మేమేమీ..చేయలేం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • చర్చలు జరపాల్సిందిగా సర్కారును ఆదేశించలేం
  • సమ్మె చట్ట విరుద్ధమని అనలేం.. లేబర్‌కోర్టే తేల్చాలి
  • ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ
  • రెండు వారాల్లో లేబర్‌ కోర్టుకు నివేదించండి
  • నివేదించకుంటే ఎందుకో మాకు చెప్పాలి
  • లేబర్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు
  • వ్యాజ్యాలకు ముగింపు

మాకూ కొన్ని పరిధులుంటాయ్‌

‘‘మా అభ్యర్థనను ప్రభుత్వం ఆలకించలేదు. అదే ధోరణి కొనసాగిస్తూ వచ్చింది. రెండు వర్గాలకూ సరిపడినంత సమయం ఇచ్చాం. ఎవరూ ముందుకు రాలేదు. ఎలాంటి ఫలితాలు రాలేదు. కార్మికుల కష్టాలు, ప్రజల ఇబ్బందులు తెలుసు. కానీ మేమేం చేయగలం. మాకూ కొన్ని పరిధులుంటాయి. వాటిని దాటి ముందుకు వెళ్లలేం. మా పరిధిలోనే ఏమైనా చేయగలం’’
-హైకోర్టు వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జోక్యం చేసుకోవచ్చా… లేదా.. చెప్పాలని అమికస్‌ క్యూరీ విద్యాసాగర్‌ను కోరాం. ఐడీ చట్టంలోని సెక్షన్‌-12 ప్రకారం ఈఅంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది కన్సీలియేషన్‌ ఆఫీసరేనని చెప్పారు. అక్కడ చర్చలు విఫలమైతే సెక్షన్‌ 12(4) కింద ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు. దీనిని లేబర్‌ కోర్టుకు నివేదించాలా.. వద్దా.. అనే విస్తృత అధికారం మాత్రమే సెక్షన్‌ 12(5) కింద కోర్టుకు ఉంటుందని ఆయన చెప్పారు. కార్మికుల సమ్మె చట్ట వ్యతిరేకమా.. చట్ట సమ్మతమా.. అని తేల్చే అధికారాలు హైకోర్టుకు ఉండవని సిండికేట్‌ బ్యాంక్‌ కేసులో సుప్రీం కోర్టు చెప్పింది.

మా తీర్పు అందిన రెండు వారాల్లోగా కన్సీలియేషన్‌ అధికారి లేబర్‌ కోర్టుకు నివేదించాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం వెలువడినా సరే.. 48 వేల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులను ఆర్టీసీ తిరిగి విధుల్లోకి తీసుకుం టుందని, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోదని మేం ఆశిస్తున్నాం.
-సీజే చౌహాన్‌

హైదరాబాదు: ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. చర్చలనేవి స్వచ్ఛందంగా ఉండాలని స్పష్టం చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించేందుకు లేబర్‌ కమిషనర్‌కు అధికారం లేదని, ఆయనకు తాము ఆదేశాలు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సోమవారం ముగింపు పలికింది. చర్చలు విఫలమైన అంశాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడంపై తీర్పు కాపీ అందిన రెండు

వారాల్లో నిర్ణయం తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను ఆదేశించింది. లేబర్‌ కోర్టుకు నివేదించలేకపోతే అందుకు తగిన కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాల్సిందిగా లేబర్‌ కమిషనర్‌ను ఆదేశించలేమని తీర్పులో పేర్కొంది. కన్షీలియేషన్‌ ఆఫీసర్‌ (లేబర్‌ కమిషనర్‌)కు అటువంటి అధికారాలు లేవని తేల్చిచెప్పింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా, సమ్మతమా అని నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. ఒకవేళ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితే.. ‘ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ సర్వీసెస్‌’ కేసులో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారని, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోరని ఆశిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అమికస్‌ క్యూరీ ఏం చెప్పారంటే..
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కోర్టు జోక్యం చేసుకోవచ్చో లేదో సలహా ఇవ్వాలని అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకునిగా నియమించిన న్యాయవాది) జి.విద్యాసాగర్‌ను కోరినట్లు వెల్లడించింది. పారిశ్రామిక వివాదాల చట్టం 12వ సెక్షన్‌ కింద నిర్ణయం తీసుకోవాల్సింది కన్సీలియేషన్‌ ఆఫీసరేనని చెప్పారని, అక్కడ చర్చలు విఫలమైతే పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 12(4) కింద ప్రయత్నాలు విఫలమైన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారని చెప్పింది. సెక్షన్‌ 12(5) కింద దీనిని లేబర్‌ కోర్టుకు నివేదించాలా? వద్దా? అనే విస్తృత అధికారం కోర్టుకు ఉంటుందని తెలిపింది. సెక్షన్‌ 20(4) కింద సిండికేట్‌ బ్యాంక్‌ వర్సెస్‌ ఉమేశ్‌ నాయర్‌ కేసులో 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించింది. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించాలని అదేశించే అధికారాలు ఈ న్యాయస్థానానికి లేవని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జి.రామచంద్రరావులు చేసిన వాదనలను ప్రస్తావించింది. సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్లకు ఆదేశించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్‌.సుబేందర్‌సింగ్‌, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై సోమవారం తుది విచారణ జరిగింది.

