డాక్టర్‌ కూలీలు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పీస్‌ వర్క్‌ తరహా వేతనాలు
– మూడు నెలలుగా పెండింగ్‌
– రాష్ట్రంలోబాలసురక్ష సిబ్బంది ఆకలి కేకలు
– చిత్తూరు ప్రతినిధి  
వీరంతా బాలసురక్షా పథకం సిబ్బంది. ఎంబిబిఎస్‌ లాగే ఎంసెట్‌, నీట్‌ ద్వారా ఎంపికైన వారు. నాలగున్నర సంవత్సరాల పాటు వైద్యవిద్యను చదవడంతో పాటు సంవత్సరం కాలం ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేశారు. ఇంత పెద్ద చదవులు చదువుకున్నా రోజు వారీ కూలీల కన్నా దారుణంగా వీరి జీవితాలున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పీస్‌ వర్క్‌ తరహాలో ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది. ఒక విద్యార్థిని పరీక్షలు నిర్వహిస్తే రూ.8 ప్రభుత్వం ఇస్తోంది. నెలలో కనీసం రూ.మూడువేల మందికైనా పరీక్షలు నిర్వహిస్తేనే రూ.20వేలు వేతనం దాటుతుంది. లేకుంటే అదీ లేదు. ఇలా వచ్చే అరకొర వేతనాలు కూడా ఈ డాక్టర్లకు సక్రమంగా అందడం లేదు. మూడు నెలలుగా వీరికి వేతనాలు అందలేదు. వారితో పని చేస్తున్న ఎఎన్‌ఎంలు, డైవర్లు ఆకలికేకలతో రోడ్డెక్కారు.
2013లో కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఎస్‌కె (ముఖ్యమంత్రి బాల సురక్ష) అనే పథకాన్ని తీసుకొచ్చింది. దేశమంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకంను అమలు చేస్తోంది. అయితే మన రాష్ట్రంలో 2018లో ప్రభుత్వం పిపిపి (పబ్లిక్‌, ప్రయివేటు పాట్నర్‌షిప్‌) తరహాలో ధనుష్‌ ఇన్‌ఫోటెక్‌ అనే ప్రయివేటు సంస్థకు దీని నిర్వహణను అప్పజెప్పింది. అప్పుడే పుట్టిన శిశివు నుంచి 18 సంవత్స రాల వయసు విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. లోపాలను గుర్తించి ప్రారంభ దశలోనే వ్యాధు లను పూర్తి నయం చేయడం ఈ ఆర్‌బిఎస్‌కె ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి మండలం పరిధిలో ఒక సంచార వైద్య బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో ఒక వైద్యుడు, వైద్యురాలు, ఇద్దరు ఎఎన్‌ఎంలు, ఒక డ్రైవర్‌ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలను సందర్శించి అక్కడున్న విద్యార్థులకు వైద్య పరంగా ఉన్న లోపాలను గుర్తించాలి. ఆ రిపోర్టును డిఎంహెచ్‌ఓకు పంపాల్సి ఉంటుంది.

కూలీల కన్నా దారుణం
సాధారణంగా రోజు వారీ పని చేసే కూలీలకు రోజంతా పని చేస్తే ఇంత అని కూలీ చెల్లిస్తాం. అయితే ఈ పథకంలో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒక్కో విద్యార్థికి రూ.8 లెక్కన డాక్టర్లకు, ఎఎన్‌ఎంలకు రూ.3, డ్రైవర్లకు రూ.1 చొప్పున చెల్లిస్తున్నారు. నెలలో మూడువేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనేది వీరికి లక్ష్యంగా నిర్దేశించారు. అయితే ఆ అంచనాలు అందుకోవడానికి తగిన వసతులు లేవు. వీరికి కంపెనీ ఒక వాహనం ఇస్తుంది. డీజిల్‌తో నింపివ్వాలి. అలా ఇవ్వకపోవడంతో సిబ్బందే సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. తిరిగి ఆ డబ్బులను కంపెనీ చెల్లించడం లేదు. చేసిన పనిని రోజు నెట్‌లో అప్‌లోడు చేయాలి. ఏదైనా కారణంతో వాహనం ఆగిపోతే ఆ రోజు ఇక పని ముందుకు సాగదు. దీంతో వీరికి వేతనంలో కోత పడుతోంది. పాఠశాల కానీ, అంగన్‌వాడీ కేంద్రంలో గానీ పిల్లలు హాజరు కాకపోతే ఆ మేరకు వారికి వచ్చే పేమెంట్‌ తగ్గిపోతుంది. ఇలా వస్తున్న ఈ డబ్బులు కూడా సక్రమంగా రావడం లేదు. గడిచిన ఆగస్టు నెల జీతాలూ ఇప్పటి వరకు అందలేదు.

కోటిఆశలతో చేరాం
ఎప్పటికైనా శాశ్వతంగా ఉద్యోగంలోకి చేరకుండా పోతామా అనే ఆశతో ఇందులో చేరాం. చేరిన రెండో రోజే అపాయింట్‌మెంటు లెటర్‌ కాదు అగ్రిమెంటు అని చెప్పారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతినెలా పదో తేదీ కల్లా వేతనాలు ఇచ్చేస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం మూడు నెలలు అవుతున్నా జీతాలు లేవు. ఇల్లు గడవక అప్పుల పాలవుతున్నాం. మమల్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలి.
– కేథార్‌నాధ్‌, డాక్టర్‌

పశ్చిమ గోదావరిలో మోకాళ్లపై నిరసన
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట బాల సురక్ష ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ముందుగా సిఐటియు జిల్లా కార్యాలయం నుంచి ఉద్యోగులు కొత్తబస్టాండ్‌, జిల్లా పరిషత్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకూ నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఒప్పంద ఉద్యోగుల జెఎసి జిల్లా ప్రధాన కార్యదర్శి పంపన. రవి కుమార్‌ మాట్లాడారు. అనంతరం జెసి-2 తేజ్‌భరత్‌కు వినతి పత్రం అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద బాలసురక్ష అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని, మన రాష్ట్రంలో మాత్రం ధనుష్‌ ఇన్ఫోటెక్‌ సాఫ్టవేర్‌ కంపెనీకి ఇచ్చి, వారి ద్వారా అవుట్‌సోర్సింగ్‌ విధానంతో నియమించారన్నారు. దీంతో కనీస వేతనం గానీ, ఉద్యోగ భద్రత గానీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Courtesy Prajasakti..

RELATED ARTICLES

Latest Updates