ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పన్నాగం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • విపక్షాలతో కార్మిక నేతల కుమ్మక్కు.. సమ్మె వెనక అదృశ్య శక్తులు
  • అధికార్లను భయపెడుతున్నారు.. రెచ్చగొట్టే ఉపన్యాసాలిస్తున్నారు
  • ఆర్టీసీలో క్రమశిక్షణ గాడితప్పింది.. సమ్మెను ప్రోత్సహించ వద్దు
  • కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయి
  • కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరినా కొనసాగించలేమేమో
  • విలీనం డిమాండ్‌ను యూనియన్లు పూర్తిగా వదులుకోలేదు
  • భవిష్యత్తులో ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ఇరకాటంలో పెడతాయి
  • ఇతర ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెలే ఎక్కువ
  • వారికి తలుపులు తెరిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్లే
  • హైకోర్టు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ తాజా అఫిడవిట్‌
  • కేబినెట్‌ నిర్ణయంపై న్యాయ సమీక్ష తగదు.. సీఎస్‌ అఫిడవిట్‌

యూనియన్‌ నాయకులు కొందరు తమ ఉనికి కోసం మొత్తం ఆర్టీసీ కార్మికులను కష్టాల్లోకి నెడుతున్నారు. ప్రతిపక్ష నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు అని హైకోర్టుకు శనివారం సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ ఆరోపించారు. ఈ సమ్మెను అదృశ్య శక్తులు వెనక ఉండి నడిపిస్తున్నాయని, ఇందులో కార్మికులు, యాజమాన్యం, ప్రజల పాత్ర లేకపోయినా వారు మూల్యం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు స్వచ్ఛందంగా విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు వచ్చినా.. వారిని తిరిగి విధుల్లో కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకోవడం యాజమాన్యానికి ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే.. సమ్మెను కార్మికుల సంక్షేమం కోసం కాకుండా కొందరు యూనియన్‌ నాయకులు తమ పలుకుబడి పెంచుకునేందుకు చేస్తున్నారని భావించాలి. అందుకే, సమ్మెను ఎంత మాత్రం ప్రోత్సహించరాదు. సమ్మె చేస్తున్న కార్మికులు తమ హక్కులు, డిమాండ్లను సాధించుకోలేరు. యూనియన్ల నాయకులు, ప్రతిపక్షాలు అధికారులను భయపెడుతున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారు. క్రమశిక్షణ గాడి తప్పింది. ఉన్నతాధికారులను లెక్కచేయడం లేదు. సంస్థా గతంగా తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. మూల స్తంభాలకు పగుళ్లు వస్తే రాళ్లపై భవనం నిలబడుతుందని భావించలేం. క్రమశిక్షణారాహిత్యాన్ని ఏ యాజమాన్యం ఉపేక్షించబోదు. సంస్థను దృష్టిలో పెట్టుకుని దాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సూత్రం కార్మికులకు, యాజమాన్యానికి వర్తిస్తుంది. ఒకవేళ సంస్థ కూలిపోతే.. ముందుగా నష్టపోయేది ఉద్యోగులే! కార్మికుల ఇష్టా ఇష్టాలకు వదిలి పెడితే విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. క్రమశిక్షణను గాడిలో పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒక యాజమాన్యంగా సొంత సిబ్బందినే శిక్షించాలనే ఉద్దేశం లేదు. కానీ, పరిస్థితులను గాడిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించక తప్పదు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కార్మికుల సమ్మె ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని, దీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కార్మికులపై ఆర్టీసీకి ఎలాంటి శతృత్వం లేదన్నారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నా.. ఉద్యోగులకు 44 శాతం జీతాల పెంపు, 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించామని తెలిపారు.

కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే సాధ్యం కాని డిమాండ్‌తోపాటు మరికొన్ని డిమాండ్లతో కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారని తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా సమ్మె నోటీసు ఇచ్చి.. దసరా నుంచి సమ్మె చేయాలని ఎంచుకున్నారని ఆరోపించారు. పండుగ సీజన్‌లో మంచి లాభాలు ఆర్జించవచ్చని యాజమాన్యం భావిస్తే.. కార్మికులు సమ్మెకు దిగారని, దాంతో ఆర్టీసీ మరింత నష్టాల్లోకి కూరుకుపోయిందని వివరించారు. ఆకస్మిక సమ్మెతో రాష్ట్రంలో ఉపద్రవం వచ్చినట్లయిందని, ప్రయాణికులు అగచాట్లు పడ్డారని తెలిపారు. ప్రజల రవాణా అవసరాలు తీర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఆర్టీసీ ఎన్నో కష్టాలు పడిందన్నారు. ఇది సంక్షేమ రాజ్యమని సమ్మె చేస్తున్న యూనియన్ల నాయకులు అర్థం చేసుకోవాలన్నారు.

విలీనం నుంచి పూర్తిగా వైదొలగలేదు….యూనియన్‌ నాయకులు విలీనం అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన వాటిపై చర్చలకు సిద్ధమని చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ విలీనం

డిమాండ్‌ నుంచి పూర్తిగా వైదొలగలేదు. దీన్నిబట్టే యూనియన్‌ నాయకులు ఏవిధంగా ఆలోచనలు చేస్తున్నారో అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది అని అఫిడవిట్‌లో సునీల్‌ శర్మ పేర్కొన్నారు. ఈ సమ్మె ఒక్కటే కాదని, ప్రతి చిన్న అంశానికి, పనికి రాని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు పలుమార్లు సమ్మెకు దిగారని తెలిపారు. లెక్కలు తీస్తే ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిసే సమ్మెకు దిగారన్నారు

సమ్మెను కార్మికుల ఇష్టాయిష్టాలకు వదిలి.. ఎప్పుడు చేరితే అప్పుడే చేరండని డోర్లు తెరిచిపెడితే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. పరిస్థితులు ఇలాగే అధ్వానంగా ఉంటే మిగిలిన సెక్టార్లలోని ఉద్యోగులు సైతం ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు పారిశ్రామికాభివృద్ధికి అడ్డుగా మారతాయి. పారిశ్రామిక వివాదాల చట్టం ముఖ్య ఉద్దేశం.. సమ్మెలు, లాకౌట్‌లు పత్రికల్లో శీర్షికలు కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రశాంతమైన పని వాతావరణం కల్పించడమే. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టు ఉటంకించింది అని వివరించారు. తీవ్ర ఆర్థిక సమస్యలతో ఆర్టీసీ నడుస్తోందని, ప్రస్తుత సమ్మెతో పరిస్థితి మరింత దిగజారిపోయిందని వివరించారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలైనంత త్వరగా తగిన ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates