ప్రతికూల వాతావరణంలో కార్మికుల వెలుగుదివ్వె

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

గడిచిన నలభై ఐదు రోజుల్లో చాలసార్లు ఆశను రేకెత్తించే వ్యాఖ్యలు, చట్టాన్ని పాటిస్తారేమో, చట్ట ఉల్లంఘనను శిక్షిస్తారేమో అని అనుమానించదగిన పదునైన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు కూడా చేతులెత్తెయ్యడంతో వీరోచితమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలా ముగుస్తుందోనన్న ఆందోళన కలుగుతున్నది.

‘నా చేతను, నీ చేతను… అరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్‌’ అన్నట్టు ఇవాళ్టి ప్రజా రథ చోదకుల ఓటమికి మనందరమూ – పాలకులూ, ట్రేడ్‌ యూనియన్లూ, ప్రజా సంఘాలూ, రాజకీయ పార్టీలూ, న్యాయవ్యవస్థా, మొత్తంగా సమాజమూ – విడివిడిగానూ మొత్తంగానూ మన మన బాధ్యతలను మదింపు వేసుకోవలసి ఉంది. ఒక న్యాయమైన సమ్మె, ఒక న్యాయ ఆకాంక్ష మన కండ్లముందర కూలిపోతున్నది. యాభై వేల కుటుంబాల ఆకాంక్షలను, ఆత్మగౌరవ కోర్కెలను, సమానత్వ కోర్కెలను ప్రకటించిన సమ్మెను మూర్ఖత్వం, మొండితనం, అహంకారం నిండిన ప్రభుత్వం, పాలకవర్గాలు మన కండ్ల ముందర భగం చేస్తూ వచ్చాయి.

ప్రజా రవాణా వ్యవస్థ ప్రయివేట్‌ పరం కాగూడదనీ, ప్రజల అదుపులో ఉండాలనీ, మెరుగైన సేవలు అందించాలనీ ఆర్టీసీ కార్మికులు మనందరి తరఫున ప్రకటించిన ఆకాంక్షలను ప్రభుత్వ దుర్మార్గం నేలమట్టం చేస్తుంటే మనందరం నిశ్చేష్టులమై నిలబడ్డామని చరిత్ర నమోదు చేసింది. ప్రభుత్వ కుటిలత్వాన్ని ఓడించడానికి మరింత శక్తి కూడగట్టుకోవలసిన, మరింత సమరశీలంగా ఉండవలసిన, మరింత సంఘీభావం సమకూర్చుకోవలసిన ట్రేడ్‌ యూనియన్లు తమ ఉద్యమాన్ని విస్తరించడంలో విజయం సాధించలేకపోయాయి. ఈ సంక్షోభ సమయంలో ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్లకు మరింత పెద్ద ఎత్తున సహకారాన్ని, స్నేహహస్తాన్ని అందించవలసిన ఇతర ట్రేడ్‌ యూనియన్లూ ఉద్యోగ సంఘాలూ ప్రజా సంఘాలూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలూ శ్రేణులూ ఉన్న రాజకీయ పార్టీలు, ఒకటి రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ సమ్మెకు నామమాత్రపు సహాయమే అందించాయి. డిపోల ముందర ఉపన్యాసాలకు పరిమితమై, విశాల ప్రజాక్షేత్రంలో చేపట్టవలసిన పనులను విస్మరించాయి. గ్రామాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు కూడగట్టే విస్తృత ప్రదర్శనలు నిర్వహించడం, ప్రయివేటు రవాణా సంస్థలను, సమ్మె విచ్ఛిన్నకారులను అడ్డుకోవడం రాజకీయ పార్టీలు చేసి ఉండ వలసిన పనులు. కాని వారు ఆ కార్యక్రమాలు తీసుకోలేదు.

అన్నిటికన్న మిన్నగా నిలిచినది న్యాయవ్యవస్థ వైఫల్యం. సమ్మెకు సంబంధించి తన ముందుకు వచ్చిన వేరువేరు వ్యాజ్యాల విచారణ సందర్భంగా ప్రజానుకూలమైన వ్యాఖ్యలు, కార్మిక అనుకూలమైన వ్యాఖ్యలు ఎన్నో చేసిన న్యాయస్థానం, ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుపట్టిన న్యాయస్థానం ఆ ఒరవడిని చివరిదాకా కొనసాగించలేక పోయింది. సంక్షేమ రాజ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ గురించీ, ప్రజల ప్రయాణ హక్కుల గురించీ, కార్మికుల జీవిత భద్రత గురించీ, పని పరిస్థితుల మెరుగుదల గురించీ చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడానికి వచ్చిన అవకాశాన్ని తెలంగాణ న్యాయవ్యవస్థ చేజేతులా చేజార్చుకుంది.

