ఆర్టీసీ ఆందోళనలపై ఉక్కుపాదం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • అశ్వత్థామ ఇంట్లోకి చొచ్చుకెళ్లినపోలీసులు
  • ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు.. దీక్ష భగ్నం
  • రాజిరెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టిన ఖాకీలు
  • మహాదీక్ష జరగకుండా దారులన్నీ దిగ్బంధం
  • మంద కృష్ణ అరెస్టు.. రాములునాయక్‌ నిర్బంధం
  • ధర్నాచౌక్‌కు వెళ్లేదారిలో పలువురి అరెస్ట్‌
  • ఇందిరా పార్కు ప్రాంతమంతా దిగ్బంధం
  • ఇంటికి వెళ్లే దారి లేక జనం అష్టకష్టాలు

ఆర్టీసీ ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆదివారం ఉదయం నుంచి ఎక్కడికక్కడ అరెస్టులు.. గృహనిర్బంధాలు.. దీక్ష భగ్నాలతో విరుచుకుపడింది. నిరాహారదీక్ష చేస్తున్న జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి ఇంట్లోకి పోలీసులు బలవంతంగా చొరబడి.. ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దీక్ష భగ్నం చేశారు! ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లి ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుని ఉస్మానియాకు తరలించారు!! ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇందిరాపార్కులో తలపెట్టిన సబ్బండ వర్గాల మహాదీక్షనూ పోలీసులు దారుల దిగ్బంధంతో భగ్నం చేశారు. ధర్నాచౌక్‌కు తరలివచ్చే దారులన్నీ మూసేసి.. మూడంచెల బందోబస్తు ఏర్పాటుచేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శనివారం నుంచి తన ఇంట్లోనే నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం క్షీణిస్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మాజీ ఎంపీలు వివేక్‌, జితేందర్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిని మొదట అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ రావడంతో వారిని లోపలికి వెళ్లనిచ్చారు. మధ్యాహ్నం 3.30-4 గంటల సమయంలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు అశ్వత్థామరెడ్డితో సమావేశమయ్యారు. రాంచందర్‌రావు బయటకు వస్తున్న సమయంలో.. పోలీసులు ముందే రచించుకున్న వ్యూహం ప్రకారం లోపలికి దూసుకెళ్లారు. లోపలివారు గడియపెట్టేలోగానే బలవంతంగా చొరబడ్డారు. అశ్వత్థామరెడ్డి కుటుంబ సభ్యులను వెనక్కి నెట్టి సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచేంతవరకూ దీక్ష కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పినట్లు ఆయన కుమార్తె భవ్య మీడియాకు వివరించారు.

నాలుగున్నర గంటలు..ఆస్పత్రి ఐసీయూ వార్డులో అశ్వత్థామరెడ్డిని పరీక్షించిన వైద్యులు.. ఆయనకు బీపీ 150/90, రక్తంలో చక్కెరస్థాయులు 170 ఉన్నట్టు గుర్తించారు. మూత్రంలో కీటోన్స్‌ స్థాయులు ప్రమాదకరంగా మారుతున్నాయని.. వెంటనే చికిత్స చేయాలని పేర్కొన్నారు. కానీ, అశ్వత్థామరెడ్డి నాలుగున్నర గంటలపాటు చికిత్సకు ఒప్పుకోకపోవడంతో వైద్యం అందించలేకపోయారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. అదే సమయంలో అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఎట్టకేలకు అశ్వత్థామరెడ్డి చికిత్సకు ఒప్పుకొన్నారు. రాత్రి 9.30 గంటలకు గ్లూకోజ్‌ ఎక్కించడంతో ఆయన దీక్ష భగ్నమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. చికిత్స ప్రారంభించిన తర్వాత ఆయన రక్తపోటు తగ్గిందని వైద్యులు తెలిపారు. మరోవైపు.. ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ జి.లింగమూర్తి తన దీక్షను రెండో రోజూ కొనసాగించారు.

పోలీసు బందోబస్తు..అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు.. ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. శనివారం దీక్షకు దిగిన రాజిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రానికి వదిలేశారు. ఆయన మళ్లీ దీక్ష మొదలుపెట్టడంతో ఆదివారం ఇంటి తాళాలు పగలగొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లిన పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేసి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

దారులు మూసి.. అరెస్టు చేసి..ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కులో తలపెట్టిన సబ్బండ కులాల మహాదీక్ష జరగకుండా.. పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ధర్నాచౌక్‌కు తరలివచ్చే దారులన్నీ మూడంచెల భద్రతతో మూసేసి నిరసనకారులెవ్వరూ ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలకు చేరకుండా కట్టడి చేశారు. ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్‌ అమలు చేశారు. మహాదీక్షకు నేతృత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను హబ్సిగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు మరికొంతమంది బంజారా నేతలను కొంతసేపు గృహ నిర్బంధంలో ఉంచి, ఆ తర్వాత ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాసు సురేష్‌ తన మద్దతుదారులతో కలిసి అశోక్‌నగర్‌ నాలా వద్ద నుంచి ఇందిరాపార్కు వైపు వస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌ రమే్‌షకుమార్‌ మాదిగ, మాలమహానాడు రాష్ట్ర సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సక్కి గంగాధర్‌ నేతృత్వంలో తరలివచ్చిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత తెలంగాణ లోక్‌సత్తా నేత మన్నారం నాగరాజు, బీఎల్‌ఎఫ్‌ నాయకుడు శ్రీనివాస్‌ బహదూర్‌లో ఇందిరాపార్కు వైపు వెళ్తుండగా వారిని కూడా పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. కాగా.. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉండడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్దారు. కొందరు తమ ఇంటికి వెళ్లడానికి గంటల తరబడి పోలీసుల అనుమతి కోసం నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Courtesy Andhrajyothy..

 

RELATED ARTICLES

Latest Updates