రక్షణ రంగం కోసం సైన్యం ఆస్తుల వేలం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆరేళ్ల కిందట ప్రధాని మోడీ మన దేశం మహాశక్తిగా మారబోతుందనే స్వప్నాన్ని భారతీయుల బుర్రలకు ఎక్కించడం మొదలెట్టారు. అంతర్జాతీయ వ్యవస్థలో ఇండియాను ఒక అగ్ర రాజ్యంగా పెంపొందించనున్నట్టు 2014లో మోడీ ప్రకటించారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అంతర్జాతీయ వ్యవహారాలను మలచగల స్థితి లోకి ప్రవేశించినట్టు ఆయన భావించారు. మోడీ ఆకర్షణాశక్తి ప్రపంచాభిప్రాయాన్ని ఇండియాకు అనుకూలంగా మార్చగల సమయం వచ్చేసింది గనక కాశ్మీర్‌కు సంబంధించిన 370వ అధికరణాన్ని తొలగించడానికి ఇదే సరైన తరుణమని ఆరెస్సెస్‌ అభిమానులు చాలా మంది విశ్వసించారు. కేవలం భారతీయ ఓటర్లే గాక యావత్‌ ప్రపంచమూ మోడీ గారి సమ్మోహనాస్త్రానికి మంత్రముగ్ధమై పోయినట్టు తరచూ కాల్పనిక ఊహాగానాలు వినిపిస్తుంటాయి.
భారత దేశపు గొప్ప జనాభా, భౌగోళిక ఉనికి, భారీ ఆర్థిక వ్యవస్థల కారణంగా అంతర్జాతీయ రంగస్థలంపై ప్రముఖ స్థానం కోసం పోటీ పడగల సత్తా సహజంగానే సంక్రమిస్తుందని ఉన్నత శ్రేణి మితవాదులు చాలామంది నమ్ముతున్నారు. ప్రవాస భారతీయలపై తన పట్టు ఎంతో ప్రదర్శించడం ద్వారా అమెరికా అద్యక్షుడిని తన ఇష్టానుసారం ఆడించవచ్చునని కూడా మోడీ తలపోస్తుంటారు. నిజానికి ఇవన్నీ బ్రహ్మాండమైన స్వైర కల్పనలు మాత్రమే. భారత దేశపు పారిశ్రామిక, సాంకేతిక పునాది చాలా బలహీనమైంది. దీనికి సంబంధించిన విజ్ఞాన వ్యాప్తి కేంద్రాలు అంతర్జాతీయ మేధావులను ఆకర్షించే స్థాయిలో ఎంత మాత్రం లేవు. ఈ కఠోర వాస్తవాన్ని అధిగమించి స్వైర కల్పనలు నిజం కావడం దుస్సాధ్యం.
అయితే మోడీ ప్రభుత్వమూ అలాగే ఆయన మద్దతుదారులూ ఈ ఊహా ప్రపంచంలోనే వుండిపోతున్నారు. వాస్తవాల లోకి రావడం లేదు. ఇటీవలనే ప్రధాని మోడీ బ్యాంకాక్‌లో మాట్లాడిన తీరే ఇందుకు ఒక నిదర్శనం. ‘ఇది భారత దేశంలో వుండి తీరాల్సిన తరుణం. కొన్ని విషయాలు పడిపోతుంటే అనేకం పైకి వస్తున్నాయి. సులభతర వాణిజ్యం, జీవన సదుపాయం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ), అటవీ కవచం, పేటెంట్లు, ఉత్పాదకత, మౌలిక సదుపాయాల కల్పన వంటివి పెరుగుతున్నాయి. పన్నులు, పన్ను రేటు,్ల అవినీతి, అధికార దుర్వినియోగం, దళారీ వ్యవహారాలు తగ్గిపోతున్నాయి’ అని చెప్పారు. కాని వికృత వాస్తవం ఏమంటే ఈ సమయంలో ఇండియా సంక్షోభంలో చిక్కి హాహాకారాలు చేస్తున్నది. పొరుగున వున్న బంగ్లాదేశ్‌ 8.1 శాతం వృద్ధి రేటుతో ఇండియా కంటే వేగంగా పెరుగుతున్నది. 2019లో నేపాల్‌ కూడా భారత్‌ కంటే వేగంగా పెరుగుతున్నది. ఈ మెరుగుదల ఆర్థిక రంగానికే పరిమితం కాదు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం జీవన ప్రమాణం భారత్‌లో 69.1 సంవత్సరాలు వుంటే బంగ్లాలో 72 సంవత్సరాలు వుంది. శిశుమరణాల రేటు ఇండియాలో 31.5 వుంటే బంగ్లాలో 25.1 మాత్రమే.
