హాస్టళ్లలో పిల్లలు గజగజ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

గదిలో పడుకున్నా.. ఆరుబయట నిద్రించినట్లుగా చంపేసేంత చలి! తలుపులు లేని కిటికీలు.. డోర్లు లేని గుమ్మాలు! కప్పుకొనేందుకు దుప్పట్లూ ఉండవు. రాత్రంతా జాగరణే! రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలోని విద్యార్థుల దైన్యం ఇది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో వారి ఇబ్బందులు అన్నీఇన్నీకావు. పొద్దుగూకిందంటే చాలు.. చలికి పిల్లలు వణికిపోతున్నారు. రాత్రి మొదలుకొని తెల్లవార్లూ గదుల్లోకి వీస్తున్న గాలి కారణంగా నిద్రకు కరువవుతున్నారు. పైగా దోమల స్వైర విహారం ఒకటి. చాలాచోట్ల స్నానాల గదులూ లేవు. పొద్దున్నే ఆరుబయటే చన్నీళ్లతో స్నానాలు చేస్తుండటంతో దగ్గు, పడిశెంతో అనారోగ్యం బారినపడుతున్నారు! మరుగుదొడ్లు లేకపోవడంతో ఆ చలిలోనే బహిర్భూమికి వెళుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు కళ్లకు కట్టాయి!

  • తలుపులు ఊడిన కిటికీలు.. కప్పుకొనేందుకు దుప్పట్లు కరువు
  •  6నెలలైనా రగ్గుల పంపిణీ లేదు
  •  స్వెట్టర్లు, దోమ తెరలూ లేవు
  •  చంపేస్తున్న చలి.. రాత్రంతా జాగారం
  •  ఇళ్ల నుంచి చద్దర్లు, ఒకేదాంట్లో ముగ్గురు
  •  ఆరుబయట చన్నీళ్ల స్నానంతో దగ్గు, పడిశెం

విద్యాసంవత్సరం మొదలై ఆరునెలలు గడిచినా చాలాచోట్ల హాస్టళ్లలో పిల్లలకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయలేదు. స్వెట్టర్లు, దోమ తెరలూ ఇవ్వలేదు. బెడ్‌షీట్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. చలికాలం నాలుగునెలల పాటు స్నానాల కోసం పిల్లలకు వేడినీళ్లు అందుబాటులో ఉంచాలనే నిబంధనలున్నా ఎక్కడా అమలు కావడం లేదు. విద్యార్థుల్లో కొందరు తమ ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి కూడా లేని అభాగ్యులే ఎక్కువ. దీంతో ఒకే దుప్పటిని నలుగురైదుగురు కప్పుకొంటున్నారు. చాలాచోట్ల హాస్టళ్లు శిథిలమైపోయాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీవీపాలెం బీసీ హాస్టల్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇక్కడ 120మంది విద్యార్థుల కోసం రెండు గదులనే వినియోగిస్తున్నారు. ఆరుబయట చన్నీళ్ల స్నానం చేస్తున్నారు. ఖమ్మంలోని ఆనందనిలయం ఎస్సీ హాస్టల్లో దుప్పట్లు వచ్చినా వార్డెన్‌ వాటిని బీరువాలోనే తాళం వేసి ఉంచారు. జనగామలోని ఎస్టీ-బి బాలుర హాస్టల్లో గదులకు తలుపులు లేకపోవడంతో రాళ్లు అడ్డం పెట్టుకొని నిద్రిస్తున్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 హాస్టళ్లలో పల్చటి చద్దర్లను పంపిణీ చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Courtesy Andhrajyothy..

RELATED ARTICLES

Latest Updates