ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • నిజం దాచినందుకే.. కేంద్ర హోంశాఖ నిర్ణయం
  • టీఆర్‌ఎస్‌లో అయోమయం
  • కాంగ్రెస్‌ నేతల సంబరం
  • హైకోర్టును ఆశ్రయిస్తా: రమేశ్‌
  • నిజం దాగదు: పిటిషనర్‌ శ్రీనివాస్‌

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన మోసపూరితంగా తప్పుడు పత్రాలను సమర్పించి పౌరసత్వం పొందారని స్పష్టం చేసింది. తప్పుడు మార్గంలో చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వం పొందారంటూ కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ చేసిన ఫిర్యాదుపై చాలాకాలంగా కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఇరువురి వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో హోంశాఖ ఇద్దరి వాదనలు విని బుధవారం నిర్ణయం ప్రకటించింది.

విదేశీ పర్యటనకు సంబంధించి రమేశ్‌ తప్పుడు సమాచారం అందించారని తేల్చింది. దాంతో ఆయన భారత పౌరసత్వానికి అర్హత కోల్పోయారని తెలిపింది. పౌరసత్వ చట్టంలోని 10(2), 10(3) నిబంధనలను పరిగణనలోకి తీసుకుంది. 5(1)(ఎఫ్‌) కింద పౌరసత్వ దరఖాస్తు చేసుకున్న తేదీకి ముందు రమేశ్‌ తన విదేశీ పర్యటనల గురించి తప్పుడుసమాచారం ఇవ్వడమే కాకుండా వాస్తవాలను దాచిపెట్టారని అభిప్రాయపడింది. ఆయన తన పౌరసత్వాన్ని తప్పుడు, బూటకపు సమాచారం, వాస్తవాలను కప్పిపుచ్చడం ద్వారా సాధించారని, అందుకు చట్టంలోని సెక్షన్‌ 10(2) కింద శిక్షార్హులవుతారని స్పష్టం చేసింది. ఈ చర్య వల్ల ఆయన భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అనర్హులవుతారని పేర్కొంది.

పరిశీలనలోకి తీసుకున్న అంశాలు
1.చెన్నమనేని రమేశ్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు నేరపూరిత నేపథ్యం లేదు. ఆయనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు.

2.ఆయన వాస్తవాలను దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల తొలుత భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ఏడాది ముందు వరకు ఆయన దేశంలో నివసించలేదని నిజం చెబితే మా శాఖలోని సంబంధిత వర్గాలు ఆయనకు పౌరసత్వం ఇచ్చేవి కాదు.

3.రమేశ్‌ సమాచారం అందించడంలో బాధ్యతతో వ్యవహరించి ఉంటే బాగుండేది. అప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రజలకు మార్గదర్శకంగా ఉండేవారు. ఒక ప్రజాప్రతినిధికి ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నత హోదా మాత్రమే కాక ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దేశ పౌరసత్వాన్ని పొందేందుకు ఒక వ్యక్తి తప్పుడు సమాచారం ఇస్తే అలాంటి వ్యక్తి సమాజానికి చేసే ప్రమాదాన్ని మనం ఊహించగలం. అతనిపై క్రిమినల్‌ నేరారోపణలు లేనంత మాత్రాన అతడు తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిదని భావించలేం. ప్రజాప్రతినిధులు అలా వాస్తవాలను దాచిపెట్టడం ప్రజల సంక్షేమానికి తీవ్ర ప్రమాదాన్ని చేకూర్చుతుంది.

4.శాసన సభ్యుడిగా లక్షలాది మంది ప్రజల భవిష్యత్తును మార్చే నిర్ణయాల్లో అతడు భాగస్వామి అవుతారు. ఆ స్థాయిలో తప్పుడు సమాచారం, వాస్తవాలను దాచిపెట్టడం వల్ల ప్రజాసంక్షేమానికి ఎంత మాత్రం మంచిది కాదు.

5.ఉగ్రవాదం, గూఢచర్యం, తీవ్ర అసంఘటిత నేరం లేదా యుద్ధ నేరాలకు ఆయన పాల్పడలేదన్న కారణంతో అతడి పౌరసత్వాన్ని రద్దు చేయకపోతే ఆ నిర్ణయం అలాంటి ఎంతో మంది వ్యక్తులకు ప్రేర ణ కలిగించి బూటకపు సమాచారం అందించడం ద్వారా భారత ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించి పౌరసత్వం పొందేందుకు కారణమవుతుంది.