ఈ ప్రభుత్వంలో ద్రవ్య రంగం స్థితిగతులు ఎలా వున్నాయంటే లాభాలు పండించే చమురుశుద్ధి కర్మాగారాలతో సహా కొన్ని భారీ ప్రభుత్వ సంస్థలను తెగనమ్మడానికి సిద్ధమైంది. ఇప్పటికే వీటిలో కొన్ని సంస్థలలో తన వాటాను 51 శాతం కన్నా తక్కువకు వదులుకోవాలని నిర్ణయించింది గాక అదనంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ తలపెట్టింది. సర్కారు ద్రవ్య లోటును భర్తీ చేసేందుకుయ గాను రిజర్వు బ్యాంకు దగ్గరున్న బంగారు నిల్వలను కూడా అమ్మేయాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలా జరగడం 30 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఇదివరలో ఈ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు మిగులు నిధుల నుంచి రూ.1.76 లక్షల కోట్లు తీసుకున్నది. ”మోడీ ప్రభుత్వం దివాళా తీసిందా? తన ప్రచారార్భాటపు విచ్చలవిడి ఖర్చుల కోసం ప్రజల సంపద అమ్మేస్తున్నదా? దాంతో అసత్యాలు అల్లి ప్రచారంలో పెడుతున్నదా?” అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలోనే ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ద్రవ్య స్థితి ఎంత ఇరకాటంగా వుందంటే ఈ సార్వభౌమ దేశం సైన్యాన్ని సమర్థంగా నడిపించేందుకు, ఆధునీకరించేందుకు కూడా కటకటలాడుతున్నది. ఆర్థిక భద్రత పేరిట ‘ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌’ కూడా నిరాకరించింది.
నిజానికి ఈ పరిస్థితి స్వయం కృతాపరాధమే. ఉన్న శక్తిని మించి ఏదో దెబ్బ తీయాలన్న దురాశాపూరిత వ్యూహం విదేశాంగ విధానం వల్ల ఉత్పన్నమైంది. సైనిక కూటములలో చేరాలంటే అది ఊరికినే జరగదు. బాగా ఖర్చు పెట్టాలి. కూటమి లోని భాగస్వాములతో సరిపోయే సామగ్రి, రక్షణ వేదికలు కొనుగోలు చేయాలి. బలగాలతో పహారా, సైనిక విన్యాసాలను పెంచాలి. ఇవన్నీ చేయడానికి భరించడానికి చాలా ఖర్చు పెట్టాలి. ఇంధన వ్యయం కూడా మోగిపోతుంది.
దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు గనక దేశ రక్షణ, అంతర్గత భద్రత కోసం ప్రభుత్వేతర నిధుల నుంచి కూడా వనరులు సమకూర్చుకునేలా చూడాలని 15వ ఆర్థిక సంఘం నిబంధనలకు సవరణ తేవాలని కేంద్రం ఆలోచిస్తున్నది. ఈ ప్రతిపాదనకు మద్దతు కోసం రక్షణ శాఖ ముందుకు తెచ్చే అవసరాలకు వాస్తవంగా జరిగే కేటాయింపులకూ మధ్య 25 శాతం అగాధం వుంటున్నదనే వాదన తీసుకొస్తు న్నారు. 15వ ఆర్థిక సంఘానికి చేసే సవరణలతో రక్షణ భూముల వేలానికి మార్గం సుగమమవు తుంది. భూ తిమింగలాలు, ప్రైవేటీకరణ రాబందులు ఇప్పటికే ఈ వాసన పసిగట్టాయి. దేశ వ్యాపితంగా వున్న 17.5 లక్షల ఎకరాల రక్షణ రంగ భూముల వినియోగాన్ని క్రమబద్దీకరణ చేయాలనే ప్రతిపాదన తెస్తున్నారు. ఇది ప్రైవేటీకరణకు ముద్దు పేరు. పైకి ఆక్రమణదారుల నుంచి కాపాడాలని చెబుతూ వాస్తవంలో ఈ తతంగం సాగిస్తారన్నమాట.
ఈ భూముల వేలం వల్ల రక్షణ మంత్రిత్వ శాఖకు సుమారు రూ.25 వేల కోట్లు సమకూరవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని భద్రమైన ఆర్థిక మదుపుగా పెట్టి… వచ్చే ఆదాయాన్ని సైనిక బలగాల రకరకాల అవసరాలకు వినియోగిస్తామంటున్నారు. ఇందుకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం కోసం ఇప్పుడు చాలా తెలివిగా సంపాదక పేజీలలో ముమ్మరంగా వ్యాసాలు కుమ్మరిస్తున్నారు. దేశమంతా విస్తరించి వున్న 9,600 ఎకరాల రక్షణ భూముల ఆక్రమణ, వివిధ రాష్ట్రాలు మునిసిపల్‌ సంస్థలతో న్యాయ పోరాటాలు పెద్ద సమస్యగా వున్నాయని ఈ వ్యాసాలలో వాదనలు చేయిస్తున్నారు. వీటన్నిటి వెనకా నిజం ఏమిటి? రక్షణ శాఖకు అద్దెలు వస్తే తప్ప అవసరాలు తీర్చుకోలేని స్థితిలో పడిందన్నమాట.