జైలు శిక్ష కూడా విధించొచ్చు
ఆర్టీసీ తరుపున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఈ వ్యాజ్యాలన్నింటినీ కూర్పుచేసి ఒకే అఫిడవిట్‌ వేసినట్లు కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా సమ్మెకు దిగారన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం 20(సి) ప్రకారం సమ్మె చేస్తున్న కార్మికులకు నెల రోజులు జైలుశిక్ష, రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. సెక్షన్‌ 22(1ఎ) ప్రకారం కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట సమ్మతం కాదన్నారు. ఆరు వారాల ముందు సమ్మె నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాత సెక్షన్‌ 12 కింద 14 రోజులు గడువు ఇచ్చిన తర్వాతే సమ్మెకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలను కార్మిక సంఘాలు పట్టించుకోనందున సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు.

చట్ట వ్యతిరేకం కాదు
ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. ఈ సెక్షన్‌ కింద సమ్మె చట్ట వ్యతిరేకమని సిండికేట్‌ బ్యాంక్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పలేదని గుర్తుచేసింది. అయితే కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా? కాదా అని తేల్చిచెప్పే పరిధి తమకు లేదంది. దీనిపై లేబర్‌ కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘కన్సీలియేషన్‌ అధికారి ఈ అంశంపై లేబర్‌ కోర్టుకు పంపాలా.. వద్దా అని నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి స్టే ఆదేశాలు ఇవ్వలేదు, సబ్‌జ్యుడీస్‌ కాదు. కన్సీలియేషన్‌ అధికారి నిర్ణయాన్ని ట్రేడ్‌ యూనియన్లు సవాల్‌ చేయవచ్చు’’ అని తెలిపింది. కార్మిక సంఘాల తరుపు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ, ముగ్గురు సభ్యుల కమిటీకి ప్రభుత్వం ఆమోదం తెలపక పోయినా నియమించే అధికారం ఈ న్యాయస్థానానికి ఉంటాయని తెలిపారు. ఈ వాదలనకు అడ్డుపడిన ధర్మాసనం.. ‘‘మా అభ్యర్థనను ప్రభుత్వం ఆలకించలేదు. రెండు వర్గాలకు సరిపడినంత సమయం ఇచ్చాం. ఎవరూ ముందుకు రాలేదు. ఎలాంటి ఫలితాలు రాలేదు’’ అని గుర్తు చేసింది.

నమ్మకం లేనప్పుడు ఏం చేయగలం?
తిరిగి సీజే కల్పించుకుంటూ.. ‘‘పార్టీల్లో నమ్మకం ఉండాలి. ఎటువంటి ఫలితాలు ఇవ్వనపుడు వృధా. ఆర్టికల్‌ 226 కింద ఈ కోర్టుకు విస్తృతాధికారాలు లేవు’’ అని స్పష్టం చేశారు. తిరిగి కల్పించుకున్న న్యాయవాది రిట్‌ రూల్స్‌ 24, 86 కింద అనుమతి ఉన్నా, లేకున్నా కమిటీలు వేయవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని గతంలో అడ్వకేట్‌ జనరల్‌ వాదించారని గుర్తు చేశారు. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తెస్తూ 2015లో ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.

