్తున్నంత వరకు వారి పనులకు ఏ రాజ్యమూ అడ్డుపడకూడదు. వారు ఏదైనా ఉల్లంఘనకు పాల్పడినప్పుడు చట్టప్రకారం చర్య తీసుకోవడాన్ని ఆయా సంస్థలు కూడా తప్పుపట్టకూడడు. సమాజాన్ని సంస్కరించడమో, మరమ్మత్తు చేయాలనుకోవడమో ఆలోచనలుగా తప్పు కావు, వాటి ప్రచారం తప్పు కాదు. సమాజాన్ని ఆ ఆలోచనలకు అనుగుణంగా విశ్లేషించి మంచిచెడ్డలు చెప్పడం తప్పు కాదు.

అటువంటి విశ్లేషణలను విని, చదివి, తెలుసుకుని ప్రభుత్వాల మీదనో, వ్యవస్థల మీదనో వెగటు, వ్యతిరేకత, అసహనం పెంచుకుంటే, దానికి ఆ ఆలోచనల బాధ్యత ఉండదు. ఉన్న పరిస్థితులదే బాధ్యత. గత ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ ప్రధాన రాజకీయాల వైఫల్యమే, తీవ్రవాదం కానీ, ఉగ్రవాదం కానీ. రాజకీయనేతలు తమ స్వార్థం వల్లనో, అసమర్థత వల్లనో, దాస్యబుద్ధుల వల్లనో దేశాన్ని పరాధీనమూ దీనమూ చేసి, అందువల్ల వచ్చే అశాంతిని పరిష్కరించమని మాత్రం పోలీసులను, సేనలను పురమాయిస్తారు. మూలంలోనే చెదపట్టిన వ్యవస్థను వారు ఎంతకని కాపాడగలరు?

ఆలోచనలతో కూడా యుద్ధం చేయాలని తలపెట్టిన ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఆదివాసుల పక్షాన, మైనారిటీల పక్షాన, దళితుల పక్షాన మాట్లాడేవాళ్లను, రచయితలను, న్యాయవాదులను, హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసి, వారికి బెయిల్‌ కూడా దొరక్కుండా చేయగలుగుతున్నాయి. అటువంటి మనుషులను జైళ్లలో పెట్టి కూడా, ఈ పెద్ద మనుషులు ఎట్లా ప్రపంచంలో తలెత్తుకుని తిరగగలుగుతున్నారో ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పార్టీ నేతలను, అవినీతి ఆరోపణలున్నవారిని ఎంత కక్షతో జైళ్లలో ఉంచుతున్నారో, అంతకుమించిన పట్టుదలతో ఈ బికారి నిస్సహాయ మేధావులను కూడా బంధిస్తున్నారు. వికలాంగుడు, అనారోగ్య పీడితుడు అయిన ఒక ప్రొఫెసర్‌ జైలులో కనీస చికిత్సను సాధించుకోవడం అసాధ్యమవుతున్నది.

కొన్ని కొన్ని అంశాల్లో రాష్ట్రాల మీద కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుందో, రాష్ట్రాలే అత్యుత్సాహం ప్రదర్శిస్తాయో తెలియదు కానీ, కేంద్రం ఒక నల్లచట్టానికి కొత్త కోరలు తొడగగానే దాన్ని వెంటనే అమలుచేయడానికి కొన్ని రాష్ట్రాలు ఉబలాటపడుతున్నాయి. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు వాటిలో చెప్పుకోదగ్గవి. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలు 43 శాతం తగ్గిపోయాయని ఒకవైపు చెబుతారు. తెలంగాణలో అయితే వామపక్ష తీవ్రవాదాన్ని సరిహద్దులకు ఆవలనే నిలిపివేశామని చెప్పుకుంటారు. మరి, ఎందుకని గుప్పెడు మంది యువకులమీద, కార్యకర్తలమీద ‘ఊపా’ లాంటి చట్టం ప్రయోగిస్తారు? తెలంగాణలో అయితే వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు తప్ప ప్రజాసమస్యల మీద వీధుల్లోకి వచ్చి గట్టిగా గొంతెత్తగలిగే వారే కనిపించడం లేదు. వారిని కూడా మూసేసి, శాంతి సాధించాలనా? ఏలికల ఆలోచనలేమిటో అర్థం కాదు.

