గుండె చెదిరే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆర్టీసీ కండక్టర్‌ మృతి.. మరో ముగ్గురికి హార్ట్‌ఎటాక్‌
– డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
– కండక్టర్‌ మృతితో సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉద్రిక్తత
– ఎమ్మెల్యే, డీఎస్పీతో సీఐటీయూ, జేఏసీ నాయకుల చర్చలు
– రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూమ్‌కు హామీ
నవతెలంగాణ – సంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి/జోగిపేట/ తొర్రూరు/నిడమనూరు/యాదగిరిగుట్ట/ ముత్తారం
ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ పోకడలు.. బెదిరింపుల వల్ల కార్మికులు మనోధైర్యం కోల్పోయి ప్రాణం విడుస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోనే గురువారం సంగారెడ్డికి చెందిన కండక్టర్‌ మృతిచెందాడు. మహబూబాబాద్‌ లోనే మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయగా, యాదాద్రిలో ఇద్దరు, పెద్దపల్లి ఒకరు గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డిలో కండక్టర్‌ మృతితో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని అంబులెన్స్‌ నుంచి దింపకుండా డిపోకు తరలించేందుకు కార్మికులు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. చర్చల అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన పూలబోయిన నాగేశ్వర్‌(45) నారాయణఖేడ్‌ ఆర్టీసీ డిపోలో పదేండ్లు కండక్టర్‌గా చేశాడు. సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో.. ఆర్టీసీ కార్మికులు 5వతేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని, లేకుంటే సెల్ఫ్‌డిస్మిస్‌ అవుతారని ప్రకటించడాన్ని టీవీలో చూసిన నాగేశ్వర్‌ మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అతని ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబీకులు సంగారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, మతిస్థిమితం కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రభుత్వం వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితిలో ప్రయివేటుగా వైద్యం చేయించలేక నాగేశ్వర్‌ను జోగిపేటలోని అత్తగారింటికి తీసుకొచ్చారు. రోజురోజుకూ అతని పరిస్థితి విషమించడంతో నాగేశ్వర్‌ భార్య సుజాత దిక్కుతోచక రోదిస్తుండగా, సీపీఐ(ఎం)తో పాటు, పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అండగా నిలిచారు. ఈనెల 11న చందాలు పోగు చేసి నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండురోజుల కిందట కోమాలోకి వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి 12.42గంటలకు మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ నుంచి అంబులెన్స్‌లో జోగిపేటకు తీసుకొచ్చారు.
కండక్టర్‌ మృతితో ఉద్రిక్తత..
కండక్టర్‌ మృతి వార్త తెలుసుకున్న సీఐటీయూ, సీపీఐ(ఎం), టీజేఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎంఎస్‌, జేఏసీ నాయకులు, కార్మికులు భారీగా జోగిపేటకు చేరుకున్నారు. కండక్టర్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌ నుంచి దించకుండా నిరసన తెలిపారు. నాగేశ్వర్‌ పనిచేసిన నారాయణఖేడ్‌ డిపోకు తరలించేందుకు సిద్ధమవుతుండగా డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. దాంతో దాదాపు తొమ్మిది గంటల పాటు ఉద్రిక్తత ఏర్పడింది. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని నాయకులు, కార్మికులు భీష్మించుకూర్చున్నారు.
ఎమ్మెల్యే, డీఎస్పీతో సీఐటీయూ, జేఏసీ చర్చలు..
చివరకు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి నాయకులను చర్చలకు పిలిచారు. మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఐదెకరాల భూమి ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు, జేఏసీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పీరయ్య తదితరులు డిమాండ్‌ చేశారు. గంటపాటు చర్చల అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తరపున టీఆర్‌ఎస్‌ నాయకులు భిక్షపతితో చర్చించి ప్రభుత్వం నుంచి అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.50వేలు అందజేశారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తామని డీఎస్పీ హామీనిచ్చారు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా, తనదే పూర్తి బాధ్యత అని డీఎస్పీ హామీ ఇచ్చారు. ఒకవేళ హామీ నెరవేరకపోతే తన కార్యాలయానికి వచ్చి అడగొచ్చని చెప్పడంతో కుటుంబీకులు, నాయకులు అందుకు అంగీకరించారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి బాబూమోహన్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మాణయ్య, పలువురు నేతలు నాగేశ్వర్‌ మృతదేహానికి నివాళులర్పించారు. మృతునికి ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. అనంతరం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు
నిర్వహించారు.
కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ ఆవుల నరేష్‌ ఆత్మహత్య ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఇదే జిల్లాలో మరో కార్మికుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. తొర్రూరు మండలం సోమవారం గ్రామానికి చెందిన మేకల అశోక్‌(29)కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అశోక్‌ తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చూస్తూ మృతిచెందాడు. 2018 మార్చిలో తండ్రి స్థానంలో మెకానిక్‌ ఉద్యోగిగా అశోక్‌ డిపోలో చేరాడు. ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో రెండు నెలలుగా వేతనం లేకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. భార్యాబిడ్డలను అత్తగారింటికి పంపి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని సన్నిహితులకు ఫోను చేసి చెప్పాడు. వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకుని తొర్రూర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, తోటి ఆర్టీసీ కార్మికులు ఆస్పత్రికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో డిపో, బస్టాండ్‌, ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ మదన్‌లాల్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కోటాచలం, నాయకులు కాకిరాల హరిప్రసాద్‌ ఆస్పత్రిలో అశోక్‌ను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
ముగ్గురు కార్మికులకు గుండెపోటు
మహిళా కండక్టర్‌కు అస్వస్థత
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం సోమోరిగూడెం పంచాయతీ ఆవాస గ్రామమైన గౌండ్లగూడెం గ్రామానికి చెందిన చరక రమేష్‌గౌడ్‌ యాదగిరిగుట్ట డిపో డ్రైవర్‌. ఇంట్లో టీవీలో ఆర్టీసీకి సంబంధించిన వార్తలు చూస్తూ కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే 108లో మిర్యాలగూడలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకుపోయారు. పరిస్థితి విషమించడంతో హైద రాబాద్‌లోని మెడిక్యూర్‌ ఆస్పత్రికి తరలించారు.
గురువారం ఉదయం యాదగిరిగుట్ట డిపో నుంచి బస్సులు బయటికి వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఇదే డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న భువనగిరి పట్టణానికి చెందిన పోతంశెట్టి ప్రభాకర్‌ గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి కార్మికులు ఆయన్ను భువనగిరి ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదే డిపోలో మధ్యాహ్న సమయంలో ఆందోళ నలో పాల్గొన్న మహిళా కండక్టర్‌ పుష్పలత తీవ్ర అస్వస్థతకు గురైంది. పుష్పలత మూడు రోజులుగా జ్వరంతోనే సమ్మెలో పాల్గొంటోంది. ఈ క్రమంలో అస్వస్థతకు గురవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. సమ్మయ్య మంథని డిపోలో పదేండ్లుగా డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఇటీవల జరిగిన హైదరాబాద్‌ చలో ట్యాంక్‌బండ్‌కు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గుండెనొప్పి రావడంతో తోటి కార్మికులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఇంజక్షన్‌ ఇచ్చి ఇంటికి పంపించారు. మూడు రోజులు తరువాత నొప్పి తీవ్రత పెరగడంతో గురువారం కరీంనగర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. సమ్మయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Courtesy Navatelangana…

 

RELATED ARTICLES

Latest Updates