పారిశ్రామిక విప్లవం నుంచీ, ఫ్రెంచి విప్లవం నుంచీ రూపొందిన ఆధునిక పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థలలో న్యాయవ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చట్టబద్ధ పాలన, చట్టం ఎదుట అందరూ సమానులే అనే ప్రాతిపదికల మీద న్యాయవ్యవస్థకు శాసననిర్మాతల విధానాలనూ, అధికారవర్గ చర్యలనూ కూడా సమీక్షించే, విమర్శించే, సవరించే అధికారం కల్పించారు. అది రాజ్యాంగ యంత్రంలో భాగమే అయినప్పటికీ దానికి శాసననిర్మాణ వ్యవస్థ నుంచీ, అధికార వ్యవస్థ నుంచీ కొంత స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి, ఆ రెండు వ్యవస్థల నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని కూడా అప్పగించడం అలవోకగా జరగలేదు. మిగిలిన వ్యవస్థలన్నీ విఫలమైనా న్యాయవ్యవస్థ ఒక్కటే అయినా సమాజ హితం కోసం పనిచేస్తుందని, చేయాలని ఆశించారు. వ్యక్తి హక్కులకూ ప్రభుత్వ ఆంక్షలకూ మధ్య, సామాజిక శ్రేయస్సుకూ ప్రయివేట్‌ లాభాపేక్షకూ మధ్య, సమాజపు ప్రశ్నాస్వభావానికీ పాలకుల అహంకారానికీ మధ్య, చట్టబద్ధపాలనకూ చట్టవ్యతిరేక పాలనకూ మధ్య, ప్రజాస్వామ్యానికీ నియంతృత్వానికీ మధ్య సమాజంలో ఘర్షణ తలెత్తినప్పుడు న్యాయవ్యవస్థ వ్యక్తి హక్కులవైపు, సామాజిక శ్రేయస్సు వైపు, ప్రశ్నాస్వభావం వైపు, చట్టబద్ధ పాలనవైపు, ప్రజాస్వామ్యం వైపు నిలబడాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఈ దేశంలో మిగిలిన అన్ని వ్యవస్థలకూ లేని గౌరవం న్యాయవ్యవస్థ మీద ఉండడం అందువల్లనే.

కానీ ఆర్టీసీ సమ్మె విషయంలో న్యాయవ్యవస్థ తన ఆదర్శాన్ని తానే నీరు గార్చుకుంది. ఎలాగైతే పత్రికా స్వేచ్ఛ అనేది నిర్దిష్టంగా అధికరణం 19లో లేకపోయినా, భావప్రకటనా స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛే అని, మంచి బతుకు కోసం ఆకాంక్ష కూడా అధికరణం 21 జీవించే హక్కులో భాగమేనని సుప్రీం కోర్టు చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చిందో, ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు కూడా ప్రజా రవాణా వ్యవస్థను అధికరణం 19లో చెప్పిన ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛలో భాగంగానే చూడాలని చెప్పే అవకాశం ఉండింది. తద్వారా ప్రజల ప్రజా రవాణా వ్యవస్థ ఆకాంక్షలు ప్రాథమిక హక్కులలో భాగమనీ, ప్రభుత్వాలకు వాటిని నిర్వీర్యం చేసే హక్కు లేదనీ చెప్పే అవకాశం ఉండింది. ఆదేశిక సూత్రాలలో అధికరణం 39ని కూడా దీనితో కలిపి ప్రయివేట్‌ రవాణా మాఫియాను నిరోధించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పే అవకాశం ఉండింది. కనీసం సమ్మె న్యాయబద్ధమైనదని చెప్పే అవకాశం ఉండింది. కానీ హైకోర్టు ఆ అవకాశాలన్నీ వదులుకుని, కార్మికులను ఒకానొక ప్రభుత్వ శాఖ అయిన కార్మికశాఖ చేతులకు అప్పగించింది.

