మెట్టు దిగిన జేఏసీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • ‘విలీనాన్ని’ తాత్కాలికంగా వదిలేస్తున్నాం
  • మిగిలిన డిమాండ్లపై చర్చలకు పిలవండి
  • రాష్ట్ర సర్కారుకు అశ్వత్థామరెడ్డి వినతి
  • కార్మికుల ఆత్మహత్యలు జేఏసీని బాధిస్తున్నాయి
  • విలీనం బూచితో ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది
  • అందుకే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం
  • విలీన అంశం ఇప్పటికే కార్మికుల్లోకి వెళ్లింది
  • పార్టీలు రేపు మేనిఫెస్టోల్లో పెట్టక తప్పదు: జేఏసీ
  • మరో కార్మికుడి ఆత్మహత్యాయత్నం
  • పురుగుల మందు తాగిన ఆర్టీసీ శ్రామిక్‌
  • 41వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్‌, నవంబరు 14: సమ్మె 41వ రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ ఒక మెట్టు కిందకు దిగింది! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కనబెట్టింది! మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. జేఏసీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు గురువారం సాయంత్రం ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆర్టీసీ విలీనం ఇప్పట్లో సాధ్యం కాదన్న ఒకే ఒక్క కారణాన్ని చూపి.. సమ్మె చేయడమే తప్పన్నట్లుగా కోర్టును, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. విలీనమనే అంశాన్ని సాకుగా తీసుకుని, కార్మికుల డిమాండ్లు పరిష్కార సాధ్యం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది’’ అని ఆరోపించారు. ఆ ఒక్క డిమాండ్‌ పరిష్కారం కాదన్న సాకుతో మిగతా డిమాండ్లన్నీ అలాంటివేనన్న దుష్ప్రచారం ముఖ్యమంత్రి చేస్తున్నారని అన్నారు.

‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం కార్మికుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కాకపోయినా.. ఎప్పటికైనా ఈ డిమాండ్‌ను పరిష్కరించక తప్పదు. 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ప్రజల్లోకి వెళ్లింది. దాంతోనే ఉద్యమం నిరంతరం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు విలీన అంశం కూడా అలాంటిదే! భవిష్యత్తులో జరిగే ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ విలీన అంశాన్ని వాటి మేనిఫెస్టోల్లో పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది’’ అని వ్యాఖ్యానించారు. అయితే.. కార్మికుల ఆత్మహత్యలు జేఏసీని బాధిస్తున్నాయని చెప్పారు. కనీసం మిగతా డిమాండ్లనైనా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో విలీనాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టామని, దీనికి కార్మికులు అధైర్యపడవద్దని తెలిపారు. మున్ముందు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నామని, దీనికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమ్మె 41 రోజులుగా కొనసాగుతున్నా ప్రభుత్వంలో కించిత్తు స్పందన కూడా లేదని విమర్శించారు. ఇప్పటికే 23 మంది వరకు కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటు కారణంగా మరణించారని, అయినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబాలను పరామర్శించలేదని తప్పుబట్టారు.

ఈ మరణాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలు, కోర్టుకు సమర్పిస్తున్న తప్పుడు నివేదికలతో కార్మికులు తీవ్ర మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం ఆర్టీసీలో బడుగు, బలహీన వర్గాలవారే ఎక్కువ మంది పని చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఈ వర్గాలే ఎక్కువగా నష్టపోతాయి. ఒకవైపు, ఆ వర్గాలకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చెప్పుకొంటోంది. మరోవైపు, ఆర్టీసీలోని అదే వర్గాల పొట్టకొట్టాలని చూస్తోంది’’ అని విమర్శించారు. కార్మికుల మరణాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని, మృతుల కుటుంబ సభ్యులను గవర్నర్‌ వద్దకు తీసుకెళ్లనున్నామని, ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ కోరామని, నేడో రేపో లభిస్తుందని చెప్పారు. అలాగే, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించామని చెప్పారు. సమ్మెకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారన్నారు. సమ్మె పరిస్థితులు, కార్మికుల మరణాల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తానని భరోసా ఇచ్చారని తెలిపారు. ఈనెల 15 నుంచి 19 వరకు జేఏసీ చేపట్టే నిరసన కార్యక్రమాలను ప్రకటించామని, దీనికి కార్మికులందరూ కదిలి రావాలని కోరారు.

Courtesy Andhrajyothy…

RELATED ARTICLES

Latest Updates