సాయుధ, అజ్ఞాత కార్యకలాపాలను నిరుత్సాహపరచడం వారి ఉద్దేశ్యమైతే, బహిరంగ రాజకీయ కార్యాచరణను అనుమతించి, ప్రోత్సహించాలి కదా? ఒకనాడు అజ్ఞాత జీవితంలో పనిచేసి, బయటకు వచ్చి సాధారణ జీవితంలో ఉంటూ, బౌద్ధిక రంగంలో పనిచేస్తున్నవారిని వేధించడం ఎందుకు? ఆలోచనలను నిర్బంధచర్యల ద్వారా చంపగలమా? ఏ ఆలోచనలయినా, వాటిలో అసంబద్ధత ఉంటే, లేదా ఆచరణలో విఫలమైతే అవే పరాజితమవుతాయి, అప్పుడే ఓడిపోతాయి. అంతే తప్ప, బహిరంగ జీవితంలో ఉంటూ, ప్రజల నిత్యజీవన సమస్యల మీద పోరాడేవారిని ఏవేవో నిరాధార సంబంధాలు అంటగట్టి, జైళ్లలోకి నెడితే ఫలితం ఉంటుందా? ప్రభుత్వ నిర్దేశాలకు పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం కూడా తోడవుతే, బుద్ధిజీవులతో జైళ్లు కిటకిట లాడతాయి. ఇక సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, ఆలోచనాత్మక ఆచరణ– ఎక్కడినుంచి వస్తాయి?

మిత్రుడు, ‘వీక్షణం’ మాస పత్రిక సంపాదకుడు ఎన్‌. వేణుగోపాల్‌ను ఒక ‘ఊపా’ కేసులో నిందితుడిగా చేర్చడం తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికతకు పరాకాష్ఠ అని చెప్పాలి. ఇంగ్లీషులో ‘ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’, ‘సెమినార్‌’, ‘ఫ్రాంటియర్‌’ వంటి పత్రికల కోవన చేర్చదగ్గ తెలుగు పత్రిక ‘వీక్షణం’. ప్రఖ్యాత పాత్రికేయులు, ఆర్థిక విశ్లేషకులు కీర్తిశేషులు వి.హనుమంతరావు స్థాపించిన పత్రిక అది. అభివృద్ధిక్రమాన్ని, విధానాలను, సామాజికార్థిక అంశాలను లోతుగా, విద్యాస్థాయిలో విశ్లేషిస్తూ తెలుగునాట వామపక్ష, విప్లవ, దళిత, ప్రజాతంత్ర వర్గాలన్నిటికీ వేదికగా ఉంటున్నది. వీక్షణమూ దాని సంపాదకుడూ కూడా తెలంగాణ ఉద్యమానికి అపారమైన దోహదం చేసినవారు. ఉద్యమంలో పనిచేసినవారికి, ప్రతిపక్షాల్లో ఉండినవారికి, అధికారంలో ఉన్నవారికి కూడా కావలసిన ఆర్థిక విశ్లేషణలు, నేపథ్యవివరణలు వేణుగోపాల్‌, పత్రికద్వారానూ, ఇతరత్రానూ కూడా అందించినవాడు. వేలాది సభల్లో ప్రసంగించి, వందలాది వ్యాసాలు,

పదులసంఖ్యలో పుస్తకాలు రాసిన నిత్యఅక్షర క్రియాశీలిని అజ్ఞాత సంస్థలతో ముడిపెట్టి అభియోగాలు మోపడం దుస్సాహసం. ఏ ఒక్క ఆధారమైనా చూపగలరా, అతనిని నిందితుడిగా నిలబెట్టగలిగేది? వివిధ పత్రికలలో తెలంగాణ ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తున్నందుకే కదా, ఈ కేసులు, వేధింపులు?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి వ్యతిరేక వార్త మీద కేసులు పెట్టమని శాఖాధిపతులను కూడా ప్రభుత్వం పురమాయిస్తోంది. ఏమి కేసులు పెడతారో మరి, పరువునష్టాలో, క్రిమినల్‌ కేసులో, తెలియదు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా నక్సలైట్‌ కేసులే పెట్టి నోళ్లు నొక్కేయాలని చూస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు దారి చూపిస్తున్నది.

ఆలోచనలను బతకనివ్వండి, వాటిని వ్యాపించనివ్వండి. తెలంగాణ కూడా ఒకనాడు ఆలోచనే. అది వ్యాప్తి చెందిన తరువాతనే ఒక ఉద్యమమైంది. ఆ చరిత్ర మరచిపోయి, ఆలోచనా రంగంలో పనిచేస్తున్నవారికి సంకెళ్లు బిగించాలనుకోవడం తప్పు. చాలా పెద్ద తప్పు. వెంటనే సరిదిద్దుకోండి.

కె. శ్రీనివాస్

RELATED ARTICLES

Latest Updates