ఇలా అన్ని వ్యవస్థలూ పనిచేయవలసిన పద్ధతిలో పనిచేయకుండా ఉండడానికి అవకాశమిచ్చినది తెలంగాణ సమాజమేననాలి. న్యాయన్యాయాల పోరాటంలో ఎల్లప్పుడూ న్యాయం వైపే నిలిచిన తన గత చరిత్రను తెలంగాణ సమాజం ఒకసారి మననం చేసుకుని ఉంటే, అందుకు తగిన విధంగా పనిచేసి ఉంటే ఇవాళ్టి స్థితి తలెత్తి ఉండేది కాదు. కాని ఆశ్చర్యకరంగా, విచారకరంగా మొత్తంగా తెలంగాణ సమాజమే తన ప్రజా రవాణా వ్యవస్థ కుప్ప కూలిపోతుంటే నిర్లిప్తతతో, మౌనంతో చూస్తూ కూచుంది. తన భవిష్యత్తు విధ్వంసానికి తానే మౌనసాక్షిగా నిలిచింది. వందలాది సంవత్సరాలుగా గొప్ప ప్రగతిశీల ఆలోచనాధోరణులకు, ఆచరణ కార్యక్రమాలకు, ధిక్కార సంప్రదాయానికి ఆలవాలమైన నేలగా గొప్పలు చెప్పుకునే తెలంగాణ సమాజ బిడ్డలమందరమూ ఇవాళ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉంది. మన ఏ వైఫల్యం, ఏ నిర్లక్ష్యం, ఏ నిరాసక్తత తెలంగాణ సమాజాన్నీ, ఈ సమాజంలో అతి ముఖ్యభాగమైన రవాణా వ్యవస్థనూ, ఆ రవాణా కార్మికులనూ ఈ వైపరీత్యానికి గురి చేశాయి?

ఆర్టీసీ కార్మికులు కేవలం తమ జీతభత్యాల కోసమో, ఉద్యోగ భద్రత కోసమో, మెరుగైన పని పరిస్థితుల కోసమో మాత్రమే సమ్మె చేయడం లేదు. అనేక డిమాండ్లలో ఆ డిమాండ్లు కూడా కలిసి ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రధాన డిమాండ్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిరక్షణకు సంబంధించినవి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను మరింత మెరుగ్గా ప్రజాసేవా సంస్థగా తీర్చిదిద్దడానికి అవసరమైన కర్తవ్యాలకు సంబంధించినవి. అసలు ఒక ప్రజాస్వామిక పాలన అనేది సాగుతున్న చోట ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉండాలనే మౌలిక ప్రశ్నకు సంబంధించినవి.

ఈ రెండు రకాల డిమాండ్లలో మొదటి రకం నేరుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినవి కావచ్చు. వాటి మీద కార్మికుల అభిప్రాయాలకూ యాజమాన్య అభిప్రాయాలకూ మధ్య విభేదం ఉండవచ్చు. ఉమ్మడి బేరసారాల ప్రక్రియలో కార్మికుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేవారు ఎవరనే విషయంలో, వారి అర్హత, యోగ్యత ఏమిటనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆ డిమాండ్లను అంగీకరించడానికి ఆర్థికపరమైన, నిర్వహణాపరమైన పరిమితులు, అవరోధాలు ఉండవచ్చు. కానీ ఈ పరిమితులు, అవరోధాలు, భిన్నాభిప్రాయాలు ఏవీ కూడా చర్చలకు అతీతమైనవి కావు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థల చరిత్ర మొత్తం ఇటువంటి భిన్నాభిప్రాయాల ఘర్షణలతో, చర్చలతో, సంప్రదింపులతో నిండి ఉంది. భగత్‌ సింగ్‌ అన్నట్టు పదహారు అణాలు అడగడంతో ప్రారంభమైన ఉద్యమాలు అణా పొందడంతోనైనా సరిపుచ్చుకుని, ఆ అణా తీసుకుని, మిగిలిన పదిహేను అణాల కోసం పోరాటం కొనసాగించవచ్చు. అటూ ఇటూ బిగిసిపోవడం ఎప్పుడూ జరగదు. ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే వైఖరి తీసుకోవాల్సి వస్తుంది.
కానీ, మనం గొప్పలు చెప్పుకుంటున్న ‘బంగారు తెలంగాణ’లో మాత్రం యాజమాన్య పక్షం పూర్తిస్థాయి మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని ప్రదర్శించింది. కార్మికుల పక్షం అనేక పర్యాయాలు చర్చలకు తన సానుకూలతను ప్రకటించింది. మొత్తం డిమాండ్లలో రెండు రకాలు ఉన్నాయని గుర్తించి, కనీసం మొదటి రకం డిమాండ్ల మీదనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని యాజమాన్యం ఎప్పుడూ ముందుకు రాలేదు. చర్చకు మొదటి నుంచీ తలుపులు మూస్తూ వచ్చింది. ఒక్కోసారి తనకూ ఆర్టీసీ యాజమాన్యానికీ సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించిన, ప్రకటించిన ప్రభుత్వం కీలకాంశాల్లో మాత్రం ఆ యాజమాన్యాన్ని శాసిస్తూ వచ్చింది. అత్యంత కీలకమైన రంగంలో యాభై వేల మంది కార్మికులకు ఆశ్రయమిస్తున్న తన అధీనంలోని కార్పొరేషన్‌ బాగోగులు పట్టించుకుని దాని అభివృద్ధి కోసం పని చేయవలసిన ప్రభుత్వం దాన్ని బలహీన పరచడానికి, విధ్వంసం చేయడానికి, దాని ఆదాయానికి గండి కొట్టడానికి, దానికి ఇవ్వవలసిన నిధులు ఎగగొట్టడానికి ప్రయత్నించింది. నిజానికి కార్మికుల డిమాండ్ల మీద యాజమాన్యానికీ కార్మికులకూ చర్చలు జరిగితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ అసలు విషయాలన్నీ బైటపడతాయనే భయంతోనే చర్చలకు ప్రభుత్వం అడ్డుపడుతూ వచ్చింది. చర్చలకు మోకాలడ్డు పెట్టమని యాజమాన్యాన్ని శాసిస్తూ వచ్చింది.