గొప్ప దేశాలెప్పుడూ సైనిక దళాల నిర్వహణకు అవసరమైన డబ్బు ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా సమకూర్చుకోవాలని ఎగబడటం జరగదు. శక్తివంతమైన సైన్యాన్ని స్థిరంగా పోషించుకోలేని దురవస్థ ప్రాప్తిస్తే ప్రభుత్వం నేలకు దిగిరావాలనీ, అగ్ర రాజ్య పేరాశలు వదులుకోవాలని చెప్పాల్సి వుంటుంది. చైనాకూ మనకూ వున్న తేడాలు, హిందూ మహా సముద్రంలో వారిలాగే మనమూ స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్న పోటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది గనక మనం విస్మరించడానికి లేదు. రక్షణ ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెంచే భద్రతా కోణాలు మీరు గజిబిజిగా కలగా పులగం చేయజాలరు. విదేశాంగ విధానం శల్య పరీక్షలతో దౌత్యం విజయవంతం అవుతుందని ఊహించలేరు.
మోడీ హయాంలో విదేశాంగ విధానం చాలా అస్తవ్యస్తంగా ఉబలాటపు వ్యవహారంగా తయారైంది. దాన్ని మరింత స్థిమితంగా సహనపూరితంగా మలుచుకోవాల్సి వుంది. విదేశాలలో అట్టహాసపు తతంగాల కోసం మోడీ చేసే రూ. వేల కోట్ల ఖర్చు ఇదివరకెన్నడూ చూడలేదు. రూ. మూడు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ తన వ్యూహాత్మక పరిమితులేమిటో కూడా తెలుసుకోవాలి. వ్యామోహం, అతి విశ్వాసం పరిపక్వ వ్యూహానికి ప్రాతిపదిక కాబోవు. ఆయుధాలు, ఫిరంగుల ఉత్పత్తిలో మనం దేశీయంగా అతి కనిష్ట సామర్థ్యం కలిగి వున్నాం. అలాంటి ఈ దేశానికి ప్రధాని అయిన మోడీ విదేశాంగ విధానం మాత్రం మహాద్భుత స్వప్న సన్నిభం కావడమే ఇక్కడ సమస్య.
అసలు మితవాద ఉన్నత శ్రేణులతో వుండే సమస్యే అది. దేశ ప్రతిష్టను, బల ప్రయోగాన్ని మేళవించి చూడటం. ఒక దేశ సార్వభౌమాధికారం దాని అసలైన సాయుధ శక్తితోనూ ఆ శక్తి వినియోగంతోనూ నేరుగా ముడిపడి వుంటుందని, ఆ స్థాయి లోనే పని చేస్తుందని ఒక భావనతో వారు బయలుదేరతారు. అయితే ఈ సూత్రం ప్రపంచమంతటా అందరికీ ఒకే విధంగా వర్తించబోదనే వాస్తవం కావాలనే మర్చిపోతారు. తన ఆయుధాల కోసం సమాచార సంబంధాల వ్యవస్థ కోసం బయిటి వారిపై ఆధారపడే ఒక మాధ్యమిక స్థాయి దేశపు సార్వభౌమత్వం, దాని బలాధిక్య కాంక్షలకు విలోమ నిష్పత్తిలో వుంటుంది. జాతీయ ప్రయోజనాలు పెంపొందించుకోవాలనే వాస్తవిక చర్యలు మరింత పరాధీనతకు దారి తీసి ఇంకా దెబ్బ తినే స్థితి లోకి నెడతాయి.
మితవాద ప్రజాకర్షక ఉద్యమాలు ప్రపంచ వ్యాపితంగా పెరుగుతున్న ప్రస్తుత వాతావరణం లో తాను ఒక ముఖ్య నేతనని మోడీ భావించు కోవచ్చు. బహుశా ఆయన గుర్తించని అంశం ఏమంటే ఆయన ఒక సామ్రాజ్యవాద సుడిగుండంలో గిరిటీలు కొడుతున్నారు. తానొక అగ్రశక్తిగా పెరుగుతాననే ఊహలు ఎంతగా చేసినా వాస్తవంలో మాత్రం అమెరికా ప్రపంచాధిపత్యాన్ని పటిష్టం చేయడం తప్ప ఆయనకు మరో గత్యంతరం వుండదు.

బి అర్జున్‌

RELATED ARTICLES

Latest Updates