టీఎ్‌సఆర్టీసీని 2016 ఏప్రిల్‌ 27న ఆర్టీసీ చట్టం సెక్షన్‌-3 కింద ఏర్పాటు చేసినట్టు ప్రస్తావించారు. ఆర్టీసీ ఏర్పాటు చేయక ముందే ఎస్మా పరిఽధిలోకి తెస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో టీఎ్‌సఆర్టీసీకి వర్తించదన్నారు. సంస్థ నష్టాలకు కార్మికులు బాధ్యులు కారని చెప్పారు. ఆర్టీసీకి స్వేచ్ఛ ఇవ్వలేదని, వివిధ వర్గాలకు రాయితీలు కల్పించారని ఈ మధ్య కాలంలో డీజిల్‌ ధర లీటర్‌కు రూ.20కి పైగా పెరిగిందని ప్రస్తావించారు. టికెట్ల ధరలు పెంచుకునే స్వేచ్ఛ ఆర్టీసీకి లేదన్నారు. ఈ వాదనలకు అడ్డుపడ్డ ధర్మాసనం.. ఈ వ్యాజ్యాల్లో ఆర్టీసీ, ప్రభుత్వం, ఆర్థిక కార్యదర్శులు వేరువేరు గణాంకాలతో పలు అఫిడవిట్లు వేశారని, వాటిలో ఏదినిజమో తెలియకుండా పోయిందని, అందుచే తాము వాటి జోలికి పోవడం లేదని చెప్పింది.

కార్మికులు చేరితే చర్యలు తీసుకోవద్దు
కార్మిక సంఘం తరపు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కల్పించుకుంటూ.. ‘‘కార్మికులు ఇప్పుడు స్వచ్ఛందంగా విధుల్లో చేరడానికి ముందుకు వచ్చినా… వారిని తిరిగి విధుల్లో కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకోడానికి యాజమాన్యానికి ఇబ్బందిగా మారిందని ఆర్టీసీ ఎండీ కౌంటర్‌ వేశారు’’ అన్నారు. ‘‘కౌంటర్‌ వేసేముందు కొంచమైనా ఆలోచించాలి. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కార్మిక సంఘాలు చూస్తున్నాయని ఆర్టీసీ ఎండీ చెబుతున్నారు. ఈ అఫిడవిట్‌ను ఒక రాజకీయ పార్టీ దాఖలు చేసినట్టుంది. దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు.

ఒకవేళ కార్మికులు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు’’ అన్నారు. ‘‘ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ సర్వీసెస్‌’’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వివాదాన్ని కోర్టు తీర్పు అందిన రెండు వారాల్లోగా కన్సీలియేషన్‌ అధికారి లేబర్‌ కోర్టుకు నివేదించాలన్నారు. అక్కడ ఎలాంటి నిర్ణయం వెలువడినా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, 48 వేల మంది కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

ఏది నిజం?
కార్మిక సంఘాల తరపు న్యాయవాది కల్పించుకుంటూ.. ఒకపక్క ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, మరోపక్క 90ు బస్సులు నడుపుతున్నామని ఏజీ, అదనపు ఏజీ కోర్టుకు పరస్పర విరుద్ధ విషయాలు చెబుతున్నారన్నారు. బస్సులు నడపటంలో ఆర్టీసీ సంస్థ పూర్తిగా విఫలమైందని, డ్రైవర్లు, మెకానిక్‌లు లేక బస్సులు మూలన పడ్డాయని చెప్పారు. అనుభవం లేని డ్రైవర్ల వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే ప్రజల సౌకర్యం కోసం సమ్మె విరమిస్తామని గతంలో కోర్టుకు తెలిపామని ప్రస్తావించారు.

ఎవరి పక్షానా ఉండబోం
సీజే కల్పించుకుంటూ, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారని, మెట్రో రైలు కిక్కిరిసిపోతున్నట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ‘‘పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్‌-12 కింద చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని సూచించాం. ఎవరూ ముందుకు రాలేదు. మేం ఎవరి పక్షాన ఉండబోం. ఈ వ్యాజ్యాల్లో మెరిట్‌ ప్రకారం ఉత్తర్వులు ఇస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి కల్పించుకుంటూ.. ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్నారు. 97 లక్షల మంది ప్రజలు రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.

కార్మికుల డిమాండ్లను పరిష్కరించడం లేదని, కనీసం చర్చలకు కూడా సిద్ధపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పీఎఫ్‌, సీసీఎస్‌ నిధులను వినియోగించుకున్నారని తెలిపారు. సీజే కల్పించుకుంటూ, ‘‘మీ వాదనలు మళ్లీ మొదటికే వస్తున్నాయి.. కార్మికుల కష్టాలు, ప్రజల ఇబ్బందులు తెలుసు. కానీ మేమేం చేయగలం. మాకూ కొన్ని పరిధులుంటాయి. మా పరిధిలోనే ఏమైనా చేయగలం. ఆ క్రమంలోనే ప్రజల సౌకర్యం కోసం బస్సులు నడపాలని ప్రభుత్వానికి సూచించాం. బస్సుల సంఖ్య పెరిగిందా? లేదా? అనే అంశాన్ని వారి విచక్షణకే వదిలేశాం’’ అని వ్యాఖ్యానించారు.

Courtesy AndhraJyothy…

RELATED ARTICLES

Latest Updates