ఇక రెండో రకం డిమాండ్లు తెలంగాణ సమాజం మొత్తానివి, ప్రజా జీవితానివి, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవి. ఆ డిమాండ్ల మీద కార్మికులు ఎంతగా మాట్లాడారో అంతకన్న ఎక్కువగా ప్రజలు, ప్రజాసంఘాలు, సోదర ట్రేడ్‌ యూనియన్లు, రాజకీయ పార్టీలు మాట్లాడవలసి ఉండింది. ఆర్టీసీ సమ్మెను సకలజనుల సమ్మెగా మార్చవలసి ఉండింది. ఆ డిమాండ్ల మీద చర్చను ఒక బహిరంగ సామాజిక చర్చగా మార్చవలసి ఉండింది. కానీ మొత్తంగా సమాజ ఆకాంక్షల మీద సాగిన ఆ ఉద్యమం నలబై ఐదు రోజులు గడిచినా అందులో తెలంగాణ సమాజం పాల్గొనవలసినంతగా పాల్గొనకపోవడం విచారకరం. అట్లాని తెలంగాణ సమాజం సమ్మెను వ్యతిరేకించిందని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎక్కడా సమ్మె పట్ల వ్యతిరేకత గానీ, సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల వ్యతిరేకత గానీ వ్యక్తం కాలేదు. అంటే మౌన అంగీకారమే కొనసాగిందనవచ్చు. ఆ మౌన అంగీకారాన్ని మాటల స్థాయికి, బహిరంగ ప్రదర్శన స్థాయికి, సమరశీల ఆచరణ స్థాయికి, ప్రయివేటీకరణకు ప్రతిఘటన స్థాయికి పెంచలేకపోవడం తెలంగాణ సమాజ బలహీనత. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి మూల్యం అనే మౌలిక ప్రజాస్వామిక సూత్రీకరణను తెలంగాణ సమాజం గత ఐదేండ్లుగా మరిచిపోతున్నట్టుంది. ఆ నిరంతర జాగరూకత లేమి ఆర్టీసీ సమ్మె విషయంలో స్పష్టంగా బైట పడింది.

ఈ మొత్తం విచారకర, అసంతృప్తికర వాతావరణంలో ఒక ఆశావహమైన వెలుగుదివ్వె ఆర్టీసీ కార్మికుల మొక్కవోని పోరాట చైతన్యం. ఎదురు లేదనుకుంటున్న ఏలిక మూడు గడువులు పెట్టినా, ఎన్నెన్ని కత్తులు దూసినా, ఎన్నెన్ని కుట్రలు చేసినా యాభైవేల మందిలో మూడు వందల మందికి మించి లొంగలేదంటే, నలభై ఐదు రోజులుగా అప్రతిహతంగా ఉద్యమం సాగుతున్నదంటే తెలంగాణ భవిష్యత్తు ఆశాసూచిక అదే. ఆ కార్మిక సమరశీల చైతన్యానికి జేజేలు.

– ఎన్‌. వేణుగోపాల్‌
సెల్‌:9848577028

RELATED ARTICLES

Latest Updates