వీటి రీత్యా చెన్నమనేని రమేశ్‌ భారత పౌరుడిగా కొనసాగడం ఎంతమాత్రం ప్రజా సంక్షేమానికి మంచిది కాదు. అందువల్ల పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 10 అధికారాలను వినియోగించుకొని చెన్నమనేని రమేశ్‌ భారతదేశ పౌరుడు కాదని నిర్ణయించింది.

తప్పుడు సమాచారం ఇలా
రమేశ్‌ భారత పౌరసత్వం పొందడానికి 2008 మార్చి 31న దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో గత ఏడాది కాలంగా దేశంలో నివసించారా అన్న దగ్గర అవును అని టిక్‌ చేశారు. గత ఏడాది కాలంలో ఏమైనా విదేశీ పర్యటనలు చేస్తే వాటి వివరాలు పంపించమని రమేశ్‌కు 2008 నవంబరు 21న లేఖ రాశామని, దానికి ఆయన తిరిగి సమాధామిస్తూ ఏ విదేశీ పర్యటన చేయలేదని తెలిపారని హోంశాఖ వెల్లడించింది.

దాంతో 2009 ఫిబ్రవరి 4న రమేశ్‌కు పౌరసత్వాన్ని మంజూరు చేశామని చెప్పింది. తర్వాత కాలంలో 2009 జూన్‌ 15న ఆది శ్రీనివాస్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపింది. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు ఏడాదిలో రెండు సార్లు రమేశ్‌ విదేశీ పర్యటన చేసినట్లు తేలిందని వెల్లడించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడానికి తాము నియమించిన కమిటీ 2017లో నివేదిక అందించిందని, రమేశ్‌ భారత ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించారని కమిటీ తేల్చిందని వివరించింది.

ఇదీ వివాదం
2009 ఎన్నికల్లో వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివా్‌సపై చెన్నమనేని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, జర్మన్‌ పౌరుడిగా ఉన్న చెన్నమనేని తప్పుడు మార్గంలో భారత పౌరసత్వం పొందారని 2010లో హైకోర్టులో ఆది శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పౌరసత్వం చెల్లదని 2013లో కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాలు చేస్తూ చెన్నమనేని సుప్రీం కోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఆలోగా 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున రమేశ్‌ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పౌరసత్వంపై మూడు నెలల్లో తేల్చాలని 2016 ఆగస్టులో కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు ఆదేశించింది. తర్వాత కాలంలో హోంశాఖ కేసును పరిశీలించి, పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. దానిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించగా.. ఇరువురి వాదనలు విని త్వరగా తేల్చాలని కోర్టు తీర్పు ఇచ్చింది. హోంశాఖ తాజా తీర్పుతో వేములవాడలో ఆది శ్రీనివాస్‌ వర్గీయులు, కాంగ్రెస్‌ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. టీఆర్‌ఎ్‌సలో అయోమయం నెలకొంది.

నిజం దాగదు: ఆది శ్రీనివాస్‌
ఎక్కడికి వెళ్లినా నిజం దాగదని, న్యాయమే నిలబడుతుందని ఆది శ్రీనివాస్‌ అన్నారు. రమే్‌ష భారత పౌరుడు కాదని, సుప్రీం కోర్టు, హోంశాఖ తేల్చి చెప్పినా నకిలీ పత్రాలతో వేములవాడ ప్రజలను, భారతదేశాన్ని మోసం చేస్తున్నారన్నారు. తమకు హైకోర్టుపై పూర్తి నమ్మకం ఉందని, నిజం దాగదని అన్నారు.

మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: రమేశ్‌
పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని రమేశ్‌ ప్రకటించారు. జూలై 15, 2019 నాటిహైకోర్టు తీర్పును హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని చెప్పారు. తన పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తర్వాత వెంటనే స్టే ఇచ్చిన హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్నదని, జూలై 15, 2019న పౌరసత్వం రద్దును కొట్టి వేసిందని అన్నారు. పౌరసత్వ చట్టం, వాటి నిబంధనలు, నైతిక విలువలను, వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిశీలిస్తూ చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని చెప్పారు. ఏ నిర్ణయం వచ్చినా మళ్లీ తమ వద్దకు రావచ్చని హైకోర్టు చెప్పిందన్నారు.

Courtesy AndhraJyothy…

RELATED ARTICLES

Latest Updates